టీడీపీకి మోదుగుల టాటా?

      నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయుడుగా ఉన్న ఆయన చంద్రబాబు పెట్టిన శీలపరీక్షలో నెగ్గలేకపోయారు. గత ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఇటీవల ఇక్కడ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయన మనసు గాయపడింది. నరసరావుపేట నుంచి మళ్లీ పోటీచేస్తానని, అక్కడ వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న అయోధ్యరామిరెడ్డి తన బావ అయినప్పటికీ వెనుకాడబోనని ఆయన చంద్రబాబును కలిసి స్పష్టంచేసినా, గుంటూరు పశ్చిమ లేదా బాపట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ బహిష్కరించిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకు నరసరావుపేట టికెట్ ఇచ్చేందుకు అధినేత యోచిస్తున్నారు. దీంతో తానేం చేసేదీ రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని మోదుగుల స్పష్టం చేశారు. అవసరమైతే నరసరావుపేట నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని ఆయన అనుచరులతో చెప్పినట్లు సమాచారం.

కృష్ణా జడ్పీ బరిలోకి గద్దె అనూరాధ?

      ప్రతిష్ఠాత్మకమైన కృష్ణా జిల్లా జడ్పీ పీఠం కోసం తెలుగుదేశం పార్టీ గద్దె అనూరాధను రంగంలోకి దింపేందుకు కసరత్తు జరుగుతోంది. విజయవాడ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ భార్య అయిన అనూరాధ ఎమ్మెస్సీ (బయో కెమిస్ట్రీ) చదివారు. జడ్పీ చైర్మన్ పోస్టుకు పలువురు పోటీలో ఉన్నా, అనూరాధ విద్యావంతురాలు కావడంతో పాటు రాజకీయ కుటుంబానికి చెందిన మహిళ కావడంతో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.   తన భార్యకు జడ్పీ చైర్‌పర్సన్ టిక్కెట్ ఇచ్చినా తనకు మాత్రం తప్పనిసరిగా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని గద్దె రామ్మోహన్ చంద్రబాబును కోరినట్లు సమాచారం. గతంలో తనకు ఇచ్చిన మాట ప్రకారం విజయవాడ (తూర్పు) సీటును తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు సమ్మతిస్తేనే తన భార్య తిరువూరు నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతుందని అంటున్నారు. గతంలో నల్లగట్ల స్వామిదాస్‌కు తిరువూరు ఎమ్మెల్యే సీటు, ఆయన భార్య సుధారాణికి జడ్పీ చైర్‌పర్సన్ పోస్టు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గద్దె ఉదహరిస్తున్నారు.

మీసేవ చుట్టూ పరుగో పరుగు

      స్థానిక సంస్థల అభ్యర్థులను ఆయా పార్టీలు ఆఖరి నిమిషంలో ప్రకటిస్తుండటంతో రిజర్వ్ స్థానాల్లో పోటీచేసే సంబంధిత అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. నామినేషన్లకు గురువారం చివరి రోజు కావటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక పోవటంతో అభ్యర్థుల స్థానంలో కొందరు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆఖరి నిమిషంలోనైనా అవకాశం వస్తే పోటీ చేసేందుకు కొందరు ఆశావహులు కులధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల రిజర్వేషన్ల కారణంగా దొరక్కదొరక్క దొరికిన అభ్యర్థి కులధ్రువీకరణ ప్రతం తేవడం కష్టంగా మారింది. పంచాయతీ ఇంటి, నీటి పన్నుల బకాయిల చెల్లింపుల నోడ్యూస్ సర్టిఫికెట్ల కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. చాలా పంచాయతీలలో కార్యదర్శుల కొరత ఉండటంతో మరింత ఆలస్యమవుతోంది. ఎన్నికల నిబంధనలు తెలియని గ్రామీణ ప్రాంత అభ్యర్థులైతే మరింత ఇబ్బంది పడాల్సి వచ్చింది.

