ఈ సిరా ఏ ఓటుదో?

      ఎన్నికల్లో దొంగ ఓట్లను నిరోధించేందుకు సిరా చుక్కతో చెక్ పెడతారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఓటరు వేలిపై వేసే ఈ చుక్క వల్ల వాళ్లు అప్పటికే ఓటు వేసినట్టు తెలుస్తుంది. అది పోవాలంటే చాలా సమయం పడుతుంది. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. రోజుల వ్యవధిలోనే ఓటర్లు ఆయా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన వారు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లోను, జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు తరువాత శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు.   ఓటు వేసిన వారి ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడతారు. ఈ చుక్క చెరగాలంటే నెలకు పైగా సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఈ రెండు ఎన్నికల మధ్య వ్యవధి తక్కువ కావడంతో ఓటర్లకు పోలింగ్ ఏజెంట్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. రెండు ఎన్నికలకూ రెండు వేళ్లకు సిరా చుక్క వేస్తారా? అది సాధ్యం కాదా? అనేది ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

పార్టీ అధ్యక్షుల సీమ?

  రాయలేలిన సీమ, రతనాల సీమ మన రాయలసీమ. రాష్ట్ర రాజకీయ పటంలో సీమకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. అతి ఎక్కువ ముఖ్యమంత్రులను అందించిన ఘనత రాయలసీమదే. రాష్ట్ర విభజన నేపద్యంలో మరో రికార్డ్ సీమ మెడలో హారం కానుంది. సీమ ప్రాంతంలోని 4 జిల్లాలకు చెందిన వారే వివిధ రాజకీయ పార్టీల అద్యక్షులు, కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ పార్టీతో పెరిగిన అధ్యక్షులు మొత్తం 5 ప్రధాన పార్టీల అధ్యక్షులతో రాజకీయాల్లో కీలకం తామేనని నిరూపించుకున్నారు.   ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఆ పార్టీకి అధ్యక్షుడు కూడా కిరణే. కడప జిల్లాకు చెందిన జగన్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి ఎంపిక కావడం అనంతపురం జిల్లాకో పార్టీ అధ్యక్షుల కోటా దక్కింది. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ పరిరక్షణ వేదిక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ్ కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారే.

గవర్నర్ వర్సెస్ భన్వర్ లాల్

      గవర్నర్ నరసింహన్ ఎంత చమత్కారంగా ఉంటారో అంతే సీరియస్ గా కూడా ఉంటారు. గతంలో డిసెంబర్ 31 తర్వాత ఏమవుతుంది అంటే, ఏముంది జనవరి 1 వస్తుంది అని సరదాగా నవ్వేశారాయన. అలాంటి గవర్నర్.. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్ లాల్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం.   విషయం ఏమిటంటే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉంది కాబట్టి, ప్రధాన అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించాలని గవర్నర్ నరసింహన్ భావించారు.  కానీ, ఆ విషయం సీఎస్ నుంచి భన్వర్ లాల్ వద్దకు వెళ్లింది. ఆయన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని సంప్రదించి, ఇది ఎన్నికల కోడ్ కు ఉల్లంఘన అని, గవర్నర్ కూడా కోడ్ పరిధిలోకే వస్తారని చెప్పారు. దాంతో నరసింహన్ కు ఒళ్లు మండింది. అందుకే భన్వర్‌లాల్‌ కు ఘాటైన లేఖ రాస్తూ.. తన అధికారాల గురించి చెప్పనక్కర్లేదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తే చాలనే అర్థం వచ్చేలా పేర్కొన్నట్లు సమాచారం.

