జగన్ బాబు పిలుపు కోసం మానుగుంట నిరీక్షణ?

      ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ కాంగ్రెస్ నేత మానుగుంట మహీధర రెడ్డి కిరణ్ క్యాబినెట్ లో మొదటిసారి మున్సిపల్ శాఖామంత్రిగా భాద్యతలు స్వీకరించారు. అనతికాలంలోనే కెప్టెన్ నల్లారి జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగారు. రాష్ట్ర విభజనతో కిరణ్ పదవికి రాజీనామా చేయడంతో మానుగుంట కూడా మాజీ అయ్యారు. అయితే కిరణ్ కొత్త పార్టీలో మాత్రం చేరలేదు. రాజకీయాల్లో రాజీ పడని వ్యక్తిగా, పాలనాదక్షుడిగా పేరున్న మానుగుంట ప్రస్తుతం జగన్ బాబు పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు వచ్చి వాలిపోతాను అని కందుకూరుకు చెందిన ఓ ఉన్నతాధికారితో రాయబారం పంపారట. వైసీపీ లో జగన్ తరువాత చెప్పుకోదగ్గ పవర్ సెంటర్ అయిన సజ్జల రామకృష్ణా రెడ్డికి బంధువైన ఉన్నతాధికారి ఎలాగైనా మానుగుంటను పార్టీలో చేర్చాలని కంకణం కట్టుకున్నారట. అయితే జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ పేరు ఉందని, తానే డైరెక్టుగా జగన్ దగ్గరకు వెళ్లి పార్టీలో చేరితే కేడర్, ద్వితీయ శ్రేణి నేతల ముందు పలుచన అయిపోతానని, ఒక్కసారి జగన్ మిస్సిడ్ కాల్ ఇచ్చినా చాలు.. జగనే తనను పార్టీలోకి ఆహ్వానించారని, నియోజకవర్గ ప్రజల కోరిక కూడా అదే కావడంతో వైసీపీలో చేరుతున్నానని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారట మానుగుంట. మరో వైపు వైసీపీలో మొదటి నుంచి పనిచేస్తూ జిల్లా కన్వీనర్ గా భాద్యతలు నిర్వహించిన నూకసాని బాలాజీ ఎప్పటి నుంచో తనకు కందుకూరు టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతున్నారు. మానుగుంట పార్టీలో చేరితే బాలాజీకి ఇక సీటు దక్కేది అనుమానమే? మరో వైపు జిల్లా వైసీపీనీ అన్నే తానే అయి నడిపిస్తున్న బాలినేనికి కూడా మానుగుంట పార్టీలో చేరితే ఇబ్బందులు తప్పవు. అందుకే మహీధర్ కు జగన్ నుంచి ఫోన్ రావాలంటే.. ముందు బాలినేని నుంచి గ్రీన్సిగ్నల్ రావాలి.

అంతా వెళ్లే వారే.. వచ్చే వారేరీ?

      కాంగ్రెస్ నుంచి రోజురోజుకూ పెరిగిపోతున్న వలసలు ఏపీపీసీసీ అగ్రనేతలను తీవ్రంగా కలవరపరుస్తోంది. మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతుండడం రాష్ట్ర పార్టీ ముఖ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. గత కేబినెట్లోని మంత్రుల్లో రఘువీరారెడ్డి (పీసీసీ ప్రస్తుత చీఫ్) బొత్స సత్యనారాయణ (మాజీ చీఫ్), ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, సి.రామచంద్రయ్య, కొండ్రు మురళి మాత్రమే మిగిలారు.మిగతా సీమాంధ్ర మంత్రుల్లో పలువురు ఇప్పటికే ఇతర పార్టీల్లో చేరగా, తక్కినవారు రేపోమాపో కాంగ్రెస్‌ను వీడుతారని ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రుల్లో పురందేశ్వరి బీజేపీలో చేరగా ఇతర మంత్రులు పోటీకి గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎంపీలు మొత్తం పార్టీని వీడారు. సీమాంధ్రకు చెందిన 97 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో మిగిలిన వారి సంఖ్య వేళ్లమీద లెక్కించేలా మారింది. వచ్చే ఎన్నికలకు పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులే కరువయ్యారు. నేతలు వలసలు పోయిన నియోజక వర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా విభాగాలలోని నేతలను పోటీకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

దళితులకు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్?

