వికటించిన జగన్ ఓదార్పు మంత్రం
posted on May 21, 2014 @ 2:46PM
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఇద్దరూ కూడా ఉద్యమాలు చేసారు. ఇద్దరూ కూడా పార్టీ నిర్మాణం చేసుకోకుండా కేవలం సెంటిమెంటునే నమ్ముకొని ఎన్నికలకి వెళ్ళారు. వారిరువురూ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తారని సర్వే నివేదికలన్నీ ఖరారు చేసాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఇద్దరూ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వలనుకొన్నారు. ఇరు పార్టీలు కూడా స్థానిక ఎన్నికలలో తెదేపా, కాంగ్రెస్ పార్టీల కంటే వెనుకడిపోయాయి. కానీ సార్వత్రిక ఎన్నికలలో తెరాస ఘన విజయం సాధిస్తే, వైకాపా మాత్రం ఘోర పరాజయం చవి చూసింది.
కేసీఆర్ ప్రజల కోసం తెలంగాణా ఉద్యమాలు చేసి అందులో ప్రజలను కూడా భాగస్తులను చేయడం ద్వారా వారికి అది తమ కోసం తాము చేసుకొంటున్న ఉద్యమమేననే భావన కలిగించి, వారిలో ఆయన పట్ల నమ్మకం కలిగించగలిగారు. అందుకే ప్రజలు తెరాసకు ఓటువేసి ఆయనకు అధికారం కట్టబెట్టారు. కానీ, షర్మిల చేసిన పాదయాత్రలు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్రలు, ఉద్యమాలు, దీక్షలు అన్నీ కూడా కేవలం తను ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతోనే చేసారు గనుకనే ఆయనను ప్రజలు తిరస్కరించారు.
కేసీఆర్ (తెలంగాణా) సెంటిమెంటుతో ప్రజలనందరినీ తనవైపు తిప్పుకోగాలిగారు. ఎందువలన అంటే అది వారందరి జీవితాలతో ముడిపడి ఉన్నసమస్య. కానీ జగన్ ప్రయోగించిన తండ్రి మరణం తాలూకు సానుభూతి సెంటిమెంటుతో ప్రజలు ప్రభావితులవలేదు. కారణం ఒక వ్యక్తి మరణం సమాజాన్ని కలకాలం ప్రభావితం చేయలేదు.
మహాకవి శ్రీశ్రీ లోకంలో బాధలను తన బాధలుగా భావించి రచనలు చేస్తే, కృష్ణశాస్త్రిగారు తన మనసులో వేదననే అద్భుతంగా వర్ణిస్తూ గొప్ప రచనలు చేసి ప్రజలను ఆకట్టుకొన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తన సమస్యలే లోక సమస్యలన్నట్లు, లోకమంతా తనకోసం బాధపడాలని అనుకోవడం హాస్యాస్పదమే.
కేసీఆర్ తెలంగాణా కోసం పదేళ్ళు అలుపెరుగని పోరాటాలు చేసి చివరికి విజయం సాధించారు గనుక ఆయన ముఖ్యమంత్రి ఆశించడాన్ని అర్ధం చేసుకోవచ్చును. కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అటువంటివేవీ చేయకపోయినా వారు తనపై సానుభూతి చూపి, తనకు అప్పనంగా ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ఆశించి భంగపడ్డారు.