Read more!

పవన్ కి అండగా మెగాభిమానులు

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టేందుకు సిద్దపడుతుండటంతో చిరంజీవి తన అభిమాన సంఘాల నేతలకు స్వయంగా ఫోన్లు చేసి తన సోదరుడి సభకు వెళ్ళవద్దని చెపుతున్నట్లు సమాచారం. అదే నిజమయితే, పదవుల కోసం ఇప్పటికే తన పరువు పోగొట్టుకొన్న ఆయన ప్రజల దృష్టిలో ముఖ్యంగా అభిమానుల దృష్టిలో మరింత చులకనవడం తధ్యం. చిరంజీవికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అభిమానులున్న సంగతి ఎవరూ కాదనలేరు. అయితే వారు ఆయన సినిమాల కారణంగానే అభిమానులయ్యారు తప్ప ఆయనలో వేరేదో గొప్ప గుణం చూసి మాత్రం కాదు. కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులలో చాలా మంది ఆయన సినిమాలను చూసి కాక ఆయనలో ఉన్న మానవతా దృక్పధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి అభిమానులయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ నటించిన అనేక సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ ఆయనపై వారి అభిమానం చెక్కు చెదరలేదు.

 

చిరంజీవి ప్రజారాజ్యం ప్రయోగం విఫలమయిన తరువాత మెగాభిమానులలో చాలా నిరుత్సాహం ఏర్పడింది. ఆ తరువాత వారి నమ్మకాన్ని, ఆశలను చివరికి వారి అభిమానాన్ని అన్నిటినీ వమ్ము చేస్తూ సాగుతున్న ఆయన ప్రస్తానం చూస్తున్న అభిమానులు, ఇప్పుడు సరిగ్గా అటువంటి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాజకీయాలలోకి ప్రవేశించాలనుకోవడంతో, ఆయన ఎక్కడ దెబ్బ తింటారో అనే భయంతోనే ఆయన రాజకీయ ప్రవేశాన్ని మనస్పూర్తిగా స్వాగతించలేకపొతున్నారు తప్ప, ఆయన రాజకీయాలలోకి రాకూడదని కాదు. అయితే, ఆయన ఆవేశంతో, అనాలోచితంగా వ్యవహరించకుండా సరయిన రాజకీయ విధానాలతో తనను తాను నిరూపించుకొన్నట్లయితే, ఆయనకు తన కుటుంబ సభ్యులు, సోదరులు అండగా నిలవనప్పటికీ, మెగాభిమానులందరూ ఆయనకు అండగా నిలవడం తధ్యం. పవన్ కళ్యాణ్ తన ముందున్నది పూల బాట కాదు, ముళ్ళ బాట అని నిత్యం గుర్తుంచుకొని పూర్తి అప్రమత్తతో, పూర్తి అవగాహనతో అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది. లేకుంటే ఇది కూడా మరొక ప్రజారాజ్యం, మరొక ఆమాద్మీ పార్టీలలాగ నవ్వుల పాలవుతుంది.