శంకర్రావు కామెంట్‌కి సెల్యూట్...

  తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శంకర్రావు ఎప్పుడూ విచిత్రమైన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వుంటారు. కానీ తాజాగా ఆయన సెల్యూట్ చేయాల్సినంత స్థాయిలో ఒక మాట అన్నారు. దీని నేపథ్యం ఏమిటంటే, కొంతమంది తెలంగాణ నాయకులకు ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలను చూస్తే కడుపులో మండుతూ వుంటుంది. తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా ఈ బాపతుకు చెందిన వ్యక్తే. ఆయన ఆదివారం నాడు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ట్యాంక్ బండ్ మీద వున్న ఆంధ్రుల విగ్రహాలను తొలగించి వాటి స్థానంలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ప్రతిష్టిస్తామని ప్రకటించారు. దీని మీద శంకర్రావు స్పందించారు. ‘‘ట్యాంక్ బండ్ మీద వున్న విగ్రహాలు ఆంధ్రులవి కావు.. తెలుగువారివి. అధికారంలో వున్నవారు ప్రజల మధ్య విద్వేషాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగువారి గౌరవానికి నిదర్శనంగా మహనీయుల విగ్రహాలను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. వాటిని తొలగిస్తామనడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అన్నారు.

జపాన్‌లో మోడీ విస్తృత పర్యటన...

  భారత ప్రధాని నరేంద్ర మోడీ తన జపాన్ పర్యటనలో భాగంగా మూడో రోజు అక్కడి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ ఆర్థికగతిని మార్చిన పారిశ్రామికవేత్తల మధ్య ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. విశ్వమానవ కళ్యాణానికి జపాన్ అందించిన సాయం ఎనలేనిదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరిశోధన రంగంలో జపాన్ తో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం, పెట్టుబడిదారుల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా జపాన్ పారిశ్రామివేత్తలతో కలిసిన పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. తమ దేశంలో జపాన్ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే మోడీ జపాన్‌లోని 136 సంవత్సరాల క్రితం స్థాపించిన ఓ పురాత స్కూల్‌ని సందర్శించి, అక్కడి టీచర్లు, విద్యార్థులతో మాట్లాడారు.

కోర్టుకు శ్వేతాబసు ప్రసాద్

  వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన సినీ హీరోయిన్ శ్వతాబసు ప్రసాద్ను పోలీసులు సోమవారం ఎర్రమంజిల్ కోర్టుకు తీసుకొచ్చారు. హైదరాబాద్ నగరంలోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ శ్వేతాబసు ప్రసాద్ ఆదివారం పోలీసులకు పట్టుబడ్డారు. మీడియేటర్‌గా వ్యవహరించిన బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరినీ పోలీసులు సోమవారం ఉదయం ఎర్రమంజిల్ కోర్టులో హాజరు పరిచారు. కాగా నటి శ్వేతబసు ప్రసాద్ను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అలాగే బాలును చర్లపల్లి జైలుకు తరలించారు.

గోదావరి తీరంలో బాపు-రమణ విగ్రహాలు

  బాపు, ముళ్లపూడి రమణల విగ్రహాలను గోదావరి తీరంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా, చిత్ర దర్శకుడిగా చెరగని ముద్రవేసిన బాపు స్మృతికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఘనంగా నివాళులు అర్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సభలో బాపు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బాపు మృతి తెలుగు సినిమాకు తీరని లోటు అని చంద్రబాబు అన్నారు. తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని చూపించిన ఘనత బాపుదని అన్నారు. పలువురు శాసనసభ్యులు బాపు గొప్పతనం గురించి శాసనసభలో మాట్లాడి, ఆయనకు నివాళులు అర్పించారు. బాపు రమణల విగ్రహాలను గోదావరి తీరంలో పక్కపక్కనే ఏర్పాటు చేయడంతోపాటు, వారిద్దరి పేరిట ఆంధ్రప్రదేశ్‌లో ఒక గొప్ప కళాక్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామని చంద్రబాబు ప్రకటించారు.

