టీ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ..కేసీఆర్ ప్లాన్ సూపర్..

  తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల సెప్టెంబర్ 23న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తరువాత వాయిదాల అనంతరం మళ్లీ ఈరోజు నుండి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు మాత్రం అసెంబ్లీలో చాలా వేడి వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్యల గురించి చర్చించనున్నారు. ఏ అంశం మీదైతే ప్రతిపక్షాలు అధికార పార్టీమీద విమర్శల వర్షం కురిపిస్తున్నారో.. ఏ అంశం మీదైతే అసెంబ్లీలో చర్చించి అధికార ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ప్లాన్ చేశాయో ఇప్పుడు ఈ రోజు అదే అంశం మీద చర్చించనున్నారు. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిపక్షనేతలు ప్రశ్నించాలని అంశాల జాబితాలో తయారుచేసుకున్న నేపథ్యంలో మొదటిది రైతు ఆత్మహత్యల అంశం. దీని మీద టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెడదామనుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఆ ఛాన్స్ వారికి ఇవ్వలేదు. తానే ముందుగా ఈరోజు రైతుల అత్మహత్యలపై  ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు చర్చ జరిగే సమయంలో ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండటానికి ఈరోజు సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను సైతం రద్దు చేశారు. మొత్తానికి కేసీఆర్ ప్రతిపక్షనేతల ప్లానింగ్ ముందుగానే గమనించి తానే రివర్స్ ప్లాన్ చేసినట్టున్నారు.

ప్రధాని తల్లి పాచిపని చేయలేదట

ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ ఏనాడూ పాచిపని చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు, తమను పెంచడానికి తల్లి హీరాబెన్ చాలా కష్టపడిందని మోడీ చేసిన వ్యాఖ్యలపై తాము ఎంక్వైరీ జరిపామని, అయితే హీరాబెన్ ఎప్పుడూ పాచిపని చేయలేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇరుగుపొరుగు ఇళ్లలో పని చేసేవారని, గిన్నెలు తోమేవారని, నీళ్లు పట్టేవారని, పాచిపని చేసిందంటూ అబద్దమాడి తన తల్లిని మోడీ అవమానించారని ఆనంద్ శర్మ ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ మండిపడుతోంది, మోడీ తల్లి విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటూ మండిపడుతోంది.

కేసీఆర్, కడియంను ఉరికిచ్చి తంతారు

ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియంపై తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు, కేసీఆర్, కడియంను ప్రజలు ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు, తనను అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కుట్ర పన్నారన్న ఎర్రబెల్లి... అక్రమ కేసులతో జైల్లో ఉంచాలని చూశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతటి దౌర్జన్యం జరగలేదని, నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ కి రోజులు దగ్గర పడ్డాయన్నారు. శృతి, సాగర్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌కు కడియం శ్రీహరే బాధ్యత వహించాలన్న దయాకర్ రావు.... దమ్ముంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు

బాబోయ్.. మెగా హీరోయిన్ కు అప్పుడే రెండో సినిమానా?

ఈటీవీ ఢీ జూనియర్స్ డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా నాగబాబు కుమార్తె నిహారిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తూ అందరినీ బాగానే ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు నిహారిక సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.. దీనిపై ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. మెగ ఫ్యామిలీ నుండి ఇప్పటివరకూ హీరోలు మాత్రమే ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మెగా హిరోయిన్ గా నిహారికా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే నిహారిక లవర్ బాయ్ నాగశౌర్యకు జోడిగా నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లనేలేదు అప్పుడే నిహారిక ఖాతాలోకి మరో సినిమా చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మిణుగురులు సినిమా ద్వారా అవార్డ్ పొందిన అయోధ్య కుమార్ తాను తీయబోయే సినిమాలో నిహారిక ఎంపికైనట్టు తెలుస్తోంది. మొత్తానికి నిహారిక వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ మీద  ఉన్నట్టు తెలుస్తోంది. మరి మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న పాప ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.

