హైదరాబాద్ లో పోటీకి జనసేన సన్నాహాలు?

  జనసేన పార్టీని తెలంగాణ ఎన్నికల కమిషన్ లో రిజిస్టర్ చేయడం, జనసేన పార్టీని గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి, గత ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్ధతిచ్చిన పవన్... గ్రేటర్ ఎన్నికల్లో జనసేనను బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది, అయితే ఒంటరిగా బరిలోకి దిగుతారా? లేక బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు పవన్ సన్నిహితులు, అయితే పార్టీ నిర్మాణం జరగనందున ఈసారికి పొత్తు పెట్టుకుని... కొన్ని సీట్లలో మాత్రమే జనసేన పోటీ చేయొచ్చని అంటున్నారు.

కేసీఆర్ మెడకు చుట్టుకుంటోన్న మరో కేసు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, ఈఎస్ఐ బిల్డింగ్స్ కాంట్రాక్ట్ విషయంలో ఇప్పటికే కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించగా, ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం బయటికొచ్చింది, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు... సహారా గ్రూప్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని, సహారా గ్రూప్ లో ఐదు కంపెనీలు సొంతంగా ప్రావిడెండ్ ఫండ్ నిర్వహించే వెలుసుబాటు కల్పిస్తూ కేసీఆర్ ఆదేశాలిచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, ఈ నిర్ణయంతో ఆ కంపెనీల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది, దాంతో సీబీఐ దీనిపైనా ఫోకస్ పెట్టిందని, సహారా పీఎఫ్ అకౌంట్లపై దర్యాప్తు జరపనున్నట్లు తెలిసింది, పైగా సహారా గ్రూప్ చేపట్టిన డిపాజిట్ల సేకరణ వివాదాస్పదం కావడం, ఏడాదికాలంగా సుబ్రతారాయ్ జైల్లో ఉన్న నేఫథ్యంలో ఈ కేసు కూడా కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశముందని అంటున్నారు.

మంత్రులపై చంద్రబాబు సీరియస్

  మంత్రుల పనితీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని చాలామంది మంత్రులు సీరియస్ గా తీసుకోలేదని, తాను రేయింబవళ్లు పనులను పర్యవేక్షించినా మంత్రులు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారట. వచ్చామావెళ్లామా అన్నట్లుగా మీడియాకి కనబడి వెళ్లిపోయారని, కనీసం గుంటూరు, కృష్ణాజిల్లాల మంత్రులు కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఇన్వాల్స్ కాలేదని చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతున్నారు. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకునే చంద్రబాబు... అమరావతి శంకుస్థాపన కార్యక్రమం మీద కూడా రిపోర్ట్ తెప్పించుకున్నారని, అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే చంద్రబాబు ... మంత్రులపై సీరియస్ అయ్యారని చెప్పుకుంటున్నారు, అయితే మంత్రులు కూడా బాబు తీరుపై అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది, తమకు బాధ్యతలు అప్పగించకుండా బొమ్మల్లా ఉంచితే తామేం చేయాలని, అయినా కమిటీలు వేసి అన్ని పనులూ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకే అప్పగిస్తే... మాకు ఏం పని ఉంటుందని మంత్రులు వాపోయారట.

ఫొటోలు వేయొద్దనడం సరికాదు... కేంద్రం

  ప్రభుత్వ ప్రచార ప్రకటనల్లో ముఖ్యమంత్రులు లేదా మంత్రుల ఫొటోలు వేయరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది, ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలను ప్రకటనల్లో వేయొద్దని చెప్పడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకు తెలిపిన కేంద్రం... ఈ మేరకు అటార్జీ జనరల్ తో అఫిడవిట్ దాఖలు చేయించింది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుందని, అలాంటప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రుల ఫొటోలను వాడొద్దనడం సరికాదని అటార్జీ జనరల్ ధర్మాసనానికి నివేదించారు, ఓ ఎన్జీవో సంస్థ వేసిన పిల్ ను విచారించిన సుప్రీం...  ప్రభుత్వ ప్రకటనల్లో ప్రభుత్వాధినేతల ఫొటోలు వేయొద్దని ఆదేశించింది, అయితే ఇప్పుడు కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో మరోసారి ఈ కేసును అత్యున్నత ధర్మాసనం విచారించనుంది

