టీఆర్ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు

  ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నాడు టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో తుమ్మల టీఆర్ఎస్‌లో చేరారు. తుమ్మలకు గులాబీ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. తుమ్మలతోపాటు పలువురు ఖమ్మం జిల్లా నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ‘‘కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ సాధించారు. కేసీఆర్ నా చిరకాల మిత్రుడు. కేసీఆర్ లక్ష్యసాధనలో భాగస్వామిని కావాలనే టీఆర్ఎస్‌లో చేరాను. రాష్ట్ర రాజకీయాలలో మార్పులకు నేను, కేసీఆరే కారణం. తెలంగాణను కోటి రతనాల వీణగా మార్చాల్సిన అవసరం వుంది. గుజరాత్‌ కంటే ఎక్కువగా తెలంగాణను అభివృద్ధి చేసే శక్తి కేసీఆర్‌కి వుంది’’ అన్నారు.

హరీష్‌రావు అంటే కేసీఆర్‌కి భయమట....

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌కి ఆయన మేనల్లుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అంటే భయమట.. కేసీఆర్‌కి హరీష్ రావు నుంచి అసమ్మతి భయం వుంది కాబట్టే ఎమ్మెల్యేల సంఖ్యని పెంచుకోవడానికి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారట. ఈ మాటలు అందు ఎవరో కాదు.. బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీట మునిగిపోతే ఎంతమాత్రం పట్టించుకోని హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో మాత్రం బాగా మునిగిపోయారని నాగం విమర్శించారు. అసలు మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో వుందో లేదో టీఆర్ఎస్ నాయకులు చెప్పాలని నాగం డిమాండ్ చేశారు.

‘తీవ్రవాద’ విద్యార్థుల అరెస్ట్... విడుదల...

  ఇరాక్‌కి చెందిన ఓ ఉగ్రవాద సంస్థ ‘ఆశయాలు’ తెలుసుకుని హైదరాబాద్‌కి చెందిన నలుగురు విద్యార్థులు ఎంతో ఆకర్షితులయ్యారు. వెంటనే ఆ సంస్థలో చేరిపోవాలని ఇరాక్‌కి ప్రయాణం కట్టారు. అయితే ఈ నలుగురూ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దొరికిపోయారు. పోలీసులు ఆ విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఏదో ఆవేశంలో అలా తీవ్రవాదం వైపు ఆ నలుగురూ ఆకర్షితులు అయ్యారని పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్‌లో ఆ సంస్థ గురించి ఈ విద్యార్థులు తెలుసుకున్నారని చెప్పారు. ఆ నలుగురు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు.

విద్యార్థులతో మోడీ ముఖాముఖి

  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఒక ఆడిటోరియంలో 700 విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 12,500 పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఒక కోటి 20 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రసారాన్ని తిలకించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని ఇతర నగరాలకు చెందిన విద్యార్థులు కూడా మోడీని ప్రశ్నలు అడిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, విద్యార్థులు దేశానికి గర్వకారణంగా నిలిచేలా ఎదగాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు.

తన గురువులకు చంద్రబాబు సత్కారం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు గుంటూరులో జరిగిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బాల్యంలో తనకు పాఠాలు చెప్పిన గురువులు మునికృష్ణారెడ్డి, లక్ష్మణరెడ్డిలకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి తన ఒక నెల పెన్షన్‌ని రాష్ట్ర అభివృద్ధికి విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు తీర్చే బాధ్యత తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని, ఉపాధ్యాయులు విద్యార్థులలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యాపరంగా మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రణాళికలను వివరించారు.