      ఏపీ పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంటును నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు సాగిస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన ఎన్.రఘువీరారెడ్డి (యాదవ్)కి అప్పగించినందున దళితవర్గానికి చెందిన నేతల పేర్లపై పరిశీలన సాగిస్తోంది. తెలంగాణ పీసీసీకి అధ్యక్షునిగా వెనుకబడినవర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను నియమించడంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంటుగా మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. అదే సమయంలో సీమాంధ్రలో కేవలం అధ్యక్షుడిని మాత్రమే నియమించి వర్కింగ్ ప్రెసిడెంటు పదవిని ఏర్పాటుచేయలేదు. ఈ విషయాన్ని దిగ్విజయ్‌సింగ్‌ వద్ద పార్టీ సీనియర్ ప్రస్తావించారు. పీసీసీ అధ్యక్షుడితో చర్చించి వర్కింగ్ ప్రెసిడెంటు పదవిపై నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ వారికి తెలిపారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి ఇవ్వగా ప్రచార, మేనిఫెస్టో కమిటీలను అగ్రవర్ణాలకు చెందిన చిరంజీవి, ఆనం రామనారాయణరెడ్డిలకు కట్టబెట్టారు.దీంతో దళితవర్గాలను నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ తరుణంలో ఆ వర్గాలకు చెందినవారికి వర్కింగ్ ప్రెసిడెంటును అప్పగిస్తే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్‌ను నియమించవచ్చన్న ప్రచారం పార్టీవర్గాల్లో వినిపిస్తోంది.

లచ్చన్న పార్లమెంటుకే.. నెగ్గిన కోడలి పంతం

      తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈసారి లోక్‌ సభకే పోటీ పడుతున్నట్లు తెలిసింది. కోడలు వైశాలి గట్టిగా పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో జనగాం అసెంబ్లీ టికెట్ ఆమెకే ఇప్పించి, తాను నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి లోక్ సభకు వెళ్లాలని పొన్నాల భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్ప పొన్నాల పేరు దాదాపుగా ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.పొన్నాల ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జనగాం అసెంబ్లీ స్థానం నియోజకవర్గ పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పొన్నాల ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.   టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసారి కూడా హుజూర్‌ నగర్ నుంచే పోటీ చేయనున్నారు.ఆయన సతీమణి పద్మావతిని కోదాడ నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయనుండగా.. ఆయన తనయుడు కె.రఘువీర్‌రెడ్డిని మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారు.

టీ-టీడీపీ సీఎం అభ్యర్థిగా కృష్ణయ్య?

      తెలంగాణలో సీఎం పదవి బీసీలకే ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేయనున్నట్లు తెలుస్తోంది. బీసీ నాయకుడిగా రాష్ట్రవ్యాప్త గుర్తింపు ఉన్న ఆర్.కృష్ణయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలిసింది. దీనివల్ల తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలకు మరింత చేరువ కావచ్చునని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'బీసీని సీఎం చేస్తామని ప్రకటించిన తెలుగుదేశానికే మా మద్దతు' అని ఆర్.కృష్ణయ్య కూడా పేర్కొన్నారు. అయితే... ఆయన ఇప్పటిదాకా టీడీపీలో అధికారికంగా చేరలేదు. అతి త్వరలోనే కృష్ణయ్యను లాంఛనంగా పార్టీలో చేర్చుకుని... ఆయననే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణకు దళితుడే తొలి సీఎం అని ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్... ఇప్పుడు ఈ విషయంలో వెనుకడుగు వేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీలకు సీఎం పదవి ఇస్తామని ప్రకటించడం ద్వారా మొత్తం బలహీనవర్గాలందరికీ దగ్గర కావొచ్చునని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం!  