భోజనం చెయ్యి.. 20 వేలియ్యి

      మన రాష్ట్రంలో కేసీఆర్, హరీష్ రావు లాంటి టీఆర్ఎస్ నేతలు ఆమధ్య కూలిపని చేసి, టీ కొట్టులో పనిచేసి వేలకు వేలు, లక్షలకు లక్షలు జీతాలు సంపాదించారు.. గుర్తుందా? గమేళాలో ఒకే ఒక్క ఇటుక పెట్టుకుని దాన్ని నాలుగడుగులు తీసుకెళ్లి ‘కూలీ‘ చేసినందుకు కేసీఆర్ అప్పట్లో 20 వేలు సంపాదించేశారు. సరిగ్గా ఇదే మంత్రాన్ని బెంగళూరులో ఓ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు జపిస్తున్నారు.   నిన్నటి వరకు ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం చేసి, ఇప్పుడు ఆమ్ ఆద్మీగా మారిన బాలకృష్ణన్ అక్కడో విందు ఏర్పాటుచేశారు. దీనికి అరవింద్ కేజ్రీవాల్ కూడా వస్తారు. అక్కడ భోజనం చేయడంతో పాటు పార్టీ విధానాల గురించి ఏం అడిగినా కేజ్రీ సమాధానాలు చెబుతారు. ఇంతకీ విందుభోజనం ఖరీదు ఎంతో తెలుసా.. అక్షరాలా 20 వేల రూపాయలు మాత్రమే. ఇలా ఒక్కో విందు ద్వారా 4 లక్షలు సంపాదించాలన్నది ఆ పార్టీ లక్ష్యమట. ఇలాంటి ఫండ్ రెయిజింగ్ డిన్నర్స్ అమెరికన్ రాజకీయాల్లో మామూలే. కానీ ఆమ్ ఆద్మీలకు అందని ద్రాక్షల్లాంటి ఇలాంటి విందుల వల్ల ఏం లాభమని ఆప్ వ్యతిరేకులు విమర్శిస్తున్నారట.

అబ్బాయి దెబ్బ.. బాబాయ్ అబ్బా

  అబ్బాయ్ ముద్దొస్తున్నాడని చంకన వేసుకుంటే చెవులు కొరికేసాడట. ఇదే రీతిలో బాబాయ్ వివేకానందరెడ్డికి జరిగిందట. అన్న వైఎస్ అంటే వల్లమాలిన అభిమానం వివేకాకు.. రాముడు వనవాసానికి వెళ్తే.. ఆయన పాదరక్షలు సింహాసనంపై ఉంచి పాలించిన భరతుడు టైపులో అవకాశం దక్కి ఉంటే వివేకా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత అన్నయ్య బొమ్మ పెట్టి పాలించేవాడే. అన్న మనోడే అయినంత మాత్రాన అబ్బాయి కూడా తనోడే అవుతాడనుకోవడం పొరపాటే అని చింతిస్తున్నాడు వివేకానందరెడ్డి.   అన్న ఉన్నప్పుడే అన్యాయం అన్నీ తానే అనుకుని నమ్ముకున్న అన్న ఉన్నప్పుడే వివేకాకు అన్యాయం జరిగింది. అబ్బాయి మొదటి దెబ్బకు బాబాయ్ అబ్బా! అని వాపోయాడు. అన్న కొడుకు జగన్ కోసం తన పార్లమెంట్ స్థానాన్ని త్యాగం చేసిన వివేకా.. వైఎస్ మరణానంతరం తప్పనిసరి స్థితిలో కాంగ్రెస్ లో చేరాడు. అమ్మ అన్నం పెట్టదు. అడుక్కొనీ తిననివ్వదన్నట్లు జగన్ వ్యవహరించడంతో వైఎస్ ఫ్యామిలీ పొలిట్రిక్స్ లో వివేకా ఒంటరి అయిపోయాడు. కాంగ్రెస్ లో ఉంటూ వదిన విజయమ్మపై పోటీ చేసి వైఎస్ అభిమానులు, బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. అడ్డంకులు అధిగమించేందుకు తప్పనిసరి అబ్బాయి పంచన మళ్ళీ చేరాడు.   బాబాయి అయినా .. జగన్ జైలులో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లి భంగపడిన వివేకా..అవమానభారంతో ఉన్నా ఇతర పార్టీల్లో చేరలేని పరిస్థితి. అబ్బాయి జగన్ కడప జిల్లా పార్లమెంట్, అసెంబ్లీ టికెట్ల పందేరం పూర్తి చేశాడు. బాబాయ్ కి నో టికెట్..నో సీట్... పోనీ పార్టీ పదవుల్లో ఏమైనా అవకాశం ఇస్తాడా అనుకుంటే అదీ లేదు. ఒకప్పుడు జగన్ అభిమానులు అడ్డగించిన సందర్భంలో మీసం మెలేసి తొడగొట్టిన బాబాయ్.. ఇప్పుడు అబ్బాయి కొట్టిన దెబ్బకు రాజకీయరంగం నుంచి ఏకంగా కనుమరుగైపోయే పరిస్థితి. పాపం బాబాయ్!