చైనీయుడికి ఎన్నికల ఇక్కట్లు

      ఎన్నికల కోడ్‌తో చైనా దేశస్తుడు జిచెంగ్ కర్నూలు జిల్లాలో ఇబ్బందికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంలో రూ.3.50 లక్షల నగదు లభించడంతో సీజ్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తరువాత ఆయన వివరాలు చెప్పడంతో వదిలేశారు. చైనాకు చెందిన జిచెంగ్ 15రోజుల కిందట మనదేశం వచ్చారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన కర్నూలు వాసి జుల్ఫికర్ అలీ ఆహ్వానం మేరకు బుధవారం ఇన్నోవాలో స్నేహితులతో కలిసి వైఎస్‌ఆర్ స్మృతివనం సందర్శించేందుకు బయల్దేరారు. భానకచర్ల వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా రూ.3.50 లక్షల నగదు లభించింది.   ఎన్నికల నియమావళి ప్రకారం ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆ నగదును సీజ్‌చేశారు. జిచెంగ్ పాస్‌పోర్టు, వీసా వివరాలను సీఐ రవిబాబు.. ఎస్పీ రఘురామిరెడ్డికి ఫ్యాక్స్ ద్వారా తెలిపారు. పూర్తి వివరాలుండడంతో అతడిని వదిలేశారు. జిచెంగ్ ఢిల్లీలో మార్బుల్స్ వ్యాపారం చేస్తున్నారని, మే నెల వరకు మన దేశంలో ఉండేందుకు వీసా ఉందని పోలీసులు తెలిపారు.

పరిషత్తులను పట్టించుకునేవారేరీ?

      గతంలో ప్రధాన పార్టీలు జిల్లా పరిషత్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవి. కానీ ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఒకేసారి మున్సిపల్, పరిషత్, ఎంపీ, ఎమ్మె ల్యే ఎన్నికల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. నెలన్నర వ్యవధిలోనే అన్నింటి పోలింగ్ పూర్తి కానుంది. మొదట మున్సిపల్, వెంటనే పరిషత్, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు.   ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలపై దృష్టి సారించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, సీనియర్ నాయకులు స్థానిక ఎన్నికలను అంత గా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం పూర్తయ్యింది. గురువారంతో పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తవుతుంది. అయినా ప్రధాన పార్టీల ముఖ్య నేతలు జిల్లా పరిషత్తుల విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. చాలాచోట్ల జడ్పీ పీఠంపై ఎవరిని నిలబెట్టాలన్న విషయమై పార్టీలు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాయి.తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు వేర్వేరు రోజుల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. ఈలోపే స్థానిక సందడి ముగిసిపోతుంది. అయినా కూడా ఆ ఎన్నికలమీదే దృష్టిపెడుతున్న నాయకులు.. ఈసారి మాత్రం జడ్పీ ఎన్నికలను అంతగా పట్టించుకోవట్లేదు.

దొరగారి చెప్పులా.. మజాకా

      బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయి ఇన్ని సంవత్సరాలయినా ఇప్పటికీ వాళ్లు తెచ్చిపెట్టిన దొరతనం మాత్రం మనను వదల్లేదు. కాస్త పదవి రాగానే తమను తాము దొరలుగా భావించుకోవడం నాయకులకు మామూలైపోయింది. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఇదే కోవలోకి వెళ్లిపోయారు. మంత్రి బుధవారం కర్నూలు జిల్లా గుడిపాడులో ఒక ఉత్సవంలో భాగంగా ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్త ఇంటివద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పక్కనే ఉన్న చనుగొండ్ల పంచాయతీ సర్పంచ్ సుజాతమ్మ భర్త జి.రంగనాయకులు.. మంత్రి చెప్పులు దుమ్ముపట్టి ఉండటాన్ని గమనించారు. వాటిని శుభ్రం చేసి కోట్ల పాదాలకు తొడిగారు. ఇదంతా మామూలే అన్నట్లుగా, అసలు అలా జరుగుతున్నట్లు కూడా పట్టించుకోకుండా కోట్ల వ్యవహరించారు.

