జవదేకర్ పంక్చువాలిటీ పంచ్!
posted on Jul 1, 2014 @ 3:45PM
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సమాచార ప్రసార శాఖ ఉద్యోగులకు పంక్చువాలిటీ పంచ్ ఇచ్చారు. ఢిల్లీలోని ఈ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులలో రెండు వందల మందికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు టైమ్‌కి రాకుండా లేటుగా రావడంతో వారందరూ ప్రకాష్ జవదేకర్ ఆదేశాల మేరకు ఒకరోజు లీవ్ తీసుకోవలసి వచ్చింది. సోమవారం ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రకాష్ జవదేకర్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఆకస్మిక తనిఖీ చేశారు. మామూలుగా ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆఫీసుకు రావలసిన ఉద్యోగులలో రెండు వందల మందికి పైగా తొమ్మిదింబావు దాటినప్పటికీ ఆఫీసులో కనిపించలేదు. దాంతో వారంతా ఆఫీసుకు వచ్చిన తర్వాత తనను కలవాల్సిందిగా జవదేకర్ ఆదేశించారు. వారందరూ వచ్చిన తర్వాత గ్రూపుల వారీగా వారందరికీ ఆయన భారీ క్లాసు తీసుకుని ఆరోజుకు లీవు పెట్టాల్సిందిగా సూచించారు. ఇకపై సమయానికి ఆఫీసుకు రావాలని స్పష్టం చేశారు.