టీడీపీకి పవన్ కళ్యాణ్ అవసరమెంత?
posted on Aug 21, 2015 @ 11:45AM
ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ట్వీట్లతో నేతలపై మాటల యుద్ధం చేస్తున్నారు. అయితే ఈ ట్వీట్లకు అందరూ ఎలా ఉన్నా టీడీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ ట్వీట్లకు తగ్గట్టుగానే ఘాటుగా సమాధానమిస్తున్నారు. గతంలో కూడా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఇలాగే మాటల యుద్ధాలు.. ట్వీట్ల యుద్ధాలు జరిగాయి. అలాగే ఈసారి కూడా భూసేకరణ నేపథ్యంలో రైతల భూములు తీసుకోవద్దని.. ఏడాదికి మూడు పంటలు పండే భూములను లాక్కోవద్దని.. ఉండవల్లి, బేతపూడి, పెనుబాక భూములను భూసేకరణ నుండి మినహాయించాలని ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబునే కోరారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు యనమల స్పందించి భూసేకరణ వద్దంటున్నారు మరి ఏం చేయాలో కూడా చెబితే బావుంటుందని ఒకింత వెటకారంగానే సమాధానవిచ్చారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా రైతు సమస్యల గురించి మాట్లాడుతుంటే ఎటకారంగా ఉందా ఉంటూ స్ట్రాంగ్ గానే యనమలకు కౌంటర్ ఇచ్చారు.
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ట్వీట్లకు టీడీపీ నేతల్లో ఎవరో ఒకరు కాస్త ఘాటుగా స్పందించినా.. తరువాత ఆపార్టీకి సంబంధించిన నేతల్లో ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ కు తామేమి వ్యతిరేకం కాదంటూ వారు ఆ ఉద్దేశంతో అనలేదంటూ సమర్ధిస్తున్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో స్వయంగా చంద్రబాబే పవన్ కళ్యాణ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తామని.. తాము పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకం కాదని చెప్పారు. యనమల విషయంలో కూడా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో తమకు ఎలాంటి విబేధాలు లేవని.. తనని ఒప్పించే భూములు సేకరిస్తామని చెప్పారు.
దీనిని బట్టి చూస్తే టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ కు బాగానే ప్రాధాన్య ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాగా బీజేపీ టీడీపీ పార్టీలు మిత్రపక్షాలు అని తెలిసిన విషయమే. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ పార్టీలకు తన మద్ధతు ఎప్పుడో తెలిపాడు. ఈ నేపథ్యంలో టీడీపీ పవన్ కళ్యాతో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే తాను ఎంత ప్రశ్నించిన.. ఎంత ఘాటుగా ట్వీట్లు చేసిన టీడీపీ మాత్రం తనను సమర్ధిస్తూనే ఉంది. దీనికి కారణం అతనికి అభిమానులు ఎక్కువ.. జనాల్లో అతనికి ఉన్న క్రేజ్ కూడా కావచ్చు.
ఇదిలా ఉండగా మరోవైపు టీడీపీ పవన్ కళ్యాణ్ కు అంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా అని కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ కి వచ్చే లాభమేంటి అని అనుకుంటున్నారు. అందులోనూ నిజం లేకపోలేదు.. ఎందుకంటే ఎప్పుడో పార్టీ పెట్టి కొన్ని రోజులు అసలు ఏం మాట్లాడకుండా ఉండి.. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడే పవన్ కళ్యాణ్ వల్ల ఏం ఉపయోగముంటుందో పార్టీకే తెలియాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వల్ల వచ్చేదెంతో.. పోయేదెంతో తెలియదు కాని పవన్ కళ్యాణ్ మాత్రం తక్కువ టైంలోనే తన కంటూ ఒక ప్రాధాన్యతను ఏర్పరచుకున్నాడు. అది గొప్ప విషయమే కదా..