ట్రైనీ ఐపీఎస్‌ని చంపేశారా?

  హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో మూడు రోజుల క్రితం ట్రైనీ ఐపీఎస్ మను ముక్త్ మానవ్ మరణించిన విషయం తెలిసిందే. మొదట మానవ్‌ ఈత కొడుతూ గాయాలు కావడం వల్ల మరణించాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత విపరీతంగా తాగి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోవడం వల్ల మరణించాడని వార్తలు వచ్చాయి. మానవ్ మృతి విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. తాజగా ట్రైనీ ఐపీఎస్ మను ముక్త్ మానవ్‌ని చంపేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. మను ముక్త్ మానవ్ తండ్రి రామ్ నివాస్ మానవ్ తన కుమారుడిని ఎవరో చంపేశారని ఆరోపిస్తున్నారు. తన కుమారుడి మ‌ృతి మీద సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మంచి ఈతగాడైన తన కొడుకు స్విమ్మింగ్ లో పడి మృతి చెందారనడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పంజాబ్ యూనివర్సిటీలో చదవి రోజుల్లో మనోముత్తు స్విమ్మింగ్ క్లబ్ సభ్యుడని తెలిపారు. అలాంటి వాడు స్విమ్మింగ్ ఫూల్ లో పడి ఎలా చనిపోతాడని ఆయన ప్రశ్నించారు. అలాగే మానవ్ మద్యం మత్తులో నీటిలో మునిగిపోయి చనిపోయాడన్న వార్తలను కూడా ఆయన ఖండించారు. మానవ్‌కి ఎలాంటి దురలవాట్లూ లేవని ఆయన స్పష్టం చేశారు.

బంజారాహిల్స్‌లో సినీనటి వ్యభిచారం.. అరెస్ట్...

  ప్రముఖ సినీ నటీమణులు వ్యభిచారం కేసులో అరెస్టు కావడం ఈమధ్యకాలంలో తరచుగా జరుగుతోంది. ఆమెధ్య ఓ బెంగాలీ నటి హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. ఇప్పుడు తాజాగా కోల్‌కతాకు చెందిన ఓ సినీనటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. కోల్‌కతాకు చెందిన ఈ సినీ నటి పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ హోటల్‌ మీద దాడి చేశారు. ఈ దాడిలో ఓ గదిలో ప్రముఖ సినీనటితోపాటు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త దొరికిపోయారు. సినీనటిని పోలీసులు అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించినట్టు తెలుస్తోంది. పారిశ్రామికవేత్తకు, సినీనటికి మధ్య బ్రోకర్‌గా వ్యవహరించిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బ్రోకర్‌కి కమిషన్‌గా లక్ష రూపాయలు ముట్టాయట. ‘కొత్త బంగారు లోకం’ లాంటి సినిమా పరిశ్రమలో ‘శ్వేత’ పావురాల్లా వుండాల్సిన సినిమా నటీమణులు ఇలా డబ్బు కోసం వ్యభిచారిణులుగా మారిపోవడం దురదృష్టం.

కామ్రేడ్స్‌తో దోస్తీకి రెడీ: మమత

  ఉత్తర ప్రదేశ్‌ ఉప ఎన్నికలలో లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, కాంగ్రెస్ దోస్తీ వర్కవుట్ కావడంతో ఇదే మార్గంలో వెళ్తే మంచిదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావిస్తున్నట్టున్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాను అడ్డుకునేందుకు వెస్ట్ బెంగాల్‌‍లో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లోనూ.. ప్రజాస్వామ్యంలోనూ ఎవరూ అంటరానివారు కాదనీ, సీపీఎంతో పొత్తుకు తాము కూడా వ్యతిరేకం కాదని అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాము అన్ని తలుపులు తెరిచి ఉంచుకుంటామని, అవకాశం వచ్చినప్పుడు పొత్తు పెట్టుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అయితే, వామపక్ష పార్టీల నేతలు మాత్రం ఈ ప్రతిపాదనను నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు.

అమితాబ్‌కి అనారోగ్యం.. షూటింగ్స్ కేన్సిల్

  సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఆయన అనారోగ్యానికి గురి కావడంతో ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్‌లు రద్దయ్యాయి. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అమితాబ్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం వుందని వైద్యులు సూచించారు. ప్రస్తుతం అమితాబ్ ‘పీకూ’, ‘షమితాబ్’ చిత్రాలు, కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో బిజీగా ఉన్నారు. తాను జ్వరంతో బాధపడుతున్నానని శనివారం అమితాబ్ ట్వీట్ చేశారు. ఇంకా జ్వరంతోనే బాధపడుతున్నాను.. షూటింగ్ రద్దు అవ్వడం బాధగా ఉంది అని ఆదివారం మరో ట్వీట్ చేశారు. ఇదిలా వుంటే శనివారం నాడు అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్‌తో కలసి ముంబైలోని లాల్ బగ్‌చా వినాయక మందిరాన్ని సందర్శించారు.

జపాన్‌లో బాపు కుమారుడు

  ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపు కన్నుమూశారు. బాపు మరణం ప్రతి ఒక్క తెలుగువారికి మనోవేదన కలిగిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలోని అనేకమంది బాపు మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తున్నారు. అనేకమంది బాపుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బాపు గారికి ఇద్దరు సంతానం. ఒక కుమార్తె, ఒక కుమారుడు. తన కుమార్తెని తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకటరమణ కుమారుడు వర ముళ్ళపూడికి ఇచ్చి వివాహం చేశారు. అలా తమ స్నేహబంధాన్ని బంధుత్వంగా మలచుకున్నారు. ముళ్ళపూడి వర ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. బాపు కుమారుడు ప్రస్తుతం జపాన్‌లో వున్నారు. ఆయన సోమవారం చెన్నైకి తిరిగి రానున్నారు.

బాపు... కొన్ని గౌరవాలు.. అవార్డులు....

  అవార్డులు, సత్కారాలకు అతీతుడు బాపు. అయినప్పటికీ ఆయన కొన్ని అవార్డులు, సత్కారాలకు అనుమతి ఇచ్చారు. బాపును వరించడం ద్వారా అనేక అవార్డుల జన్మ సార్థకమైంది. బాపు తాజాగా 2013లో పద్మశ్రీ అవార్డును పొందారు. 2001లో ఆయనకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించింది. ముత్యాలముగ్గు, మిస్టర్ పెళ్ళాం సినిమాలకు జాతీయ అవార్డులు పొందారు. సీతాకళ్యాణం (1976), వంశవృక్షం (1980) చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులను పొందటంతోపాటు 2012లో ఫిలిం ఫేర్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పొందారు. 1986లో బాపు రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పొందారు. బాలరాజు కథ (1971), అందాల రాముడు (1973), ముత్యాలముగ్గు (1975), పెళ్ళిపుస్తకం (1991), మిస్టర్ పెళ్ళాం (1993), శ్రీరామరాజ్యం (2011) సినిమాల ద్వారా ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డులు. ఇవే కాక ఇంకా ఎన్నో అవార్డులు, బిరుదులు, సత్కారాలు బాపు కీర్తి కిరీటంలో చేరి మెరిశాయి.

బాపు జీవితం... సింహావలోకనం...

