హీరోయిన్ రేప్ కేసు: మంత్రి కొడుకు పరార్...

  కన్నడ హీరోయిన్ మైత్రేయ రేప్ కేసులో కేంద్ర మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ పరారీలో వున్నాడు. బెంగుళూరు పోలీసులు కార్తీక్ గౌడ మీద రేప్ కేసు నమోదు చేశారు. అయితే కార్తీక్ గౌడ పరారీలో వుండటంతో ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కార్గీక్ గౌడ వెంటనే లొంగిపోవాలని సోమవారం అల్టిమేటం జారీ చేశారు. ఈ బుధవారం లోగా లొంగిపోకపోతే వెతికి మరీ అరెస్ట్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. తనను ప్రేమ పేరుతో వంచించి మానభంగం చేశాడని కన్నడ హీరోయిన్ మైత్రేయ ఈమధ్య బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా వుండగా కోర్టు నుంచి బెయిల్ లభించిన తర్వాతే పోలీసులకు లొంగిపోవాలన్న ఉద్దేశంలో కార్తీక గౌడ వున్నట్టు సమాచారం. మొత్తమ్మీద ఈ వ్యవహారం కేంద్ర మంత్రి సదానంద గౌడకు జాతీయ స్థాయిలో తలవంపులు తెచ్చిపెట్టింది.

అరుణ్ జైట్లీకి అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స

  కేంద్ర మంత్రులను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మొన్నీమధ్య కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నారు. ఇప్పుడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. వెన్నునొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారని, ఆయన వెన్నుకు చిన్న ఆపరేషన్ చేయనున్నారని సమాచారం. బడ్జెట్ సమర్పించే సమయంలో కూడా అరుణ్ జైట్లీ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా కుర్చీలో కూర్చుని ఆయన కేంద్ర సాధారణ బడ్జెట్ను సమర్పించారు.

మోడీ 100 రోజుల పాలన: సోనియా ఆవేదన....

  యుపిఎ ప్రభుత్వం పదేళ్ళలో సాధించలేనిదాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం వంద రోజుల్లో సాధించేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెగ ఫీలైపోతున్నారు. మోడీ అధికారాన్ని చేపట్టి వందరోజుల మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా సోనియా దేశం ఎంతమాత్రం బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పదేళ్ళలో దారుణంగా పెంచేసిన ధరలను మోడీ ప్రభుత్వం వంద రోజుల్లో తగ్గించలేదని ఆమె ఆరోపిస్తున్నారు. బీజేపీకి మతంరంగు పులిమే ప్రయత్నాన్ని మానుకోని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతకల్లోలాలు పెరిగాయని అన్నారు. ఎక్కడ పెరిగాయో మాత్రం ఆమె చెప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన సోనియా గాంధీ, ఆ నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్, తాగునీటి సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదో ఆమె సమాధానం చెప్పకుండా ఇక్కడి సమస్యల పరిష్కారం విషయంలో యు.పి. ముఖ్యమంత్రి అఖిలేష్‌తో మాట్లాడతానని అన్నారు.

మెట్రోని పరిశీలించిన శ్రీధరన్

  ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థ రూపశిల్పి, ఢిల్లీ మెట్రో మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ‘మెట్రో మాన్’గా అందరూ పిలిచే శ్రీధరన్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మెట్రో సలహాదారుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం వున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లో జరుగుతున్న మెట్రోరైలు పనులను పరిశీలించారు. ఉప్పల్‌, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న మెట్రో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి.ఎస్.రెడ్డిని శ్రీధరన్ అభినందించారు. ఉప్పల్‌లో ట్రైల్ రన్‌లో వున్న మెట్రో రైలులో కూడా ఆయన ఎక్కి రైలు ప్రయాణిస్తున్న తీరును పరిశీలించారు. హైదరాబాద్ మెట్రో డైరెక్టర్ ఎన్.వి.ఎస్. రెడ్డి ఈ సందర్భంగా శ్రీధరన్‌కి హైదరాబాద్‌ మెట్రోకి సంబంధించిన అన్ని విషయాలనూ కూలంకషంగా వివరించారు.