రహస్య స్నేహాలు బట్టబయలు

      కాంగ్రెస్‌తో దోస్తీ లేనేలేదని తేల్చిచెప్పిన టీఆర్‌ఎస్... చాలాచోట్ల రహస్య స్నేహాలు మొదలుపెట్టేసింది. స్థానికంగా తమకు కావల్సిన చోట్ల ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేసుకుంటోంది. కరీంనగర్ జిల్లా పరిస్థితి అలాగే కనిపిస్తోంది. రహస్య స్నేహాలన్నీ క్రమంగా బయటపడుతున్నాయి. జగిత్యాలలో ఆ పార్టీకి మద్దతుగా ఐదు చోట్ల పోటీకి దూరంగా ఉంది. వేములవాడలో ఏకంగా బీజేపీతో గులాబీయింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లిలో నాలుగు స్థానాల్లో పోటీ చేయుకుండా చేతులెత్తేసింది.   పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు మధ్య ఉన్న కోల్డ్‌వార్‌తో 19వ వార్డు నుంచి పోటీకి దిగిన పార్టీ అభ్యర్థి బండి సునీల్‌కు బీ ఫారం దక్కలేదు. సిరిసిల్లలోని 24వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు లేకుండా పోయూరు. వేములవాడ నగర పంచాయతీలో రెండు స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. నిజానికి ఇక్కడ కమలనాథులతో టీఆర్ఎస్ రహస్య స్నేహం చేసింది. ఏడో వార్డు నుంచి నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి, తన ప్రత్యర్థి అయిన బీజేపీ నాయకుడికి మద్దతుగా బరినుంచి తప్పుకొన్నాడు. అలాగే 11వ వార్డులో కూడా టీఆర్ఎస్ అసలు అభ్యర్థినే నిలబెట్టలేదు. అదీ కుమ్మక్కు రాజకీయం.

అద్వానీ శకం ముగిసినట్లేనా?

      బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ శకం దాదాపుగా ముగిసిపోతున్నట్లే కనిపిస్తోంది. ఆయన ఏం అనుకున్నా అది అవ్వడంలేదు. నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ఆయన ససేమిరా అన్నారు. అయినా తప్పలేదు. ఇప్పుడు తన సొంత అభ్యర్థిత్వం విషయంలోనూ చుక్కెదురైంది. ఇన్నాళ్లూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లోని గాంధీనగర్ కాకుండా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి బరిలోకి దిగాలని ఆయన భావించినా, పార్టీ మాత్రం అద్వానీకి గాంధీనగర్ టికెట్టే కేటాయించింది. మోడీ కోసం భోపాల్ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధమని పార్టీ సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత కైలాశ్ జోషీ ప్రకటించినా బీజేపీ అధిష్టానం మాత్రం అద్వానీకి ఆ సీటును కేటాయించేందుకు ససేమిరా అంది. అద్వానీ ఈసారి కూడా గాంధీనగర్ స్థానం నుంచే తిరిగి పోటీ చేయాలని నిర్ణయించింది.

