ఉపముఖ్యమంత్రి కుర్చీలో గంటా కర్చీఫ్
posted on May 20, 2014 @ 3:14PM
ఏ ఎండకి ఆ గొడుగు పడుతూ, అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలిగినవాడే రాజకీయాలలో రాణించగలడు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఆ కోవకు చెందినవాడేనని చెప్పవచ్చును. మొదట తెలుగుదేశం పార్టీలో ఒకవెలుగు వెలిగిన ఆయన, ఆ తరువాత చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోకి దూకేశారు. కానీ ఆయన ఊహించినట్లుగా ప్రజారాజ్యం ఎన్నికలలో గెలవలేకపోయింది. అప్పుడు ఆయన ప్రజారాజ్యం నావని ఒడుపుగా కాంగ్రెస్ తీరానికి చేర్చి, తనతో బాటు చిరంజీవికి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కేలా చేయగలిగారు. కానీ రాష్ట్ర విభజన వ్యవహారం మొదలవడంతో అది కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఆ సమయంలో చిరంజీవి సరయిన నిర్ణయం తీసుకోలేక తడబడుతూ ప్రజలలో అభాసుపాలవుతుంటే, గంటా మాత్రం చాలా ముందు చూపుతో నలుగురితో నారాయణ అన్నట్లు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ కాంగ్రెస్ అధిష్టానంతో పోరాడేసి ప్రజలలో తనకు చెడ్డ పేరు రాకుండా చూసుకొన్నారు. రాష్ట్ర విభజన వ్యవహారం ఒక కొలిక్కివచ్చే సమయం వరకు కాంగ్రెస్ లో మంత్రిగా కొనసాగిన గంటావారు, కాంగ్రెస్ పట్ల సీమాంధ్ర ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేఖతను గమనించి, తెదేపాలోకి జంప్ చేసేసారు.
అందరికంటే ముందు అవకాశాన్ని పసిగట్టగల నేర్పు గల గంటా తెదేపాకి విజయావకాశాలున్నాయని ఖచ్చితంగా నమ్మినందునే ఆ పార్టీలోకి దూకారని భావించవచ్చును. ఆయన అంచనాలను నిజం చేస్తూ తెదేపా విజయం సాధించింది. తెదేపా అధికారంలోకి వస్తే, బీసీలకు, కాపులకు ఒక్కొక్క ఉపముఖ్యమంత్రి పదవి చొప్పున ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేసారు. కనుక, ఇప్పుడు ఆ ఆవకాశాన్ని కూడా సద్వివినియోగించుకొనేందుకు అందరికంటే ముందుగా కదిలారు గంటావారు.
తనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తే పుచ్చుకొంటానని లేకుంటే సామాన్య కార్యకర్తగానేపార్టీకి సేవలందిస్తానని ప్రకటించి చంద్రబాబుకు అల్టిమేటం జారీచేసారు. అంటే ఆ పదవి ఈయకపోతే ఆయన వల్ల పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లే భావించవచ్చును. ఇదే వ్యక్తి కాంగ్రెస్ నుండి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నప్పుడు తనకు పదవీ కాంక్ష లేదని, పార్టీని బలోపేతం చేసేందుకు ఏ బాధ్యత అప్పగిస్తే దానిని వినమ్రంగా స్వీకరిస్తానని సభాముఖంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఉపముఖ్యమంత్రి ఇస్తే తప్ప కుదరదని చెపుతున్నారు. కానీ, పార్టీలో చాలా మంది సీనియర్లు పార్టీని కష్టకాలంలో అంటిబెట్టుకొని ఉన్నారు. వారందరికీ చంద్రబాబు న్యాయం చేయవలసి ఉంది. వారిని కాదని అధికారం, పదవుల కోసం పార్టీలు మారుతూ తెదేపాలోకి వచ్చి పడిన గంటా శ్రీనివాసరావుకి ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం సాధ్యం కాకపోవచ్చు. అదే జరిగితే గంటావారు పార్టీలో అసమ్మతి గంట మ్రోగించడం మొదలుపెడతారేమో!