దసరా నుంచి హైదరాబాద్‌లో ఫుల్లు కల్లు

  హైదరాబాద్ మహానగర ప్రజలకు శుభవార్త. జంట నగరాల్లో కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గీత కార్మికులకు ఉపాధి కోసమే కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. కల్లు దుకాణాల ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కల్లీకల్లు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో వున్న తాటి చెట్లను హైదరాబాద్ కల్లు సొసైటీలకు కేలాయిస్తామని, ప్రభుత్వం తరఫున తాటిచెట్ల పెంపకం చేపడతామని మంత్రి వెల్లడించారు. తాటి ఉత్పత్తులతో తినుబండారాల తయారీ అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. దసరా నుంచి హైదరాబాద్‌లో కల్లు విస్తారంగా లభిస్తుందని వివరించారు.

ఏపీ రాజధాని విజయవాడకి సహకరిస్తాం.. కేంద్ర మంత్రి వెంకయ్య

  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ఎంపిక చేశారని తెలిసిందని, రాజధానిగా విజయవాడ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ వుండాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని, రాజధాని నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే నిర్ణయాధికారం వదిలేశామని వెంకయ్య చెప్పారు. ఢిల్లీలో ఉండి తాము రాజధానిని నిర్దేశించలేమని, రాజధాని నిర్మాణానికి మాత్రం అవసరమైన సాయం చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు.

ఎన్టీఆర్ పేరుపై నిర్ణయం అప్పుడే కాదు...

  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తెలుగు జాతి ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో పెంచిన ఎన్టీఆర్‌ పేరును రాజధానికి లేదా రాజధానిలోని అసెంబ్లీ ప్రాంతానికి పెట్టాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ పేరు గురించి అప్పుడు ఆలోచిద్దామని ఆయన తెలుగు తమ్ముళ్ళకు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే హైకోర్టు ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

అసెంబ్లీలో 8 తీర్మానాలు ఆమోదం

  ఆంద్రప్రదేశ్ శాసనసభ గురువారం నాడు ఎనిమిది తీర్మానాలను ఆమోదించింది. అవి...   1. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన చేసిన తీరుపై శాసనసభ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీర్మానం.   2. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి వుందని తీర్మానం.   3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విజయవాడ సంపూర్ణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం కోరుతూ తీర్మానం.   4. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన ప్రతిపాదనలు, హామీలను కేంద్రం వెంటనే నెరవేర్చాలని కోరుతూ తీర్మానం.   5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నివిధాలా న్యాయం చేయడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం.   6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, విధానపరమైన మద్దతు అందించాలని కోరుతూ తీర్మానం.   7. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్ళలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం.   8. శాసనమండలి సీట్ల కేటాయింపులో అన్యాయాన్ని సవరించి 58 సీట్లకు పెంచాలని కోరుతూ తీర్మానం.

హీరోయిన్ మైత్రేయ కేసు: మంత్రి కొడుక్కి వారెంట్

  కన్నడ హీరోయిన్ మైత్రేయ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను ప్రేమించాడని, పెళ్ళి చేసుకుంటానని మోసం చేశాడని పోలీసు కేసు పెట్టిన విషయం తెలిసిందే. బెంగుళూరు పోలీసులు కార్తీక గౌడ మీద కేసు నమోదు చేశారు. మామూలుగా అయితే లొంగిపోవాల్సిన కార్తీక్ గౌడ పరారీలో వున్నాడు. పరారీలో వుంటూనే బెయిల్ కోసం ప్రయత్నించాడు. బెంగుళూరు పోలీసులు కార్తీక్ గౌడ తనంతట తానే లొంగిపోతే మంచిదని సూచించారు. అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం కార్తీక్- ఆగస్టు 30న సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది.కార్తీక్ గౌడ త్వరగా బెయిల్ సమకూర్చుకోని పక్షంలో పోలీసులు వేటాడి అరెస్ట్ చేసే అవకాశం వుంది.

ఫేస్‌బుక్ ఆగిపోయింది

  ఫేస్‌బుక్ ఆగిపోయింది.. అవునా.. జస్ట్ ఇంతకుముందే చూశామే అనుకుంటున్నారా.. ఫేస్‌బుక్ నిజంగానే ఆగిపోయింది. అయితే శాశ్వతంగా కాదు.. బుధవారం నాడు పదిహేను నిమిషాలపాటు ఆగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సుమారు 15 నిమిషాలపాటు పనిచేయడం ఆగిపోయింది. ఫేస్‌బుక్ సంస్థ తమ వెబ్‌సైట్‌లో సాంకేతికమైన మార్పులు చేస్తూ వుండగా సైట్ 15 నిమిషాల పాటు ఆగిపోయింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్కీయులు టెన్షన్ పడిపోయారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సంస్థ ప్రకటించింది. ‘‘ఫేస్‌బుక్‌లో సాంకేతికమైన మార్పులు చేస్తూ వుండగా పదిహేను నిమిషాల పాటు సైట్ ఆగిపోయింది. మేము ఈ సమస్యను వెంటనే గమనించి తగిన చర్యలు తీసుకోవడంతో పదిహేను నిమిషాల తర్వాత ఫేస్‌బుక్ యథావిధిగా పనిచేయడం మొదలుపెట్టింది’’ అన్నారు.