జైరాం.. ఇక రెండు రాష్ట్రాల్లో రాం రాం

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి, ఎన్నికల వేళ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి తామున్నామంటూ పాలమూరుకు వచ్చిన కేంద్ర మంత్రి జైరాం రమేష్, రాహుల్ దూత కొప్పుల రాజులకు క్షేత్రస్థాయిలో తమ పార్టీ పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలిసింది. సీమాంధ్రలో ఎటూ ఒక్కసీటైనా రావడం కష్టమేనని తెలిసినా, తెలంగాణాలో బ్రహ్మాండంగా ఉంటుందని అనుకున్నారు. కానీ, ఇక్కడ సైతం వాళ్లు ఊహించని పరాభవం ఎదురుకావడంతో విస్తుపోయారు.   మునిసిపాలిటీ ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వలేదని కొందరు నాయకులు గొడవ సృష్టించారు. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ 31 వార్డు నుంచి తమ కుటుంబానికి టికెట్ ఇప్పిస్తామని నాయకులు చెప్పడంతో తన చిన్న కూతురు రేణుకను నామినేషన్ వేయిస్తే బీఫామ్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారని డీసీసీ కార్యదర్శి నాగమణి స్థానిక డీసీసీ కార్యాలయం వద్ద కన్నీటిపర్యంతమైంది. ఆమె కూతుళ్లు ఉమ, టికెట్ ఆశించిన రేణుక కేంద్రమంత్రి జైరాం రమేశ్ ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో హాలు బయటపార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హంగామా చేశారు. తమకు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, ముత్యాల ప్రకాశ్ కుట్ర చేశారని, డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.

ఇది భార్యా భర్తల సవాల్

      ఎక్కడైనా బావ అంటే ఒప్పుకుంటాను. కానీ వంగతోట కాడ మాత్రం ఒప్పుకోను అంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఇది మారిపోయింది. ఎక్కడన్నా భార్య అంటే ఒప్పుకుంటాను. ఎన్నికల వేళ మాత్రం భార్యా భర్తా జాన్తానై అంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ లోకసభా స్థానానికి బీఎస్పీ తరఫున సిట్టింగ్ ఎంపీ ఖాదర్ రాణా పోటీ చేస్తున్నారు.ఆయనకు పోటీగా ఆయన భార్య షాహిదా బేగమ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. రాణా గతంలో సమాజ్ వాదీ పార్టీలో ఉండేవారు. 2007లో ఆయన రాష్ట్రీయ లోకదళ్ లో చేరారు. రెండేళ్లకే బీఎస్పీలోకి దూకేశారు. ఆయనకు కూడా ఇంతిపోరు తప్పడం లేదు. భార్యామణి బరిలో దిగేసరికి ఆయన కంగారు పడుతున్నారు. కొసమెరుపు: ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో మన రాణా మీద కూడా చార్జిషీటు దాఖలైంది.

కేసీఆర్.. వంద అబద్ధాలు

      ఇన్నాళ్లూ కేసీఆర్ తన పార్టీని విలీనం చేస్తారేమో, కనీసం పొత్తుకైనా సరేనంటారేమో అని ఎదురు చూస్తూ సంయమనం పాటించిన కాంగ్రెస్ నాయకులు.. ఇక ఆ ఆశలన్నీ అడుగంటి పోవడంతో నోళ్లు విప్పడం మొదలుపెట్టారు. ‘కేసీఆర్.. వంద అబద్ధాలు’ పేరుతో ఏకంగా ఓ పుస్తకం విడుదల చేయాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ స్థాపించినప్పటినుంచి ఇప్పటివరకు కేసీఆర్ చెప్పిన మాటలు, వాటిని మార్చుకున్న తీరును ఎండగడుతూ ఈ పుస్తకం ఉండబోతోంది. పార్టీ పెట్టినప్పుడు తన కుటుంబ సభ్యులెవరికీ పార్టీలో చోటు ఉండబోదని చెప్పడం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రకటించి మాటతప్పడం, 2004, 2009 ఎన్నికల్లో కేసీఆర్ అనుసరించిన తీరు, 2009 ఎన్నికల ఫలితాలు వెలువడకముందే బీజేపీ పంచన చేరిన వైనం.. ఇలా అన్నీ ఇందులో ఉంటాయట. వారం రోజుల్లోపే ఈ పుస్తకాన్ని విడుదల చేయాలని టీ-పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

