అమెరికా టు అమలాపురం.. ఆపై నామినేషన్

      రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఏకంగా అమెరికా నుంచి విమానంలో వచ్చి మరీ హాజరు వేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈ సంఘటన జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పట్టణ మహిళా కన్వీనర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దిట్టకవి వెంకటనర్సమాంబ (అమ్మాజీ) కొన్ని నెలల క్రితమే అమెరికాలో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లారు. ఇంతలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అమ్మాజీని 23వ వార్డు నుంచి పోటీ చేయించాలని పట్టణ పార్టీ శాఖ నిర్ణయించింది. ఈ సమాచారాన్ని ఆమెకు అందజేశారు. వాస్తవానికి అమ్మాజీ ఈనెల 18న స్వదేశానికి రావడానికి విమానం టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈలోపే పార్టీ నుంచి ఆదేశాలు రావడంతో ఆగమేఘాల మీద ముందే విమానం ఎక్కాల్సి వచ్చింది. అలా వచ్చేసి, ఆమె నామినేషన్ దాఖలు చేశారు.

కోర్టుకెళ్లిన నన్నపనేని.. వారంటు రద్దు

  టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి శుక్రవారం పర్చూరు కోర్టుకు హాజరయ్యాయి. 2009 జులై నెలలో తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. అక్రమంగా కేసు బనాయించారని పేర్కొంటూ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. కమిటీ విచారణ చేపట్టే సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో తనపై దాడి జరిగినట్లు నన్నపనేని రాజకుమారి కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పిటీషనర్‌గా ఉన్న రాజకుమారి విచారణకు హాజరై సాక్ష్యం చెప్పనందున న్యాయమూర్తి బెయిలబుల్ వారంటు జారీచేశారు. దీంతో శుక్రవారం ఆమె కోర్టుకు వచ్చారు. తన న్యాయవాది ద్వారా వారంటు రద్దుకు పిటీషన్ వేయించి కోర్టులో సాక్ష్యం చెప్పారు. వాదనలు విన్న సీనియర్ సివిల్ జడ్జి సుశీల్‌కుమార్ పాత్రుడు బెయిల్‌బుల్ వారంటు రద్దు చేస్తూ తీర్పుచెప్పారు.

సిక్కోలులో శిథిల హస్తం

  శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో పలు వార్డులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. ఏకంగా మూడు చోట్ల అత్యధిక వార్డుల్లో నామినేషన్లు వేయలేని దుస్థితిలో పడిపోయింది. ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, పాలకొండ మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 91 వార్డులుండగా, వాటిలోని 31 వార్డుల్లో ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు. ఇచ్ఛాపురంలో 6 వార్డుల్లోను, పలాస-కాశీబుగ్గలో 9చోట్ల, ఆమదాలవలసలో మూడు వార్డుల్లోను, పాలకొండ నగర పంచాయతీలో 13 చోట్ల కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకలేదు. వీటిలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మున్సిపాలిటీలు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోవే. గతంలో ఇదే కాంగ్రెస్ తరపున వార్డు స్థానాల కోసం పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో వివాదాలు, గొడవలు జరిగాయి. టికెట్ల కోసం దాదాపు కొట్టుకున్నారు.

పాలమూరుపై జైపాల్ కన్ను

  తెలంగాణా ఏర్పాటు తర్వాతి నుంచి కాస్త గట్టిగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సేఫ్ సీటుపై కన్నేశారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల లోక్‌సభ స్థానంలో ఎదురుగాలి వీస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి రాజకీయాలు తన గెలుపుపై ప్రభావం చూపుతాయనే ఆందోళనతోనే ఆయన సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు చేవెళ్లలో పర్యటించలేదని, మహబూబ్‌నగర్‌లో జైపాల్ వర్గం కొంతకాలంగా క్రియాశీలకంగా మారిందని అంటున్నారు. తన అనుచరుడైన ఉద్దమర్రి నరసింహారెడ్డికి మేడ్చల్ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకుంటున్న జైపాల్‌రెడ్డి... సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి చేవెళ్ల లోక్‌సభ టికెట్ ఇప్పించే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తద్వారా అటు సబిత వర్గం మీద పైచేయి సాధించడంతో పాటు తన అనుయాయుడికి మేడ్చల్ టికెట్ ఇప్పించుకోవచ్చన్నది జైపాల్ ద్విముఖ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పలమనేరు తెరపైకి డీఏ శ్రీనివాస్

  పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో కొత్త సమీకరణలు చోటుచేసుకుంటున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన సుభాష్‌చంద్రబోస్ పేరు దాదాపుగా ఖాయమని అనుకుంటుండగా, తాజాగా కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రధానంగా చిత్తూరు మాజీ ఎంపీ డీకే.ఆదికేశవులునాయుడు కుమారుడు డీఏ.శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.   ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన మాజీ మంత్రి టీజీ.వెంకటేష్‌కు కర్నూలు అసెంబ్లీ టికెట్టు ఖరారైంది. ఈయన కూడా వైశ్య సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో రాయలసీమలోనే వారికి రెండు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేనందున పలమనేరు నుంచి వేరే సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గానికి సంబంధించి సుమారు 25 వేల ఓట్లు ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో ఆ సామాజికవర్గానికి టికెట్టు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.