‘మేరికోమ్’ మూవీ రివ్యూ

  నటీనటులు: ప్రియాంక చోప్రా, దర్శన్ కుమార్, సునీల్ థాపా, మీనాక్షి కలితా, శిశిర్ శర్మ, సంగీతం: శశి-శివమ్ , ఫోటోగ్రఫీ: కీకో నకహర, నిర్మాత: వయాకామ్ 18 మోషన్ పిక్చర్, డైరెక్టర్: ఒమంగ్ కుమార్ , క్రియేటివ్ డైరెక్టర్: సంజయ్ లీలా భన్సాలీ.   ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటించగా రూపొందిన క్రీడా నేపథ్యంతో రూపొందిన సినిమా ‘మేరి కోమ్’ ఈశాన్య భారతదేశంలోని ఓ కుగ్రామంలోని పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మేరి కోమ్ అనే యువతి తనకు ఎదురైన అన్ని అడ్డంకులు జయించి బాక్సింగ్ క్రీడలో అంతర్జాతీయ ఛాంపియన్ గా మేరి కోమ్ ఎలా మారింది. అలాగే పెళ్ళయ్యాక కూడా తర్వాత మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి దూకి, క్రీడా సంస్థల అవమానాలను, అనేక ఆటుపోట్లను అధిగమించి.. విమర్శకులకు ఎలాంటి సమాధానమిచ్చిందనే కథాంశమే మేరి కోమ్ చిత్రం. అనేక కష్టాలను ఎదురించి అంతర్జాతీయ క్రీడాకారిణిగా మారిన ఓ సామాన్య యువతి పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించింది. ప్రశంసనీయమైన నటన ప్రదర్శించింది. తొలిసారి దర్శకత్వం వహించిన ఒమాంగ్ కుమార్ ‘మేరి కోమ్’ సినిమాని ప్రశంసనీయంగానే తెరకెక్కించాడు.

ఢిల్లీలో ప్రభుత్వం.. బీజేపీకి ఆహ్వానం?

  ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అత్యధిక మెజారిటీ వున్న పార్టీగా భారతీయ జనతాపార్టీకి గవర్నర్ జనరల్ నుంచి ఆహ్వానం లభించే అవకాశాలు లభిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ 49 రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన వుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్రపతి ఆ లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో ఐదుగురు సభ్యుల మద్దతు అవసరం. ఆ మద్దతును బీజేపీ ఎలా సాధిస్తుందనేది ఆసక్తికరం.

విద్యార్థినిపై పోలీస్ అత్యాచారం...

  కంచే చేను మేసింది. విద్యార్థులను దుష్ట శక్తుల నుంచి కాపాడాల్సిన ఓ పోలీసు తానే దుష్టుడైపోయి ఒక విద్యార్థినిని మానభంగం చేశాడు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న తనపై ఓ కానిస్టేబుల్ రెండు నెలల క్రితం అత్యాచారం చేశాడంటూ ఆ విద్యార్థిని (21) పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దాంతో గిరిరాజ్ సింగ్ (23) అనే ఆ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ పోలీసు కానిస్టేబుల్ తనతో స్నేహం చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, రెండు నెలల క్రితం అదే ప్రాంతంలోని ఓ హోటల్లో తనపై అతడు అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెడ్‌రూమ్‌లో శవం...

  హైదరాబాద్‌లో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. ఆజంపురా ప్రాంతంలో మహ్మద్ ఖాలేద్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి మూడు రోజుల క్రితం వేరే ఊరికి వెళ్ళాడు. ఆ కుటుంబం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు బద్దలు కొట్టి వున్నాయి. ఇంట్లో దొంగతనం జరిగి వుంటుందని భావించి బెడ్ రూమ్ దగ్గరకి వెళ్ళి తలుపు నెట్టగా తెరుచుకోలేదు. కిటీకీలోంచి చూస్తే సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని వున్న వ్యక్తి శవం కనిపించింది. ఊహించని ఈ పరిణామానికి బెంబేలెత్తిపోయిన ఖాలీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరో స్థానికులు ఎవరికీ తెలియదు. పరాయి వాళ్ళ ఇంటికి తలుపులు బద్దలు కొట్టి లోపలకి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా అలా హత్య చేశారా... ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రస్తుతం ఎవరి దగ్గరా లేవు.

కేసీఆర్ కార్ల రంగు మార్పు...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు ప్రాబ్లం వుందంటూ తన క్యాంప్ ఆఫీసుని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్ల రంగు విషయంలో కూడా ఆయన ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. కార్ల రంగు వల్ల కూడా తనకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన తన కాన్వాయ్‌లో ఉపయోగించే కార్ల రంగులు కూడా మార్చాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కాన్వాయ్‌లో 6666 నెంబరు గల నలుపు రంగు ఫార్చ్యూనర్ కార్లను వినియోగిస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా వీవీఐపీల వాహన శ్రేణి నలుపు రంగులో ఉంటుంది. అయితే, ఈ నలుపు రంగు తనకు అచ్చిరావడం లేదని... తెలుపు రంగులోకి మార్చాలని కేసీఆర్ అధికారులను కోరారు. రానున్న రెండు, మూడు రోజుల్లో కాన్వాయ్ రంగు మారే అవకాశం ఉంది.

రాజధాని నిరసనలు... బాబు దిష్టిబొమ్మ....

