బరితెగించిన శాడిస్టుమొగుడు... వీడియోలు...

  హైదరాబాద్‌లో ఓ శాడిస్ట్ మొగుడి ఉదంతం బయటపడింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన భాస్కర్‌కి ఆ ప్రాంతానికే చెందిన యువతితో ఆరు నెలల క్రితం పెళ్ళయింది. పెళ్ళయిన దగ్గర్నుంచి భాస్కర్ అనేకసార్లు తన భార్యను నగ్నంగా వీడియో తీశాడు. ఇప్పుడు తనకు విడాకులు ఇవ్వకపోతే ఈ వీడియోలన్నీ మీ బంధుమిత్రులందరికీ పంపిస్తానంటూ తన భార్యని బెదిరిస్తున్నాడు. అంతేకాకుండా, గతంలో తాను చిత్రీకరించిన పలువురు యువతుల నగ్న వీడియోలను తన భార్యకి చూపిస్తూ ఆమెని మానసికంగా వేధిస్తున్నాడు. ఆరు నెలలుగా తన భర్త శాడిజాన్ని భరిస్తూ వచ్చిన ఆ యువతి ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది.

బస్సులో మంటలు.. ఐదుగురి మృతి

  తమిళనాడులో అనూహ్యమైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు బస్సులోనే సజీవ దహనమవ్వగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. రామనాథపురం సమీపంలోని కీల్ళకరై సమీపంలో ఓ ప్రైవేట్ బస్సులో గ్యాస్ సిలెండర్ పేలడంతో బస్సులో మంటలు వ్యాపించాయి. దాంతో ఐదుగురు వ్యక్తులు బస్సులోనే సజీవ దహనమయ్యారు. కాలిన గాయాలకు గురైన 11 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. మృతులు, గాయపడినవారు అందరూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడుకు యాత్రికులను తీసుకొచ్చిన ప్రైవేట్ బస్సు ఇది. రామేశ్వరం ఆలయాన్ని సందర్శించిన అనంతరం కన్యాకుమారికి వెళ్తూ వుండగా దారిలో ఈ ప్రమాదం జరిగింది. యాత్రికులు వంట కోసం వినియోగించే గ్యాస్ సిలెండర్ పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది.

వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకి నిపుణుల కమిటీ నియామకం

   వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టులో చిన్నకదలిక వచ్చింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నిపుణుల కమిటీని నియమిస్తూ జీ.ఓ.714 జారీ చేసింది. ఈ కమిటీ వైజాగ్ మెట్రో రైలు కోసం జీవీయంసి సూచించిన నాలుగు కారిడార్లలో ఒకదానిని ఖరారు చేస్తుంది. ఈ ప్రాజెక్టును సర్వేచేసి నివేదికను రూపొందించేందుకు ఆరు అంతర్జాతీయ సంస్థలు టెండర్లు వేసాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వాటి అర్హతలను, గత అనుభవాన్ని, పనితీరు, సామర్ధ్యాన్ని పరిశీలించి వాటిలోనుండి ఒకదానిని ఎంపిక చేసి జీవీయంసికి సూచిస్తారు. అప్పుడు జీవీయంసి రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి, నిధులు మంజూరు అయిన తరువాత ఆ సంస్థకు పని అప్పగిస్తుంది. నిపుణుల కమిటీ సమావేశమయ్యి సర్వే కోసం సంస్థ ఎంపిక, దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి, కేంద్రప్రభుత్వం నుండి నిధుల మంజూరు అవడం, తరువాత సర్వే చేయడానికి, మళ్ళీ ఆ నివేదిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టేందుకు అవసరమయిన అనుమతులు, నిధులు మంజూరు, భూసేకరణ వంటి సుదీర్ఘమయిన తతంగం అంతా పూర్తవడానికి కనీసం ఒకటి నుండి రెండేళ్ళు పట్టే అవకాశం ఉంది. అంటే అన్నీ సవ్యంగా సాగితే 2016 లేదా 2017సం.లో ప్రాజెక్టు పనులు మొదలయినట్లయితే బహుశః 2019 ఎన్నికల సమయానికి ఈ ప్రాజెక్టు కొంతమేర పూర్తయ్యే అవకాశం ఉందని భావించవచ్చును.