విజయవాడ పరిసరాల్లోనే రాజధాని.. ఎల్లుండి బాబు ప్రకటన

  ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్న విషయంలో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇస్తారని, దీనికి సంబంధించి అసెంబ్లీలో ప్రకటన చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే, రాజధాని ప్రకటనకు సంబంధించిన పత్రాలు సిద్ధంకాకపోవడం, ఈరోజు అష్టమి, పైగా మంగళవారం అన్న పలు కారణాల నేపథ్యంలో ప్రకటనను ఎల్లుండికి వాయిదా వేశారు. విజయవాడ, గుంటూరు మధ్యలోనే ఏపీ రాజధాని ఉంటుందని ఏపీ కేబినెట్ భేటీలో సోమవారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడ కేంద్రంగా పలు కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు  అన్ని విభాగాల శాఖాధిపతులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో కార్యాలయాల ఏర్పాటుకు ఎంత మేర స్ధలం అవసరమవుతుంనే ప్రతిపాదనలు పంపాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించడానికి మంచిరోజు కోసం ఆగడం మంచిదేగా మరి...

ఏపీ రాజధాని నూజివీడు?

  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూజివీడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూమి అందుబాటు ,సేకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకోవచ్చని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే రాజధానిపై ప్రకటన ఆలస్యం చేస్తే, అనవసరంగా ఊహాగానాలు, ఆందోళనలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని కూడా మంత్రివర్గం అభిప్రాయపడింది. విజయవాడ,గుంటూరు నగరాలు కలిసి అభివృద్ది చెందేలా నిర్ణయం చేయాలని మొదట భావించినప్పటికీ భూముల సేకరణలో సమస్య వుంటుందన్న అభిప్రాయంతో ఇప్పుడు నూజివీడు మీద దృష్టిని కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.

శ్వేతా బసు: కొత్త వ్యభిచార లోకం...!

  ‘కొత్త బంగారు లోకం’ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించిన శ్వేతా బసు ప్రసాద్ తన మొదటి సినిమానే పెద్ద విజయం సాధించడంతో ఆమె సినిమా కెరీర్ ‘కొత్త బంగారు లోకం’లో అద్భుతంగా వుంటుందని అందరూ భావించారు. ఆ తర్వాత ఆమె తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినిమాలలో కూడా హీరోయిన్‌గా నటించింది. హీరోయిన్‌గా బిజీగా వున్న సమయంలో పారితోషికం కూడా బాగానే డిమాండ్ చేసేదని వినికిడి. ఆ తర్వాత ఆమెకు సరైన హిట్లు లేకపోవడం వల్ల అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో ఆమె తనకు ‘కొత్త బంగారు లోకం’ ఇచ్చిన హైదరాబాద్‌లోనే కొత్త వ్యభిరాచార లోకాన్ని సృష్టించుకుంది. హైదరాబాద్‌లోని రాజ్ భవన్ పక్కనే వున్న ఒక హోటల్‌లో శ్వేతా బసు ప్రసాద్ చాలాకాలంగా తన ‘దందా’ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా జనాల్లో తనకు గుర్తింపు, తన శరీరంలో తళుకు బెళుకులు వుండగానే నాలుగు డబ్బులు వెనుక వేసుకోవాలన్న ఉద్దేశంతో శ్వేతా బసు ప్రసాద్ తన వ్యభిచార వ్యాపారాన్ని చాలా ఉద్ధృతంగా నిర్వహించినట్టు తెలుస్తోంది.

రోడ్డు ప్రయాణమంటే నాకు సురక్షితం కాదు.. జగన్....

  జగన్ పెట్టుకున్న అనేకానేక పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఇప్పుడు తాజాగా మరో పిటిషన్‌ని కూడా సీబీఐ కోర్టు కొట్టేసింది. తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు బెంగుళూరుకు వెళ్ళడానికి అనుమతివ్వాల్సిందిగా ఆయన సీబీఐ కోర్టుకు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తాను ఎప్పుడు అనంతపురం జిల్లాకు రోడ్డు మార్గంలో వెళ్ళడం తనకు ఎంతమాత్రం సురక్షితం కాదని, అనంతపురం జిల్లాకు వెళ్ళాంటే బెంగుళూరుకు వెళ్ళి వెళ్ళడమే తనకు సురక్షితమని అందువల్ల తాను ఎప్పుడు బెంగుళూరు వెళ్ళాలని అనుకున్న వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. అయితే జగన్ పిటిషన్‌ని సీబీఐ కోర్టు కొట్టేసింది.

కేసీఆర్‌ - తలసాని ఏకాంత చర్చలు

  తెలంగాణ తెలుగుదేశం పార్టీ సనత్ నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు. దాదాపు గంటసేపు వీరిరువురు చర్చలు జరిపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఏకాంత సమావేశానికి ప్రాధాన్యత లభించింది. అయితే తలసాని వర్గీయులు మాత్రం మెట్రో రైలు కారణంగా ఆస్తులు కోల్పోతున్న వారికి న్యాయం జరగాలని కోరుతూ మాత్రమే తలసాని కేసీఆర్‌తో సమావేశమయ్యారని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆస్తికోసం తమ్ముణ్ణే చంపేశాడు...

