ఏపీ రాజధాని... దేనికెంత భూమి?

  ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని పలు భవనాల ఏర్పాటుకు ఎంతెంత భూమి అవసరమన్న విషయంలో శివరామకృష్ణ కమిటీ కొన్ని సూచనలు చేసింది. రాజధానిలో ప్రధానమైన భవనాలైన అసెంబ్లీ, సచివాలయం తదితర నిర్మాణాలకు మొత్తం 500 ఎకరాల భూమి సరిపోతుందని కమిటీ అభిప్రాయపడింది. అయితే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల వంటివి ఒకే ప్రాంతంలో కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం వుంటుందని పేర్కొంది. హైకోర్టు విషయానికి వస్తే, అసెంబ్లీ, సచివాలయం ఉన్నచోటే హైకోర్టు వుండాల్సిన అవసరం లేదని కమిటీ చెబుతోంది. సీఎం, మంత్రుల కార్యాలయాలు, సచివాలయ ఏర్పాటుకు 20 ఎకరాలు, అసెంబ్లీ ఏర్పాటుకు 80 నుంచి 100 ఎకరాలు, గవర్నర్ నివాసగృహం రాజ్‌భవన్‌ కోసం 15 ఎకరాలు, హైకోర్టు, దాని సంబంధిత వ్యవస్థ నిర్మాణానికి దాదాపు 100 నుంచి 140 ఎకరాలు అవసరమని కమిటీ తెలిపింది.

పవన్‌కి వెన్నునొప్పి.... నిజమేనా?

  పవర్‌స్టార్, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతున్నారని, ప్రస్తుతం బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నిజంగానే వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. లేక మెదక్ ఎన్నికల ప్రచారానికి దూరంగా వుండటానికే వెన్నునొప్పిని సాకుగా చూపిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా మెదక్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే స్థానం నుంచి ఓడిపోయిన్పపటి నుంచే జగ్గారెడ్డి పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా వుంటున్నారు. అప్పుడే జగ్గారెడ్డి బీజేపీలో చేరిక మీద అందరికీ అనుమానాలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న జగ్గారెడ్డికి పవన్ ‘వెన్నునొప్పి’ షాక్ ఇచ్చిందని పరిశీలకులు అంటున్నారు.

ట్రైనీ ఐపీఎస్ మృతిపై అనుమానాలు

  హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం నాడు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఈత కొలనులో పడి తీవ్ర గాయాలపాలు కావడం, ఆ తర్వాత కేర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించిన సంఘటన మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కి చెందిన మను ముక్త్ మానవ్ అర్ధరాత్రి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ గాయాలపాలు అయ్యారని పోలీస్ అకాడమీ అధికారులు చెబుతున్నారు. మను ముక్త్ మానవ్ 2013లో ఐపీఎస్కు ఎంపికై శిక్షణ కోసం హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో చేరారు. అకాడమీలోని స్విమింగ్‌పుల్‌లో పడి గాయపడడంతో సహచరులు బంజారాహిల్స్‌లోని కేర్‌ అసుప్రతికి తీసుకొస్తుండగా మర్గమధ్యలోనే మృతి చెందారు. మృతదేహన్ని కేర్‌ లోని మార్చురీలో భద్రపరిచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని అతని కుటుంబానికి సమాచారం అందించారు. వాళ్లు ఆస్పత్రికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. అయితే, ఐపీఏస్‌ అధికారి మృతిపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ అకాడమీలో మద్యంతో కూడిన విందు ఇచ్చారని, మద్యం అధికంగా తాగడం వల్ల మను ముక్తి మానవ్ స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పోలీసు అకాడమీ అధికారులు స్పష్టత ఇవ్వాలసిన అవసరం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఖైరతాబాద్ గణపతికి కేసీఆర్ పూజలు

  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణపతికి వినాయకచవితి రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో 2001 సంవత్సరంలో ఖైరతాబాద్ గణపతిని సందర్శించిన ఆయన ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో గణపతిని దర్శించుకుని పూజలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా ఖైరతాబాద్ గణపతిని దర్శించారు. గణపతి దయవల్ల తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా వీరిద్దరూ వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో వుండాలని స్వామివారిని కోరుకున్నట్టు వీరు చెప్పారు. వినాయక నిమజ్జనం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖైరతాబాద్‌ వినాయకుడి మీద పూలవర్షం కురిపించాలని నిర్వాహకులు కోరారని తప్పకుండా హెలికాఫ్టర్‌ ఏర్పాటు చేసి పూలవర్షం కురిపించే ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

పెళ్ళికి ముందే లైంగిక పరీక్షలు చేయాలి... కోర్టు...