జపాన్‌లో మోడీ బౌద్ధాలయ సందర్శన

  భారత ప్రధాని నరేంద్రమోడీ విదేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు స్థానికంగా వున్న ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించడం సంప్రదాయంగా మారింది. మొన్నీమధ్య నేపాల్‌కి వెళ్ళినప్పుడు అక్క ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఇప్పుడు జపాన్ పర్యటనలో వున్న ఆయన టోజీలో వున్న పురాతన పగోడా బౌద్ధలయాన్ని సందర్శించారు. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ఆలయానికి వచ్చిన మోడీ ఇక్కడ అరగంటపాటు గడిపారు. చెక్కతో ఐదు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని తిలకించారు. ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన ఈ పగోడా బౌద్ధలయ విశేషాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రధాన బౌద్ధభిక్షువు మోరీ పగోడా బౌద్ధాలయవిశేషాలను మోడీకి వివరించారు.

ఉప ఎన్నికల బరిలో...

  ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మెదక్ ఉప ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మెదక్ పార్లమెంట్ స్థానం బరిలో తెరాస నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జగ్గారెడ్డి బరిలో వున్నారు. మిగతా అందరూ స్వతంత్ర అభ్యర్థులు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ శాసనసభ స్థానం నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్త తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బోడపాటి బాబూరావు నిలిచారు. పుల్లయ్య, పుల్లారావు అనే ఇద్దరు వ్యక్తులు స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీలో వున్నారు.

తుమ్మల కంటతడి

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, ఖమ్మం జిల్లాకి చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తాను రాజీనామా చేసిన విషయాన్ని ప్రకటించిన సమయంలో భావోద్వేగాన్ని తట్టుకోలేక కంటతడి పెట్టారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం వున్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం అనేది తుమ్మలకి కంటతడి పెట్టుకునే అంశమే. తుమ్మల నాగేశ్వరరావుతోపాటు తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం నాయకులు టీడీపీకి రాజీనామా చేశారు. వారిలో ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొండబాల, ఎమ్మెల్సీ బాలసాని, డిసిసిబి చైర్మన్ మువ్వ విజయ్ బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కవిత, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నాగచంద్రారెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు వున్నారు.

జపాన్‌కి చేరుకున్న మోడీ

  భారత ప్రధాని నరేంద్రమోడీ జపాన్‌లోని క్యోటో నగరానికి చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన పలువురు అధికారులు, ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్‌జీ వంటి పారిశ్రామికవేత్తలతో కలసి ఆయన జపాన్‌కి చేరుకున్నారు. క్యోటో విమానాశ్రయంలో జపాన్ ప్రధానమంత్రి సింజూ- మోడీ బృందానికి స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌ని కూడా కాదనుకుని సింజూ విమానాశ్రయానికి వచ్చి మరీ మోడీ బృందానికి స్వాగతం పలకడం విశేషం. మోడీ ఈ పర్యటన సందర్భంగా మొదట స్మార్ట్ సిటీ అయిన క్యోటోలో పర్యటిస్తారు. భారతదేశంలో స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని భావిస్తున్న మోడీ దానికి సంబంధించిన సంపూర్ణ అవగాహన పొందడం కోసమే క్యోటోలో పర్యటిస్తారు. జపాన్ పర్యటన సందర్భంగా మోడీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళతారనే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పర్యటనలో రక్షణ, పౌర అణు కార్యక్రమం, మౌలిక వసతులు అభివృద్ధి వంటి రంగాల్లో సహకారం, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మోదీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షణ, పౌర అణు కార్యక్రమాల్లో కొన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.

టీడీపీకి తుమ్మల రాజీనామా

  ఖమ్మం జిల్లాకి చెందిన తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి శనివారం నాడు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద నష్టం. గత కొంతకాలంగా తుమ్మల నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నామా నాగేశ్వరరావుతో పడకపోవడం వల్లే తుమ్మల తెలుగుదేశాన్ని వీడినట్టు తెలుస్తోంది. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంగా వుండి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన తుమ్మలను చంద్రబాబుతో సహా పలువురు తెలుగుదేశం నాయకులు పరామర్శించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయిన తర్వాత ఖమ్మంలోని తెలుగుదేశం కార్యాలయానికి వెళ్ళిన తుమ్మల తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగేదీ లేనిదీ సెప్టెంబర్ 5న ప్రకటిస్తానని చెప్పారు. అంతలోనే తెలుగుదేశం పార్టీకి తన రాజీనామా లేఖను పార్టీ నాయకుడు చంద్రబాబుకు పంపించారు. ‘నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను’ అని ఏక వాక్యంతో ఆయన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. కాగా, తెలుగుదేశం పార్టీని వీడిన తుమ్మల త్వరలో టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని, త్వరలో జరిగే తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తుమ్మలకు స్థానం దక్కే అవకాశం వుందని తెలుస్తోంది.

