స్వామిగౌడ్ గెలుపు లాంఛనప్రాయమే
posted on Jul 2, 2014 7:17AM
ఈరోజు తెలంగాణా శాసనమండలి చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్, తెదేపాలకు చెందిన ఏడుగురు శాసనమండలి సభ్యులను, మరో ముగ్గురు ఇతర పార్టీలకు చెందిన వారిని తెరాసలోకి ఫిరాయింపజేసినందున, తెరాస చైర్మన్ అభ్యర్ధిగా నిలబడిన స్వామిగౌడ్ ఎన్నిక లాంచనప్రాయమే అవనుంది. ప్రస్తుతం శాసనమండలిలో ఉన్నమొత్తం 35 మంది సభ్యులలో తెరాసకు కేవలం ఆరుగురు సభ్యులే ఉన్నప్పటకీ పార్టీ ఫిరాయించిన వారితో కలిపి ఇప్పుడు ఆ సంఖ్య 16కు చేరింది. తెరాస అభ్యర్ధి గెలిచేందుకు కనీసం 18 మంది మద్దతు అవసరం. స్వామిగౌడ్ కు మజ్లిస్ కు చెందిన ఇద్దరు, పీ.డీ.యఫ్. సభ్యులు ఒకరు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ కు చెందినా మరో ఇద్దరు సభ్యులు కూడా ఆయనకే మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓటమి ఖాయమని తెలిసినప్పటికీ కాంగ్రెస్ కూడా తన అభ్యర్ధి ఫారూఖ్ హుస్సేన్ను బరిలో దించినందున ఎన్నికలు అనివార్యమయ్యాయి. కానీ దాదాపు18-20మంది సభ్యుల వరకు స్వామిగౌడ్ కు మద్దతు తెలుపుతున్నారు గనుక ఆయన గెలుపు లాంచన ప్రాయమే.