  సంసారానికి పనికిరాని అనేకమంది పురుషులు, స్త్రీలు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అటువంటి వారిని పెళ్ళాడిన భాగస్వాములు విడాకులు కావాలని కోరుతూ కోర్టుకు ఎక్కడం తరచుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివాహానికి ముందే అబ్బాయిలకుఇంపోటెన్సీ (నపుంసకత్వం), అమ్మాయిలకు ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ఎందుకు తప్పని చేయకూడదంటూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్రానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచి నోటీసులు జారీ చేసింది. తన భర్త నపుంసకుడని, తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒక మహిళ కోర్టును ఆశ్చయించింది. ఈ కేసు మీద విచారణ సందర్భంగా కోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. ‘వైవాహిక బంధాలు విఫలమవకుండా నిరోధించడానికి పెళ్లికి ముందే లైంగిక పరీక్షలు నిర్వహించడాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదా అని' న్యాయమూర్తి జస్టిస్ ఎస్ కిరుబాకరస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భర్త నపుంసకత్వం లేదా భార్య లైంగిక సామర్థ్యం లేమి కారణాల వల్ల విడాకుల కేసులు పెరిగిపోతున్నాయని చెన్నై ఫ్యామిలీ కోర్టులో నమోదవుతున్న విడాకుల కేసులను ఉదహరించారు.

దాసరి కుమారుడు తారక ప్రభుపై అరెస్ట్ వారంట్

  ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు తారక ప్రభుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. భరణం చెల్లించడం లేదని తారక ప్రభు భార్య సుశీల కోర్టును ఆశ్రయించడంతో ఈ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించి పలుమార్లు తారక ప్రభు కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. భరణం విషయంలో తారక ప్రభు, అతని భార్య సుశీల మధ్య చాలా కాలం కోర్టు కేసు నడుస్తోంది. గతంలో ఫ్యామిలీ కోర్టు సుశీలకు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆ తర్వాత ప్రభు రికారల్ పిటీషన్ దాఖలు చేసి భరణం రద్దయ్యేలా ఉత్తర్వులు పొందారు. అయితే సుశీల అంతటితో ఆగకుండా పైకోర్టులకు వెళ్లింది. ఇలా ఈ భరణం వివాదం గత కొంత కాలంగా సాగుతూనే ఉంది. తారక ప్రభు తండ్రిని ఎదిరించి ఈ వివాహం చేసుకున్నారు. తండ్రి వీరి వివాహానికి ఒప్పుకోకపోవడంతో గతంలో కొంతకాలం పాటు తారకప్రభు ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయి ఆర్థిక ఇబ్బందులు పడ్డారు.

ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ పూజలు

  హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రతి యేటా ప్రతిష్ఠించే భారీ గణపతికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మొదటి పూజ శుక్రవారం ఉదయం నిర్వహించారు. గవర్నర్ దంపతులు వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఖైరతాబాద్ వినాయకుడికి 5 వేల కిలోల లడ్డూ ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ లడ్డును తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భక్తుడు తయారుచేయడం విశేషం. విశాఖపట్టణంలో 71 అడుగుల భారీ గణపతిని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడ వైపే ప్రభుత్వం మొగ్గు?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి అనేక సూచనలు చేసిందన్న వార్తలు వచ్చాయి. మార్టూరు - దొనకొండ మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని సూచించినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ నిరాధారాలని, రాజధాని విషయంలో ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడొద్దని ముఖ్యమంత్రి సూచించారు. ఇదిలా వుంటే, శివరామకృష్ణన్ కమిటీ ఎలాంటి సూచనలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజధాని విజయవాడ - గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా విజయవాడ దగ్గర రాజధాని ఏర్పాటు చేయవద్దని కమిటీ నివేదికలో ఎక్కడా లేదంటున్నారు మంత్రి నారాయణ. సారవంతమైన వ్యవసాయ భూములున్న చోట రాజధాని ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం అవుతుందని మాత్రమే రిపోర్ట్ లో చెప్పారన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో రాజధానికి మొగ్గు శివరామకృష్ణన్ కమిటీ ఏ సూచనలు చేసినా విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని ఉంటుందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుండబద్దలు కొట్టారు. రాజధాని దొనకొండ లాంటి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఉపయోగం లేదంటున్నారు మంత్రి యనమల.