జైరామ్ నోటి దురద కొంచెం ఎక్కువే

  గత రెండు వారాలుగా రాష్ట్రం మీదనే చక్కర్లు కొడుతున్న కేంద్రమంత్రి జైరామ్ రమేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలని, ప్రతిపక్ష పార్టీలనీ చివరికి తన కాంగ్రెస్ పార్టీకి కూడా చిరెత్తిస్తున్నారు. మొన్న తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని ప్రకటించి నాలిక కరుచుకొన్న తరువాత తెరాస మీద అవాకులు చవాకులు వాగి నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరికలు చేయించుకొని వారి చేత తలంటించుకొన్నాక ఆంద్రాకు వచ్చి పడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు రాజమండ్రీలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని అక్కడ తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. దానిని జైరామ్ రమేష్ ఎద్దేవా చేస్తూ ‘శ్మశానంలో పుడుతున్న పార్టీ చివరికి శ్మశానంలోనే కలిసిపోతుందని’ వ్యాక్యానించారు. అప్పుడు పత్రికా విలేఖరులు అభ్యంతరం చెపితే, తన మాటలను అపార్ధం చేసుకోవద్దని రాజమండ్రిలో ఒక కైలాసభూమి ఉందని అందుకే తాను ఆవిధంగా అన్నాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదని సర్ది చెప్పుకొన్నారు. అయితే కిరణ్ కి కుడిభుజంగా వ్యవహరిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకు తీసిపోని విధంగా చాలా ఘాటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ అస్తికలను గోదావరిలో కలపడానికే ఆయన పనికట్టుకొని డిల్లీ నుండి వచ్చారని అన్నారు.   తెలుగు ప్రజలందరూ పవిత్ర గోదావరి ప్రవహించే రాజమండ్రీని తమ సాంస్కృతిక రాజధానిగా, ఒక పరమ పవిత్ర ప్రాంతంగా, పుణ్యక్షేత్రంగా భావిస్తూ దానితో ఏదో చెప్పలేని ఒక అవినాబావ సంబంధం పెనవెసుకొని ఉంటారు. అందుకే, అనేకమంది రచయితలు, కవులు, కళాకారులు గోదావరి-రాజమండ్రీ గురించి అపురూపంగా వర్ణిస్తారు. తెలుగు సినిమాకు గోదావరికి-రాజమండ్రీకి విడదీయరాని అనుబంధం ఉంది. అటువంటి పట్టణాన్ని జైరామ్ రమేష్ ఒక శ్మశానభూమిగా వర్ణించడం ఆయన మిడిమిడి జ్ఞానానికి, అహంకారానికి అద్దం పడుతోంది.   ఆయన ఈవిధంగా మిడిమిడి జ్ఞానంతో నోటికి వచ్చినట్లు మాట్లాడితే, ఇప్పటికే జీవచ్చవంలా కాడి మీద పడుకానున్న కాంగ్రెస్ పార్టీకి ఆయనే శ్రాద్ధ కర్మలు స్వయంగా నిర్వహించి ఉండవల్లి చెప్పినట్లు ఆ గోదాట్లోనే అస్థికలు కలిపి డిల్లీ తిరుగు ప్రయాణం కాకతప్పదు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఇటువంటి నేతల వలననే కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం కలుగుతోంది.

కమలం - సైకిల్ దోస్తీ?