స్నేక్‌గ్యాంగ్ మీద ఐదు కేసులు నమోదు

  హైదరాబాద్‌లో ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకున్న స్నేక్‌గ్యాంగ్ ఇప్పుడు పోలీసుల చెరలో వుంది. పాములు చూపించి బెదిరించి ఈ స్నేక్‌గ్యాంగ్ ఇప్పటి వరకు 11 మంది అమ్మాయిల మీద సామూహిక అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. ఈ స్నేక్గ్యాంగ్పై ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదయ్యాయి. శనివారం నాడు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ ముఠా సభ్యులను పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు చెందిన దయానీతో పాటు మరో నిందితుడిని కూడా పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. సామూహిక అత్యాచారం, వ్యక్తిని తీవ్రంగా కొట్టడం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, బెదిరింపుల కేసు, భూ కబ్జా కేసులు ఈ గ్యాంగు మీద నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో స్నేక్‌గ్యాంగ్‌ సభ్యులకు సెప్టెంబర్ నాలుగవ తేదీ వరకు రిమాండ్‌ విధించారు

తుమ్మల టీఆర్ఎస్ తీర్థం.. 5 వరకూ సస్పెన్స్...

  ఖమ్మం జిల్లా తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు త్వరలో టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో అయితే తుమ్మల టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టుగా కొంతమంది ఔత్సాహికులు కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే తుమ్మల టీఆర్ఎస్‌లో చేరేదీ లేనిదీ సస్పెన్స్‌గా వుంది. ఈమధ్య ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన తుమ్మల తన ఆరోగ్యం కొంత మెరుగు కావడంతో డిశ్చార్చి అయ్యారు. ఆయన శనివారం నాడు ఖమ్మంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు తుమ్మల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల తాను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకి వెళ్లేదీ లేనిదీ సెప్టెంబర్ 5వ తేదీన చెబుతానని చెప్పారు.

వేధింపులు... విద్యార్థిని ఆత్మహత్య...

  నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో టీటీసీ శిక్షణ పొందుతున్న సుభాషిణి అనే విద్యార్థిని శనివారం నాడు ఒంటిపైన కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకి పాల్పడింది. తాను చదువుతున్న విద్యాసంస్థకు చెందిన సిబ్బంది వేధింపులకు పాల్పడటంతో.. వాటిని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె స్నేహితురాళ్ళు చెబుతున్నారు. తీవ్రమైన కాలిన గాయాలకు గురైన సుభాషిణి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలు వదిలేసింది. కళాశాలలో రికార్డులు సమర్పించే విషయంలో ఆమెను కొంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు వేధించారని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. అధ్యాపకులు, సహ విద్యార్థుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు మరణించేముందు పోలీసులకు తెలిపినట్టు సమాచారం.

హీరోయిన్ రేప్ కేసు... మంత్రి కొడుక్కి బెయిల్...

  కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కొడుకు కార్తీక్ గౌడ తనను పెళ్ళాడతానని మాయమాటలు చెప్పి తనను రేప్ చేశాడని కన్నడ హీరోయిన్ మైత్రేయ కేసు పెట్టడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు కన్నడ సినిమా రంగంతోపాటు దేశ రాజకీయాలలో కూడా ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. కార్తీక్ గౌడ మీద బెంగుళూరు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసిన నేపథ్యంలో కార్తీక్ గౌడ స్థానిక సివిల్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇదిలా వుంటే, కార్తీక్ గౌడ మీద ఫిర్యాదు చేసిన హీరోయిన్ మైత్రేయని పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు. ఆమె చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు. మైత్రేయ పెట్టిన కేసు పుణ్యామా అని కార్తీక్ గౌడకు జరగాల్సిన నిశ్చితార్థం ఆగిపోయింది.

సినీ హీరో ఇంట్లో బాంబు బూచీ

  ప్రముఖ తమిళ కథానాయకుడు అజిత్ ఇంటికి శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శనివారం తెల్లవారుఝామున ఒక వ్యక్తి అజిత్ ఇంటికి ఫోన్ చేసి, ‘మీ ఇంట్లో బాంబు పెట్టాం. అది పేలబోతోంది’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దాంతో అజిత్ ఫిర్యాదు మేరకు బాంబుస్క్వాడ్ ఆయన ఇంటికి హుటాహుటిన చేరుకుని అణువణువూ గాలించింది. అయితే, ఎలాంటి బాంబు లేకపోవడంతో అది ఉత్తుత్తి కాల్ మాత్రమేనని తేలింది. ఈ బాంబు బెదిరింపు కాల్ చేసిందెవరో కనుగొనే ప్రయత్నంలో ప్రస్తుతం పోలీసులు వున్నారు. చెన్నైలో ఇప్పుడు ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్స్ సీజన్ నడుస్తున్నట్టు వుంది. శనివారం నాడే చెన్నై విమానాశ్రయానికి ఒక ఆకతాయి ఫోన్ చేసి బాంబు వుందని చెప్పాడు. బాంబు స్క్వాడ్ తనిఖీల తర్వాత అది ఫేక్ కాల్‌గా పోలీసులు తేల్చారు. ఫోన్ చేసిన ఆకతాయిని అరెస్టు చేశారు. చెన్నై విమానాశ్రయానికి, అజిత్ ఇంటికి ఫోన్ చేసింది ఒకరేనా కాదా అనేది తేలాల్సి వుంది.