  ప్రముఖ సినీ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని మల్లార్ ఆస్పత్రిలో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఐదు నంది అవార్డులు అందుకున్నారు. 1933 సంవత్సరం డిసెంబర్ 15 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బాపు జన్నించారు. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. ఆంధ్రపత్రికలో ఆయన కార్టూనిస్తుగా కెరీర్ ప్రారంభించిన ఆయన సంగీతకారుడిగా, చిత్రకారుడిగా, కార్టునిస్ట్, డిజైనర్ గా పలు రంగాలకు ఎనలేని సేవనందించారు. సాక్షి చిత్రం ద్వారా చలన చిత్ర జీవితాన్ని ప్రారంభించిన బాపు తన కెరీర్ లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపు చివరి చిత్రం శ్రీరామరాజ్యం. ఆయన సినీ జీవితంలో 5 నంది అవార్డులు, రెండు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ముత్యాలముగ్గు చిత్రానికి బాపుకు జాతీయ పురస్కారం లభించింది. 1986 సంవత్సరంలో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2013లో పద్మశ్రీ అవార్డు లభించింది. తెలుగులో సాక్షి, బాలరాజు కథ, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, మనవూరి పాండవులు, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు, వంశవృక్షం, మిస్టర్ పెళ్లాం, రాధా గోపాలం, శ్రీరామ రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాలకు, హిందీలో హమ్ పాంచ్, సీతా స్వయవర్, అనోఖా భక్త్, బేజుబాన్, వో సాత్ దిన్, ప్యారీ బహ్నా, మొహబ్బత్, మేరా ధరమ్, ప్రేమ్ ప్రతిజ్ఞ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

బాపు మృతిపై కన్‌ఫ్యూజన్

  ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. అయితే బాపు మరణం విషయంలో చాలా కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. బాపు ఆదివారం మధ్యాహ్నమే గుండెపోటుతో చెన్నైలోని మల్లార్ ఆస్పత్రిలో మరణించారు. అయితే మొదట బాపు ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాపు మరణించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు బాపు కోలుకున్నారని, తమతో బాగానే మాట్లాడారని చెప్పడంతో బాపు మరణంపై పుకార్లు వ్యాపించాయన్న అభిప్రాయం కలిగింది. అయితే చివరికి బాపు మరణించినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు.

బాపు చలన చిత్రావళి...

  సాక్షి (1967), బంగారుపిచిక (1968), బుద్ధిమంతుడు (1969), బాలరాజు కథ (1970), ఇంటి గౌరవం (1970), సంపూర్ణ రామాయణం (1972), అందాలరాముడు (1973), శ్రీరామాంజనేయ యుద్ధం (1974), ముత్యాలముగ్గు (1975), రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976), భక్త కన్నప్ప (1976), సీతాకళ్యాణం (1976), స్నేహం (1977), మనవూరి పాండవులు (1978), గోరంతదీపం (1978), తూర్పు వెళ్ళే రైలు (1979), కలియుగ రావణాసురుడు (1980), రాజాధిరాజు (1980), వంశవృక్షం (1981), రాధాకళ్యాణం (1981), త్యాగయ్య (1981), కృష్ణావతారం (1982), ఏది ధర్మం ఏది న్యాయం (1982), పెళ్ళీడు పిల్లలు (1982), మంత్రిగారి వియ్యంకుడు (1984), సీతమ్మ పెళ్ళి (1985), బుల్లెట్ (1985), జాకీ (1985), కళ్యాణ తాంబూలం (1987), పెళ్ళి పుస్తకం (1991), శ్రీనాథ కవిసార్వభౌమ (1992), మిస్టర్ పెళ్ళాం (1993), పెళ్ళి కొడుకు (1994), రాంబంటు (1995), రాధాగోపాళం (2005), సుందరకాండ (2008), శ్రీరామరాజ్యం (2008).   ఇతర భాషా సినిమాలు......   పరమాత్మా (హిందీ - 1994), ప్రేమ్ ప్రతిజ్ఞా (హిందీ - 1989), దిల్ జలా (హిందీ - 1987), ప్యార్ కా సిందూర్ (హిందీ - 1986), మేరా ధరమ్ (హిందీ - 1986), ప్యారీ బెహనా (హిందీ - 1985), మొహబ్బత్ (హిందీ - 1985), వోహ్ సాత్ దిన్ (హిందీ - 1983), నీతిదేవన్ మయగుగిరన్ (తమిళం - 1982), బేజుబాన్ (హిందీ - 1981), హమ్ పాంచ్ (హిందీ - 1980), అనోఖా శివభక్త్ (హిందీ - 1978), సీతాస్వయంవర్ (హిందీ - 1976).