రాజుగారికి ఆశాభంగం

    కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తనతోపాటే క్యాడర్ కూడా వెన్నంటి వస్తుంది.. ఇటు టీడీపీ శ్రేణులు కూడా మూకుమ్మడిగా తనకే జయజయధ్వనాలు పలుకుతారని భావించిన రాజావారికి ఆశాభంగమైంది. టీడీపీలో చేరిన తర్వాత తొలిసారి పాతపట్నం నియోజకవర్గానికి వచ్చిన మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు తనవారనుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొహం చాటేశారు.. మరోవైపు టీడీపీ శ్రేణుల నుంచీ పూర్తిస్థాయిలో స్వాగత సత్కారాలు లభించలేదు. ఎల్.ఎన్.పేట నుంచి నిర్వహించిన స్వాగత ర్యాలీ చప్పగా సాగింది. టీడీపీలో తన అధిపత్యం నిరూపించేందుకు శత్రుచర్ల చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పటికే అక్కడ టీడీపీలో రెండు వర్గాలు ఉండగా.. ఒక వర్గానికి చెందినవారే ఈ కార్యక్రమంలో కనిపించారు. దీంతో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి ఈసారి తనను గట్టెక్కించేస్తారు అనుకున్న శత్రుచర్ల ఆశలు అడియాసలని మొదటిరోజే తేలిపోయింది. రెంటికీ చెడ్డ రేవడిలా ఆయన పరిస్థితి తయారైంది.

రాజస్థాన్ బరిలో అజారుద్దీన్

      మాజీ క్రికెటర్, ఎంపీ అజహరుద్దీన్‌ ఈసారి రాజస్థాన్‌ రాష్ట్రంలోని సవాయ్‌ మదోపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభ బరిలోకి దిగబోతున్నారు. ఇంతకుముందు ఆయన ప్రాతినిధ్యం వహించిన యూపీలోని మొరాదాబాద్ నుంచి ఫీల్డింగ్ ప్లేస్ మార్చినట్లుగా ఏకంగా రాజస్థాన్ పంపేశారు. 58 మంది పేర్లతో కాంగ్రెస్ పార్టీ లోక్ సభకు పోటీచేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. అందులో అజహరుద్దీన్ పేరు రాజస్థాన్ లో వినపడింది. మొరాదాబాద్ లో ఆయనపై స్థానికంగా ఉన్న వ్యతిరేకతవల్లే రాజస్థాన్‌ కి మార్చినట్టు సమాచారం.ఇక కేంద్ర మంత్రులు కపిల్‌ సిబల్‌ ను ఢిల్లీలోని చాందినీచౌక్ స్థానం నుంచి, కృష్ణతీరథ్‌ను వాయవ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారు. వారణాసి నుంచి నరేంద్రమోడీ పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఈ స్థానం నుంచి హస్తం తరఫున ఎవరు బరిలో దిగుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో మంగళవారం విడుదల చేసిన మూడో జాబితాలో వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ జాబితాలోనూ వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేయలేదు.

అంతరాత్మను బయట పెడతానంటున్న కలెక్షన్ కింగ్

      కొంతకాలంగా అంతరాత్మను చంపుకుని ఓపిగ్గా ఉన్నానని, కొన్ని రోజుల తరువాత తన అంతరాత్మను బయటపెడతానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటున్నారు. త్వరలో ఓ వ్యక్తిపై సంచలన వ్యాఖ్యలు చేస్తానని, వారి అక్రమ సంపాదననూ బయట పెడతానని ఆయన చెప్పారు. ఆ వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు ఎంత ఆస్తి ఉండేది? ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎంత ఆస్తి సంపాదించాడని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆయనీ వ్యాఖ్యలు చేయడంతో.. అవి ఎవరి గురించన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో సహజంగానే నెలకొంది.   ఓటర్లు  నిజాయితీగా, డబ్బులకు లొంగకుండా ఓటు వేసినరోజు దేశం ముందడుగు వేస్తుందని కూడా మోహన్ బాబు అన్నారు. ఎన్నికల్లో డబ్బుతీసుకుని ఓటేస్తే మన హక్కులకోసం నాయకుడిని నిలదీసేందుకు అర్హత కోల్పోతామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతిని రూపుమాపితే తప్ప ప్రజలకు మంచి జరగదన్నారు. గతంలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిన మోహన్ బాబు, ఆ తర్వాత మాత్రం వాటికి కొంత దూరంగా ఉన్నారు. మళ్లీ ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోందని ఈ వ్యాఖ్యలు విన్నవాళ్లు అంటున్నారు.