ఏపీ సర్కారును పొగిడిన సత్య నాదెళ్ల

  మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల్ ఏపీ సర్కార్ పై.. ఏపీ సర్కార్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి గొప్పగా ప్రశంసించారు. మోడీ అమెరికా పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల మోడీతో భేటీ అయ్యారు. ఈసందర్బంగా వారు అనేక విషయాలపై చర్చించారు. ఈ భేటీలో సత్య నాదెళ్ల ఏపీ సర్కార్ తీరుపై ప్రశంసలు కురిపించారు. భేటీ సందర్బంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాల గురించి ప్రస్తావించి అందరిని ఆశ్చర్యపరిచారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు పాఠశాల విద్యార్ధులు చాలా కష్టాలు పడేవారని.. ట్రానిస్టర్ల సాయంతో అతికష్టం మీద పాఠాలు వినేవారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఆరోజులు పోయాయి.. ఇప్పుడు అదే శ్రీకాకుళంలో పాఠశాల విద్యార్ధులు స్కైప్ ద్వారా పాఠాలు వింటున్నారని అంతర్జాతీయ వేదికపై వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఏపీ సర్కార్ టెక్నాలజీని బాగా వాడుకుంటుంది అని ప్రశంసించారు. ఏదైనా ఒక అంతర్జాతీయ వేదికపై ఏపీ సర్కార్ ప్రశంసలు అందుకోవడం ఆనందించాల్సిన విషయమే.

ఆప్ ఎమ్మెల్యేపై సుప్రీం సీరియస్.. సాయంత్రంలోపు లొంగిపోవాలి

ఆప్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  సోమ్‌నాథ్ భారతిపై ఆయన భార్య గృహహింస హత్యాయత్నం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమ్‌నాథ్ భారతికి హెచ్చరిక చేసింది. సాయంత్రం 6 గంటల లోపు లొంగిపోవాలని ఆదేశించింది. ఈకేసుపై ఇప్పటికే సోమ్‌నాథ్ భారతి కింద కోర్టు.. హైకోర్టులను ఆశ్రయించారు.. అయితే అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ సాయంత్రం 6 గంటల లోపు లొంగిపోవాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మోడీ ముందు నవాజ్ తీసికట్టేనా?

  మోడీ రాజకీయ చతురత ముందు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ మాత్రం సరిపోడని ఇంతకు ముందు రష్యా పర్యటనలోనే తేలిపోయింది. పాకిస్తాన్ దేశంతో ఎప్పుడు చర్చలు ప్రారంభించాలో ఎప్పుడు నిలిపివేయాలో అన్నీ మోడీ అనుకొన్నట్లే జరిపించుకొన్నారు. మోడీ రష్యా పర్యటన సందర్భంగా స్వయంగా చొరవ తీసుకొని నవాజ్ షరీఫ్ తో సమావేశమవడమే అందుకు ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అదే నవాజ్ నవాజ్ షరీఫ్ మోడీతో సమావేశం కావాలని కోరుకొన్నా వీలుపడలేదు.   రష్యాలో వారి సమావేశం ముగిసిన తరువాత ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు ఒక ఉమ్మడి ప్రకటన చేసారు. అది కూడా అంతా మోడీ వ్రాసిచ్చిన స్క్ర్పిట్ ని పాకిస్తాన్ చదివినట్లే ఉంది తప్ప దానిలో పాక్ ప్రభావం ఎక్కడా కనబడలేదు. దానిలో ఇరుదేశాలు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. వివిధ స్థాయిల్లో ఇరు దేశాల అధికారుల మధ్య డిల్లీలో సమావేశాలు నిర్వహించేందుకు అంగీకరించాయి. భారత్ పై దాడులు చేసి పాక్ లో తలదాచుకొంటున్న ఉగ్రవాదుల అప్పగింతపై పాక్ చేత మాట్లాడించగలిగారు. అలాగని పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ కి అప్పగిస్తుందని కాదు. కానీభారత్ పై దాడులు చేసిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం, రక్షణ, ప్రోత్శాహం అందిస్తోందని పాక్ చేతే దృవీకరింపజేసినట్లయింది. ప్రతీ వేదికపై కాశ్మీర్ అంశం ప్రస్తావించే పాకిస్తాన్, ఇరుదేశాల విదేశీ కార్యదర్శులు చేసిన ఆ సంయుక్త ప్రకటనలో ఆ విషయం ప్రస్తావించడం మరిచిపోయింది. దానితో నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ తిరిగి వెళ్ళిన తరువాత అక్కడ మీడియా చేత చివాట్లు చీత్కారాలు ఎదుర్కోక తప్పలేదు.   అందుకే ఆ తరువాత ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి కుంటిసాకులతో హాజరు కాకుండా తప్పించుకొంది. కానీ దాని వలన ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్నే అనుమానంగా చూసాయి. మళ్ళీ ఇప్పుడు అమెరికాలో కూడా అదే పరిస్థితి ఎదురయింది. మోడీ తన దేశానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంటే నవాజ్ షరీఫ్ మాత్రం ఇంకా కాశ్మీర్ సమస్యనే పట్టుకొని వ్రేలాడుతున్నారు. మోడీ ముందు నవాజ్ షరీఫ్ తీసికట్టేనని పాకిస్తాన్ మీడియా చెప్పడమే అందుకు ఉదాహరణ.