నవంబర్ ఫస్ట్ వీక్ లో భూసేకరణ అమలు

  ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది, ఇప్పటికే 33వేల ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం... భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాలని భావిస్తోంది, అమరావతి ప్రాంతంలో ఇంకా సుమారు 300 ఎకరాలు భూమి అవసరం కానుందని, అందుకే నవంబర్ ఫస్ట్ వీక్ లో భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి పుల్లారావు తెలిపారు, సమీకరణ ద్వారానే రైతుల నుంచి భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని, అందుకు మరోసారి రైతులతో చర్చలు జరుపుతామని, రైతులు ముందుకు రాకపోతే భూసేకరణ చట్టం ద్వారా తీసుకుంటామని ఆయన తెలిపారు, భూసేకరణ చట్టం అమలుపై ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుందని, ఇక రాజీపడే ప్రసక్తే లేదన్నారు

తెలంగాణ మంత్రికి మావోయిస్టుల వార్నింగ్

  తెలంగాణ మంత్రి చందూలాల్ పై మావోయిస్ట్ పోస్టర్లు వెలిశాయి, చందూలాల్ ఎన్ కౌంటర్లను ప్రోత్సహిస్తున్నాడంటూ వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో మావోయిస్టులు పోస్టులు వేశారు, కరీంనగర్-ఖమ్మం-వరంగల్ మావోయిస్ట్ కార్యదర్శి దామోదర్ పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో మంత్రి చందూలాల్ ను హెచ్చరిస్తూ వార్నింగ్ ఇచ్చారు, ఇటీవల వరంగల్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో వెలిసిన ఈ పోస్టర్లపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు, కమలాపురం గ్రామంలో పలువురిని పోలీసులు ప్రశ్నించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే గిరిజన మంత్రి చందూలాల్ ను బెదిరిస్తూ మావోయిస్టు పోస్టర్లు వెలియడంతో వరంగల్ జిల్లాలో కలకలరం రేగుతోంది.

వరంగల్ ఉపఎన్నిక.. వివేక్ లేదా సర్వేకు టికెట్

  వరంగల్ ఉపఎన్నికకు పోటీ చేసేందుకుగాను అభ్యర్ధుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగానే టీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో చర్చలు జరిపారు. వరంగల్ ఉపఎన్నిక గురించి రాహుల్ ఉత్తమ్ తో భేటీ అయి.. ఈ ఎన్నికకు అభ్యర్ధులుగా వివేక్ ను, సర్వే నారాయణను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పోటీలో నిలబడాలని వివేక్ పై ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. ఒకవేళ వివేక్ కనుక ఒప్పుకోకపోతే సర్వే నారాయణను బరిలో దింపాలని చూస్తోంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయం కుదిరింది. ఎన్నిక బరిలో దిగేందుకు టీడీపీ, బీజేపీకే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంక టీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు బరిలో దిగుతారనేది కేసీఆర్ ఢిల్లీ నుండి వచ్చిన తరువాతనే తెలుస్తోంది.

కేసీఆర్ ను కరుణించని మోడీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యర్ధులపై ఎలా విరుచుకుపడతారో తెలిసిన విషయమే. వాళ్లూ.. వీళ్లూ అని చూడరూ.. తన మాటల తూటాలకి అందరిని బలి చేసేస్తుంటారు. కానీ ఇప్పుడు అదే తీరు కేసీఆర్ కు కాస్తంత ఇబ్బందికరంగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల నేపథ్యంలో ఒకరి మీద ఒకరు అవాకులు చవాకులు పేల్చుకోవడం మామూలే కానీ కేసీఆర్ కాస్తంత దూకుడిగా ప్రధాని నరేంద్ర మోడీపై కూడా అదే రీతిలో విమర్శలు చేశారు. మరి అప్పుడు అన్న మాటల్ని మోడీ అంత త్వరగా మర్చిపోతారా.. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. ఎప్పటినుండో కేంద్రంతో కేసీఆర్ కు అంత మంచి సంబంధాలు లేవు.. అందుకే ఎప్పుడు కేసీఆర్ మోడీని కలుద్దామనుకున్నా మోడీ  మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు మళ్లీ ఈ విషయంలో కేసీఆర్ కు నిరాశే ఎదురైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ పనిలో పనిగా మోడీని కలుద్దామనుకున్నారు. కానీ మోడీ మాత్రం కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత్ నుండి తప్పిపోయి పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాలు ఉన్న గీత తిరిగి భారత్ కు వచ్చిన నేపథ్యంలో స్వయంగా ప్రధాని ఆమెను కలిసి.. ఆమెతో కాసేపు ముచ్చటించారు కూడా. అయితే అదే రోజు అపాయింట్ మెంట్ అడిగిన కేసీఆర్ కు మాత్రం తనను కలిసే ఛాన్స్ ఇవ్వలేదు. అయితే కేసీఅర్ కు ఇదే మెుదటిసారి కాదు.. ఇంతకుముందు కూడా చాలాసార్లు మోడీ తనను కలిసే ఛాన్స్ కేసీఆర్ కు ఇవ్వలేదు. అయితే మొన్న జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీతో కేసీఆర్ కాస్తంత దగ్గరగా మెలిగినట్టు కనిపించినా ఈ సారి కూడా అపాయింట్ మెంట్ కరువైంది. దీనిని బట్టి అర్ధమైన విషయం ఏంటంటే ఏంత బలమున్న నాయకుడైనా ఢిల్లీ ముందు చిన్న నాయకుడే అని. కేసీఆర్ ఇప్పటికి ఈ విషయం గ్రహించినట్టున్నారు. అందుకే మోడీని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు. మరి కేసీఆర్ పొగడ్తలకు మోడీ పడతారో.. లేదో.. ఈ సారైనా కేసీఆర్ కు మోడీని కలిసే ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.

