చంద్రబాబును కలిసిన రేవంత్, ఎర్రబెల్లి.. ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు

తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. వరంగల్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతలు సమావేశమవ్వగా ఇరువురి నేతల మధ్య వివాదం తలెత్తి తీవ్రమైనస్థాయిలో విమర్సించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు.. పార్టీ పరువు తీస్తున్నారని.. వారిని విజయవాడలో ఉన్న తనను కలవమని చెప్పగా ఈ రోజు కలిశారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వరర్రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనకు ఏమాత్రం గుర్తింపు లేదని.. తనకు ఏమాత్రం సమాచారం అందిచకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. టీఆర్ఎస్ పై ఉమ్మడి పోరు సాగిద్దామన్నా తనకు ఎవరూ మద్దతు పలకడంలేదని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలస్తోంది. దీంతో చంద్రబాబు సమస్యను పెద్దదిగా చేసుకోవద్దు.. మిగిలిన నేతలతో నేను మాట్లడతానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఎర్రబెల్లి మిగిలిన నాయకులు రేవంత్ రెడ్డిది ఒంటెద్దు పోకడని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ సమావేశంలోనే వరంగల్ ఉపఎన్నిక గురించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాం-ఉత్తమ్

  వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు, త్వరలోనే వరంగల్ అభ్యర్ధిని ప్రకటిస్తామన్న ఉత్తమ్... లక్ష ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు, హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అన్ని రంగాల్లోనూ టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. వరంగల్ అభ్యర్ధి ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, ఇప్పటికే ఐదుగురి పేర్లను అధిష్టానానికి పంపించామని తెలిపారు, అయితే ఎక్కువమంది పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ పైనే మొగ్గుచూపుతున్నారని అన్నారు.

లోకేష్ స్నేహితుడు అభీష్టపై ఆరోపణలు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టార్గెట్ చేశారు, ప్రభుత్వ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం పెరిగిపోతుందని, సెకండ్ పవర్ సెంటర్ గా వ్యవహరిస్తున్నాడని రఘువీరా ఆరోపించారు. చంద్రబాబు ఆఫీస్ లోని ఫైళ్లన్నీ చినబాబు కనుసన్నల్లోనే కదులుతున్నాయన్న విమర్శించిన రఘువీరారెడ్డి... లోకేష్ సన్నిహితుడు అభీష్టను సీఎం పేషీలో ఓఎస్డీగా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా నియమ నిబంధనలకు విరుద్ధంగా అభీష్టను నియమించారని, అసలు అభీష్టకున్న అర్హతలేంటో చెప్పాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ.. నిధులివ్వండి ప్లీజ్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్దికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశయ్యారు.  ఈ భేటీలో ఇద్దరు పలు అంశాల మీద చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్దికి కేంద్రం సాయం చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అభివృద్ధి పథకాలకి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా రాష్ట్రానికి రుణ పరిమితి పెంపుతోపాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాగా అరుణ్ జైట్లీతో భేటీ అనంతరం కేసీఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి రామచంద్రు తేజావత్ లు ఉన్నారు.

క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్ట్... బెయిల్ పై రిలీజ్

  భారత క్రికెటర్, స్పిన్నర్ అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. యువతిపై దాడి కేసులో సుమారు మూడు గంటల పాటు అమిత్ మిశ్రాను ప్రశ్నించిన పోలీసులు... అనంతరం అరెస్టు చేశారు. అయితే మిశ్రా లాయర్లు బెయిల్ పేపర్లు దాఖలు చేయడంతో వెంటనే రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 25న బెంగళూరులో తానుంటున్న హోటల్ గదికి వచ్చిన ఓ అమ్మాయిపై దాడి చేసినట్లు మిశ్రాపై కేసు నమోదైంది. అయితే.. ఈ కేసును ఆమె ఉపసంహరించుకున్నట్లు కథనాలు వచ్చినా, ఆ తర్వాత మళ్లీ కేసు విషయంలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకుంది. దాంతో పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఈ నేఫథ్యంలోనే మంగళవారం దాదాపు మూడు గంటలపాటు మిశ్రాను ప్రశ్నించి వదిలిపెట్టారు, అయితే అమిత్ మిశ్రాపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద కేసు నమోదైందని, దానిపై దర్యాప్తు కొనసాగుతోందని బెంగళూర్ డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు.

