ప్రజల విజ్ఞతను తప్పుబడుతున్న కాంగ్రెస్, వైకాపాలు
చంద్రబాబు, కేసీఆర్ ఇరువురూ ఇచ్చిన భూటకపు హామీలు, చెప్పిన మాయమాటలను నమ్మి ప్రజలు ఓటేయడంతో వారు విజయం సాధించగలిగారని ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు, జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు అంటే, వారి దృష్టిలో ప్రజలు ఆలోచనా జ్ఞానం లేని అవివేకులు, బుద్ధిహీనులన్నమాట. ఆ లెక్కన వారి దృష్టిలో దేశ ప్రజలందరూ కూడా బుద్ధిహీనులేననుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మోడీ చెప్పిన మాయ మాటలు విని బీజేపీకి అఖండ మెజార్టీ కట్టబెట్టారు. అయితే ఈ విజేతలకు ఓటేసినవారిలో కేవలం గ్రామీణులు, నిరక్షరాశ్యులే కాదు కోట్లాది మంది ఉన్నత విద్యావంతులు, మేధావులు కూడా ఉన్నారు. అటువంటి వారిచ్చిన తీర్పుని తప్పుబట్టడం కాంగ్రెస్, వైకాపాల అవివేకం, అహంకారానికి నిదర్శనమని చెప్పవచ్చును. అయితే వారు కూడా తెరాస, తెదేపాలకు తీసిపోకుండా ఆచరణ సాధ్యం కాని అనేక హామీలను గుప్పించిన సంగతి విస్మరించారు. ఒకవేళ ప్రజలు వారి హామీలను నమ్మి వారికే ఓటేసి గెలిపిస్తే, అప్పుడు వారికి విజ్ఞత ఉన్నట్లు భావిస్తారేమో.
కాంగ్రెస్ పార్టీ తన అసమర్ధ, అవినీతి పాలనకు మూల్యం చెల్లిస్తే, వైకాపా గత ఐదేళ్ళ కాలంలో గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణం చేసుకోకుండా, కేవలం సానుభూతి అంశం పట్టుకొని వ్రేలాడుతూ ఓటమిపాలయింది. వారి ఓటమికి ఇటువంటి అనేక కారణాలున్నాయి. ఆ రెండు పార్టీలు కూడా ప్రజల విశ్వసనీయత కోల్పోయినందునే ఓడిపోయాయి. అది పూర్తిగా స్వయంకృతాపరాధమే. అయితే అందుకు తమ ప్రత్యర్ధులను, వారికి ఓటేసి గెలిపించిన ప్రజలను, వారి విజ్ఞతను తప్పుబట్టడం అవివేకమే.