మోడీ పై పాక్ ప్రశంసలు.. మోడీని చూసి నేర్చుకో షరీఫ్

పాకిస్తాన్ మీడియా మన ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసల జల్లు కురిపించింది. అంతేకాదు మోడీ చూసి పాక్ ప్రధాని షరీఫ్ నేర్చుకోవాలని కూడా సూచించింది. ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పాక్ మీడియా సంస్థలు మోడీ అమెరికా పర్యటనను బాగానే కవర్ చేసింది. ఈ సందర్భంగా వారు ప్రధాని ఘనతను కొనియాడారు. అమెరికాలో మోడీకి సినిమా స్టార్ లా స్వాగతం లభించిందని.. ఆయన ప్రత్యర్ధులను తలదన్నేలా ఉంటున్నారని పాక్ మీడియా తెలిపింది. అంతేకాదు మోడీ, షరీఫ్  ఐకాససెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లగా తమ ప్రధానిని ఉద్దేశించి.. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కు ఐక్యరాజ్య సమితిలో మాత్రమే మాట్లాడే అవకాశం లభించింది కానీ మోడీకి మాత్రం ఫేస్ బుక్, గూగుల్ సంస్థల నుండి కూడా స్వాగతం లభించిందని తెలిపారు. ఇది కేవలం పాక్ వ్యతిరేక తీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. మోడీ విదేశాలతో సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే షరీఫ్ అక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అంతేకాదు మోడీ చూసి నేర్చుకోవాలని ఆయన మార్గంలో నడవాలని కూడా సూచించింది. ఏదిఏమైనా ప్రత్యర్ధి దేశమైన పాకిస్తాన్ కూడా మోడీ ఘనతను మెచ్చుకోవడం అభినందించాల్సిన విషయమే.

గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్ బాబు

శ్రీమంతుడు సినిమా ఆదర్శంగా తీసుకొని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మహేశ్ బాబును కోరడం.. మహేశ్ బాబు కూడా కేటీఆర్ కోరిక మేరకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న దానిపై పరిశీలించిన పిమ్మట మహేశ్ బాబు సిద్దాపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా.. కొత్తూరు మండలంలో ఉంది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తెలంగాణలో ఓ గ్రామాన్ని.. ఆంధ్ర రాష్ట్రంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి విదితమే.