జగన్ కు కేంద్రం వార్నింగ్? అందుకే వెనక్కి తగ్గారా?

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ అటు కేంద్రానికి వ్యతిరేకంగా.. ఇటు రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసి.. పాపం ఆ ఆందోళనలకు సరైన రెస్పాన్స్ రాక చివరికి.. నిరాహార దీక్ష చేసినా పట్టించుకునే వారు లేక దీక్ష మధ్యలోనే విరమింపచేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆఖరికి ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కూడా వెళ్లకుండా తన వ్యతిరేకతను ప్రదర్శించారు. అయితే శంకుస్థాపన అనంతరం జగన్ ఇంకా రెచ్చిపోయి ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేపడతారని అందరూ అనుకున్నారు. అంతేకాదు జగన్ కు కాంగ్రెస్ పార్టీ కూడా తోడై చంద్రబాబుకు, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతారని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది.. అందుకు భిన్నంగా ఇప్పుడు జగన్ ఈ విషయంలో కొంచం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కారణం జగన్ కు కేంద్రం నుండి ఫోన్ రావడమేనట.. ఈవిషయాన్ని కూడా స్వయంగా పార్టీ నేతలే చెబుతున్నారు. ఒకవేళ జగన్ ప్రత్యేక హోదా అంటూ మళ్లీ దీక్షలు మొదలుపెడితే అది ఒక్క చంద్రబాబుకే కాదు కేంద్రానికి కూడా సమస్యే అని భావించి.. ఈ విషయంలో జగన్ ను ఎలాగైనా కంట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారట. దీనిలో భాగంగానే కేంద్రం జగన్ కు ఫోన్ చేసి ప్రత్యేక హోదా గురించి  ఉద్యమాలు అంటూ మొదలుపెడితే అనవసరంగా ఇబ్బందులు పడతావని.. ఎలాంటి గొడవలు చేయోద్దని హెచ్చరించారట. అందుకే జగన్ వెనక్కి తగ్గారట. మొత్తానికి జగన్ ఇబ్బందులు పడే అంశాలేంటో అందరికి తెలిసిందే ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు..

వావ్ బాలయ్య.. వాట్ ఏ రెస్సాన్స్

  ఏపీ ప్రత్యేక హోదా గురించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య పై అందరూ ప్రశంసలు కురిపించేస్తున్నారు. ఆదివారం నాడు ఆయన కాన్సర్ పై అవగాహన పెంచేందుకు గాను పింక్ రిబ్బన్ వాక్ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆయన ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా ఏపీ ప్రజల కోరిక అని.. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా కనుక ఇవ్వక పోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని.. ప్రజలంతా కలిసి ఏకమై ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని హెచ్చరించారు. అంతే దీంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య చేసిన వ్యాఖ్యలకు.. చాలా బాగా మాట్లాడారని.. కొంతమంది నేతలు తన మద్దతును కూడా తెలుపుతున్నారు. అంతేకాదు మీడీయాలో సైతం బాలయ్య వ్యాఖ్యలపై పోల్ నిర్వహించగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు తెలుగు తముళ్లు సంగ్ధిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎవరు ఎన్నిరకాలుగా వ్యాఖ్యలు చేసిన తాము మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పేవారు కాని ప్రత్యక్షంగా కేంద్రాన్ని డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలకు వచ్చిన రెస్పాన్స్ చూడగా తప్పకుండా తాము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినట్టయింది. అంతేకాదు బాలయ్యలా మిగిలిన నేతలు కూడా ముందుకు రావాలని.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు.