గన్నవరానికి నెహ్రూ?

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) విజయవాడ తూర్పు నియోజకవర్గానికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆయన రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తూర్పు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవి వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేయటానికి సుముఖంగా ఉన్నారు. విజయవాడ నగరానికి దగ్గర్లో ఖాళీగా ఉన్న గన్నవరం నియోజకవర్గం నుంచి నెహ్రూను పోటీ చేయించటానికి సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం.   శనివారం నున్నలో విజయవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేవినేని నెహ్రూ ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. నియోజకవర్గంలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలో ఉన్న ముఖ్య కాంగ్రెస్ నాయకులను కూడా నున్నలో జరిగే సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో దిక్కు లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కొండంత అండలా కనిపిస్తున్నారు.

కాసేపట్లో వేదికపైకి రానున్న పవన్

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో సభ వేదికపైకి వచ్చి కొత్త పార్టీ, విధి విధానాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే హైటెక్స్ కు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. వేదిక వద్ద జనసేన పార్టీకి సంబంధించిన విడియో గీతాలను ప్రదర్శిస్తున్నారు. పవన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బిగ్‌స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది పవన్ కొత్త పార్టీ ప్రకటనను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు. కేవలం నాలుగు వేల మందికే పాస్ లు జారీ చేయడంతో..మిగతా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా అభిమానులు, పోలీసులు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేశారు.

పవన్ అభిమానులపై 'లాఠీచార్జ్'

      పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఆవిర్భావ సభకు పవర్ స్టార్ అభిమానులు భారీ సంఖ్యలో తరలీవచ్చారు. కేవలం నాలుగు వేల మందికే పాస్ లు జారీ చేయడంతో..మిగతా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా అభిమానులు, పోలీసులు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేశారు. తమ అభిమాన నటుడు నెలకొల్పనున్న రాజకీయపార్టీ ఆవిర్భావ సభను ప్రత్యక్షంగా చూద్దామని వచ్చిన కొంతమంది అభిమానులు పాస్ లు లేక బయటే నిరాశతో నిలిచిపోయారు.  పవన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బిగ్‌స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది పవన్ కొత్త పార్టీ ప్రకటనను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.

సెల్.. మోహన రంగా

      ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్లే. వెయ్యి రూపాయలు కూడా అక్కర్లేకుండానే ఫోన్లు వచ్చేస్తున్నాయి. సరిగ్గా ఈ అందుబాటునే నాయకులు ఉపయోగించుకుంటున్నారు. వాటిద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు, వాళ్ల సమస్యలు వినేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఈవిషయంలో కొంత ముందున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు,  యువజన సంఘాల ప్రతినిధులు, రైతులు, కవులు, కళాకారులు, రచయితలు, కుల సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజల సెల్‌ఫోన్ నంబర్లను సేకరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారు. వాళ్లు ఇప్పటికే వేలాది సెల్‌ఫోన్ నంబర్లను సేకరించారు. నెంబరుతో పాటు వారి పుట్టినరోజు తేదీలు, మరిన్ని వివరాలను నమోదు చేస్తున్నారు. సేకరించిన సెల్‌ఫోన్ నంబర్ల ద్వారా హరీష్‌రావు నేరుగా వారి పేరుతో పలకరించేలా ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో శుభాకాంక్షలు తెలియజేస్తారు. అభివృద్ధి పనులను ప్రచారం చేయడంతో పాటు సమస్యలను తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నంబరును త్వరలో ప్రకటించబోతున్నారు. ఏ ఊరికి ఎప్పుడు వస్తారో ప్రజలకు నేరుగా సమాచారం అందడానికి ఏర్పాట్లు చేశారు.  ఈ హైటెక్ ప్రచారం త్వరలోనే అందరూ అందిపుచ్చుకునే అవకాశం ఉంది.

ఆటోలకు పది కోట్ల బడ్జెట్!!