తూర్పు, పశ్చిమ గోదావరి అభివృద్ధి ప్రణాళిక...

  ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ప్రతిపాదనలు చేశారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్న నేపథ్యంలో ఇరవై పేజీల ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రతిపాదనలలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవి..   తూర్పు గోదావరి జిల్లా:   తూర్పు గోదావరి జిల్లాకు పెట్రోలియం యూనివర్శిటీ, పోర్ట్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్, వీసీఐసీ కారిడార్, విశాఖ -చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్లోకి కాకినాడ, తెలుగు యూనివర్శిటీ, కొబ్బరిపీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్, స్మార్ట్ సిటీస్గా రాజమండ్రి, కాకినాడ, ఫుడ్ పార్క్, టూరిజం, భూఉపరితల జలమార్గం, కాకినాడలో ఎస్ఎన్జీ టెర్మినల్, తునిలో నౌక నిర్మాణ కేంద్రం, ఆక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్, ఐటీ హబ్గా రాజమండ్రి.   పశ్చిమ గోదావరి జిల్లా:   నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్, నరసాపురం పోర్టు, తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు, సిరామిక్ పరిశ్రమ, ఆయిల్ పామ్ పరిశ్రమ, పర్యాటక కేంద్రంగా కొల్లేరు, జలమార్గాల అభివృద్ధి, చింతలపూడి ప్రాంతంలో బొగ్గు వెలికితీత, పోలవరం ప్రాజెక్టు, కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమలు, మెట్ట ప్రాంతాల్లో 100 శాతం డ్రిప్ ఇరిగేషన్, ఆక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఉద్యానవన పరిశోధన కేంద్రం.

ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళిక...

  ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ప్రతిపాదనలు చేశారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్న నేపథ్యంలో ఇరవై పేజీల ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రతిపాదనలలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవి..   శ్రీకాకుళం జిల్లా:   నూతన పారిశ్రామిక నగరంగా శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పోర్టు, కళింగపట్నం పోర్ట్ అభివృద్ధి, స్మార్ట్ సిటీగా శ్రీకాకుళం, నూతన విమానాశ్రయం, ఫుడ్ పార్క్, వంశధార, నాగావళిపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, శ్రీకాకుళానికి ఓపెన్ యూనివర్సిటీ, ఎలక్టానిక్స్, హార్డ్వేర్ పార్క్.   విజయనగరం జిల్లా:   విజయనగరంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం, నూతన పారిశ్రామిక నగరంగా విజయనగరం, ఏడాదిలోగా తోటపల్లి రిజర్వాయర్ పూర్తి, విజయనగరానికి పుడ్ పార్క్, గిరిజన యూనివర్శిటీ, హార్డ్వేర్ పార్క్, పోర్టు, సంగీతం, లలిత కళల అకాడెమీ, మెడికల్ కళాశాల,   విశాఖపట్నం జిల్లా:   మెగా సిటీగా విశాఖ, విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖలో ఇండస్ట్రీయల్ కారిడార్, మెట్రోరైలు, విశాఖలో ఐఐఎం, ఐఐఎఫ్టీ, మెగా ఐటీ హబ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం, విశాఖలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ హబ్, పుడ్ పార్క్, విశాఖలో ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్, రైల్వే జోన్.

చంద్రబాబు ప్రకటన.. కొన్ని ముఖ్యాంశాలు...

  ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సంబంధించిన 20 పేజీల ప్రకటనను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో విడుదల చేశారు. ఈ ప్రకటనలోని కొన్ని ముఖ్యాంశాలు..   * భూ సేకరణ ద్వారా రాజధానిని నిర్మించాలని భావిస్తున్నాం.   * శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రజాభిప్రాయాన్ని బలపరిచింది.   * రాష్ట్ర ప్రగతి సాధన, ప్రజల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం.   * ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ పార్క్.   * భూ సేకరణ విధి విధానాలపై ఉపసంఘం.   * రాబోయే రోజుల్లో ఒక్కో సంవత్సరం ఒక్కో జిల్లాలో స్వాతంత్ర్య వేడుకలు.   * ఏపీ అభివృద్ధికి ఏడు మిషన్లు, 5 గ్రిడ్ల ఏర్పాటు.   * విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి.   * అనంతపురం కరవు నివారణకు బిందు, తుంపర సేద్యాలకు ప్రాధాన్యం   * శ్రీకాకుళంలో విమానాశ్రయం, స్మార్ట్ సిటీగా అభివృద్ధి.   * వీసీఐసీ కారిడార్ పరిధిలో కాకినాడ.   * తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోలియం కారిడార్, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు.   * తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి పీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్.   * విజయనగరంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం.