టీడీపీలోకే రాయపాటి

      గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఒకటి రెండు రోజుల్లో రాయపాటి టీడీపీలో చేరబోతున్నారు. నరసరావుపేట నుంచి రాయపాటి టీడీపీ తరఫున పోటీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు నరసరావుపేట సిటింగ్ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని గుంటూరు పశ్చిమ నియోజక వర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు సూచించినట్లు తెలియవచ్చింది.   రాయపాటిపై కాంగ్రెస్ అథిష్టానవర్గం బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరేదీ తేల్చుకోలేకపోయారు. ఈ మధ్య కాలంలో రాయపాటి శిష్యునిగా పేరుపొందిన డొక్కా ఆయనకు మళ్ళీ కాంగ్రెస్‌లోకి రప్పించడానికి ఢిల్లీలో యత్నించినట్లు తెలిసింది. అయినా ఫలితం దక్కలేదు. ఒక దశలో రాయపాటి సమైక్యాంధ్ర నినాదంతో తెరపైకి వచ్చిన కిరణ్‌తో చేతులు కలుపుతారనుకున్నారు. అదీ జరగలేదు. చివరకు సైకిలెక్కాలనే రాయపాటి నిర్ణయించుకున్నారు.

పండగ పుణ్యమాని.. తగ్గిన ఖర్చు

      ఈసారి ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు ఉగాది పండుగ కలిసొస్తోంది. ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు మునిసిపల్ ఎన్నికలున్నాయి. ఆ మర్నాడే ఉగాది పండుగ. అంటే రెండు రోజులు సెలవులొస్తున్నాయి. ఎటూ రెండు రోజులు సెలవులు వస్తాయి కాబట్టి, వేర్వేరు నగరాల్లో స్థిరపడినవాళ్లు కూడా సొంతూళ్లకు తమంతట తామే వస్తారు. పండుగ పుణ్యమా అని ఆయా డివిజన్లలోని అభ్యర్థులకు కొంత ఖర్చు తగ్గినట్టవుతుంది. ఒకవేళ ఉగాదికి వాళ్లు రాకపోతే దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రవాణా చార్జీలు భరించి తీసుకురావాల్సి వచ్చేది. ప్రతిసారీ స్థానిక ఎన్నికల్లో, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అయితే హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కేవలం ఓట్లు వేయించుకోడానికే భారీ సంఖ్యలో ఓటర్లను వోల్వో బస్సుల్లో తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఆ ఖర్చు మొత్తం తగ్గిపోయినట్లయింది.

మర్డర్ కేసులో బైరెడ్డి?

      రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాశేఖరరెడ్డిపై హత్య కేసు నమోదైంది. నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడు దారుణ హత్యపై మృతుడి కుమారుడు కర్నూలు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెరైడ్డి రాశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, తమ్ముడి కుమారుడు సిద్దార్ధరెడ్డిలతోపాటు ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మరికొంతమంది తన తండ్రిని హతమార్చారని సాయి ఈశ్వరుడు కుమారుడు ఫిర్యాదు లో పేర్కొన్నాడు.   సాయి ఈశ్వరుడు గతంలో బెరైడ్డి రాశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడు. తరువాత కాలంలో ఆయనకు దూరమయ్యాడు. ఆ తరువాత కాలంలో సాయి ఈశ్వరుడు ఒకసారి హత్యా ప్రయత్నం జరిగింది. ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కోర్టు కొట్టేసింది. పిల్లల చదువుల కోసం కర్నూలు వచ్చి స్థిరపడిన సాయి ఈశ్వరుడు ప్రత్యర్ధులు బలిగొన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం చాటుకొనేందుకే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