అమరావతి శంకుస్థాపన.. ముంబై సంస్థకు టెండర్

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం దసరా రోజు అంటే అక్టోబర్ 22న ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. సింగపూర్ ప్రధాని.. తదితర ఇంకా ముఖ్య అతిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఇంత అంగరంగ వైభవంగా చేపట్టదలచిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ముంబైకు చెందిన విజ్ క్రాఫ్ట్ అనే సంస్థ దక్కించుకుంది. అమరావతి శంకుస్థాపనకు గాను.. భూమి పూజ నిమిత్తంగాను చేపట్టవలసిన కార్యక్రమాలను సీఆర్డీఏ ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టెండర్ ప్రక్రియను నిర్వహించారు. కానీ దీనిలో రెండు సంస్థలే పాల్గొనగా ముంబైకి చెందిన విజ్ క్రాఫ్ట్ సంస్థ రూ 9.5 కోట్లకు బాధ్యత నిర్వహణలను కైవసం చేసుకుంది.

ఎర్రబెల్లిపై హత్యాయత్నం కేసు

టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై కేసు నమోదైంది. చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డు గోదాంల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో టీడీపీనేత ఎర్రబెల్లి దయాకర్ రావు తన అనుచరులు పోలీసులపై టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో ఎర్రబెల్లితో పాటు ఆయన అనుచరులు 17 మందిపై హత్యాయత్నం కేసు నమోదుచేశారు. అడిషినల్ ఎస్పీ, జనగామ ఇన్‌చార్జి డీఎస్పీ సంఘం జాన్‌వెస్లీ ఈ విషయాన్ని తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. యార్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రావాల్సి ఉంది ..కానీ ఆయన రాకముందు ఎర్రబెల్లి శిలాఫలకాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ నేతలు దీనిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వివాదం ఏర్పడి టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడనున్న పోలీసులకు, మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఎర్రబెల్లిపై అతని కార్యకర్తలపై హత్యాయత్నం, దొమ్మి, పోలీసులపై దాడి, కుట్ర కేసులతోపాటు ఇతర కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు ఊరట

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నుండి ముగ్గురు, కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు, వైసీపీ పార్టీనుండి ఒక్కరు పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ నేత ఎర్రబెల్లి.. కాంగ్రెస్ పార్టీ నేత సంపత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలని అటు తెలంగాణ అధికార పార్టీని.. స్పీకర్ ను ఆయా పార్టీల నేతలు చాలా సార్లు అడిగారు. దీనిలో భాగంగా గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారివల్ల ఎలాంటి ఉపయోగంలేని కారణంగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇది స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని.. స్పీకర్ ను ఆదేశించలేమని తెలిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో ఆలోచన చేయాలని మాత్రమే సూచించింది.

బొత్సనా.. మజాకా..

