ఖైరతాబాద్ గణేషుడి మీద పూలవర్షం

  ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనానికి రెడీ అవుతున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడి మీద సాయంత్రం అయిదు గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఖైరతాబాద్ వినాయకుడి మీద హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయకచవితి రోజున ఖైరతాబాద్ గణపతికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యధికంగా ఈసారి మాత్రమే 60 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం, వచ్చే ఏడాది నుంచి వరుసగా ఎత్తు తగ్గుతూ వస్తుండటంతో ఈసారి పూలవర్షం కురిపించాలని ఉత్సవ కమిటీ కేసీఆర్ను కోరిన విషయం తెలిసిందే.

ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధమైందా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలకు అవసరమైన తెల్ల రేషన్‌ కార్డులు అక్రమంగా పలువురు దక్కించుకున్నారని, దాదాపు ఏపీలో 15 లక్షల బోగస్‌ కార్డులు ఉండి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేషన్‌ కార్డులను ఆధార్‌ కార్డులతో అనుసంధానం చేస్తే బోగస్‌ కార్డులన్ని పోయే అవకాశముందని ఏపీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అర్హులైన పేద కుటుంబాల వారికి మాత్రమే రేషన్‌ కార్డులు ఉండేలా చర్యలు తీసుకునే దిశగా తెలుగు దేశం ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

పవన్ అభిమాన సంఘం... చిరు ఫ్యాన్స్‌తో కిరికిరి...

  జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్తగా అభిమాన సంఘాన్ని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. చిరంజీవి అభిమాన సంఘం భేటీ కంటే ముందే పవన్ కళ్యాణ్ అభిమానులు భేటీ కావాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ సమావేశం రాజమండ్రి లేదా విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య చీలిక వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న చిరంజీవి అభిమాన సంఘాల సమావేశానికి హాజరు కావద్దని హైదరాబాద్‌ నుంచి, అది కూడా చిరంజీవి కాంపౌండ్ నుంచి ఆదేశాలు జారీ అయినట్టు పవన్ అభిమానులు చెబుతున్నారు.

మహిళను గ్యాంగ్‌రేప్ చేసిన దోషులకు మరణశిక్ష

  అఫ్ఘనిస్థాన్‌లో ఒక మహిళ మీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు సభ్యులున్న ముఠాకి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అత్యాచారంతో పాటు దోపిడీకి పాల్పడిన ఈ సంఘటనను అత్యంత అరుదైన కేసుగా పరిగణించి కోర్టు వారికి మరణశిక్ష విధించింది. దేశంలో ఇటువంటి నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే మరిన్ని సంఘటనలు ఇటువంటివి జరిగే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అఫ్గనిస్తాన్‌లోని పగ్మన్ జిల్లాలో గత నెల వివాహానికి హాజరై వాహనాల్లో తిరిగివస్తున్న పలు కుటుంబాలకు చెందినవారిపై పోలీసు దుస్తులు ధరించి కొందరు వ్యక్తులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేస్తూ వాహనాల్లో ఉన్నవారిపై దాడి చేసి బంగారం, నగదు దోచుకెళ్లారు. అంతేకాకుండా ఒక మహిళను సమీపంలోని పొలాల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై ఘోరంగా సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. 

ఢిల్లీలో విధ్వంసానికి ఇండియన్ ముజాహిద్దీన్ కుట్ర

  విజయదశమి, దీపావళి పండగల సందర్భంగా న్యూఢిల్లీలో భారీ విధ్వంసానికి తీవ్రవాదులు కుట్ర పన్నినట్టు బయటపడింది. ఈమధ్య ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో పోలీసులకు దొరికిపోయిన ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాది అజీజ్ షేక్ బయటపెట్టాడు. ఇండియన్ ముజాహిదీన్‌కు కీలక సంధానకర్త, హవాలా మార్గంలో నిధులను తరలించడంలో నిష్ణాతుడైన అజీజ్ షేక్ గత ఏడాది యాసీన్ భత్కల్‌ను అరెస్టు చేసిన వెంటనే నేపాల్‌కు పారిపోయి అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. అయితే ఢిల్లీ చేరుకోవాలంటూ అతడ్ని పాకిస్థాన్‌లోని మిలిటెంట్లు రియాజ్ భత్కల్, మొహిసిన్ చౌదరిలు ఆదేశించినట్టు చెప్పాడు. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండటం కోసం బ్రేక్ జర్నీలు చేయాలని, నేరుగా ఢిల్లీ వెళ్లవద్దని కూడా వారు అతడికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామని వారు చెప్పారని అతను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను మరింత పటిష్టం చేయడానికి పోలీసులు నడుం బిగించారు.

బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం.. కోర్టు...

  బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరమైనదని, దీన్ని పూర్తిగా నిర్మూలించాలని ఢిల్లీ కోర్టు అభిప్రాయపడింది. ఓ బాలికపై వరకట్న వేధింపుల కేసును మెట్రోపాలిటన్ కోర్టు విచారించింది. బాల్య వివాహం చేయడంతో పాటు కట్నం ఇచ్చినందుకు, తీసుకున్నందుకు బాలిక తల్లిదండ్రులు, అత్తింటివారిపై కేసు నమోదు చేయాలని మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ పోలీసులను ఆదేశించారు. తమ కూతురికి చిన్నతనంలోనే వివాహం చేసిన నేరం మీద బాలిక తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఆడపిల్లకు చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల తమ విద్యను కొనసాగించలేరు. శారీరక హింసలకు, హెచ్‌ఐవీ వంటి వ్యాధులకు గరవుతారు. గర్భవతులైనప్పుడో, కాన్పు సమయంలోనో తరచు మరణిస్తుంటారు. ఇది అత్యంత బాధాకరం అని మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ పేర్కొన్నారు.

బాలాపూర్ లడ్డూ ఖరీదు 9.50 లక్షలు

  ఈ సంవత్సరం జరిగిన వేలంపాటలో బాలాపూర్ వినాయకుడి లడ్డూ తొమ్మిదిన్నర లక్షల రూపాయలకు అమ్ముడయింది. సింగిరెడ్డి జైహింద్ రెడ్డి అనే భక్తుడు లడ్డును వేలంపాటలో దక్కించుకున్నాడు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట ఆ గ్రామ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. హైదరాబాదులోని ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో బాలాపూర్ లడ్డూ వేలంపాటకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డూను వేలం వేయడం ప్రారంభించారు. ఆ ఏడాది కేవలం రూ. 450కి లడ్డూ అమ్ముడుపోయింది. గత ఏడాది హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు లడ్డూను వేలంపాటలో సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది లడ్డు విలువ తొమ్మిదిన్నర లక్షలకు చేరుకుంది.

కోలి ఉరి ఓ వారం ఆపండి.. కోర్టు

  నిఠారి వరుస హత్యల కేసు దోషి సురీందర్ కోలీకి సోమవారం ఉరి వేయనున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పడు కోలీ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నోయిడాలోని 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్‌ను దారుణంగా హతమార్చిన కేసులో కోలీకి ఉరిశిక్ష పడింది. మీరట్ జైల్లో అతడిని సోమవారం ఉరి తీసేందుకు రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కోలీ మరణ శిక్ష అమలుపై న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తూ వారం రోజుల పాటు స్టే విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో సురేందర్ కోలీకి వేసిన ఉరిశిక్ష అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. ఉరిశిక్ష అమలుపై అతడు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు పరిశీలించి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. మీరట్ జైల్లో ఆదివారం నాడు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఉరివేసే తాడు, తాడు తగిలించే కొక్కెం, ఉరి వేసి వ్యక్తి.. ఇలా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కానీ ఇంతలోనే సుప్రీం కోర్టు ఒక వారం పాటు స్టే ఇచ్చింది.

చైనా: ఎంచక్కా ఇద్దర్ని కనండి..