మెగా సోదరుల మాటల యుద్ధం

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తానని శపథం చేసారు. అయితే ఆయన సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత భుజాన్నేసుకొన్నసంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల తమ్ముడు విసిరిన సవాల్ కి జవాబీయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.   చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, “తమ్ముడు పవన్ సమాజానికి సేవ చేయాలనే తలపుతో రాజకీయాలలోకి ప్రవేశించాడు. 125సం.ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఎన్నో సవాళ్ళను సమర్ధంగా ఎదుర్కొని బయటపడింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం కొత్తా కాదు, పెద్ద కష్టమూ కాదని” బదులిచ్చారు.   చిరంజీవికి కూడా కాంగ్రెస్ నీళ్ళు బాగానే ఒంటబట్టాయి గనుక అచ్చమయిన కాంగ్రెస్ వాదిలాగే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చక్కగా చిలకపలుకులు పలికారు. అయితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా అభ్యర్ధులు దొరకని పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఎవరికయినా అర్ధమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వంటి మంచి ప్రజాభిమానం ఉన్న వ్యక్తి, రాజకీయాలోకి ప్రవేశించడం, కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయమని ప్రజలకు పిలుపునీయడం, ప్రజలపై, ముఖ్యంగా మెగాభిమానులపై ఎటువంటి ప్రభావమూ చూపదని చిరంజీవి అనుకొంటే అది భ్రమే అవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకి ప్రస్తుతం ఇంతకంటే వేరే గత్యంతరం కూడా లేదు పాపం!

సీనులోకి చిన్నశీను?

  మజ్జి శ్రీనివాసరావు .. ఈ పేరు బహుశా చాలా మందికి తెలియదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువనేత విజయనగం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కూడా. ఇలా ఎన్ని చెప్పినా ఎవరూ గుర్తు పట్టలేరు. చిన్న శీను అని చెబితే 3 జిల్లాల అధికార యంత్రాంగం నుంచి.. 3వ తరగతి పిల్లాడి వరకూ ఠక్కున చెప్పేస్తారు. తాజా మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శీను.. అంటే ఉత్తరాంధ్రకు చిన్న సైజు ప్రభుత్వమే. మేనమామ బొత్సకు జిల్లాలో అందరూ ఝలక్ ఇచ్చి వెళ్లిపోతుంటే చూడలేక బొత్సకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కార్యరంగంలోకి దూకాడు.   ముందుగా బొత్స ఇంటి సెంటిమెంట్ పై చిన్న శీను దృష్టి సారించారు. చీపురుపల్లి -గరివిడి మద్యలో ఉన్నసొంత ఇంటి నుంచే బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆస్తులు అంతస్తులు పెరిగిపోవడంతో విజయనగరంలో రాజప్రాసాదాల్లోకి మారిపోయారు. బొత్స గతంలో ఉన్నఆ పాత ఇంటినే అనధికార కార్యాలయంగా చేసుకొని చిన్న శీను రాజకీయ కార్యక్రమాలు త్వరలోనే మొదలుపెడుతున్నారు. చిన్నశీను అంటే బొత్సకు ప్రతిరూపం. పాత ఇంట్లో ఉండేది చిన్నశీను అయినా సెంటిమెంట్ వర్కవుట్ అవ్వాల్సింది మాత్రం బొత్సకే కనుక, ఆయన కూడా అప్పుడప్పుడు మేనల్లుడిని చూసినట్టూ ఉంటుంది.. పదేళ్లుగా పలుకరించని నియోజకవర్గం ప్రజలని పలకరించినట్లూ ఉంటుందని వీలున్నపుడల్లా ఆ ఇంటి వైపు ఓరౌండు వేసి వస్తున్నారుట! అంటే బొత్స మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి ఎదిగి డిల్లీ వరకూ చేరతారేమో చూడాలి.   ఇక బొత్సకు అత్యంత సన్నిహితుడు, తన సిట్టింగ్ స్థానం చీపురుపల్లి పక్క నియోజకవర్గమైన ఎచ్చెర్ల కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మీసాల నీలకంఠ నాయుడు ఈమధ్యనే వైసీపీలో చేరారు. బొత్సకు కుడిభుజం వంటి బెల్లాన చంద్రశేఖర్ కూడా ఈమధ్యనే జగన్ వైపు జంప్ చేసారు. ఇటువంటి కష్టకాలంలో ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తికి టికెట్ ఇప్పించి బరిలోకి దింపడం కంటే తన మేనల్లుడు చిన్న శీనునే ఎచ్చెర్ల నుండి బరిలోకి దింపినట్లయితే తనకూ అండగా ఉంటాడనే ఉద్దేశ్యంతో అతనికి టికెట్ ఇప్పించేందుకు బొత్స ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఇంతవరకు తెర వెనుకుండి మామకోసం మంత్రాంగం నడిపిన చిన్న శీను ఈసారి ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగి, ఎచ్చెర్ల నుండి పోటీ చేసి గెలిచి తన సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్నట్లు తెలుస్తోంది.  