  ఏపీలో అధికార టీడీపీ పార్టీకి గట్టిపోటీ నిచ్చే ప్రతిపక్షపార్టీ వైకాపా పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉనికి లేని కారణంగా టీడీపీకి ప్రతిపక్ష నేతగా జగన్ గట్టిపోటి ఇవ్వగలరూ అని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే అది రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో.. అప్పుడు పరిస్థితులు బాలేక అధికార పార్టీకి రోజుకో తలనొప్పి తయారయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడింది. పార్టీ రోజు రోజుకు బలపడుతుందనే రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈనేపథ్యంలో జగన్ పై అప్పుడున్న నమ్మకం ఇప్పుడు లేదనే అనిపిస్తుంది. దీనికో తోడు పార్టీలో ఉన్న నేతలు కూడా ఏదో నామమాత్రంగా.. ఏదో ఒక పార్టీలో ఉన్నాం కదా అన్న ధోరణిలో ఉన్నారు తప్ప.. పార్టీని బలోపేతం చేసే ఏవిధమైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అంతేకాదు మరోవైపు జగన్ పై కూడా పార్టీ నేతలు కొంత వరకూ అసంతృప్తికరంగానే ఉన్నారు. పార్టీలో అంతా తానై ఉండటం.. ఏదో పదవి ఆశించినా అది కాస్త తన సన్నిహితులకు ఇవ్వడంపై చాలా మంది నేతలు ఇప్పటికే జగన్ పై అసంతృప్పితో ఉండి పార్టీ నుండి బయటకు కూడా వచ్చేశారు. అయితే అందరి పరిస్థితి ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి జంప్ చేసిన మాజీ మంత్రి - మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్లిన బొత్స కొద్దిరోజులకే పార్టీలో తన దంటూ మార్క్ వేసుకొని.. తన టాలెంట్ తో జగన్ తర్వాత నెం 2 స్థానాన్ని దక్కించుకున్నాడు. బేసిక్ గా బొత్సకు రాజకీయానుభవం ఎక్కువ.. మంచి వాక్చాతుర్యం ఉంది.. రాజకీయాల్లో ఎత్తుగడలు బాగా తెలుసు. వీటివల్లే ఇప్పుడ బొత్స జగన్ కు కుడి భుజంలా తయారయ్యారు. సాధారణంగా ఏదైనా మీడియా సమావేశంలో మాట్లాడాలంటే దానికి జగన్ పర్మిషన్ తీసుకోవాలి.. అంతేకాదు ఎలా మాట్లాడాలి అనే విషయం కూడా జగనే చెపుతారు. అలాంటిది బొత్స మాత్రం తానే జగన్ ను సంప్రదించి.. ఈవిషయంపై మాట్లాడితే బావుంటుంది.. ఈ విషయంపై ప్రెస్ మీట్ పెడదాం మీరేమంటారు అంటూ జగన్ తో ఓకే చెప్పిస్తున్నారంట. దీంతో ఇంతకాలం పార్టీలో ఉన్న నేతలు బొత్స ధైర్యం చూసి ముక్కున వేలేసుకుంటున్నారట. అందుకే జగన్ కు కూడా బొత్సపై నమ్మకం కలిగి పార్టీ బాధ్యతలు దగ్గరుండి మరీ చూసుకోమని చెప్పారు. అయితే బొత్స మాత్రం అధికారాలు ఇచ్చారు కదా అని ఎక్కడా అతిగా ప్రవర్తించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. కేవలం పార్టీ కార్యక్రమాలు.. ప్రతిపక్షపార్టీపై ఎలాంటి ఎత్తుగడలు ఉపయోగించాలి అనే విషయాలు మాత్రమే చూసుకుంటున్నారట. మొత్తానికి బొత్స రాజకీయానుభవం ఏంటో దీనిని బట్టి మనకు అర్ధమైపోతుంది. ఇంత తక్కువ టైంలో అదీ వేరే పార్టీ మారినప్పటికీ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే అన్నీ బానే ఉన్నా ఇప్పుడు వైకాపా పార్టీ నేతలు మాత్రం బొత్స పై కుళ్లుకుంటున్నారట. ఇంతకాలం పార్టీలో ఉన్న కూడా తమకు దక్కని ప్రయారిటీ బొత్సకు దక్కిందని తెగ బాధ పడిపోతున్నారట.

కంటతడి పెట్టిన మోడీ.. టీలు అమ్మేవాడిని

  ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మోడీ ఒక సందర్బంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడంతో అందరూ ఆశ్యర్యపోయారు. జుకర్ బర్గ్.. ప్రధాని మోడీని ప్రశ్నలు వేస్తుండగా అందుకు మోడీ కూడా సమాధానం చెప్పారు. అయితే జుకర్ బర్గ్ కుటుంబాల విషయంలో మీకూ మాకూ ఒకేలాంటి పరిస్థితులు ఉంటాయి కదా అని ప్రశ్నించిన నేపథ్యంలో మోడీ తన బాల్యం గురించి వివరించారు. తమది చాలా పేద కుటుంబమని.. అందరి కుటుంబాలలో మాదిరిగానే మా కుటుంబంలో కూడా మమ్మల్ని పెంచడంలో మా తల్లి దండ్రులు కీలక పాత్ర పోషించారని అన్నారు. అంతేకాదు నేను బాల్యంలో టీలు అమ్మేవాడిని.. నాతల్లి మమ్మల్ని పోషించడానికి పక్క ఇళ్లలో పనులు చేసేదని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టేశారు. ఇప్పటికీ నా తల్లి తన పనులు తానే చేసుకుంటుందని ఇప్పుడు ఆమెకు 90 ఏళ్లు అని చెప్పారు. అయితే వెంటనే తేరుకొని మోడీ జుకర్ బర్గ్ పై ప్రశంసలు కురిపించారు. వేదిక వద్ద ఉన్న తన తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మీ అబ్బాయి ప్రపంచ దృష్టినే మార్చేశాడు’’ అని.. అందరూ కనిపించేలా వారిని లేచి నిలుచోవాలని కోరారు.  