  రానున్న ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్రంలోని కమలనాథులు ఎంతగా ఉత్సాహపడుతున్నా, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే మంచిదని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే బీజేపీతో టీడీపీ పొత్తు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక కొన్ని లాంఛనాలు కూడా పూర్తి చేసుకున్నాక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబు మంగళవారం పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినపుడు ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు. స్థానిక, సాధారణ ఎన్నికల్లో సీమాంధ్ర, తెలంగాణల్లో వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌ ప్రధాన శత్రువులన్నారు. భవిష్యత్ అవసరాలు, జాతీయరాజకీయాల్లో పార్టీ పోషించాల్సిన పాత్ర దృష్ట్యా బీజేపీతో కలిసి పనిచేయాలని సూచించారు. సాధారణ ఎన్నికలు పార్టీకి ముఖ్యం కాబట్టి బీజేపీ ఎన్ని స్థానాలు కోరితే అన్ని ఇవ్వాలన్నారు.

చెప్పుడు మాటలు విని విఫలమయ్యా: బాబు

  తాను 1999 వరకు స్వయంగా నిర్ణయాలు తీసుకునే వాడినని, ఆ తరువాత 2009 వరకూ పలువురు చెప్పిన మాటలు వినటంతో పాటు మొహమాటాలకు పోయి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటంతో వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. బాలకృష్ణ పోటీ చేస్తానంటే ఆయన కోరిన సీటును ఇస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు పార్టీ తరఫున ప్రచారం చేస్తారని తెలిపారు. సీమాంధ్రలో తనను లేకుండా చేయటంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి సహకరించాలనే ఉద్దేశంతోనే.. టీడీపీ సీమాంధ్రలో బీసీ సీఎం నినాదం ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని ఆయన విమర్శించారు.   టీఆర్‌ఎస్‌తో అనుబంధం ఉన్న ఉద్యోగులకే తనపట్ల వ్యతిరేకత ఉందని బాబు వ్యాఖ్యానించారు. అభ్యర్థులను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) పద్ధతి ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఎంపిక చేస్తామని అన్నా రు. తొలుత పార్టీ కార్యకర్తలు, ఆ తరువాత ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. అసెంబ్లీ లేదా లోక్‌సభ సీటుకు పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజలకు పంపి వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, వీరు ఎవ్వరూ వద్దనుకుంటే మరొకరి పేరు సూచించాలని కోరతామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామన్నారు.

విభజించు.. పాలించు

  కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. విభజించి పాలించే విధానాన్ని పదే పదే పాటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం ఉంటే తనకు ఇబ్బంది అని విభజించి, ఇప్పుడు మళ్లీ రెండువైపులా కూడా ప్రజల్లోను, నాయకుల్లోను విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగమే కేంద్ర మంత్రి జైరాం రమేష్ పర్యటన, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.   ఆంధ్రప్రాంతంలో పర్యటించినంత కాలం అక్కడి ప్రజలను, నాయకులను కూడా నోటికి వచ్చినట్లల్లా తిట్టిపోసిన జైరాం రమేష్.. తాజాగా తెలంగాణలోనూ అదే పని చేస్తున్నారు. జేఏసీ నేతలకు వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇస్తామని ప్రకటనలు చేయడం, మరోపక్క తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలతో సమావేశం కానున్నట్టు ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ పార్టీకి- తెలంగాణ జేఏసీకి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీన్ని పార్టీ సీనియర్ నేత, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కూడా తీవ్రంగా విమర్శించారు. హత్యలు చేసినవాళ్లే శవంపై పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించినట్టుగా ఆయన తీరు ఉందని దుయ్యబట్టారు. జేఏసీకి, టీఆర్‌ఎస్‌కు మధ్య అంతరం పెంచే పాపపు పనికి ఒడిగడుతున్నారని ఆరోపించారు.