వరంగల్ మాదే... నారాయణఖేడ్ కూడా మాదే...

  వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... కేసీఆర్ పాలనపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెబుతోంది. ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ విధానాల పట్ల 80శాతం పైగా ప్రజలు పాజిటివ్ గానే ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి అన్నారు, దాదాపు 57శాతం ఓట్లతో వరంగల్ ఎంపీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామని, అలాగే నారాయణఖేడ్ ను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు, విపక్షాలు ఎంత గింజుకున్నా ఉపయోగం లేదని, ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలకు అసలు అభ్యర్ధులే దొరకడం లేదన్న ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి... టీఆర్ఎస్ టికెట్ కో్సం పాతికమంది పోటీపడుతున్నారని అన్నారు.

కేసీఆర్ రావడమే ఆలస్యం.. వెంటనే ప్రకటన

  వరంగల్ ఉపఎన్నికకు సంబంధించి పలు పార్టీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికకు పోటీచేసే విషయంపై టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం కుదిరినట్టు, టీడీపీ బీజేపీకే ఆఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు చర్చమొత్తం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయంపైనే జరుగుతుంది. ఎందుకంటే ఈ పార్టీ తరుపున ఎవరు బరిలో దిగుతారు అన్న విషయంపై ఇంతవరకూ ఓ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.. ఆయన వస్తేకాని ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంతో కేసీఆర్ ఢిల్లీ నుండి తిరిగి రాగానే పార్టీ నేతలతో..వరంగల్ జిల్లా నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈనేథ్యంలో రేపు కేసీఆర్ పార్టీ నేతలతో భేటీకానున్నారు. కాగా ఇప్పటికే ఈ ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ నుండి పదవిని ఆశిస్తున్న వారిలో పసునూరి దయాకర్.. గుడిమల్ల రవికుమార్.. ప్రొఫెసర్ సాంబయ్య.. డాక్టర్ రమేశ్.. ఎర్రోళ్ల శ్రీనివాస్.. కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కడియం శ్రీహరి మాత్రం తన కూతురు ఈ బరిలో లేదని తేల్చి చెప్పారు. అయితే వరంగల్ ఉపఎన్నికకు సంబంధించి పోటీ చేసే అభ్యర్ధి విషయంలో కేసీఆర్ పూర్తి అవగాహనతో ఉన్నారని.. ఈవిషయంలో కేసీఆర్ ఎప్పుడో క్లారిటీతో ఉన్నారని కొంతమంది నేతలు అనుకుంటున్నారు. అత్యంత ప్రాముఖ్యమైన వరంగల్ ఉపఎన్నిక విషయంలో కేసీఆర్ ఎప్పుడో కసరత్తు చేశారని.. అభ్యర్ధి ప్రకటన విషయంలో సరైన సమయం కోసం చూస్తున్నారని అనుకుంటున్నారు. ఏదీఏమైనా కేసీఆర్ ఎప్పుడో ఫిక్స్ అయిన అభ్యర్ధి ఎవరో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

