Read more!

చంద్రబాబు సరి కొత్త ప్రయోగం

 

ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని, వినియోగించుకోవడంలో ఎల్లపుడు ముందుండే చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలకు మరో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు నిన్న వైజాగ్ లో జరిగిన ప్రజాగర్జన సభలో ప్రకటించారు.

 

ఈసారి పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరిని అభ్యర్ధులుగా నిలబెట్టాలో తెలుపమని కోరుతూ పార్టీ ఎంచుకొన్నకొందరు అభ్యర్ధుల పేర్లను చంద్రబాబు గొంతుతో రికార్డు చేయబడిన వాయిస్ మెసేజ్ లు పార్టీ కార్యకర్తల, ప్రజల సెల్ ఫోన్లకు పంపబడతాయని, ఐ.వీ.ఆర్.యస్. ఆధారితంగా పనిచేసే ఆ మెసేజ్ లకు ప్రజలు, కార్యకర్తలు స్పందించి తమకు నచ్చిన అభ్యర్ధులను ఎంచుకోవచ్చని వారి అభిప్రాయాలకు అనుగుణంగా వారికి నచ్చిన వ్యక్తినే పార్టీ అభ్యర్ధిగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే నియోజక వర్గాల వారిగా అభ్యర్ధుల పేర్లతో కూడిన మెసేజ్ లు ప్రజలకు, కార్యకర్తలకు అందుతాయని, వాటికి స్పందించమని చంద్రబాబు కోరారు.

 

ఇదే ప్రయోగం ఆయన అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయక మునుపే చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. అందరి మన్ననలు పొందగాలిగేవారు. కానీ, దాదాపు సగం మందికి పార్టీ టికెట్స్ ఖరారు చేసిన తరువాత చేస్తున్న ఈ ప్రయోగం వలన ఆశించిన ఫలితం దక్కకపోవచ్చును. పైగా కొత్త సమస్యలను సృష్టించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు విజయవాడ నుండి కేశినేని నానికి ఏడాది క్రితమే ఆయన లోక్ సభ టికెట్ ఖరారు చేసారు. ఇప్పుడు ఆయనతో బాటు మరో ముగ్గురు అభ్యర్ధుల పేర్లను సూచిస్తూ మెసేజులు పంపినప్పుడు, ప్రజలు, కార్యకర్తలు ఆయనను కాక మరొకరి పేరును సూచిస్తే ఆయనను మార్చడం సాధ్యమా? అంటే కాదనే చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నుండి తెదేపాలోకి వచ్చి చేరుతున్న వారందరూ కూడా పార్టీ టికెట్స్ ఖరారు చేసుకొన్న తరువాతనే పార్టీలో చేరుతున్నారనేది బహిరంగ రహస్యం. కనుక అభ్యర్ధులకు పార్టీ టికెట్స్ ఖరారు చేసిన తరువాత ప్రజలను, కార్యకర్తలను అభిప్రాయం కోరడంలో ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలి.

 

అయితే, ఇప్పటికీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయని అనేక నియోజకవర్గాలలో ఈ ప్రయోగం చేయవచ్చును. కానీ, అది కూడా కొత్త సమస్యలకు దారి తీయవచ్చును. అయితే ప్రతీ కొత్త ప్రయోగానికి, ఆలోచనకీ మొదట్లో ఇటువంటి ఆటుపోటులు, విమర్శలు ఎదుర్కోక తప్పదు గనుక చంద్రబాబు ప్రయత్నించడంలో తప్పులేదు.