బొత్సపై అధిష్టానం వేటు

  సమైక్యరాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన బొత్ససత్యనారాయణను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా నియమించబోతోందని వార్తలు వచ్చాయి. కానీ చాలా ఆశ్చర్యకరంగా ఆయన స్థానంలో రఘువీరారెడ్డిని నియమించింది. బొత్ససత్యనారాయణను పీసీసీ అధ్యక్ష పదవిలో నుండి తప్పించడమే కాకుండా ఆయనను, రఘువీరా రెడ్డి క్రింద పనిచేసే ఒక కమిటీలో ఒక సాధారణ సభ్యుడిగా నియమించడం శిక్షగానే భావించాల్సి ఉంటుంది.   బహుశః ప్రజలలో బొత్స పట్ల ఉన్న వ్యతిరేఖతను కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించినట్లు అర్ధమవుతోంది. అయితే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భావించినందునే ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పించిందని అనుకొన్నా, ఈ ఎన్నికలలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే కనబడనప్పుడు పదవిలో నుండి తప్పించడం కేవలం శిక్షగానే భావించవలసి ఉంటుంది.   ఆయన విభజన సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను అదుపుచేసి, అందరినీ ఒక్క త్రాటిపైకి తేవడంలో చాలా ఘోరంగా విఫలమయినందునే నేడు కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి దాపురించినదని చెప్పక తప్పదు. సీమాంధ్రలో పార్టీపట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత ఏర్పడినప్పుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ఆ వ్యతిరేఖతను పెంచి పోషిస్తున్నపుడు, దానిని అదుపుచేసి పార్టీని కాపాడే ప్రయత్నం చేయకపోగా, ప్రజలలో తనపట్ల మరింత వ్యతిరేఖత పెరగకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతూ ముఖ్యమంత్రితో కలిసి అధిష్టానానికి లేఖలు వ్రాసారు, ధర్నాలలో పాల్గొన్నారు. అయినప్పటికీ ఆయన ప్రజలను కానీ, తన అధిష్టానాన్ని గానీ మెప్పించలేక ఆయన పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడిన రేవడిలా తయారయింది.   ఎటువంటి రాజకీయానుభవం లేని చిరంజీవికి కూడా ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, సుదీర్గ రాజకీయానుభవం ఉన్న బొత్సకు మాత్రం  ఏ కమిటీ బాధ్యత అప్పగించలేదు. అభ్యర్ధులకు టికెట్స్ కేటాయించే ఈ కీలక సమయంలో ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పించడం ఆయనకు పెద్ద దెబ్బే కాక ప్రజల దృష్టిలో ఆయన మరింత పలుచనయ్యే అవకాశం ఉంది. అయితే తానే పదవి నుండి స్వయంగా తప్పించమని కోరానని బహుశః ఆయన రేపు సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేస్తారేమో!

ఆంధ్ర, తెలంగాణాలకు వేర్వేరు పీసీసీ అధ్యక్షుల నియామకం

  ఇంతవరకు సమైక్య రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడు ఉన్న బొత్ససత్యనారాయణను కాంగ్రెస్ అధిష్టానం ఆ పదవిలో నుండి తప్పించి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు వేర్వేరుగా పీసీసీ అధ్యక్షులను నియమించింది. మాజీ మంత్రులు రఘువీర రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణా రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షులుగా నియమించింది. ఉత్తమ కుమార్ రెడ్డిని తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది.   ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఎన్నికల కోసం వేర్వేరుగా మ్యానిఫెస్టో కమిటీ మరియు ప్రచార కమిటీలను కూడా నియమించింది. వీరిలో అందరూ కూడా అధిష్టానానికి వీర విధేయులుగా ముద్ర పడ్డవారే. రాష్ట్ర విభజన సమయంలో అధిష్టానానికి అనుకూలంగా మాట్లాడిన, వ్యవహరించిన ప్రతీ ఒక్కరికీ తగిన విధంగా ప్రతిఫలం దక్కింది.   ఆంధ్రప్రదేశ్ మ్యానిఫెస్టో కమిటీకి చైర్మన్ గా మాజీ మంత్రి ఆనం రామినారాయణ రెడ్డిని, కో-చైర్మన్ గా కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని నియమించింది.   ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్ గా కేంద్రమంత్రి చిరంజీవిని, కో-చైర్మన్ గా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించింది.   తెలంగాణా మ్యానిఫెస్టో కమిటీకి చైర్మన్ గా మాజీ మంత్రి శ్రీధర్ బాబుని, కో-చైర్మన్ గాభట్టి విక్రమార్కను నియమించింది.   తెలంగాణా ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్ గా దామోదర రాజనరసింహను, కో-చైర్మన్ గాషబ్బీర్ ఆలీని నియమించింది.