సదానందగౌడ కొడుకు మీద కేసు...

  కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను పెళ్ళి చేసుకుని మోసం చేశాడని కన్నడ సినీనటి మైత్రేయ బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కార్తీక్ గౌడ కేంద్ర మంత్రి కొడుకు కావడంతో కేసు బుక్ చేయాలా వద్దా అని తర్జన భర్జనలు పడిన పోలీసులు చివరికి కార్తీక్ గౌడ మీద కేసు నమోదు చేశారు. మైత్రేయ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టిన తర్వాతే కార్తీక్ గౌడను అదుపులోకి తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇంతముందు వార్తలు వెలువడినట్టుగా మైత్రేయ కార్తీక గౌడ తనను మానభంగం చేసినట్టుగా ఆమె ఫిర్యాదు చేయలేదని, తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని మాత్రమే ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు. ఇదిలా వుంటే తాను సదానంద గౌడ ఇంటికి కోడలిగా వెళ్ళాలని కోరుకుంటున్నానే తప్ప, ఆ కుటుంబాన్ని అభాసుపాలు చేసే ఉద్దేశం లేదని మైత్రేయ చెబుతున్నారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకూ బోసి మెడతో కనిపించిన మైత్రేయ గురువారం సాయంత్రం నుంచి మెడలో పసుపు కొమ్ము కట్టిన పసుపుతాడు వేసుకుని కనిపించడం విశేషం.

నేరం నాదికాదు.. పూరీ జగన్నాథ్ వివరణ

  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, ఆయన భార్య లావణ్య మీద జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఛీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే పూరీ జగన్నాథ్ తాను ఎవర్నీ మోసం చేయలేదని, తానే మోసపోయానని వివరణ ఇస్తున్నారు. తన స్థలంలో అపార్ట్‌మెంట్ కట్టిన బిల్డర్లు తనను మోసం చేసి అమెరికా పారిపోయారని ఆయన చెప్పారు. ఆ బిల్డర్ల మీద తాను మూడేళ్ల క్రితమే కేసు పెట్టానని పూరి జగన్నాథ్ చెబుతున్నారు. చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌లో పూరీ జగన్నాథ్ భార్య లావణ్యపేరుతో ఇంటి స్థలం ఉంది. దానిని సుబ్బరాజు, రామరాజు అనే బిల్డర్లకు అభివృద్ది నిమిత్తం ఇచ్చారు. వారు నాలుగు ఫ్లాట్స్ కట్టి అమ్ముకున్నారు. వారితో ఒప్పంద సమయంలోనే తనకు బ్యాంకులో ఐదు కోట్ల రుణం ఉందని బిల్డర్లకు చెప్పానని,వారు వాయిదాలు కట్టడానికి ఒప్పుకుని కొంతకాలం చెల్లించారని కూడా జగన్నాథ్ చెబుతున్నారు. కానీ ఆ బిల్డర్లు వాయిదాలు పూర్తిగా కట్టకపోవడంతో బ్యాంకు నోటీసు ఇవ్వగా ఇది సబమస్య అయిందని, ప్లాట్స్ కొన్నవారు తనను అపార్థంచేసుకున్నారని పూరీ జగన్నాథ్ చెబుతున్నారు.

కాణిపాకం దేవాలయంలో తుపాకీతో చరణ్‌రాజ్ ఎంట్రీ...

