ప్రత్యేక హోదాపై డౌట్లు వద్దు: వెంకయ్య
posted on Jun 15, 2014 @ 3:36PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని కేంద్ర పట్టణాభివద్ధి శాఖా మంత్రి ఎం వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం నాడు విశాఖలో వెంకయ్య నాయుడిని ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పై విధంగా భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో ప్రణాళికా సంఘం అనేదే లేదని, ఏర్పాటు కావలసి వుందని, అలాంటప్పుడు ప్రణాళికా సంఘం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదని చెప్పిందన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన అన్నారు. ఏ విషయంలో అయినా తెలంగాణకు నష్టం కలిగించే ఏ పనిని బీజేపీ చేయదని, అలాగని ఆంధ్రకు అన్యాయం జరగనీయమన్నారు. కొత్త రాష్ట్రమైన ఏపీకి అభివద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. విశాఖను అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వేజోన్ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు.