మెదక్‌లో బీజేపీ విజయం ఖాయం: జగ్గారెడ్డి

  మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థికి తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. బుధవారం బీజేపీలో చేరిన ఆయనను మెదక్‌ పార్లమెంటు అభ్యర్థిగా పార్టీ బరిలోకి దింపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ మెదక్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో చేరడం తనకు సొంత ఇంటికి వచ్చిన అనుభూతిని కలిగిస్తోందని అంటూ తాను మొదట బీజేపీ కార్యకర్తనే అని జగ్గారెడ్డి గుర్తుచేశారు. టీఆర్ఎస్‌కి ప్రజల మీద కంటే ఉప ఎన్నికల మీదే ప్రేమ ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు. మెదక్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి జిల్లాకు భారీగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు.

కడుపులో అస్థిపంజరం (ఫొటో)

  కొద్ది రోజుల క్రితం నాగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కాంతాబాయ్ అనే 60 ఏళ్ళ మహిళ కడుపులో వైద్యులు ఒక అస్థిపంజరాన్ని గుర్తించారు. కడుపు నొప్పిగా వుందంటూ ఆస్పత్రికి వచ్చిన ఆమె కడుపును స్కాన్ చేసిన డాక్టర్లు లోపల చిన్న అస్థిపంజరం వుండటం గమనించి షాకయ్యారు. ఆ అస్థిపంజరం ఆమె కడుపులో 36 సంవత్సరాలుగా వుందని గ్రహించారు. 24 ఏళ్ళ వయసులో గర్భందాల్చిన ఆమెకు గర్భాశయం వెలుపల పిండం ఎదగడంతో అబార్షన్ జరిగింది. అయితే పిండం అవశేషాలను బయటకి తీయించుకోవడానికి భయపడింది. ఆ తర్వాత అంతా సర్దుకున్నట్టు అనిపించడంతో ఊరుకుంది. ఇన్నేళ్ళ తర్వాత కడుపులో నొప్పిగా వుందని ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటే అసలు విషయం బయటపడింది. ఆమె కడుపులోనే వుండిపోయిన పిండం కాలక్రమేణంగా నశించిపోయి చివరకు అస్థిపంజరంగా మిగిలింది. ఆమెకు ఆపరేషన్ చేసి అస్థిపంజరాన్ని బయటకి తీశారు. తాజాగా ఆ అస్థిపంజరం ఫొటోని మీడియాకి విడుదల చేశారు.

మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి

  మెదక్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) ఎంపిక అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా వున్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈనేపథ్యంలో ఆయన బుధవారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగ్గారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ నేతలు కూడా హాజరు కానున్నారు. గతంలో ఆయన బీజేపీలో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను మొదటి నుంచి బీజేపీ వ్యక్తినేనని, ఏబీవీపీ నుంచే క్రియాశీలక కార్యకర్తగా పనిచేసినట్లు తెలిపారు.

నేర చరితులకు పదవులపై సుప్రీం వ్యాఖ్యలు...

  నేర చరితులకు మంత్రి మండలిలోకి తీసుకోవడం అనే అంశాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలివేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే నేర చరితులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్నే తాను సమర్థిస్తానని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే, క్రిమినల్ కేసులున్న మంత్రలను ఆ పదవులకు అనర్హులుగా ప్రకటించాలనంటూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలాగే అలాంటి మంత్రులపై అనర్హత వేటు వేయడానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది. నేరచరితులు కేంద్రంలో, రాష్ట్రాలలో మంత్రులుగా వుండటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ జరిపి తీర్పునిచ్చింది.

ప్రియుడితో కలసి భర్తని చంపేసింది

  మానవసంబంధాలు మంట కలసిపోయాయి. ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసే సంఘటనలు సమాజంలో అడపాదడపా జరుగుతూనే వున్నాయి. కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని అడవిరావులపాడు గ్రామంలో అలాంటి సంఘటన మరోటి జరిగింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని ఒక మహిళ ప్రియుడితో కలసి భర్తని చంపేసింది. మార్కపూడి ఆశీర్వాదం (30)కి ఆరేళ్ల క్రితం చందర్లపాడు మండలం తుర్లపాడుకు చెందిన వేల్పుల ప్రమీలతో వివాహం జరిగింది. వీరికి మహేశ్వరి (5), సిరిమల్లి (2) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంత కాలంగా ప్రమీల అదే గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసి ఆశీర్వాదం ఆమెను మందలించాడు. ఆశీర్వాదం బతికి ఉంటే తమకు అడ్డుగా ఉంటాడని భావించిన ప్రమీల, వినోద్‌లు సోమవారం అర్థరాత్రి ఊపిరి ఆడకుండా చేసి ఆశీర్వాదాన్ని దారుణంగా హత్య చేశారు. పోలీసులు ప్రమీలను, వినోద్‌ని అదుపులోకి తీసుకున్నారు.