బొత్సకు చీపురుపల్లి చిక్కులు?

బొత్సకు చీపురుపల్లి చిక్కులు?   బొత్స సత్యనారాయణ .. తాజా మాజీ పీసీసీ చీఫ్. కాంగ్రెస్ నుంచి ఎవరు వెళ్ళిపోయినా నష్టం లేదంటూ పీసీసీ పీఠంపై ఉంటూ బీరాలు పలికిన పెద్ద మనిషి.. కుర్చీ దిగేసరికి కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్ధమవుతోంది. సొంత నియోజకవర్గంలో, తన ఆంతరంగికులే పార్టీని వీడుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన  సత్తిబాబుకు.. పెదబాబు అనబడే బెల్లాన చంద్రశేఖర్ కుడి భుజంగా వ్యవహరించేవాడు. బెల్లానను కాంగ్రెస్ కార్యకర్త నుంచి జెడ్పీ చైర్మన్ వరకూ తీసుకెళ్ళింది బొత్సే. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడం, బీరకాయ పీచు చుట్టరికం కూడా కలవడంతో బొత్స వ్యవహారాలన్నీ చక్కపెట్టేవాడు బెల్లాన.   ఏ వ్యవహారం బెడిసి కొట్టిందో తెలియదు గానీ బెల్లాన జగన్ కు జై కొట్టారు. రాష్ట్ర విభజన చేసి సీమాంధ్ర లో దోషిగా నిలబడిన పార్టీ తరపున పనిచేస్తే రాజకీయ భవిష్యత్ ఉండదనే ఆలోచనతో బెల్లాన సత్తిబాబుకు హ్యాండిచ్చి జగన్ తో చేయి కలిపాడని అనుకుంటున్నారు కార్యకర్తలు. ఇటీవల చీపురుపల్లి మేజర్ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బొత్స మద్దతుతో కాంగ్రెస్ సానుభూతిపరులుగా బరిలో తన భార్యను దింపిన బెల్లాన ఫలితం  చూసి తెల్లబోయారు. ఒక్క పంచాయతీలో 5000 కు పైగా ఓట్ల మెజారిటీతో ప్రత్యర్ధి గెలవడం బెల్లాన చంద్రశేఖర్ ను ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు సన్నిహితులు. బొత్సతో ఉంటే తానూ రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వస్తుందని భావించిన పెదబాబు చీపురుపల్లి వైసీపీ టికెట్ హామీతో జగన్ గూటికి చేరారని బెల్లాన భార్య శ్రీదేవి చెబుతోంది. తన అంతరంగికుడే .. వైసీపీ తరపున తన ప్రత్యర్ధిగా ఎన్నికల రంగలో దిగుతుండటంతో చీపురుపల్లిలో పోటీ చేయాలా వద్దా అని బొత్స పునరాలోచనలో పడినట్లు సమాచారం. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేయాలని బొత్సను కోరుతున్నారు.

పవన్, కిరణ్ లది ఒకటే పార్టీ?