  డబ్బు ఎంత దుర్మార్గాన్నయినా చేయిస్తుంది. ఆస్తి ఏ అనుబంధాన్నయినా తెంచుకోవడానికి పురిగొల్పుతుంది. అలాంటి పాపిష్టి డబ్బు, ఆస్తి ఒక వ్యక్తిని రక్తసంబంధాన్నే మరచిపోయి రక్తాన్ని చిందించాడు. సొంత తమ్ముడి ప్రాణాన్నే హరించాడు. కాన్పూర్ సమీపంలోని బిల్హౌర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వినీత్ కుమార్ (40) అనే వ్యక్తికి, అతడి తమ్ముడు సునీల్కు ఆస్తి విషయంలో ఆదివారం నాడు గొడవ జరిగింది. దాంతో తర్వాత కొద్ది సేపటికి బాగా తాగి ఉన్న సునీల్ను వినీత్ గట్టిగా తోసి, తలను గోడకేసి కొట్టాడు. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. సోదరులిద్దరికి కలిపి దాదాపు మూడు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాన్ని ఇప్పటికే పంపకాలు కూడా జరిగాయి. అయితే తాగుబోతు అయిన సునీల్ ఆస్తిని కూడా తానే కాజేయాలని వినీత్ పథకాలు వేసేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరికి సునీల్ ప్రాణాలు పోయాయి. తమ్ముణ్ణి చంపిన వినీత్ మృతదేహాన్ని తన స్నేహితుల సాయంతో ఒక కాలువలో విసిరేసి వచ్చాడు. అయితే పోలీసులు జరిపిన విచారణలో వినీత్ దోషి అని తేలింది.

శ్వేతా బసు: దొరికిపోయినా బుకాయించింది...

  హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఆదివారం నాడు ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ పునరావాస కేంద్రంలో వుంది. ఇదిలా వుంటే, శ్వేతా బసు ప్రసాద్ ఇలాంటి వ్యవహారాల్లో వుందన్న విషయం బయటపడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో శ్వేతా బసు ప్రసాద్ మీద ఒక ఛానెల్ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ పక్కన వున్న ఒక హోటల్లో మకాం వేసి వ్యభిచార కేంద్రాన్ని తెరిచిన శ్వేతా బసు ఒక బ్రోకర్‌తో విటులను తెమ్మని చెబుతూ వీడియోలో దొరికిపోయింది. ఆ వీడియోలో శ్వేతా బసు ప్రసాద్ పక్కా ప్రొఫెషనల్‌గా మాట్లాడింది. మూడు గంటలకు తనకు మూడు లక్షల రూపాయలు ఇస్తే బ్రోకర్‌కి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పింది. లక్ష రూపాయలంటే మామూలు విషయం కాదు ఆలోచించుకోమని బ్రోకర్ని ప్రోత్సహిస్తూ మాట్లాడింది. అలాగే మామూలు వాళ్ళ దగ్గర అయితే మూడు లక్షలట. అదే రాజకీయ నాయకులకయితే ఆరు లక్షలట. ఎందుకంటే రాజకీయ నాయకుల దగ్గర డబ్బు బాగా వుంటుందట. రాజకీయ నాయకులను తీసుకొస్తే బ్రోకర్‌కి రెండు లక్షలు ఇస్తుందట. ఈ వీడియో బయటపడినప్పుడు అందరూ నోళ్ళు నొక్కుకున్నారు. అయితే శ్వేతా బసు ప్రసాద్ మాత్రం దొరికిపోయినా ఎంతమాత్రం బెదిరిపోలేదు. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని బుకాయించింది. తనను బద్నాం చేయడానికే ఇలాంటి వీడియో ‘క్రియేట్’ చేశారని చెప్పింది.

శ్వేతాబసు వ్యభిచారం... ఇప్పుడు కొత్తేమీ కాదు..