      ఎన్నికల కాలం కావడంతో ఆటోరిక్షాలకు భలే గిరాకీ మొదలైంది. పట్టణాలు, నగరాల్లో భారీ ఫ్లెక్సీలు పెట్టడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవు. ఎక్కడ ఏ పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినా సరే ఆయా మునిసిపాలిటీల సిబ్బంది తొలగించేస్తున్నారు. దాంతో నాయకులు సరికొత్త మార్గం కనిపెట్టారు. ఆటోలకు వెనుక భాగంలో మొత్తం తమ పోస్టర్లు, ఫ్లెక్సీలు అతికించి వాటిద్వారా ఎంతోకొంత ప్రచారం చేసుకుంటున్నారు.   ఇంతకుముందు కూడా వాణిజ్య ప్రకటనలకు ఆటోలను విరివిగా ఉపయోగిస్తున్నారు. వాటికి అలా ప్రకటనల బోర్డులు అతికించినందుకు ఆటోవాలాలకు నెలకు 100 రూపాయల నుంచి 300 వరకు ఇచ్చేవారు. అయితే, ఎన్నికల సీజన్ కావడం, ఒకేసారి అన్ని ఎన్నికలూ రావడంతో ఆటోవాలాలు కూడా రేటు పెంచేశారు. సగం వరకే అయితే 500, మొత్తం వెనకభాగం అంతా అయితే 1000 ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నాయకులు కూడా సరేనని అంతా ఇచ్చేస్తున్నారు. నగరాన్ని బట్టి కనీసం 10వేల వరకు ఆటోలుంటాయి. అంటే, అన్ని పార్టీలకు కలిపి కేవలం ఈ ఆటోల బడ్జెట్టే 5 నుంచి 10 కోట్ల వరకు అవుతుందన్న మాట!!

తెలంగాణాలో తెదేపా ప్రజాగర్జన రేపే

  చంద్రబాబు నాయుడు గతేడాది “వస్తున్నా మీ కోసం” పాదయాత్ర తరువాత, మళ్ళీ తెలంగాణాలో పర్యటించలేదు. తుఫాను బాధితులను పరామర్శించడానికి మధ్యలో ఒకసారి మాత్రమే వెళ్ళారు. రాష్ట్ర విభజన అంశంపై పార్టీ అనుసరించిన వైఖరి వల్ల తెలంగాణాలో పర్యటిస్తే రెండు చోట్లా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతోనే బహుశః ఆయన ఇంతవరకు పర్యటించలేదు. అయితే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణాలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి గనుక ఆయన తెలంగాణాలో పర్యటించనున్నారు.   తెలంగాణా రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తరువాత చంద్రబాబు తొలిసారిగా రేపు (శనివారం) ఖమ్మం జిల్లాలో తెదేపా నిర్వహించే ప్రజా గర్జన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. తెదేపా-తెలంగాణా నేతలు నామనాగేశ్వర రావు తదితరులు తెలంగాణాలో మొట్టమొదటిసారి జరుగబోతున్న ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గట్టిగా ప్రయత్నాలు, ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మోటార్ సైకిళ్ళపై ర్యాలీగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశః ఈ సభలో చంద్రబాబు తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలకమయిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా తెదేపా అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇదివరకే ప్రకటించిన ఆయన దానినే మరో మారు పునరుద్ఘాటించి, ఈ విషయంలో దాగుడు మూతలు ఆడుతున్నకాంగ్రెస్, తెరాసలను ఎండగట్టె ప్రయత్నం చేయవచ్చును. అదేవిధంగా హైదరాబాద్ ను ఏవిధంగా అభివృద్ధి చేసినదీ వివిఅరించి, తెదేపాకే తెలంగాణాను పునర్నిర్మించే సత్తా ఉందనే సందేశం ఈయవచ్చును. ఇక గతంలో పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్ళినవారు మరియు ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు ఈ సభలో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరే అవకాశం ఉంది. సభ ముగిసిన తరువాత, చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమవుతారు.  

పవన్ కి అలీ కూడా గుడ్ బై చెప్పెస్తాడా?

