Read more!

పోటీ చేయడానికి ఎదురు డబ్బులు?

 

 

 

అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆఖరుకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి వద్దకు నేరుగా నాయకులే వెళ్లి కాంగ్రెస్ తరఫున బీఫారం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నా వారి నుంచి స్పష్టమైన హామీ రావడం లేదు.

 

మాజీ మంత్రి రఘువీరారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రావడంతో పరువు నిలవాలంటే అన్ని చోట్లా అభ్యర్థులను రంగంలో దింపాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు రంగంలో ఉండాల్సిందేనంటూ తన అనుచరవర్గానికి రఘువీరా చెప్పినట్లు తెలుస్తోంది.



ఇప్పటి వరకు రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గమైన మడకశిర మున్సిపాలిటీలో మాత్రమే అన్ని వార్డులకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. మిగిలిన 10 మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. మడకశిర మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారందరికీ తానే ఖర్చు భరిస్తానని రఘువీరారెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అనంతపురంలో ఇద్దరు ముగ్గురు మాత్రం ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని నేరుగా తమకు ఇస్తామంటేనే పోటీ చేస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది.