పవన్ పుట్టినరోజు వేడుకలు... ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్...

  ఒక్కోసారి కొన్ని సందర్భాలను, సన్నివేశాలను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థంకాదు. ఈరోజు అభిమానులు ‘పవర్ స్టార్’ అని పిలుచుకునే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఒక అభిమాని అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఏర్పాట్లు చేస్తూ వుండగా కరెంట్ షాక్‌తో చనిపోయాడు. ఎవరి పుట్టినరోజో జరపడానికి ఎవరో ప్రాణాలు కోల్పోయారు. అభిమానించే వ్యక్తికి, అభిమానాన్ని పొందుతున్న వ్యక్తికి మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ అభిమానిస్తారు. సరే, ఇదిలా వుంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ వుంటే, అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఉత్సాహంలో తాను పాలు పంచుకోలేక బెంగుళూరు ఆస్పత్రిలో వెన్నునొప్పి చికిత్స చేయించుకుంటున్నాడు. ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో వెన్నునొప్పి విషయం గురించి ఎంతమాత్రం ఆలోచించకుండా ఉత్సాహంతో చిందులు వేస్తున్నారు. ఆయన వెన్నునొప్పి వీళ్ళకి పట్టదు.. వీళ్ళ ఉత్సాహం ఆయనకి పట్టదు. మరి ఇలాంటి సందర్భాలను చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని స్థితి కలగడం న్యాయమే కదా?!

ప్యూను ఆస్తి.. జస్ట్ ఏడు కోట్లు..

  మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో కుల్దీప్ యాదవ్ అనే ఓ సహకార బ్యాంకులో పనిచేసే ప్యూను ఏకంగా దాదాపు ఏడుకోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టాడు. ఆయన గారి ఆస్తిలో ఆరు భారీ భవంతులు, రెండు లగ్జరీ కార్లు ఒక భాగం. గ్వాలియర్లోని అతడి ఇళ్లపై లోకాయుక్త, ఏసీబీ పోలీసులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు ఏడు కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. అతని ఆస్తులకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయని, అప్పుడు కళ్ళు తిరిగేంత మరింత సంపద బయటపడే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. యాదవ్ ఆస్తి గురించి వ్యక్తి ఫిర్యాదు రావడంతో ఈ సోదాలు చేశారు.

శ్వేతా బసు ప్రసాద్... పునరావాస కేంద్రంలో హ్యాపీ...

  ప్రముఖ సినిమా కథానాయిక శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆమెను పోలీసులు ఎర్రమంజిల్ కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు ఆమెను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని ఆదేశించింది. హీరోయిన్ హోదా అనుభవించి, ఏదో ఒక మార్గం ద్వారా బోలెడంత డబ్బు సంపాదిస్తూ వున్న శ్వేతా బసు ప్రసాద్ అకస్మాత్తుగా ఇలా పోలీసులకు పట్టుబడటం, ప్రభుత్వ పునరావాస కేంద్రానికి వెళ్ళాల్సి రావడం... ఇలాంటి పరిస్థితుల్లో మామూలుగా అయితే ఎవరైనా భోరున ఏడుస్తూ వుంటారు. దిగులుగా కూర్చుని వుంటారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ పునరావాస కేంద్రంలో వున్న శ్వేతా బసు ప్రసాద్ ఎంతమాత్రం దిగులు పడకుండా చాలా మామూలుగా, అసలేం జరగనట్టుగా, అందర్నీ హ్యాపీగా పలకరిస్తూ వున్నట్టు సమాచారం. పోన్లెండి... తలరాత ఎలా వున్నా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగే గుండె ధైర్యం కూడా వుంది. మొత్తానికి శ్వేతా బసు ప్రసాద్ గట్టి పిండమే.

ప్రియుడు మోసం చేశాడని గొంతు కోసుకుంది

  కొంతమంది అమ్మాయిలు ముందూ వెనక ఆలోచించకుండా ఎవరో పనికిమాలిన వాడితో ప్రేమలో పడతారు. చివరికి వాడు వేస్ట్ ఫెలో అని అర్థమవుతుంది. ఆమెకి రకరకాల బాధలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఆ ప్రియుడు ఆమె మీద దాడి చేస్తాడు. మరికొన్నిసార్లు ప్రియుడు పెళ్ళి చేసుకోను పొమ్మంటాడు.. ప్రియుళ్ళు ప్రియురాళ్ళని చేసే మోసాలను ఇలా రాసుకుంటూ పోతే పెద్ద గ్రంథం తయారవుతుంది. అలాంటి గ్రంథంలో ఒక పేజీలా చేర్చదగ్గ సంఘటన చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లెలో జరిగింది. ఒక యువతి ఒక యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఆ యువతిని ప్రేమలోకం అంచుల వరకూ తీసుకెళ్ళి అక్కడి నుంచి నెట్టేశాడు. ఆమె అతన్ని పెళ్ళి చేసుకోమని అడిగింది. అతను క్లియర్‌గా నేను చేసుకోను అని చెప్పేశాడు. ఆమె తిరుగుబాటు చేసి అతన్ని పోలీస్ స్టేషన్‌కి ‌ఈడిస్తే కథ మరోలావుండేది. అయితే ఆమె అలా చేయకుండా డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్ళింది. ఆ పక్కనే షాపులో ఓ బ్లేడ్ కొనుక్కుంది. పోలీస్ స్టేషన్ ముందు నిల్చుని బ్లేడుతో గొంతు కోసుకుంది. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.

తొలి విడత అన్న క్యాంటిన్లు 35....

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయ తలపెట్టిన అన్న క్యాంటీన్లపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ మంగళవారం జరిగింది. తొలివిడతగా రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో మొత్తం 35 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అనంతపురంలో 5, తిరుపతిలో 5, గుంటూరులో 10, విశాఖపట్నంలో 15 చొప్పున అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నారు. అన్న క్యాంటిన్ల నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలంటూ నాలుగు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

మమ్మల్ని సమైక్యవాదులంటే చెప్పుతో కొడతాం...

  తమను ఇకపై టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ‘సమైక్యవాదులు’ అని అంటే వాళ్ళని చెప్పుతో కొడతామని తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నాయకుడు, మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ఘాటుగా అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈ ఇద్దరు నాయకులు పై విధంగా ఫైర్ అయ్యారు. మెదక్లో ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే, ఫాంహౌస్లో కేసీఆర్ తాగే మందులో సోడా పోయడానికి, కవిత బ్యాగులు మోయడానికే పనికొస్తాడు తప్ప.. పార్లమెంటులో ప్రజాసమస్యల పరిష్కారానికి పనికిరాడని అన్నారు. తమను ఎవరైనా విమర్శిస్తే వాళ్ళతో బంతాడుకుంటామని జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఏపీ రాజధాని పేరు ‘తారకరామ నగర్’?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల్లో ప్రకటించబోతున్నారు. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఉండాలన్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి కూడా వచ్చేసింది. రాజధాని ఎక్కడ అనే విషయంలో క్లారిటీ బాగానే వుంది. ఇప్పుడు తాజాగా సరికొత్త అంశం తెరమీదకి వచ్చింది. కొత్త రాజధానికి తెలుగుజాతి కీర్తి పతాకను అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన ఎన్టీఆర్ పేరు కలిసేలా పేరు పెడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ అభిమానుల్లో అంతర్లీనంగా వున్న అభిప్రాయాన్ని మంగళవారం నాడు బయటపెట్టారు. కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే గుంటూరు జిల్లాలో ఎనిమిది వేల ఎకరాల భూమిని ఇవ్వడానికి కూడా రైతులు సిద్ధంగా వున్నారని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా పేరు పెడితే ఆ పేరు ఎలా వుంటుందన్న ఆలోచన ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానుల్లో మొదలైంది. కొత్త రాజధాని ఏ ఊరిలో ఏర్పడినా కొత్త రాజధానికి ‘తారకరామ నగర్’ అనే పేరు ఉంటుందన్న ఆశాభావాన్ని, ఊహాగానాన్ని ఎన్టీఆర్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్‌ని ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికే వుంది....

  తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒక పార్టీ మీద మరోపార్టీ మాటల దాడి చేయడం సాధారణమైపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి ఆ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంతరావును టీఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్లో చేరిన వారిని పవిత్రులు అనడం, బీజేపీలో చేరినవారిని పాపులు అనడం టీఆర్ఎస్ వారికి పరిపాటిగా మారిందని అన్నారు. తాజాగా జగ్గారెడ్డి బీజేపీలో చేరడం అదేదో ఘోరమైన విషయంలా టీఆర్ఎస్ నాయకులు చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ని ఎదుర్కునే సత్తా జగ్గారెడ్డికే వుందని కిషన్ రెడ్డి అన్నారు.

లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. ఒత్తిడే కారణం

  డబ్బు సంపాదించడమే లక్ష్యంగా బతికేస్తూ యాంత్రికంగా మారిపోతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఒత్తిడికి చేరువవుతున్నారు. అలా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ (24) ఇండోర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ముంబైకి చెందిన దీపా రాదారియా గత ఆరు నెలలుగా ఇండోర్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తోంది. ఆమె చిన్న చిన్న విషయాలకు కూడా దీప పదేపదే డిప్రెషన్కు గురయ్యేది. గత మూడు నాలుగు రోజులుగా ఆమె ఆరోగ్యం కూడా గాడి తప్పింది. మానసిన ఒత్తిడి, అనారోగ్యం రెండూ ఆమెని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయి. దాంతో ఆమె ఉరి వేసుకుని మరణించింది.సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు డిప్రెషన్‌కి లోను కాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా సంస్థల మీద వుందన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

డ్రమ్ వాయించిన మోడీ

  ప్రస్తుతం జపాన్ పర్యటనలో వున్న భారత ప్రధాని నరేంద్రమోడీ అక్కడి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు. రెండు రోజుల క్రితం జపాన్‌లోని ఓ పురాతన బడికి వెళ్ళి అక్కడి పిల్లలను ఆకట్టుకున్న మోడీ, సోమవారం నాడు ఫ్లూట్ వాయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆయన లయబద్ధంగా డ్రమ్స్ వాయించారు. మంగళవారం ఉదయం నరేంద్ర మోడీ టోక్యోలో టీసీఎస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్ సంప్రదాయ టైకో డ్రమ్స్‌ వాయించాలంటూ టీసీఎస్ సీఈఓ చంద్రశేఖర్‌ మోడీని ఆహ్వానించారు. ఆహ్వానం అందుకున్న మోడీ డ్రమ్ ఎలా వాయిస్తారో దీక్షగా గమనించి... అనంతరం డ్రమ్స్‌పై ఫాస్ట్‌బీట్ ఉత్సాహంగా వాయించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు.

ఒకే వేదిక మీద చిరంజీవి, జయమాలిని...

  నర్తకిగా తెలుగు సినిమా రంగాన్ని, ప్రేక్షకులను ఒక ఊపు ఊపి, ఆ తర్వాత చక్కగా పెళ్ళి చేసుకుని సంసార జీవితంలో సెటిలైన నర్తకి జయమాలిని ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు. దాదాపు పాతికేళ్ళ క్రితం సినిమా నటనకు స్వస్తి చెప్పిన ఆమె మళ్ళీ సినిమాల్లో నటించలేదు సరికదా, బయట కూడా ఎక్కడా కనిపించలేదు. ఇన్నేళ్ళ తర్వాత ఆమె అజ్ఞాతవాసం వీడి బయటకి వచ్చారు. సంతోషం సినిమా పత్రిక నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తనదైన శైలిలో డాన్స్ కూడా చేశారు. ఇదే ఫంక్షన్లో పాల్గొన్న చిరంజీవి సరసన నిల్చుని ఆమె కెమెరాలకు పోజిచ్చారు. ఈ సందర్భంగా వీరిద్దరూ తాము కలసి నటించిన సినిమాల గురించి గుర్తు చేసుకున్నారు.