అసెంబ్లీలో జగన్‌కి బాబు చురకలు

  ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా విజయవాడను ప్రకటించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సుదీర్ఘమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద చురకలు వేశారు. జగన్ ప్రతిదానికీ చేతులెత్తి మాట్లాడ్డం కాదు.. విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు. జగన్ ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి వచ్చారని, తాను ఇదే అసెంబ్లీలో చాలామంది పెద్దలను ఢీకొన్నానని జగన్ తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనినీ విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కంటే ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి ప్రతిపక్షం అండగా నిలవాలని చెప్పారు. జగన్‌కి అవకాశం వుంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఇడుపులపాయలో పెట్టుకునేవారని వ్యంగ్యంగా అన్నారు.

ఏపీలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై ప్రకటన చేయడంలో భాగంగా ఆయన విడుదల చేసిన 20 పేజీల ప్రకటనలో అనేక అభివృద్ధి పనుల గురించి వెల్లడించారు. వాటర్, పవర్, గ్యాస్, రోడ్, బ్రాడ్ బ్యాండ్లకు ప్రత్యేకంగా గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానశ్రయాలుగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అనంతపురంలో కరవు నివారణకు బిందు సేద్యం, తుంపర సేద్యాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నామని వివరించారు. అలాగే శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటు చేసి శ్రీకాకుళాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు.

రాజధానిపై చంద్రబాబు 20 పేజీల ప్రకటన...

  ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సంబంధించిన 20 పేజీల ప్రకటనను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో విడుదల చేశారు. ఈ ప్రకటనలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అభివృద్ధి ఏ రకంగా చేయబోతున్నారన్నది స్పష్టంగా వివరించారు. భూ సేకరణ ద్వారా రాజధానిని నిర్మించాలని భావిస్తున్నామని, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రజాభిప్రాయాన్ని బలపరిచిందని అన్నారు. రాష్ట్ర ప్రగతి సాధన, ప్రజల సంక్షేమం కోసమే విజయవాడ రాజధానిగా నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని, భూ సేకరణ విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నామని, రాష్ట్రంలో మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలు నిర్మించనున్నామని, రాబోయే రోజుల్లో ఒక్కో సంవత్సరంలో ఒక్కో జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని సీఎం ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

విజయవాడ రాజధానికి ఓకే.. జగన్

  విజయవాడను ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా ప్రకటించడాన్ని తాను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగన్ అన్నారు. విజయవాడ రాజధాని కావడం పట్ల తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చంద్రబాబు రాజధాని ప్రకటించిన తీరు విషయం మీదే తనకు అభ్యంతరం వుందని జగన్ అన్నారు. ముందు చర్చ జరిగి తర్వాత రాజధానిని ప్రకటిస్తే బాగుందేదని, చంద్రబాబు ప్రకటించిన తర్వాత చర్చ జరిగి లాభం లేదని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ విజయవాడ కొత్త రాజధాని కావడాన్ని తాను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని అన్నారు. అయితే విజయవాడలో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోకుండా చూడాలని అభిప్రాయపడ్డారు.

ఏపీలో 3 మెగాసిటీలు.. 14 స్మార్ట్ సిటీలు...

  బాబు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లోనే వుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ అందుబాటులో వుండే విజయవాడ పరిసరాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని వుంటుంది. ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా రాజధానికి అవసరమైన భూ సేకరణ చేస్తాం. అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి వుంది. అందుకు అవసరమైన ప్రణాళికను కూడా సిద్ధం చేశాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలు నిర్మించనున్నాం’’ అన్నారు.

అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం ప్రారంభం

  ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రకటించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. గురువారం నాడు ఆయన అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే గురువారం ఉదయం నుంచి రాజధాని ప్రకటనకు ముందే చర్చ జరగాలని పట్టుబడుతూ వచ్చిన వైసీపీ సభ్యులు చంద్రబాబు మాట్లాడుతూ వుండగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చర్చ కావాలన్నారు కదా.. ప్రశాంతంగా వుండి చర్చించండి అని చెప్పినా వైసీపీ సభ్యులు శాంతించలేదు. అయితే ఇలాంటి గందరగోళ వాతావరణంలో మాట్లాడనని, స్పీకర్ సభను అదుపులో పెట్టిన తర్వాతే తాను మాట్లాడతానని ముఖ్యమంత్రి కూర్చున్నారు. స్పీకర్ సభను అదుపు చేయాలని ప్రయత్నిస్తున్నా వైసీపీ సభ్యులు తగ్గడం లేదు.