      రాజమండ్రి సభలో తాజా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీ పేరును జై సమైక్యాంధ్రగా ప్రకటించారు. నోవాటెల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ నామకరణోత్సవం నిర్వహించారు. జనసేన పేరును అధికారికంగా ప్రకటించారు. కొత్తగా పెట్టిన ఈ రెండు పార్టీల పేర్లు ఇంగ్లీష్ షార్ట్ ఫార్మ్ లో జై సమైక్యాంధ్ర పార్టీ (jsp), జనసేన పార్టీ (jsp) లుగా ఉచ్చరించాల్సినవే. తెలుగు పొట్టి పేర్లలో జైసపా, జైసేపా లుగా స్థిరపడి చిన్న తేడా రెండింటి మధ్య కనిపిస్తుంది. పేరులోనే కాకుండా తీరులోనూ ఈ రెండు పార్టీలకు చాలా పోలికలున్నాయి. కాంగ్రెస్ డిల్లీ పెద్దలపై ఆగ్రహంతోనూ, విభజన తీరును వ్యతిరేకిస్తూ  కిరణ్, పవన్ లు కొత్త పార్టీలను పెట్టారు. తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదంటూనే సీమాంధ్ర హక్కులు గురించి ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు, మార్చి నెలలోనే రెండు పార్టీలు ఆవిర్భవించాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని కిరణ్కుమార్ రెడ్డితో పాటు పవన్ కళ్యాణ్ కూడా అభిమానించడం కొసమెరుపు.

డిగ్గీకి విభజన వర్తించదా?

      ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లు-2014 ను ఉభయ సభలు ఆమోదించడం, రాష్ట్రపతి ఆమోదముద్ర పడడం అయిపోయింది. వాటాలు, కోటాలు, పంపకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ ల అపాయింటెడ్ తేదీ కూడా జూన్ 2 గా నిర్ణయించేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, విపక్షాలతో కుమ్మక్కు అవ్వాల్సి వచ్చినా రాజీ పడని కాంగ్రెస్.. ఇచ్చిన మాటకు కట్టుబడి విభజన చేసేసింది. తమ పార్టీకి కూడా రెండు కార్యవర్గాలను ప్రకటించేసింది.   తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పొన్నాల, అవశేష ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డితో ఇరుప్రాంతాలకు ఎన్నికల, పార్టీ కార్యవర్గాలను కూడా నియమించింది. పట్టు పట్టి రాష్ట్రాన్ని విడగొట్టిన డిగ్గీ రాజా మాత్రం రెండు రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా పనులు చక్కబెట్టేస్తున్నాడు. తెలంగాణలో హామీలు సీమాంధ్ర కు పనికి రావు. సీమాంధ్ర కంటి తుడుపు ప్యాకేజీ మాటలకు  తెలంగాణాలో ఓట్లు రాలవు. రెండు రాష్ట్రాలకు ఇద్దరు ఇంచార్జ్ లను నియమిస్తే బాగుంటుందని సీమాంధ్ర  కాంగ్రెస్ లో మిగిలిన నాయకులు తమ ఆంతరంగిక చర్చల్లో ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఇరు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి జైరాం రమేష్  చేసిన వ్యాఖ్యలు పార్టీకి పూడ్చలేని నష్టాన్ని చేశాయని వాపోతున్నారు. ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేశారు, ఒక పీసీసీని రెండుగా విభజించేశారు. మరి ఇంచార్జ్ గా ఒక్క డిగ్గీ రాజానే ఎందుకు కొనసాగిస్తున్నారో అర్ధం కావడం లేదని, తమ చేతలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరు ప్రాంతాల నేతల్ని ఇరుకున పెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనియమ్మా విభజన మాకే కాదు.. డిగ్గీరాజా లాంటి ఇంచార్జ్ లకు కూడా వర్తింపజేయమ్మ అని వేడుకుంటున్నారు.

జగన్ కు డీఎన్ఏ పరీక్ష?