ఇరాక్‌లో కారు బాంబు పేలుడు 13 మంది మ‌ృతి

  ఇరాక్ రాజధానిలో కారుబాంబులు పేలడం, చాలామంది అమాయక ప్రజలు చనిపోవడం మామూలు విషయంలా మారిపోయింది. అక్కడి వారికి ఇది మామూలుగానే వుండొచ్చుగానీ, ప్రపంచంలోని ఇతర దేశాల వారికి మాత్రం అది చాలా టెర్రర్ కలిగిస్తున్న అంశం. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఓ కారు బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 13 మంది మరణించగా 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల ధాటికి సమీపంలోని పలు భవనాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈమధ్యకాలంలో ఇరాక్‌లో ఉగ్రవాదులు జరిపిన హింసాకాండలో 1420 మంది మరణించారు. 1370 మంది గాయపడ్డారు. ఇరాక్‌కి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఈ గణాంకాలను వెల్లడించింది.

బాపు గారి అంత్యక్రియలు పూర్తి

  ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు అంత్యక్రియలు చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. బాపు నివాసం నుంచి ప్రారంభమైన ఆయన అంతిమయాత్ర బీసెంట్ నగర్ శ్మశానవాటిక వరకు కొనసాగింది. ఈ అంతిమయాత్రలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రావికొండలరావు, బోనీ కపూర్, అనిల్ కపూర్ తదితర సినీ ప్రముఖులు, పలువురు అభిమానులు పాల్గొన్నారు. బాపును చివరి చూపు చూసుకోవడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. అలాగే సోమ, మంగళవాలలో తెలుగు సినిమా రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు బాపు భౌతిక కాయాన్ని సందర్శించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఏపీ కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు....

  ఆంధ్రప్రదేశ్ రాజధానికి దివంగత మహా నటుడు, మహా నాయకుడు, తెలుగువారి కీర్తిని అంతర్జాతీయ స్థాయికి చాటిన ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు కలసి వచ్చేలా పెడితే ఎనిమిది వేల ఎకరాల భూమిని ఇవ్వడానికి గుంటూరు జిల్లా రైతులు సిద్ధంగా వున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. అలాగే మంగళవారం నాడే ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ప్రకటన చేయాలని భావించినప్పటికీ, మంచి ముహూర్తం కోసమే ప్రకటనను ఎల్లుండికి ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిదా వేశారని మంత్రి చెప్పారు. ఏదైనా మంచి పని చేపట్టే ముందు ముహూర్తబలం కూడా బాగుండాలన్నదే తమ ఉద్దేశమని ఆయన వివరించారు.

అసెంబ్లీలో ప్రమాదం.. టీడీపీ ఎమ్మెల్యేలకు తప్పిన గండం...

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. మంగళవారం జీరో అవర్లో టీడీపీ ఎమ్మెల్యే కొమ్ములపాటి శ్రీధర్ ప్రసంగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి కర్టెన్ ఇనుప రాడ్ జారి పడింది. రాడ్ ఎమ్మెల్యేలకు కొద్ది దూరంలో పడటంతో ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు శాసనసభ్యులు కంగారుపడ్డారు. అనంతరం మార్షల్స్ ఆ ఇనుపరాడ్ను తొలగించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవడానికి కేటాయించిన హాలులో సదుపాయాలు సరిగా లేవని గతంలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

భార్యాపిల్లల్ని గొడ్డలితో నరికాడు...

  కడప జిల్లాలో పెళ్ళాం పిల్లల్ని గొడ్డలితో దారుణంగా నరికేసిన ఒక అనుమాన పిశాచి ఉదంతం ఇది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ఎప్పటి నుంచో తన భార్య మీద తీవ్రమైన అనుమానం. తమకు ఉన్న కుమార్తె, కుమారుడు కూడా తనకు పుట్టినవారు కాదన్న అనుమానం అతనికి వుండేది. ఆ అనుమానం పెనుభూతంగా మారి మంగళవారం నాడు అతనిలోని రాక్షసుడు బయటపడ్డాడు. గొడ్డలి తీసుకుని భార్యని, ఇద్దరు పిల్లల్ని నరికేశాడు. దాంతో భార్య, కుమార్తె మరణించారు. కుమారుడు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంత దారుణానికి పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో వున్నాడు.