  ప్రముఖ నటుడు చరణ్‌రాజ్ వినాయకచవితి రోజున చిత్తూరు జిల్లాలోని కాణిపాకం దేవాలయంలో హడావిడి చేసి వివాదం సృష్టించారు. కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలోకి చరణ్‌రాజ్ రివాల్వర్‌తో ప్రవేశించారు. భద్రతా సిబ్బంది సరిగ్గా తనిఖీలు చేయకపోవడంతో పాటు.. భద్రత కోసం ఆలయంలో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లు పని చేయకపోవడతో చరణ్ రాజ్ రివాల్వర్‌తోనే ఆలయం లోపలికి వెళ్లి వినాయకుడిని దర్శనం చేసుకున్నారు. ఆలయమంతా తిరిగారు. భక్తులు చరణ్ రాజ్ వద్ద తుపాకీ ఉన్న విషయాన్ని గుర్తించి ఆలయ అధికారులకు సమాచారం చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన వద్ద తనిఖీ చేయగా, తుపాకీ బయటపడింది. దాంతో ఆలయంలోకి రివాల్వర్ తీసుకురావడం పట్ల చరణ్‌రాజ్ క్షమాపణలు చెప్పారు. వినాయక మాల తీసివేసే హడావుడిలో పొరపాటున గన్‌ను పక్కన పెట్టడం మరచిపోయానని చెప్పారు. ఈ విషయంలో పోలీసులు, భక్తులు, ఆలయ సిబ్బంది తనను క్షమించాలని కోరారు. చివరికి ఆలయ అధికారులు చరణ్ రాజ్‌కు తుపాకీని తిరిగి అప్పగించారు.

పూరి జగన్నాథ్ మీద ఛీటింగ్ కేసు

  ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. పూరి జగన్నాథ్‌తోపాటు ఆయన భార్య లావణ్య కూడా ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. పూరి జగన్నాథ్ దంపతులతోపాటు ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ మీద కూడా జూబిలీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే, పూరి జగన్నాథ్‌కి చెందిన జూబిలీహిల్స్‌లోని 1000 గజాల స్థలాన్ని ఆయన గతంలో బ్యాంకులో 5 కోట్లకు తాకట్టు పెట్టారు. ఆ తర్వాత అందులో సగం తిరిగి చెల్లించారు. ఈ స్థలం పూరి జగన్నాథ్ భార్య లావణ్య పేరు మీద వుంది. కొంతకాలం తర్వాత ఆస్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మించే ప్రపోజల్‌తో సుబ్బరాజు అండ్ కంపెనీతో పూరి జగన్నాథ్ కుటుంబం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వీరు తమ స్థలాన్ని ఆ కంపెనీకి ఇవ్వాలి. వారు బ్యాంకులో మిగిలి వున్న రెండున్నర కోట్ల అప్పు తీర్చేయాలి. అయితే సదరు కన్‌స్ట్రక్షన్ కంపెనీ సంస్థగానీ, పూరీ జగన్నాథ్ గానీ బ్యాంకులోను తీర్చకుండానే ఆ స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మించి అమ్మేశారు. బ్యాంకు అధికారులు లోను వసూలు కోసం ప్రయత్నించి తమకు తాకట్టు పెట్టిన స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మాణం అయి వుండటం చూసి అవాక్కయ్యారు. దాంతో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు కొన్నవారు, బ్యాంకు అధికారులు పూరి జగన్నాథ్ మీద, ఆయన భార్య లావణ్య మీద, సుబ్బరాజు కన్‌స్ట్రక్షన్ కంపెనీ మీద కేసు నమోదు చేశారు.

యువతి స్నానం చేస్తుంటే సెల్‌తో....

  బంజారాహిల్స్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో స్నానం చేస్తున్న యువతిని వీడియో తీసిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేసి, అతని మీద నిర్భయ కేసును నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 13లోని సయ్యద్ నగర్‌లో నివసించే రవూఫ్ అనే ఎలక్ట్రీషియన్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో వున్న ఒక అపార్ట్‌మెంట్‌లో కరెంటు పనుల నిమిత్తం వెళ్ళాడు. ఈ సందర్భంగా అదే అపార్ట్‌మెంట్‌లో స్నానం చేస్తున్న యువతిని గమనించిన రవూఫ్ తన దగ్గర వున్న సెల్‌ఫోన్‌లో ఆమెని చిత్రీకరించాడు. ఈ విషయాన్ని మరో మహిళ గుర్తించి కేకలు వేయడంతో రవూఫ్ పరారయ్యాడు. మంగళవారం నాడు ఈ సంఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రవూఫ్‌ని అరెస్టు చేసి నిర్భయ కేసు నమోదు చేశారు. రవూఫ్‌ని రిమాండ్‌కి తరలించారు.