కొంప ముంచిన కిరణ్ పర్యటన

      ముఖ్యమంత్రి హోదాలో 2012 డిసెంబర్ 19న కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖ జిల్లా పాడేరు పర్యటన ఆర్‌ఆండ్‌బీ అధికారుల కొంపముంచింది. ఆయన పర్యటనలో సాంకేతిక అనుమతులు లేకుండా హడావిడిగా ఆర్‌ఆండ్‌బీ రోడ్ల అభివృద్ధి పేరిట రూ.76.25 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆధారాలతో పాడేరుకు చెందిన అల్లాడి శ్రీనివాసరావు పాడేరు కోర్టులో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన న్యాయమూర్తి నాగేశ్వరరావు, అక్రమాలకు పాల్పడిన 11 మంది ఆర్‌ఆండ్‌బీ అధికారులతోపాటు కాంట్రాక్టర్‌పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని పాడేరు పోలీసులను ఆదేశించారు. దీంతో పాడేరు పోలీసులు మంగళవారం ఆర్‌ఆండ్‌బీ అధికారులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కావాలనే తప్పుడు నామినేషన్లు

      ఎన్నికల సీజన్‌లో క్షణక్షణానికి సీన్ మారిపోతుంటుంది. బస్తీమే సవాల్ ఈ సీటు నాదేనని బీరాలు పలికినవారు నామినేషన్ ఘట్టానికి వచ్చేసరికి చతికిలపడతారు. నామినేషన్లకు ముందే కొందరు తప్పుకుంటుంటే మరికొందరు నామినేషన్ల అనంతరం. పోటీలో నిలబడి తీరతామని మీసం మెలేసి చెప్పిన వారు సైతం రహస్య బేరాలకు తలొగ్గి నామినేషన్ పత్రాల దాఖలులో కావాలని కొన్ని పొరపాట్లు చేసి అవి తిరస్కరణకు గురయ్యేలా చేసుకుంటున్నారు.   తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మూడో వార్డులో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికి పరోక్షంగా సహకరిస్తూ మరో ప్రధాన పార్టీ అభ్యర్థి లోపాయికారీ ఒప్పందాలతో సహకరించారు. అతనికి ఖర్చు చేసే సత్తా లేక పోవడంతో నామినేషన్ వేసినట్టే వేశారు. కానీ వాటిని కావాలని  సరిగ్గా పూర్తి చేయలేదు. అతని నామినేషన్‌ను అనుకున్నట్టుగానే తిరస్కరించారు. దాంతో ఆ వార్డులో ఆయన స్నేహితుడి విజయం నల్లేరుపై నడకైంది. ఇలాగే చాలాచోట్ల అంతర్గత ఒప్పందాలతో నామినేషన్లను తిరస్కరింపజేసుకుని, హాయిగా ఇంట్లో పడుకుంటున్నారు. అదీ సంగతి.  

చెప్పు పార్టీకి ఉపాధ్యక్షుడి షాక్

      బెర్లిన్ గోడ ముక్క అంటూ ఓ రాయిని చూపించి, మళ్లీ తెలుగు మాట్లాడేవాళ్లందరినీ ఒకే రాష్ట్రంలోకి తీసుకొస్తానన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా ఉంది. ఆయన స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పక్కచూపులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తనకు వేసుకోడానికి ‘చెప్పులు ’ లేకపోయినా పర్వాలేదు గానీ, తొక్కడానికి ‘సైకిల్’ ఉంటే చాలంటున్నారు.   ఒకవైపు శైలజానాథ్‌ను కిరణ్ తమ పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించగా... శైలజానాథ్ మాత్రం తనకు ఆ పార్టీతో సంబంధం లేదన్నట్లుగానే మాట్లాడారు. "నా వెంట నడిచిన అన్ని వర్గాల ప్రజలనూ సంప్రదించి... ఏ పార్టీలో చేరబోయేదీ గురువారం ప్రకటిస్తా'' అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి, తెలుగు ప్రజల అభివృద్ధికి పని చేసే పార్టీలోనే చేరతానని కూడా తెలిపారు. శైలజానాథ్, టీడీపీ మధ్య ఇప్పటికే మధ్యవర్తుల స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో శింగనమలలో శైలజానాథ్‌పై టీడీపీ అభ్యర్థిగా శమంతకమణి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ. ప్రస్తుతం శింగనమలలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. శైలజానాథ్ టీడీపీలో చేరేందుకు సిద్ధమైతే, చేర్చుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయనను ఆహ్వానిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.