  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నిరసనగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఆందోళనలు జరిగాయి. తెలుగుదేశం ప్రభుత్వం విశాఖకు తీరని అన్యాయం చేసిందంటూ పలు ప్రజా సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అవుట్‌గేట్ వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. రాజధానిగా విశాఖకు పలు అనుకూలతలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి విజయవాడను ఎంపిక చేయడం రాజకీయ దురుద్దేశమేనని ఆరోపించారు. అన్ని విధాలా వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇవ్వకుండా మరింత వెనక్కునెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.

భారత్‌లో అల్ ఖైదా బ్రాంచ్

  భారత్‌లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించాడు. ఈ మేరకు ఒక వీడియో విడుదలైంది. ఈ ప్రకటన భారత హోం మంత్రిత్వ శాఖని అలెర్ట్ చేసింది. అల్ జవహరి విడుదల చేసిన వీడియో విషయమై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిఘా సంస్థలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆల్ ఖైదా విడుదల చేసిన ఈ వీడియో ఎంతవరకూ నిజమో కూడా చూడాలని హోం మంత్రిత్వశాఖ గూఢచార సంస్థలను కోరింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని పోలీసు స్టేషనను ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ‘‘అల్ ఖైదా వీడియో నేపథ్యంలో మనమంతా మరింత అప్రమత్తం కావాలి. కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలతో కలిసి పనిచేసి, రాష్ట్రానికి ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాలి’’ అని పేర్కొన్నట్టు సమాచారం.

తిరుపతిలో విద్యార్థి అనుమానాస్పద మ‌ృతి

  తిరుపతిలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదివే మోహన్ కృష్ణారెడ్డి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. కిటికీ గాజు పెంకు గొంతులో గుచ్చుకోవడంతో ఆ విద్యార్థి మరణించాడు. అయితే స్కూల్‌లో విద్యార్థి గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి మోహనకృష్ణారెడ్డిని గొంతుపై గాజు పెంకుతోపొడవటంతో మరణించాడని ఒక వాదన వినిపిస్తోంది. స్కూలు యాజమాన్యం మాత్రం భోజన విరామ సమయంలో విద్యార్థులు ఆడుకుంటూ గాజు తలుపుపై పడటంతో అదికాస్త విరిగి మోహనకృష్ణారెడ్డి గొంతుపై గుచ్చుకోవడంతో మరణించాడని చెబుతోంది. విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డను చంపేశారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

సచిన్ యమా హ్యాపీ హ్యాపీ.. ఎందుకు...

  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాలా హ్యాపీగా వున్నాడు. క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఇంట్లో తన ఫోటో ఉండటం తనకు లభించిన అత్యుత్తమ గౌరవమని సచిన్ టెండూల్కర్ అన్నారు. బ్రాడ్‌మన్ రూపొందించిన ‘పదకొండు మంది ఆల్ టైమ్ టెస్ట్ క్రికెటర్ల జాబితాలో తన ఫోటో ఉండటం గొప్ప అదృష్టమని’ సచిన్ తెలిపారు. ‘‘కొన్ని సందర్భాలలో నా బ్యాటింగ్ శైలి బ్రాడ్‌మన్ శైలిని పోలి వుంటుందని ఆయన భార్య చెప్పారు. అది నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. నేను జీవితంలో అందుకున్న అతి పెద్ద అభినందన బ్రాడ్‌మన్ ఇచ్చిందే’’ అన్నారు. ఆస్టేలియా ప్రధాని టోని అబాట్ సమక్షంలో ఆదేశ కాన్సులేట్ చేసిన క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో పాల్గొన్న సచిన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. 

పారిపోయిన వరుడు.. ప్రాణం తీసుకోబోయిన వధువు...

  రెండు రోజుల్లో ఆ జంట పెళ్ళి చేసుకోవాల్సిది. కట్న కానుకలు అన్నీ వధువు తల్లిదండ్రులు వరుడుకి ఇచ్చారు. అయితే ఇంతలోనే వరుడు డబ్బుతో సహా పరారైపోయాడు. దాంతో హర్టయిన వధువు ఆత్మహత్యా ప్రయత్నం చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం యానాదిబెట్టులో ఇది జరిగింది. వరుడు రెండు లక్షల రూపాయల కట్నం, మూడున్నర తులాల బంగారంతో ఉడాయించాడు. దాంతో వధువు కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తట్టుకోలేక వధువు ఆత్మహత్యకు ప్రయత్నించింది. దాంతో ఆమెని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.