మళ్ళీ గోతిలో పడిన కాంగ్రెస్

  కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్ధుల కోసం తీసిన గోతులలో తరచూ తనే పడుతూలేస్తున్నా కూడా దాని తీరు మాత్రం మారడం లేదు. కాంగ్రెస్ తో విలీనానికి, పొత్తులకు కేసీఆర్ అంగీకరించకపోవడంతో, కేసీఆర్ ను దెబ్బతీద్దామనే ఆలోచనతో తెలంగాణాలో పర్యటించిన కేంద్రమంత్రి జైరామ్ రమేష్, తమపార్టీ అధికారంలోకి వస్తే దళితుడనే తెలంగాణాకు తొలి ముఖ్యమంత్రిగా చేతామని, అది తన మాటే కాదని రాహుల్ గాంధీ కూడా అదే కోరుకొంటున్నారని ప్రకటించారు. కానీ టీ-కాంగ్రెస్ నేతల ఆగ్రహాన్ని చవిచూసిన ఆయన కేవలం రెండు గంటలలోనే తన మాట మార్చి తన పరువు, పార్టీ పరువు కూడా తీసుకొన్నారు.   ఇక ఈయన మాట్లాడిన ప్రతీ ముక్కకి డిల్లీ నుండి అర్ధ తాత్పర్యాలు వివరించే దిగ్గీరాజా మీడియాతో మాట్లాడుతూ, “దళిత ముఖ్యమంత్రి అనేది జైరామ్ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చును. ఆ విషయంపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటాము," అని చెప్పి చేతులు దులుపుకొన్నారు. అయితే జైరామ్ రమేష్ మొదట మాట్లాడినప్పుడు అది కేవలం తన అభిప్రాయమే కాదని, తమ యువరాజు రాహుల్ గాంధీ అభిప్రాయంగా ప్రజలకు తెలియజేస్తున్నానని చెప్పినపుడు, ఇప్పుడు దిగ్విజయ్ ఆయన ప్రకటనతో పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని చెప్పడం చూస్తే, కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ తను గోతిలో పడ్డామని అర్ధం చేసుకొన్నందునే దానిని జైరామ్ మీదకు త్రోసేసి చేతులు దులుపుకొని ఉండవచ్చును.

జైరా౦ నోటిని అదుపులో పెట్టుకోవాలి

      టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైరామ్ తెలంగాణ పాలిట విలన్ గా మారారని అన్నారు. ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాలని,లేకపొతే తెలంగాణ ప్రజలు తగినబుద్ది చెబుతారని హెచ్చరించారు. తెరాస, కాంగ్రెస్ మధ్య చిచ్చుపెట్టేలా జైరామ్ రమేష్ వ్యాఖ్యలు వున్నాయని అన్నారు. సోనియా గాంధీని ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జై రామ్ చేష్టలు తెలంగాణాలో కాంగ్రెస్ ను నిండా ముంచుతాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ జెఏసి నేతలకు టిక్కెట్లు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్... ఉద్యమం సమయంలో ఏం చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. ఉద్యోగాలను కేసులు పెట్టి, వేధించి కోర్టుల చుట్టు తిప్పిందన్నారు. జైరామ్ మిడిమిడి జ్ఞానంతో తెరాసపై విమర్శలు చేస్తున్నారని, తెలంగాణపై, తెరాసపై విషం కక్కుతున్నారన్నారు. జైరామ్ తీరు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని, మనిషిని చంపి పూలు చల్లినట్లుగా ఉందన్నారు.