జూన్ 2 తరువాత విజయవాడ నుండే పాలన

  రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి పదహారు నెలలు పైనే అయిపోయింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న శాఖల్లో కొన్ని శాఖలు విజయవాడకు తరలిపోయాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 2 నుండి ఎట్టి పరిస్థితిల్లోనూ విజయవాడనుండే పాలన సాగించాలని అధికారులకు సూచించడంతో ఆదిశగా ఉద్యోగులను సమాయత్తపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా మంగళవారం ఒక సర్కులర్ జారీ చేశారు. దీనిలో ఆయన ఉద్యోగులందరికీ మూడు ఆప్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  అవి నవంబర్‌ 30 లోపు ఎవరెవరు వెళ్తారు? వచ్చే ఫిబ్రవరి ఆఖరుకు ఎవరు వెళ్తారు? జూన్‌ 1 నాటికి ఎవరు వెళ్తారు? అని అందులో అడిగారు. అందరూ ఒకేసారి వెళ్లడం కంటే..దశలవారీగా వెళితేనే బావుంటుందని.. అక్కడ ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాడు చేయడానికి కూడా వీలుంటుందని తెలుపుతూ.. నెలాఖరులోపు వివరాలు అందజేయాలని సూచించారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా మీనా జారీ చేసిన సర్కులర్ పై సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిధంగా ఆప్షన్లు ఇస్తే కష్టమని అందరికి, గందరగోళం తలెత్తుతుందని..సచివాలయం మొత్తానికి ఒకే రకమైన పద్ధతిని అమలు చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావును కలిసి విజ్ఞప్తి చేశారు. మొత్తానికి వచ్చే ఏడాది నుండి పరిపాలన మొత్తం విజయవాడనుండే జరగబోతుందన్నమాట.

కేసీఆర్ యాగం వెనుక అసలు కారణం అదా?

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ చివరి వారంలో చండీయాగం చేయడానికి పూనుకున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ ఇంత సడన్ గా చండీయాగం చేయాలనుకోవడానికి గల కారణాలు ఏంటి.? ఆయనకు కొంచం దైవభక్తి ఎక్కువ కాబట్టి ఈ యాగం చేయాలనుకుంటున్నారా? లేక ఏదైన కారణంతో ఈ యాగానికి పూనుకున్నారా? అని ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే కేసీఆర్ యాగం చేయడానికి పూనుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నేతలు అనుకుంటున్నారు. కేసీఆర్ కు వచ్చే ఏడాది పదవీ గండం ఉందని.. అది ఏ రూపంలోనైనా రావచ్చని జ్యోతిష్కులు చెప్పారంట.. దీంతో కేసీఆర్ ఈ చండీయాగానికి పూనుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటుంది.. దానికి తోటు రీసెంట్ గా సీబీఐ కేసుతో కూడా కొంత సమస్య ఉంది.. అన్ని ఒకత్తైతే అసలు సమస్య రాజకీయంగా ఇంటిపోరు సమస్య ఎక్కువైంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో తనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి కేసీఆర్ ఈయాగం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏంటో కేసీఆర్ కే తెలియాలి.

రాజధానికి ఉచితంగా భవనం.. చంద్రబాబు హ్యాపీ

  ఏపీ రాజధాని అమరాతికి విరాళాలు బాగానే వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు చేపట్టిన నా ఇటుక - నా అమరావతి ద్వారా ఇటుకల రూపంలో విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా  జనచైతన్య గ్రూప్ కూడా ముందుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో భారీ భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తామని జనచైతన్య గ్రూప్ ఛైర్మన్ మాదాల చైతన్య చంద్రబాబుకు తెలిపారు. తన తల్లి శంకుతల పేరిట.. దాదాపు 26 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించడానికి మాదాల చైతన్య ముందుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు జనచైతన్య గ్రూపుని అభినందించారు. ఆంధ్రా నుంచి పుట్టిన కంపెనీలు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే రాజధాని ప్రపంచం గర్వించేలా తయారవుతుందని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఏపీ ప్రత్యేక హోదా.. కేంద్రం.. మధ్యలో జయలలిత

ఏపీ ప్రత్యేక హోదా రాకపోవడానికి.. కేంద్రం ప్రత్యేక హోదా గురించి ఏం నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితనే కారణమా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఏపీ ప్రత్యేక హోదాకి.. జయలలితకు.. కేంద్రానికి మధ్య సంబంధం ఏంటా అనుకుంటున్నారా. అదేంటంటే కేంద్రం కనుక ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే.. తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులుకాని.. పరిశ్రమలు కానీ రావని.. అవి ఏపీకి వెళతాయని.. ఈ ఉద్దేశ్యంతోనే జయలలిత ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి అడ్డుపుల్ల వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగని జయలలితను కాదని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాని ప్రకటించలేని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం రాజ్యసభలో జయలలిత మద్దతు తప్పనిసరి. అందుకే మోడీ కూడా ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడానికి కారణం. ఇదే విషయాన్ని కేంద్రమంత్రులు చంద్రబాబుకు కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది. మీరు కనుకు ఈ విషయంలో జయలలితను ఒప్పించగలిగితే ప్రత్యేక హోదాపై కేంద్రానికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చని సూచించారట. దీంతో చంద్రబాబు జయలలితను ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచనలో పడ్డట్టు సమాచారం. తమిళనాడుకు ఏపీ ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెప్పి జయలలితను ఒప్పించాలి. మరి ఏ రకంగా చంద్రబాబు జయలలితను ఒప్పిస్తారో చూడాలి

హోదా ఇస్తే వైసీపీ కనుమరుగా?