టీఆర్ఎస్ లో చేరిన కొండా దంపతులు

      తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రజలు ఆకాంక్ష మేరకు ఈరోజు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరినట్లు కొండా సురేఖ ప్రకటించారు. గతంలో టీఆర్ఎస్ శ్రేణులతో వివాదాలు ఉన్న నేపథ్యంలో అదంతా రాజకీయ పరమైనవే తప్ప వ్యక్తిగతం కాదని, తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యం అని, గతంలో ఉన్న పరిస్థితులు, అవగాహన మేరకే కేసీఆర్ మీద విమర్శలు చేశామని, ఇప్పుడు టీఆర్ఎస్ మూలంగానే తెలంగాణకు భవిష్యత్ అని భావించి ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చామని కొండా సురేఖ వెల్లడించారు. పార్టీలు మారడంపై మీడియా అడిగిన ప్రశ్నకు జర్నలిస్టులుగా మీరు అవకాశాలను బట్టి ఛానళ్లు, పత్రికలు మారినట్లే తాము పార్టీలు మారామని, తాము పదవుల కోసం పార్టీలు మారలేదన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సురేఖ గుర్తు చేశారు. మరోవైపు వరంగల్ జిల్లాలో కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు కొండా దంపతుల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.ఒక కార్యకర్త అయితే కిరోసిన్ మీద పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో కెటిఆర్ అయిందేదో అయిపోయింది..అంతా కలిసి పనిచేద్దామని కెటిఆర్ పిలుపు ఇచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ?

      తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అమలులోకోచ్చే అపాయింతేడ్ తేదీ జూన్ 2. అంటే ఇంకా 2 నెలలకు పైగా సమయం ఉంది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు చాలా సమయము ఉంది. అప్పుడే తెలంగాణా రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయారు. ఎలా అంటే ఆయన మాటల ద్వారా అయిపోయారనిపిస్తోంది. గెలుపు గుర్రాలు, విజయావకాశాలపై, సొంతంగా చేయించుకున్నానని స్వయంగా చెప్పిన కేసీఆర్.. సర్వేలో పేర్కొన్న సీట్లన్నీ టీఆర్ఎస్ కు వచ్చినట్లు, తానే తెలంగాణా రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కొందరు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఒక సీఎం మాట్లాడుతున్నా తీరుగా ఉన్నాయని, తానూ అధికారంలోకి వస్తే చేస్తాననే హామీలులా లేవని విశ్లేషించారు రాజకీయ పరిశీలకులు. టీయూడబ్ల్యుజే సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. వీరంతా తెలంగాణ పునర్నిర్మాణం, ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర గురించి ప్రసంగించారు. కేసీఆర్.. మాత్రం జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఇక ఉండదని, డెస్క్, ఫోటో, వీడియో జర్నలిస్టులనే తేడా లేకుండా అందరికీ అక్రిడేషన్లు ఇస్తానని, బలహీనవర్గాల కోటాలో ఇల్లు మంజూరు చేస్తానని చెప్పారు. వేదికపై ఉన్న ఇతర పార్టీ నేతలు మాత్రం ఔరా.. కేసీఆర్ అని ముక్కున వేలేసుకున్నారు.