బెల్లంకొండ ఇంటిముందు మంచులక్ష్మి మనుషుల ‘రభస’

  వెరైటీ సంఘటనలకు నిలయమైన సినిమా ఇండస్ట్రీలో మరో వెరైటీ సంఘటన జరిగింది. నటుడు, నిర్మాత మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మికి చెందిన మనుషులుగా పేర్కొంటున్నవారు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇంటిముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం రాత్రి 9 గంటలకు ‘మంచు లక్ష్మి మనుషులు’ ఆందోళన చేశారు. ఇలా ఆందోళన చేయడం వెనుక వున్న కారణాలను పరిశీలిస్తే, మంచు లక్ష్మి నిర్మించిన ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ సినిమా సెట్‌ని బెల్లంకొండ సురేష్ తాను నిర్మిస్తున్న ‘రభస’ షూటింగ్ కోసం అద్దెకి తీసుకున్నారు. దీనికోసం 58 లక్షల రూపాయలు ఇస్తానని మంచు లక్ష్మితో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సదరు సెట్‌లో ‘రభస’ షూటింగ్ పూర్తి చేసిన అనంతరం మంచు లక్ష్మికి ఇవ్వాల్సిన డబ్బు బెల్లంకొండ సురేష్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ‘రభస’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా విడుదలైన తర్వాత డబ్బుల గురించి అడిగినా ఉపయోగం వుండదన్న ఉద్దేశంతో మంచు లక్ష్మి మనుషులు మంగళవారం నాడు బెల్లంకొండ ఇంటిముందు ‘రభస’ చేశారు. దీంతో ఫిలింనగర్‌లోని సురేశ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి

  టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాజీనామాతో ఉప ఎన్నిక జరుగనున్న మెదక్‌ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. పార్టీ నాయకులతో తీవ్రంగా చర్చించిన తర్వాత తర్వాత ప్రభాకర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ ప్రకటించింది. బుధవారం ఉదయం మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో కొత్త ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఉద్యోగ సంఘం నాయకుడు దేవీప్రసాద్‌తోపాటు కె.భూపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పరిశీలనకు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రభాకర్‌రెడ్డివైపే మొగ్గు చూపారు.దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి గత ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే పోటీ చేయాలని భావించినా టికెట్ దక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఎంపీ టిక్కెట్ దక్కించుకోవడం విశేషం. సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక జరగనుంది. ఉద్యమ సమయంలో ప్రభాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచారు.

వినాయకుడికి 259 కోట్ల ఇన్సూరెన్స్

  మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై నగరంలో వినాయకచవితిని అద్భుతంగా చేస్తారు. స్వాతంత్ర్యం నా జన్మహక్కు అని నినదించిన బాల గంగాధర తిలక్ ముంబైలో వినాయకచవితి వేడుకలను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ముంబైలో వినాయక వైభవం పెరుగుతూనే వచ్చింది. హైదరాబాద్‌లో కూడా ముంబై స్ఫూర్తితోనే వినాయకచవితి వేడుకలను నిర్వహిస్తారు. తాజాగా ముంబైలోని బీఎస్‌బీ సేవా మండల్ ఏర్పాటు చేసిన వినాయక మంటపం సంచలనం సృష్టిస్తోంది. వినాయకచవితి తర్వాత ఐదు రోజులపాటు ఈ మంటపంలో వినాయకుడిని వుంచుతారు. ఈ మంటపాన్ని, మంటపంలో వినాయకుడిని ఇన్సూర్ చేయడం విశేషం. అది కూడా మొత్తం 259 కోట్ల రూపాయలకు ఇన్సూర్ చేశారు. ఇక్కడి వినాయకుడి విగ్రహంలో మొత్తం 22 కోట్ల రూపాయల విలువైన బంగారం వుంటుందట. వినాయకుడి విగ్రహానికి, ఆ విగ్రహం మీద వున్న బంగారానికి, మంటపానికి, భక్తులకు కలిపి బీమా చేశారు. దొంగతనం, అగ్నిప్రమాదం, ఉగ్రవాద దాడులు, మతకల్లోలాలు.. ఇలా ఏం జరిగినా బీమా కంపెనీ బీమా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఉత్సవాలు మొదలైన తొలిరోజు నుంచి బీమా కవరేజి మొదలవుతుంది. చిట్టచివరి రోజున ట్రస్టీలు విగ్రహానికి అలంకరించిన ఆభరణాలను మళ్లీ బ్యాంకు లాకర్లో భద్రపరిచేవరకు కవరేజి కొనసాగుతుంది. ఆ తర్వాతే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తారు.

రజనీకాంత్‌కి గాలం వేయలేదు.. బీజేపీ..

  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి తమ పార్టీ ముఖ్యమంత్రి సీటును ఆఫర్ చేస్తూ గాలం వేసిందని వచ్చిన వార్తలను భారతీయ జనతాపార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళసలై సౌందరరాజన్ ఖండించారు. రజనీకాంత్‌ని తమ పార్టీ ఆహ్వానించలేదని, అయితే రజనీకాంత్ తమ పార్టీలోకి వస్తే మాత్రం సాదరంగా ఆహ్వానిస్తామని ఆమె అన్నారు. రజనీకాంత్‌ని తమ పార్టీలో చేర్చుకోవడానికి పార్టీ నాయకత్వం సానుకూలంగా వుందని ఆమె అంటూ, ఎన్నికల సందర్భంగా రజనీకాంత్‌ని నరేంద్రమోడీ కలవటాన్ని గుర్తుచేశారు. గతంలో కూడా ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నదులను అనుసంధానం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు రజనీకాంత్ కోటి రూపాయల విరాళం ఇచ్చిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేశారు.

నందిగామ కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావు

  ఆంధ్రప్రదేశ్‌లో... అది కూడా నందిగామలో పోటీ చేస్తే బాబూ.. డిపాజిట్లు కూడా రావు.. అని ఎవరు ఎంతగా చెప్పినా వినకుండా కాంగ్రెస్ పార్టీ అక్కడ తమ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం అక్కడ తంగిరాల కుమార్తె తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమెకు సానుభూతిగా వేరే పార్టీలేవీ పోటీ చేయకుండా ఉండాలని, ఏకగ్రీవంగా ఆమెను ఎన్నిక చేయాలని తెలుగుదేశం పార్టీ కోరింది. అయితే జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వినడం లేదు. ఈసారి నందిగామ స్థానం నుంచి ఏపీసీసీ కార్యదర్శి బోడపాటి బాబూరావుతో పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఓడిపోతామని తెలిసినా పోటీ చేయడం అంటే ఇదే.

17 సార్లు కట్ చేశారు.. జగన్ ఆక్రోశం...

  జగన్ ఆవేదన చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు.. ఆయన ఆక్రోశం వినడానికి రెండు చెవులూ సరిపోవడం లేదు. అసెంబ్లీలో తాను మాట్లాడుతుంటే 17సార్లు మైక్ కట్ చేశారని ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీని విజయవంతంగా వాయిదా ‘వేయించిన’ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రజల పక్షాన మాట్లడుతుంటే అధికార పార్టీ అడ్డుపడిపోతోందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు చాలా అన్యాయ భరితంగా జరిగాయని ఆయన ఆరోపించారు. వాకౌట్ చేస్తానన్నా తనకు మైకు ఇవ్వలేదని వాపోయారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించకపోయినప్పటికీ తన మైక్‌ని 17 సార్లు కట్ చేశారని జగన్ చెప్పారు. అధికారపక్షం ఎంత సేపు మాట్లాడినా కాదనట్లేదని.. వారు వై.ఎస్.రాజశేఖరరెడ్డిని దూషిస్తున్నారని జగన్ విచారం వ్యక్తం చేశారు.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ అమిత్ షా

  భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్‌గా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ బోర్డు నుంచి పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోసీలను తొలగించారు. మార్గదర్శక మండలి అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ విభాగంలో పార్టీ మార్గదర్శకులుగా వారిద్దరినీ నియమించారు. భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా నరేంద్రమోడీ, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, అనంత్ కుమార్, తావర్ చంద్ గెహ్లాట్, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవహరిస్తారు.

వదోదర నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్టా

  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి, రాజీనామా చేసిన వడోదర స్థానం నుంచి బీజేపీ తమ అభ్యర్దిగా రంజన్‌బెన్ భట్టా పేరును ఖరారు చేసింది. గత ఎన్నికల సందర్భంగా వారణాసి, వడోదర లోక్ సభ స్థానాల నుంచి నుండి గెలిచిన నరేంద్ర మోడీ వారణాసి స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతూ, వదోదర స్థానం నుంచి రాజీనామా చేయడంతో వడోదర స్థానానికి సెప్టెంబర్ 13వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. వడోదర స్దానానికి బీజేపీ అభ్యర్దిగా హైకమాండా తన పేరుని ప్రకటించడంతో రంజన్‌బెన్ భట్టా హర్షం వ్యక్తం చేశాడు. వడోదర మున్సిపల్ కార్పోరేషన్‌కి జూన్‌లో డిప్యూటీ మేయర్‌గా రంజన్‌బెన్ భట్టా నియమితులయ్యారు. వడోదర మున్సిపాలిటీలో నాలుగుసార్లు కార్పోరేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ధోనీ.. పని చూసుకోమ్మా...