అళగిరి మీద కబ్జా కేసు

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకె అధినేత కరుణానిధికి ఈ వయసులో ఆయన పెద్ద కుమారుడు అళగిరి పెద్ద తలనొప్పై కూర్చున్నాడు. పార్టీలో పెద్ద న్యూసెన్స్‌గా మారిన ఆయన ఈ మధ్య కరుణానిధి రెండో కుమారుడు స్టాలిన్ త్వరలో చనిపోతాడన్నట్టుగా కామెంట్లు చేశాడు. దాంతో కరుణానిధి మనసు కష్టపడి అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. తాజాగా అళగిరి మరో తలనొప్పిని తెచ్చిపెట్టాడు. మదురైలో అళగిరికి ఓ కాలేజీ వుంది. ఆ కాలేజీ పక్కన వున్న 44 సెంట్ల భూమిని ఆక్రమించేశాడు. దాంతో ఆ భూమి యజమానులు అళగిరి మీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అళగిరిని అరెస్టు కూడా చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే, అళగిరి మీద చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించినవేనని ఆయన సన్నిహితులు అంటున్నారు. అళగిరికి సెప్టెంబర్ 3వ తేదీ వరకు మద్రాస్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

చెన్నై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

  ఈమధ్యకాలంలో దేశంలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. తాజాగా చెన్నై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని, కొద్దిసేపట్లో అది పేలబోతోందని ఒక ఫోన్ కాల్ విమానాశ్రయ అధికారులకు వచ్చింది. దాంతో విమానాశ్రయ సిబ్బంది, బాంబు స్క్వాడ్ తనిఖీ సిబ్బంది విమానాశ్రయం మొత్తాన్నీ గాలించి వదిలిపెట్టారు. బాంబు స్క్వాడ్ హడావిడి చూసి ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. చివరికి అది ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్ అని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివర్లో ట్విస్ట్ ఏమిటంటే, బెదిరింపు కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు.

జపాన్ పర్యటనకు మోడీ

  భారత ప్రధాని నరేంద్రమోడీ జపాన్ పర్యటనకు బయల్దేరి వెళ్ళారు. మోడీ జపాన్‌లో నాలుగు రోజుల పాటు పర్యటిస్తారు. శనివారం నాడు మోడీ అధికారులు, పలువురు పారిశ్రామికవేత్తలో కూడిన బృందంతో జపాన్‌కి బయల్దేరి వెళ్ళారు. ఈ పర్యటనలో మోడీ వెంట ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్ జీ కూడా వున్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో జపాన్‌తో దౌత్య సంబంధాలను ఎంతమాత్రం పట్టించుకోకపోవడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ సంబంధాలను పునరుద్ధరించే ఉద్దేశంలో మోడీ వున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగనుంది. ఈ పర్యటలో భాగంగా రక్షణ, పౌర అణు రంగాల్లో ఒప్పందాలకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోడీ తన జపాన్ పర్యటనకు ముందు ట్విట్టర్‌లో ట్విట్ చేస్తూ జపానీస్ భాషను ఉపయోగించడం ఆ దేశంలో మోడీ మీద అభిమానం పెరగడానికి కారణమైంది. జపాన్‌లో మోడీకి ఘన స్వాగతం పలకడానికి సన్నాహాలు పూర్తయ్యాయి.

ఆంధ్రా అమ్మాయి... సింధు అదరగొట్టింది...

  అచ్చ తెలుగు ఆంధ్రా అమ్మాయి పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచే చెలరేగి ఆడిన సింధు.. మొదటి గేమ్‌ కోల్పోయినా ఆ తర్వాత పుంజుకుంది. వరుసగా రెండు గేమ్స్‌లు గెలిచి మ్యాచ్‌ను ముగించింది. గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన పివి సింధు, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు మెడల్స్‌ సాధించిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌‌షిప్‌లో సైనా నెహ్వాల్‌ పోరు ముగిసింది. మరోసారి పతకం గెలవకుండానే సైనా స్వస్థలానికి వెనుదిరిగింది.