మోడీని కలవనున్న జగన్మోహన్ రెడ్డి
posted on May 19, 2014 @ 12:28PM
కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకొని బెయిలుపై జైలు నుండి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఊహించని విధంగా ఎన్నికలలో ఓడిపోవడంతో వెంటనే అప్రమత్తమయినట్లున్నారు. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి మరీ నిధులు తీసుకు వస్తానని భింకాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, పరిస్థితులు తారుమారవడంతో ఈరోజు తన యంపీలను వెంటేసుకొని, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పట్టబోతున్న నరేంద్ర మోడీని అభినందించి, సీమాంధ్రకు అన్ని విధాల న్యాయం చేయాలని కోరేందుకే చేందుకు డిల్లీ బయలుదేరుతున్నట్లు వైకాపా నేతలు చెప్పుకొంటున్నారు. అయితే అసలు కారణం ఏమిటో అందరికీ తెలిసిందే.
నేడు కాకపోతే రేపయినా జగన్ సీబీఐ కేసులలో దోషిగా జైలుకు వెళ్ళాక తప్పని పరిస్థితి ఉంది గనుక, అంత ప్రమాదం ముంచుకు రాకముందే, నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకొనేందుకే డిల్లీ బయలుదేరుతున్నారనుకోవచ్చును. లేకుంటే, బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొని నరేంద్ర మోడీతో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు కంటే ముందే, మోడీని వ్యతిరేఖించిన జగన్మోహన్ రెడ్డి ఇంత హడావుడిగా డిల్లీ బయలుదేరవలసిన అవసరమేమీ లేదు. అయితే చంద్రబాబు మాటను కాదని మోడీ జగన్మోహన్ రెడ్డిని కనికరిస్తారని అనుకోవడం అత్యాసే అవుతుంది.
ఇప్పుడు బీజేపీకి జగన్ మద్దతు అవసరము లేదు, గనుక అతని మాట వినవలసిన అవసరము లేదు. అందువల్ల జగన్ తన కేసులను పూర్తిగా మాఫీ చేయించుకోలేకపోయినా, కనీసం వీలయినంత ఎక్కువ కాలం తన బెయిలు పొడిగించుకొనే ప్రయత్నం చేస్తారేమో. ఏమయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ముందున్నది అంతా గడ్డు కాలమేనని చెప్పవచ్చును.