పవన్ కళ్యాణ్‌ని జనం రాళ్ళతో కొడతారు

  మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డికి సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశం వుందని వార్తలు వస్తున్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ (ఓయూ జేఏసీ) తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి జన సేన మద్దతిస్తే జనం పవన్ కళ్యాణ్‌ని రాళ్లతో కొడతారని ఓయూ జేఏసీ నాయకులు అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్‌కి ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారని అంటున్నారు. మెదక్ లో జగ్గారెడ్డికి ప్రచారం చేస్తే ప్రజలు మరోసారి గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.

జన్ ధన్ యోజన ప్రారంభం

  దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన జన్ ధన్ యోజన పథకం ప్రారంభమైంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా లక్ష్యంగా జన్ ధన్ యోజన ద్వారా పేదలకు ఎన్నో ప్రయోజనాలు వుంటాయని తెలుస్తోంది. ఖాతాదారులకు ఇన్సూరెన్స్‌తోపాటు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తారు. ఈ ఖాతాలు ఆధార్ కార్డుకు అనుసంధానంగా వుంటాయి. జన్ ధన్ యోజనలో భాగంగా పథకం ప్రారంభమైన తొలిరోజే దేశవ్యాప్తంగా కోటి ఖాతాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పథకం ప్రారంభోత్సవంలో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జన్ ధన్ యోజన పథకం లక్ష్యాలు, ప్రయోజనాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా వున్న బ్యాంకు అధికారులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏడున్నర లక్షలకు పైగా ఈ మెయిల్స్ పంపించారు.

మంచు లక్ష్మి, బెల్లంకొండ మీద కేసులు...

  నటుడు, నిర్మాత మోహన్‌బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి, నిర్మాత బెల్లంకొండ సురేష్ మధ్య ఆర్థిక సంబంధమైన వివాదం వున్న విషయం తెలిసిందే. ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ సెట్‌ ‘రభస’ చిత్రం కోసం వినియోగించుకున్నందుకు తనకు 58 లక్షలు ఇస్తామని చెప్పిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు ఇవ్వనంటున్నారంటూ మంచు లక్ష్మి మనుషులు మంగళవారం రాత్రి బెల్లంకొండ ఇంటిముందు ధర్నా చేశారు. దీనిమీద బెల్లంకొండ సురేష్ వివరణ ఇస్తూ, ‘‘గతంలో తన బ్యానర్‌లో మంచు విష్ణుతో ఓ చిత్రం తీసేందుకు రూ.60 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను. కథ సిద్ధం కాకపోవడంతో ఈ చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఆ డబ్బులను మంచు లక్ష్మీ ప్రసన్నకు ఇవ్వాల్సిందిగా మంచు విష్ణుకు చెబితే ఆయన సరేనన్నారు. కానీ, మంచు లక్ష్మీ ప్రసన్న మాత్రం అతనికి తనకు లింకు పెట్టొద్దనీ, తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంతవరకు న్యాయం? మంచు లక్ష్మి, విష్ణు ఒకే కుటుంబానికి చెందినవారు కారా?’’ అన్నారు. ఈ విషయం మీద బెల్లంకొండ సురేష్ మీద మంచు లక్ష్మి, మంచు లక్ష్మి మీద బెల్లంకొండ సురేష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు.

ఏపీ రాజధానిపై ఇంకా ఏ నివేదికా రాలేదు: చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించిందన్న వార్తలు వచ్చాయి. శివరామకృష్ణన్ కమిటీ ఫలానా ఫలానా సూచనలు చేసిందని, విజయవాడ - గుంటూరు ప్రాంతం రాజధానిగా బాగోదని చెప్పిందని, మార్టూరు - వినుకొండ - దొనకొండ మధ్యప్రాంతం రాజధానికి అనుకూలంగా వుంటుందని నివేదికలో పేర్కొందన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తల మీద కూడా ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు పలువురు స్పందిస్తూ రకరకాల వివరణలు ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్ర రాజధానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి నివేదిక రాలేదని, రాజధాని విషయంలో మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని చంద్రబాబు స్పష్టం చేశారు.