పి.ఎస్.ఎల్.వి సి-30 శాటిలైట్ విజయవంతం

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈరోజు ఉదయం 10 గంటలకి శ్రీహరికోట నుండి ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి సి-30 విజయవంతం అయ్యింది. భారత్ కి చెందిన ఆస్ట్రో శాట్ తో బాటు విదేశాలకు చెందినా మరో ఆరు ఉపగ్రహాలను కూడా పి.ఎస్.ఎల్.వి సి-30 ద్వారా  ఇస్రో శాస్త్రజ్ఞులు నిరేశిత కక్ష్యలోకి విజవంతంగా ప్రవేశపెట్టగలిగారు.     ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రజ్ఞులు సుమారు పదేళ్ళపాటు నిర్విరామంగా శ్రమించారు. 1513 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహం కేవలం ఖగోళ పరిశోధనలు మాత్రమే వినియోగిస్తారు. అందుకోసం ఈ ఉపగ్రహంలో అత్యాధునిక అల్ట్రా వయొలెట్ టెలిస్కోపులు, ఇమేజేర్స్, మానిటర్ వంటి పరికరాలను అమర్చారు. బ్లాక్ హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాలు, అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం, నక్షత్రాల ఆవిర్భావం వంటి వాటి గురించి ఈ ఉపగ్రహం ద్వారా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం ఐదేళ్ళపాటు సేవలు అందిస్తుంది.    ఇది ఖగోళ పరిశోధనలకే పరిమితమయిన ప్రయోగం అయినప్పటికీ, ఇండోనేషియా, కెనడా, అమెరికా లకు చెందిన మొత్తం ఆరు విదేశీ ఉపగ్రహాలను కూడా పి.ఎస్.ఎల్.వి సి-30 ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెడుతున్నారు. ఆయా దేశాల నుండి ఫీజు రూపేణా చాలా భారీ మొత్తం అందుతుంది కనుక ఈ ప్రయోగం కోసం చేసిన కొంత ఖర్చును భారత్ తిరిగి రాబట్టుకొన్నయింది. ఇంతవరకు ఇస్రో మొత్తం 50 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెట్టింది. ఇంతకు ముందు కూడా భారత్ ఒకేసారి ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది మళ్ళీ మూడవసారి.

మా మీదే కేసులున్నాయి.. నాయిని

తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలకు బలిగొని అమరులైన కుటుంబాలకు ఇప్పుడు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఐదుగురి కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేస్తుందని.. రూ. 10 లక్షల చెక్కులు అందజేశారు. ఉద్యమంలో పాల్గొన్న సమయంలో చాలామందిపై అప్పటి ప్రభుత్వం చాలా కేసులు పెట్టిందని.. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుమారు వెయ్యిమందికి పైగా కేసులు రద్దు చేశామని తెలిపారు. అయితే రైల్వే పోలీసులు పెట్టిన కేసులు ఇంకా రద్దు కాలేదని.. నా మీదే ఐదు కేసులు ఉన్నాయి.. వాటిలో మూడు కేసులను కోర్టు కొట్టివేయగా మిగిలిన రెండు కేసుల్లో భాగంగా ఇప్పటికీ కోర్టుకు హాజరవుతూనే ఉన్నానని అన్నారు. అంతేకాదు 1969 సంవత్సరంలో మరణించిన వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామని తెలిపారు.