  భారత క్రికెట్ జట్టు కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆటేదో తాను ఆదుకోకుండా క్రికెట్ రాజకీయాల్లో కూడా వేలుపెడుతున్నాడు. బీసీసీఐ వ్యతిరేకిస్తున్న కోచ్ డంకన్ ఫ్లెచర్‌కి మద్దతుగా మాట్లాడుతున్నాడు. దాంతో బీసీసీఐకి ఆగ్రహం వచ్చింది. డంకన్ ఫ్లెచర్ మంచి కోచ్ అంటూ ధోనీ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ కొట్టిపారేసింది. అది ధోనీ వ్యక్తిగత అభిప్రాయమంటూ తీసిపారేసింది. ధోనీ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా తన ఆట తీరును మెరుగుపరచుకునే విషయం మీద దృష్టిపెడితే మంచిదని సూచించింది. విదేశాల్లో భారత జట్టు వైఫల్యాలకు ధోనీ బాధ్యత వహించాలని ఎంతోమంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేసినా బోర్డు నోరు మెదపలేదు. కానీ, డంక్ ఫ్లెచర్‌కు మద్దతుగా ధోనీ ఒక్క వ్యాఖ్య చేయడంతో బీసీసీఐ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధోనీని మందలించడం గమనార్హం.

లాలూప్రసాద్ యాదవ్‌కి హార్ట్ సర్జరీ...

  రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కి త్వరలో గుండె ఆపరేషన్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యుడు విజయ్ డిసిల్వా తెలిపారు. ప్రాథమిక చికిత్స నివేదికల ఆధారంగా లాలూ హార్ట్ సర్జరీ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఎలాంటి సర్జరీ నిర్వహించేది మరికొన్ని నివేదికల ఆధారంగా వెల్లడవుతుందని తెలిపారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంగానే ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ గుండెకు ఆపరేషన్ చేయడం తప్పనిసరి కావడం వల్లే ఆపరేషన్ చేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.

షీలా దీక్షిత్ రాజీనామా

  కేరళ గవర్నర్ పదవి నుంచి వైదొలగడానికి బెట్టు చేస్తూ వస్తున్న షీలాదీక్షిత్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. షీలా దీక్షిత్ సోమవారం నాడు ఢిల్లీకి వచ్చి మొదట కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఎన్డీయే ప్రభుత్వం ఆమెని పదవి నుంచి వైదొలగాల్సిందిగా మౌఖికంగా ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె హోం మంత్రిని, రాష్ట్రపతిని కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. షీలా దీక్షిత్ ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏమిటా అన్న ఆలోచనలో రాజకీయ వర్గాలు పడ్డాయి. తన పదవిని కాపాడుకోవడానికి నానారకాల ప్రయత్నాలు చేసిన షీలాదీక్షిత్ చివరికి తన పదవికి రాజీనామా చేశారు.

చిరుతను ఎదుర్కొని చంపిన మహిళ

  ఒంటరిగా వున్న వారి మీద చిరుత దాడి చేస్తే పరిస్థితి ఎలా వుంటుంది. అలాంటి సమయంలో ఎంతటి వీరాధి వీరులైనా చేతులెత్తేసి ఇష్టదైవాన్ని తలచుకోవడం మినహా చేసేది ఏమీ వుండదు. ఒక వేళ చిరుత నుంచి పారిపోదామని పరిగెత్తినా, చెట్టెక్కినా కూడా ప్రయోజనం వుండదు. కానీ, ఇలాంటి పరిస్థితే ఓ 56 ఏళ్ళ మహిళకి ఎదురైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లా కోడి బోడ్నా గ్రామానికి చెందిన కమలాదేవి అనే మహిళ గొడ్డలి, కొడవలి తీసుకుని వ్యవసాయ పనులకు వెళ్ళింది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై వున్న ఆమె మీద చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసింది. అయితే కమలాదేవి ఎంతమాత్రం భయపడకుండా ఆ చిరుత పులి మీద ఎదురుదాడి చేసింది. తన దగ్గర వున్న కొడవలి, గొడ్డలి సాయంతోనే చిరుతపులిని ఎదుర్కొంది. ఆ చిరుత పులికి, ఆమెకి మధ్య దాదాపు 30 నిమిషాలపాటు పోరాటం జరిగింది. ఈ పోరులో కమలాదేవి తీవ్రంగా గాయపడినప్పటికీ చిరుతపులిని చంపేసింది.