2019 కాదుకదా.. 2090లోనూ నో ఛాన్స్: హరీష్‌రావు
posted on May 19, 2014 @ 5:11PM
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2019లో కాదు కదా... 2090లో కూడా అధికారంలోకి రాలేదని టీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు జోస్యం చెప్పారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కొంతమంది అనుచరులతో కలసి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. ఇక ప్రతిరోజూ తెరాసలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని చెప్పారు. నర్సారెడ్డి చేరికతో గజ్వెల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయి దుకాణం మూసేసిందన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెసు, టిడిపి ఖాళీ అయ్యే రోజులు ముందు ముందు ఉన్నాయని హరీష్ రావు చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు టులెట్ బోర్డ్ పెట్టక తప్పదని కామెంట్ కూడా చేశారు. సెల్ఫ్ డిక్లెర్డ్ మేధావి లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ తమ పైన కేసులు ఉన్నాయని చెప్పడం విడ్డూరమన్నారు. తమ పైన ఉద్యమ కేసులు తప్ప ఎక్కడా దోపిడీ కేసులు లేవని చెప్పారు. తాము జయప్రకాష్ నారాయణలా ఇంట్లో ఏసి కింద కూర్చొని రాజకీయాలు చేయడం లేదని హరీష్ రావు విమర్శించారు.