విజయవాడ వైపే ప్రభుత్వం మొగ్గు?
posted on Aug 29, 2014 @ 2:06PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి అనేక సూచనలు చేసిందన్న వార్తలు వచ్చాయి. మార్టూరు - దొనకొండ మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని సూచించినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ నిరాధారాలని, రాజధాని విషయంలో ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడొద్దని ముఖ్యమంత్రి సూచించారు. ఇదిలా వుంటే, శివరామకృష్ణన్ కమిటీ ఎలాంటి సూచనలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజధాని విజయవాడ - గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా విజయవాడ దగ్గర రాజధాని ఏర్పాటు చేయవద్దని కమిటీ నివేదికలో ఎక్కడా లేదంటున్నారు మంత్రి నారాయణ. సారవంతమైన వ్యవసాయ భూములున్న చోట రాజధాని ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం అవుతుందని మాత్రమే రిపోర్ట్ లో చెప్పారన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో రాజధానికి మొగ్గు శివరామకృష్ణన్ కమిటీ ఏ సూచనలు చేసినా విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని ఉంటుందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుండబద్దలు కొట్టారు. రాజధాని దొనకొండ లాంటి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఉపయోగం లేదంటున్నారు మంత్రి యనమల.