  ‘కొత్త బంగారు లోకం’, ‘రైడ్’ వంటి హిట్ చిత్రాలలో నటించిన శ్వేతా బసు ప్రసాద్ హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచరిస్తూ దొరికిపోయిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తెలుగు సినిమాల్లో ముద్దుముద్దుగా వుండే ముగ్ధ పాత్రల్లో కనిపించిన శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం చేస్తూ దొరికిపోయిందన్న వార్త చదివి అనేకమంది విస్తుపోతున్నారు. అయితే శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారాన్ని వృత్తిగా తీసుకుందన్న విషయం ఇప్పుడు కొత్తగా ఏమీ బయటపడలేదు. శ్వేతా బసు ప్రసాద్ స్టార్ హోటల్స్‌లో వ్యభిచారానికి రెడీ అంటుందన్న విషయం, దానికోసం మీడియేటర్లను నియమించుకుందన్న విషయం గతంలోనే బయటపడింది. ఆమధ్య శ్వేతా బసు ప్రసాద్ తాను వ్యభిచారం చేయడానికి రెడీగా వున్నానని, బాగా డబ్బున్న పార్టీలను తీసుకొచ్చి నువ్వు కమీషన్ తీసుకో అంటూ తనకు మీడియేటర్‌గా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తికి చెబుతున్న వీడియో గతంలో ఒకసారి బయటపడింది. ఆ వీడియో బయటపడినప్పటి నుంచి పోలీసులు ఆమె కదలికల మీద నిఘా పెట్టి ఇప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ నటుడు బొమన్ ఇరానీకి బెదిరింపులు

  ప్రముఖ బాలీవుడ్ నటుడు, ‘అత్తారింటికి దారేది’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బొమన్ ఇరానీకి మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబై అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి బొమన్ ఇరానీకి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో బొమన్ ఇరానీ పోలీసులను ఆశ్రయించారు. మాఫియా బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. ఈమధ్యకాలంలో బాలీవుడ్ నటీనటులకు ముంబై మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇటీవలే షారుఖ్ ఖాన్‌కి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ముంబై మాఫియా బొమన్ ఇరానీని టార్గెట్ చేసింది.

శ్వేత బసు ప్రసాద్ కేసు... ఆ పారిశ్రామికవేత్త ఎవరు?

  ప్రముఖ సినీ కథానాయిక శ్వేత బసు ప్రసాద్ ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్లో వ్యభిచరిస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. శ్వేత బసు ప్రసాద్ ఒక బడా పారిశ్రామికవేత్తతో వ్యభిచరిస్తూ వుండగా పోలీసులు పట్టుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే సోమవారం నాడు పోలీసులు శ్వేత బసు ప్రసాద్‌ని, ఆమెకు మీడియేటర్‌గా వ్యవహరించిన వ్యక్తిని మాత్రమే కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు మీడియేటర్‌ని చర్లపల్లి జైలుకు రిమాండ్‌కి తరలించింది. అలాగే శ్వేత బసు ప్రసాద్‌ని ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే శ్వేతా బసు ప్రసాద్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సమయంలో ఆమెతో వున్న బడా పారిశ్రామికవేత్త గురించి మాత్రం పోలీసులు ఎలాంటి సమాచారాన్నీ వెల్లడించడం లేదు. ఈ ఇద్దర్ని మినహా మరెవరినీ కోర్టు ముందు హాజరు పరచలేదు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే సదరు విటుడిని కేసు నుంచి తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్వేత బసు ప్రసాద్ వ్యభిచారం చేసింది నిజమే అయినట్టయితే, పోలీసులు ఎవరితో వ్యభిచారం చేసిందో బయటపెట్టాలి కదా? శ్వేత బసు ప్రసాద్‌ని రోడ్డు మీదకి ఈడ్చిన పోలీసులు ఆ పారిశ్రామికవేత్తని మాత్రం వదిలేయడంలో గల ఆంతర్యమేమిటి? ఈ విషయంలో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

  అమెరికాలోని పనామాలో ఆంధ్రప్రదేశ్‌‌కి చెందిన ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ప్రకాశం జిల్లాలోని కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన సాయికృష్ణ ఉన్నత చదువుల కోసం అమెరికాలోని హ్యూస్టన్ యూనివర్సిటీలో చేరాడు. ఆదివారం నాడు సాయికృష్ణ మృతదేహాన్ని పనామాలోని ఒక స్విమ్మింగ్ పూల్‌లో పోలీసులు కనుగొన్నారు. హ్యూస్టన్ నుంచి పనామాకు సాయికృష్ణ విహార యాత్రకు వెళ్ళిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. సాయికృష్ణ మరణం ఎలా సంభవించిందనే అంశం మీద ఇంతవరకు స్పష్టత లేదు. అక్కడి పోలీసులు దీనిని అనుమానాస్పద మరణంగా విచారణ జరుపుతున్నారు.