  పవర్ స్టార్ పొలిటికల్ పవర్ స్టార్ గా మారుతున్నారు. సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ సీన్ లోకి ఎంటరవుతున్నారు. అయితే పవన్ కు ఉన్న అతికొద్ది మంది స్నేహితులు ఆయన వెంట నడుస్తారా? సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పవన్ అంతరంగికుల్లో ఒకరైన మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పార్టీ వ్యూహకర్తల్లో ఒకరంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా నుంచి ఇటీవల విడుదలయిన ‘అత్తారింటికి దారేది’ వరకూఅతనితో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ అతనితో కలిసి పయనిస్తున్న నటుడు అలీ. ఈ విషయాన్ని అలీ, పవన్ లు వేర్వేరు సందర్భాల్లో సినిమా వేదికలపై చాలాసార్లు ప్రకటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పార్టీ ‘జనసేన’ విడుదలకు సిద్ధమైంది. ఇదే తరుణంలో అలీ టీడీపీలో చేరి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పవన్ పార్టీ పెడుతుండగా అలీ తెలుగుదేశం వైపు ఎందుకు చూస్తున్నారు? వీరిద్దరి స్నేహం ముగిసిందా? ఇద్దరి మధ్యా విభేదాలు పొడసూపాయా? లేక పవన్ అన్నయ్య చిరంజీవిని కాదని తన పంధాలో తను సాగాలనుకొన్నట్లే, ఆలీ కూడా తను అభిమానించే తెలుగుదేశంలో చేరబోతున్నారా? అనే విషయాలు వీరిద్దరిలో ఎవరో ఒకరు చెబితే గానీ క్లారిటీ రాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   అలీ ఎంద సీటు? సినిమాల్లో ఎంద చేట, కాట్రవల్లి ఊత పదాలతో అలరించిన ప్రముఖ హాస్య నటుడు అలీ రాజకీయాల్లోకి వస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన సొంతూరు రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెలువడినవి ఊహగానాలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం గుంటూరు అర్బన్ తూర్పు నియోజకవర్గం నుంచి అలీ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ముస్లిం మైనారిటీలు ఎక్కువమంది ఉండటం, ఇదే స్థానం నుంచి గతంలో బరిలో దిగిన దివంగత టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ భాషా సోదరుడు జియాఉద్దీన్ పోటీకి విముఖత చూపడంతో అలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని టీడీపీ నేతలు, అలీ గానీ ఖండించట్లేదు. అంటే అలీ తెదేపాలో చేరడం, గుంటూరు నుండి పోటీ చేయడం ఖాయమనుకోవచ్చేమో.

మాకు టిక్కెట్లొద్దు నాయనో..

      జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల బరిలో దిగడానికి ఆ పార్టీ సీనియర్ నేతలు నిరాకరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి ఇబ్బందులు కలిగిస్తోంది. యూపీఏ-2లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు సీనియర్లు ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి మనీశ్ తివారీ, ఆర్థిక మంత్రి చిదంబరం, సచిన్ పైలట్, జయంతి నటరాజన్ తదితర సీనియర్ నేతలు ఎన్నికల బరిలో దిగడానికి నిరాకరిస్తున్నారు. మరోవైపు.. సీనియర్ నేతలంతా ఎన్నికల బరిలోకి దిగాల్సిందేనని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో పార్టీని గెలుపు పట్టాలు ఎక్కించాల్సింది సీనియర్లేనని ఆయన చెబుతున్నారు.

కాంగ్రెస్ లోనే ఉంటానన్న బాడిగ

  రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించిన మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ మనసు మార్చుకున్నారు. మళ్లీ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఆయన బాటలోనే మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ నడిచారు. బాడిగ రామకృష్ణ మచిలీపట్నంలోని తన ఆఫీసులో కార్యకర్తలతో ఓ సమావేశం నిర్వహించారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాడిగను కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు. కాంగ్రెస్ నుంచి నాయకులు పోయారే తప్ప కార్యకర్తలు ఎక్కడికి వెళ్లలేదని, తామంతా బాడిగ కావాలనే కోరుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిసి తామంతా బాధపడినట్లు చెప్పారు. ఈసారి ఎన్నికల్లో బందరు నుంచి పోటీచేస్తే గెలిపిస్తామని అన్నారు. అయితే, పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేవనే అభిప్రాయాన్ని బాడిగ వ్యక్తం చేసినా వాళ్లు మాత్రం పట్టు వీడలేదు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండేదీ లేనిదీ చెప్పాలంన్నారు. మీరంతా కోరుతుంటే కాదనలేనని గడ్డుకాలంలో కాంగ్రెస్‌ను వీడడం తనకు ఇష్టం లేదని చెప్పిన బాడిగ చివరకు కాంగ్రెస్‌కు జై కొట్టారు. సమావేశానికి హాజరైన బూరగడ్డ వేదవ్యాస్ కాంగ్రెస్‌తోనే పయనమని ప్రకటించారు.

టీడీపీలోకి కొండా దంపతులు?

  వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు తిరుగులేని నేతలైన కొండా దంపతులు- మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ టీడీపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారు టీడీపీ తరఫున బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబుతో ఇందుకోసం కొద్ది రోజులుగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. కొండా దంపతులను టీడీపీలో చేర్చుకునే విషయంలో చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదు. అయితే ఈ విషయంపై జిల్లా నేతలతో బాబు కూడా చర్చించినట్టు సమాచారం. పరకాలతో పాటు మరో అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు టికెట్ల కోసం కొండా దంపతులు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. సోనియాకు సన్నిహితులైన ముఖ్య నేతల ద్వారా సిఫారసులు చేయించుకున్నా ఫలితం దక్కలేదు. దీనికి తోడు తమను వ్యతిరేఖించే పొన్నాల లక్ష్మయ్య తెలంగాణా పీసీసీ అధ్యక్షుడిగా రావడంతో వారి ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. తొలుత బీజేపీలో చేరాలని భావించినా, తర్వాత మనుసు మార్చుకొని టీడీపీవైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.