      "రావుగారు మీరేం అనుకోనంటే ఒక మాటంటాను. మీకు కొంచెం.. నోటి దూల ఎక్కువే" ఢీ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న డిగ్గీ రాజా.. అదేనండి మన దిగ్విజయ్ సింగ్ గారు కూడా సేమ్ టు సేమ్ రావుగారి టైపే ..అలాగని ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది అనడు. అరిగిపోయిన రికార్డుల్లాగా కొన్నింటిని రిపీట్ చేస్తుంటాడంతే. అందులో మొదటిది అన్ని పార్టీలు అంగీకరించాకే రాష్ట్రాన్ని విభజించాం. రెండోది తెలంగాణా ఇస్తే తెరాస ను కాంగ్రెస్ లో కేసీయార్ విలీనం చేస్తామన్నారు. ముచ్చటైన మూడోది జగన్ ది కాంగ్రెస్ డీఎన్ఏ.   మొదటిది నిజమే, రెండోది నిజమే.. మూడోది కూడా దిగ్విజయ్ నిజమేనంటారు. ఎవరికైనా అనుమానం ఉంటే, కాంగ్రెస్ జెండాకు, వైసీపీ జెండాకు డీఎన్ఏ పరీక్ష చేసుకోమంటాడు. మరో వైపు పిల్ల కాంగ్రెస్, ఎన్నికల తరువాత తల్లి కాంగ్రెస్ లో కలిసి పోవడం ఖాయం అంటూ చంద్రబాబు వూరు వాడా ప్రచారం చేస్తున్నారు. దీనికి ఊతం ఇచ్చేలా డీఎన్ఏ మాట మాననంటున్నాడు దిగ్విజయ్ సింగ్. కొట్టినా, తిట్టినా డిగ్గీరాజా డీఎన్ఏ మాట మీదే నిలబడినప్పుడు మాట తప్పని జగన్ కాంగ్రెస్ పెద్దలకు ఏం మాట ఇచ్చారోనని ప్రజలు గుసుగుసలాడుకుంటున్నారు. మడమ తిప్పని మహానేత తనయుడు డీఎన్ఏ పరీక్షకు సిద్ధమై విశ్వసనీయత నిలుపుకోవాలని కోరుతున్నారు  వైసీపీ కార్యకర్తలు.  

కమలం వైపే జనాభిప్రాయం

      రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న భారతీయ జనతా పార్టీ హవా ఉంటుందని.. ఆ పార్టీ అత్యధికంగా 195 సీట్లు గెలుచుకుంటుందని తమ తాజా ఎన్నికల సర్వేలో వెల్లడయిందని ఎన్‌డీటీవీ తెలిపింది. హంసా రీసెర్చ్ గ్రూప్‌తో కలిసి నిర్వహించిన సర్వే ప్రకారం.. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి 229 సీట్లు లభిస్తాయని.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీకి 43 సీట్లు తగ్గుతాయని పేర్కొంది. ఇక అధికార యూపీఏ సారథి కాంగ్రెస్ పార్టీ బలం సగానికి సగం పడిపోయి 106 సీట్లకు తగ్గుతుందని అంచనా వేసింది. యూపీఏకు మొత్తంగా 129 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే చెప్తున్నట్లు వెల్లడించింది. వామపక్షాలతో కూడిన ప్రత్యామ్నాయ కూటమికి కేవలం 55 సీట్లు వస్తే, ఇతర పార్టీలన్నిటికీ కలిపి 130 సీట్లు వస్తాయని పేర్కొంది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 350 నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మందికి పైగా ప్రజలను సంప్రదించి ఈ సర్వేను నిర్వహించినట్లు ఎన్‌డీటీవీ వివరించింది.