కిరణ్ పార్టీకి ఎదురుదెబ్బ

      మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేయబోయే ‘జై సమైక్యాంధ్ర’ పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 12న పార్టీ జెండా, ఎజెండాలను ప్రకటించే బహిరంగసభకు తొలుత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు. రాజమండ్రి, అమలాపురం ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్ సన్నాహాలు ప్రారంభించారు. అయితే ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో కళాశాల మైదానంలో సభ నిర్వహణకు అనుమతించబోమన్న కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సభ కోసం తరలించిన సామగ్రిని తొలగించాలని ఆదేశించారు. దీంతో విధి లేక వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. లాలాచెరువు వద్ద ఉన్న ప్రైవేటు స్థలాన్ని ముందుగా పరిశీలించినా ఆ స్థలం సాంకేతికంగా అనుకూలంగా లేదని, చివరకు వి.ఎల్.పురం ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న జెమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను ఖరారు చేశారు.

బొత్సకే మళ్ళీ పీసీసీ అధ్యక్ష పదవి?

  తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రకు బొత్ససత్యనారాయణ, తెలంగాణకు పొన్నాల లక్ష్మయ్య పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. మరి కొద్దిసేపటిలో పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ వారి పేర్లను అధికారికంగా ప్రకటించవచ్చును. ఇదే ఖాయమయితే, రెండు ప్రాంతాలలో ఆ పదవి కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్ నేతల అసమ్మతి, అలకలు, తిరుగుబాట్లు, బుజ్జగింపుల పర్వం త్వరలోనే మొదలవవచ్చును.   బొత్ససత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపటికీ ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక చాలా ఉంది. కానీ, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలు కనబడటం లేదు గనుకనే ఆయన మళ్ళీ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకే మొగ్గు చూపి ఉండవచ్చును. అయితే, కొద్దిరోజుల క్రితంకాంగ్రెస్ పార్టీలో ‘మూడు నెలల ముఖ్యమంత్రి పదవి పోటీలు’ ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓపెనింగ్ బ్యాట్ మ్యాన్ గా చిరంజీవి దిగుతారని ప్రకటించారు. అంటే, ప్రస్తుతం బొత్ససత్యనారాయణని ఈ మూడు నెలల కోసం తాత్కాలికంగా పీసీసీ అధ్యక్షుడిగా నియమించి, ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికలలో గెలిస్తే అప్పుడు చిరంజీవిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించి, బొత్సను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో ఉందేమో?   ముఖ్యమంత్రి పదవికి సీమాంధ్రలో కన్నా లక్ష్మినారాయణ, చిరంజీవి, రఘువీరారెడ్డి, ఆనం రామినారాయణ రెడ్డి తదితరులు రేసులో ఉండగా, డొక్కా, కొండ్రు తదితరులు పీసీసీ అధ్యక్షపదవికి రేసులో ఉన్నారు. కనుక, ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి తగు నిర్ణయం తీసుకోవచ్చును.

ఆడాళ్లూ.. ఏడులోపే ఇంటికి చేరుకోండి.. షీలా వస్తున్నారు

      కొంతకాలం కిందట ఢిల్లీలో వైద్యవిద్యార్థినిపై కదులుతున్న బస్సులో అత్యాచారం జరిగినప్పుడు దేశమంతా ఒక్కటై నినాదించింది. కానీ ఆ సంఘటన సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ మాత్రం.. స్త్రీలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకుండా రాత్రి ఏడు గంటల్లోపు ఇల్లు చేరుకోవాలని అన్నారు. తాజాగా షీలా దీక్షిత్ కేరళ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కేరళ నటి రీమా కళింగళ్ తన ఫేస్ బుక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''షీలా దీక్షిత్ మన రాష్ట్రానికి గవర్నర్‌గా రానున్నారు కాబట్టి ఇకపై కేరళ స్త్రీలందరూ రాత్రి 7 గంటల్లోపే ఇంటికి చేరుకోండి'' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి. కేరళ నటి రీమా తమిళంలో ఇవన్ యువతి, మలయాళంలో రీతు, హ్యాపీ హజ్‌బెండ్ కమ్మత్ అండ్ కమ్మత్ చిత్రాల్లో నటించారు.