  జనాభా నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు చైనాలో ఒక జంట ఒక సంతానాన్ని మాత్రమే కనడానికి వీలుంది. దశాబ్దాలుగా ఈ విధానం అమలులో వుంది. ఈ నేపథ్యంలో చైనాలో జనాభాలో భారీ స్థాయిలో సమతుల్యత దెబ్బతింది. దీనితోపాటు ఇటీవలి కాలంలో తమకు మరో సంతానానికి జన్మనిచ్చేందుకు అనుమతి కావాలని చాలామంది ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. దాంతో తమకు వినతిపత్రం సమర్పించిన 21,249 మంది జంటల్లో 19,363 జంటలో రెండో సంతానాన్ని కనడానికి అనుమతి ఇస్తూ చైనా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రకంగా అనుమతి లభించిన వారిలో 56 శాతం మంది మహిళలు 31 నుంచి 35 ఏళ్ల లోపు వారే కావడం విశేషం.

శారదా చిట్‌ఫండ్.. మమతనీ విచారించాలి: అమిత్ షా

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాత్ర కూడా ఉంటే ఆమెను కూడా విచారించాల్సిందేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ స్కామ్‌లో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదన్నారు. కోల్‌కతాలో భారతీయ జనతాపార్టీ సమావేశంలో మాట్లాడుతూ అమిత్ షా పై విధంగా వ్యాఖ్యానించారు. శారదా చిట్ ఫండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ కునాల్ ఘోష్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాలంటే శారదా చిట్ ఫండ్ అధినేత సుదీప్త సేన్‌తో పాటు తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా విచారించాల్సి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.

‘నిఠారీ’ కోలీకి సోమవారం ఉరి?

  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిఠారీ’ కేసుల నిందితుడు సురేందర్ కోలీని మీరట్ జైల్లో సోమవారం ఉదయం ఉరి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో కోలీ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. ఉరిశిక్ష విధించాలని సీబీఐ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెప్టెంబర్ 4 తేదిన కోలీని గజియాబాద్‌లోని దస్నా జైలు నుంచి మీరట్ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 7 తేది నుంచి 12 తేది లోపల ఏ రోజైనా ఉరితీసే అవకాశం వుంది. సోమవారం ఉదయం 5.30 నిమిషాలకు ఉరి తీసే అవకాశముందనే వార్తలు వెలువడుతున్నాయి. నైనీ సెంట్రల్ జైలు నుంచి ఉరితాడు.. కొక్కెం జైలు అధికారులకు అందాయని తెలుస్తోంది.

వెంట్రుక కూడా పీకలేవు కేసీఆర్: రేవంత్ రెడ్డి

  మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో విమర్శల ఊపు పెరిగింది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావారణాన్ని వేడిక్కిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కేసీఆర్ పెట్టించే అక్రమ కేసులకు భయపడేవారు ఎవరూ లేరు. కేసీఆర్.. ఆ కేసులతో వెంట్రుక కూడా పీకలేవు. అవినీతిపై బహిరంగ విచారణకు సిద్ధమా?’’ అన్నారు. మెదక్ ఎన్నికల ప్రచారంలోనే ఇంతకుముందు బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తమను మరోసారి సమైక్యాంధ్ర మద్దతుదారులని అంటే చెప్పుతో కొడతామంటూ హెచ్చరించారు.

క్రైం యాంకర్.. క్రిమినల్ అయిపోయాడు.. 10 కోట్లు డిమాండ్

  టీవీ ఛానల్‌లో గంభీరంగా క్రైం వార్తలు చెప్పే యాంకర్ హర్షవర్ధన్ తాను చదివే వార్తల పుణ్యమేమోగానీ, తాను కూడా క్రిమినల్ అయిపోయాడు. ఓ కాలేజీ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేయడంతో విజయవాడ పోలీసులు హర్షవర్ధన్‌ని అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్సాండెంట్‌ ఫాదర్‌ పి.బాలను హర్షవర్ధన్ 5 కోట్ల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే ఒక ప్రముఖ టీవీ చానెల్‌లో కాలేజీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దాంతో బాల పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు రంగంలోకి దిగి హర్షవర్ధన్‌తోపాటు అతనికి సహకరిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.