తెలంగాణాలో టీఆర్‌ఎస్ పైచేయి

        తెలంగాణా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా దెబ్బతింటుందని ఎన్‌డీటీవీ సర్వే చెబుతోంది. ఇక్కడ మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో 11 సీట్లు టీఆర్‌ఎస్ గెలుచుకుంటుంది. ఇది గతం కన్నా 9 సీట్లు ఎక్కువ. తెలంగాణా ప్రకటించిన కాంగ్రెస్‌కు కేవలం 5 సీట్లు మాత్రమే లభిస్తాయని సర్వే తెలిపింది. సీమాంధ్రలో కాంగ్రెస్ కు ఒక్కటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మట్టికరవనుందని ఎన్‌డీటీవీ సర్వే స్పష్టంచేస్తోంది. ప్రస్తుత లోక్‌సభలో ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్‌కు 21 సీట్లు ఉంటే.. ఇప్పుడు ఒక్క సీటుకే పరిమితమవుతుందని సర్వే చెప్తోంది. మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అలాగే.. టీడీపీ-బీజేపీ కూటమికి 9 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది.

ఎర్రబెల్లి ఏం చేస్తారో?

      తెలంగాణా తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు రాజకీయ పయనంపై కొనసాగుతున్న చర్చకు ఒకటిరెండు రోజుల్లో తెరపడే అవకాశం కనపిస్తోంది. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎర్రబెల్లి ఆ పార్టీని వీడుతారా... అందులోనే కొనసాగుతారా అనే అంశంపై శనివారం స్పష్టత వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణా కమిటీ ఏర్పాటు చేసి తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేస్తున్నారు. కమిటీ ఏర్పాటు ఉంటుందా లేదా అనే విషయం శనివారం తేలుతుందని ఎర్రబెల్లి అనుచరులు చెబుతున్నారు.   కానీ, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ దుగ్యాల శ్రీనివాసరావు, ఎర్రబెల్లిని పార్టీలోకి తీసుకోవద్దంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న హన్మకొండలో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం పెట్టి మరీ దయాకర్‌ రావును కాంగ్రెస్‌ లోకి రానివ్వబోమని ప్రకటించారు. శుక్రవారం ఏకంగా నియోజకర్గంలోని ముఖ్యనేతలతో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ ను, టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిసి.. దయాకర్‌ రావును పార్టీలోకి తీసుకోవద్దని కోరారు.

హస్తానికి చెయ్యిచ్చిన నందీశ్వర్?

      కాంగ్రెస్ శాసనసభ్యుడు నందీశ్వర్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీకి ‘చెయ్యి‘ ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు ప్రధాన అనుచరుడు. స్థానికంగా కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని, పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాల్లేవనే ఉద్దేశంతోనే ఆయన టీఆర్‌ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలిసి డీఎస్ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. డీఎస్ స్వయంగా ఫోన్ చేసినా రెండ్రోజుల నుంచి స్పందించడం లేదని సమాచారం.

బాబోయ్.. రేణుక మాకొద్దు

      ఫైర్‌బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు అందింది. రేణుకపై ఫిర్యాదు అనగానే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులే చేసి ఉంటారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. ఈసారి ఆ అవకాశాన్ని ఇతర జిల్లాల నాయకులు తీసుకున్నారు. మేడమ్ మాకొద్దు అంటూ ఇతర జిల్లాలకు చెందిన ఎంపీలు పార్టీ అధినేత్రికి లేఖ రాశారు.   రానున్న సార్వత్రిక ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇటీవలే తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎంపీ రేణుకాచౌదరికి కూడా స్థానం కల్పించారు. మొత్తం 23 మంది  సభ్యులున్న ఈ కమిటీలో రేణుకకు స్థానం కల్పించడాన్ని తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. వీళ్లకు పొన్నం ప్రభాకర్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. తెలంగాణా ఉద్యమాన్ని, ఈ ప్రాంత ప్రజల పోరాటాన్ని అవమానపరిచేలా మాట్లాడిన రేణుకకు తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఎలా స్థానం కల్పిస్తారని ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్ సమక్షంలోనే ప్రశ్నించినట్లు తెలిసింది.