సచివాలయానికి బ్రేక్

      సచివాలయంలో మిగిలిన పనులన్నీ ఆగిపోయాయి. కేవలం రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించిన పనులు మాత్రమే శరవేగంగా, ఆగమేఘాలమీద జరిగిపోతున్నాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి 60 రోజుల సమయాన్ని నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అన్ని శాఖలకు టైంటేబుల్‌ పంపారు. ఏ శాఖ ఏ తేదీలోగా ఏ పని పూర్తి చేయాలో వివరించారు. ఈ నెల 15వ తేదీలోగా ఫైళ్ల విభజన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రికార్డు రూమ్స్‌లో ఫైళ్లను కూడా ప్రాంతాల వారీగా విభజించాలని స్పష్టం చేశారు. తర్వాత ఆ ఫైళ్లను జిరాక్స్ తీయాలని, ఒక్కో ఫైలును మూడు సెట్లు చొప్పున జిరాక్స్ తీయాలని స్పష్టం చేశారు. దీంతో సాధారణంగా జరగాల్సిన పనులను అన్ని శాఖలు నిలుపుదల చేశాయి. కేవలం విభజన పనిని మాత్రమే చేస్తున్నారు.   రాష్ట్ర విభజనతో సంబంధం లేని, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులకు పదోన్నతులను కూడా సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిన్హా నిలుపుదల చేశారు. దీంతో త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులతో పాటు వాస్తవంగా పదోన్నతి లభించాల్సిన సమయంలో పదోన్నతి రాకపోవడంతో సర్వీసుపై ప్రభావం పడుతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తూచ్! ముఖ్యమంత్రి ఎవరయినా కావచ్చు: జైరాం

    స్థలం: కరీంనగర్, సమయం: ఉదయం 10గంటలు సందర్భం: కేంద్రమంత్రి జైరామ్ రమేష్ మీడియా సమావేశం.   “అవును! తెలంగాణా రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రి దళితుడనే చేస్తాము. నూటికి నూరు శాతం కాదు 200% ఖచ్చితంగా దళితుడనే ముఖ్యమంత్రిని చేస్తాము. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, దళితుడిని తెలంగాణాకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిని చేయడం తధ్యం. ఇది నా మాటే కాదు...రాహుల్ గాంధీ మాట కూడా. మా మాటకు తిరుగు లేదు.”   స్థలం: నిజామాబాద్, సమయం: మద్యాహ్నం రెండు గంటలు. సందర్భం: కేంద్రమంత్రి జైరామ్ రమేష్ మీడియా సమావేశం.   “మా పార్టీ ఎప్పుడో 50 సం.ల క్రితమే దళితుడయిన దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. మా పార్టీ సమాజంలో అన్ని వర్గాలవారికి సమానావకాశాలు కల్పించాలనే దృడ సంకల్పంతో పంచ సూత్ర పాలసీని చాలా కాలంగా అమాలు చేస్తోంది. దాని ప్రకారం సమాజంలో అన్ని వర్గాలకు అంటే యస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మరియు మైనార్టీ వర్గాలకు చెందిన వారికి అధికారం చెప్పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మా పార్టీ తెలంగాణా విషయంలో అదే పాలసీని అవలంభిస్తుంది. ఈ వర్గాలకు చెందిన ఏ నేతనయినా తెలంగాణకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నియమిస్తాము.”   డామిట్ కధేటి ఇలా అడ్డం తిరిగింది... తెలంగాణా ఇస్తే మా పార్టీలో తెరాసను విలీనం చేస్తానని మా హ్యాండ్ పార్టీకే హ్యాండిచ్చిన కేసీఆర్, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇంత కాలం చెపుతూ వచ్చి ఇప్పుడు తానే ముఖ్యమంత్రి సీట్లో సెటిల్ అయిపోదామని చూస్తున్నాడు కదాని.. అతనికి దెబ్బేసేదామని చూస్తే.. డామిట్ కధేటి ఇలా అడ్డం తిరిగింది...అయినా మావాళ్ళు ఓ డజను మంది ముఖ్యమంత్రి కుర్చీలో కర్చీఫ్ వేసుకొని తిరుగుతుంటే, అది పట్టించుకోకుండా వాగినందుకు నాకే వాళ్ళే గడ్డేట్టేసారు మరి...షిట్...షిట్...