  ఆంధ్రప్రదేశ్ కి ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే... ఏపీలో అసలు ప్రతిపక్షమే ఉండదని టీడీపీ నేత టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు, స్పెషల్ స్టేటస్ వస్తే క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందని, అయినా హోదా అడిగేందుకు బాబు భయపడుతున్నారనడం అర్థరహితమన్నారు. ఒకవేళ ఏపీకి హోదా వస్తే... వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగవుతుందని టీజీ వెంకటేశ్ జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు ఈశాన్య రాష్ట్రాల కంటే బాగా వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని, లేకపోతే సీమకు మరోసారి దగా జరుగుతుందని టీజీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలంటే అమరావతిని ఫ్రీజోన్ గా చేయాలని సూచించారు.

దానం, టీఆర్ఎస్ మంత్రి పద్మారావు భేటీ.. ఎందుకు?

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి చేరుతున్నారు అన్న వార్తలు జోరుగానే ప్రచారం జరిగాయి. అయితే దానం మాత్రం వాటిని ఖండించి.. ఆవార్తల్లో ఏమాత్రం నిజం లేదు.. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు.. అని చెప్పారు. అంతేకాదు అప్పుడే ఆయన హైకమాండ్ కు  పార్టీ కోసం పనిచేసే నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓ సూచన కూడా చేశారు. అయితే ఇన్ని చెప్పిన దానం నాగేందర్ పై మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దానం నాగేందర్ ఇంటికి టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి పద్మారావు వెళ్లారు. దాదాపు గంటకు పైగా వీరిద్దరు చర్చలు జరిపారు. దీంతో ఇప్పుడు వీరిద్దరూ దేనికి సమావేశమయ్యారు.. దేని గురించి చర్చించారు అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా దానం నాగేందర్ మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత టిఆర్ఎస్ నేత డి శ్రీనివాస్‌కు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో దానం కూడా డీఎస్ మాదిరి టీఆర్ఎస్ గూటికి చేరుతారు అనే వార్తలు ఊపందుకుంటున్నాయి. మరి ఈభేటీకి దానం ఏం సమాధానం చెబుతారో..

ఎమ్మెల్యేకి అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్

  పాలమూరులో కరువు తీవ్రతను వివరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరితే ఇవ్వడం లేదని అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ అన్నారు, మహబూబ్ నగర్ జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని, దీనిపై సీఎంకు విన్నవించాలని ప్రయత్నించానని, అయితే కేసీఆర్ కనీసం అపాయింట్ మెంటే ఇవ్వడం లేదని సంపత్ ఆరోపించారు, గత ఎన్నికల్లో ఆర్డీఎస్ ను చూపించి ఓట్లు సంపాదించుకున్న కేసీఆర్ ఇప్పుడెందుకు దాన్ని పట్టించుకోవడం లేదని సంపత్ ప్రశ్నించారు, పండగల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్... కరువుతో అల్లాడుతున్న ప్రజానీకాన్ని మాత్రం ఆదుకోవడం లేదని సంపత్ మండిపడ్డారు.

బాలయ్య, గల్లాపై వీర్రాజు ఫైర్

  టీడీపీ నేతలు బాలకృష్ణ, గల్లా జయదేవ్ పై ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు, కేంద్రంపైనా, మోడీపైనా ఇష్టమొచ్చినట్లు అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మోడీపై బాలకృష్ణ, గల్లా జయదేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన... ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిందించొద్దని సూచించారు, టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తాము కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుందని, అవసరమైతే పదవులను సైతం వదులుకుని టీడీపీ సర్కార్ పై విమర్శలు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు, మిత్రపక్షమైనందుకే టీడీపీపై తాము విమర్శలు చేయడం లేదని, అయితే అవినీతి జరిగితే మాత్రం కచ్చితంగా ప్రశ్నిస్తామని అన్నారు.