చంద్రబాబుకు చెప్పలేరు..టీజీకి మద్ధతు

  ఏపీ రాజధాని అమరావతిని ఎంత తొందరగా నిర్మించాలా.. ఎంత త్వరగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలా అని చంద్రబాబు చూస్తున్నారు. అయితే రాజధాని అమరావతి వల్ల రాష్ట్రా అభివృద్ధి సంగతేమో కానీ తాము మరీ వెనుకబడిపోతామేమో అని కొందరు నాయకులు అనుకుంటున్నారంట. రాష్ట్రం విడిపోవడం ఒక సమస్య అయితే విడిపోయిన తరువాత రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదని.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా కూడా రాయలసీమ అభివృద్ధికి స్పెషల్ గా ప్యాకేజీ ఇవ్వాలని అప్పుడే భిన్నాభిప్రాయాలు తలెత్తాయి.. ఇప్పుడు కూడా తెలెత్తుతూనే ఉన్నాయి. అయితే కొంతమంది నేతలు బహిరంగంగా వ్యక్తపరిచినా .. కొంతమంది వ్యక్తపరలేని పరిస్థితి. అమరావతి మీద చంద్రబాబు నాయుడు విపరీతమైన శ్రద్ధను కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి భయం. కాని కర్నూలుకు చెందిన నాయకుడు టీజీ వెంకటేష్ మాత్రం ఎడాపెడా తన డిమాండ్లను వినిపించేస్తున్నారు. ఎందుకంటే తనకు పదవి లేదు కనుక.. ఎలా మాట్లాడినా జరిగే నష్టం ఏం లేదు కాబట్టి అప్పుడప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు టీజీ అవి. * రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని * అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కావాలని * అమరావతిని ఫ్రీజోన్ చేయాలని అయితే ఒక రకంగా చెప్పాలంటే టీజీ చేసిన డిమాండ్లు సమంజసంగానే ఉన్నా వాటి గురించి మాట్లాడే ధైర్యం పదవిలో ఉన్న నేతలకు లేదు. కాని కొసమెరుపు ఏంటంటే టీజీ చేసిన డిమాండ్లు బానే ఉన్నాయని.. సరైన సరైన అంశాలను లేవనెత్తారని ఆయనకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారట సీమ నేతలు. మరి టీజీ డిమాండ్లు ఎంతవరకూ నెరవేరుతాయో చూడాలి.

అమరావతి.. 9 నగరాలు.. 9 రంగులు

ఏపీ రాజదాని అమరావతి శంకుస్థాపన  కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఇంక రాజధాని నిర్మాణం శరవేగంగా జరగడమే తరువాయి భాగం. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో భాగంగా  ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ ‘పింక్‌ సిటీ'గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రాజధాని అమరావతిలో టూరిజం, ఆరోగ్యం, ఎలక్ట్రానిక్స్‌, విద్య, ప్రభుత్వ పాలన, జస్టిస్‌, స్పోర్ట్స్‌, ఆధ్యాత్మిక, ఆర్థిక నగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని పింక్ సిటీ మాదిరి రాజధానిలోని తొమ్మిది నగరాలకూ  ఒక్కో రంగును ప్రత్యేకించి, తొమ్మిది రంగులతో నిర్మించాలని.. దీనికి సంబంధించిన ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సీఎం చంద్రబాబు ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం.. దానికి వేసే రంగులు.. రోడ్లు.. నీటి సదుపాయాలు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ అమరావతిలో ఒక్కో నగరాన్ని నిర్మించిన తరువాత మరొకటి నిర్మించాలంటే చాలా సమయం వృధా అవుతుందని.. కాబట్టి అలా కాకుండా ఒక్కో విభాగాన్ని ఒక్కో సంస్థకు ఇస్తే పనులు త్వరగా అవుతాయని కూడా చర్చించినట్టు సమాచారం. మొత్తానికి ఏడు రంగులు ఇంద్రధనస్సు అన్నట్టు.. 9 రంగుల అమరావతిని త్వరలో చూస్తామన్నమాట.

అహం తగ్గించుకోండి.. కేసీఆర్ జూనియర్ అయినా పిలిచా.. చంద్రబాబు

  సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు క్లాస్ పీకారంట. ఏ విషయంలో అనుకుంటున్నారా.. నేతల్లో అహంకారం పెరుగుతోందని పెద్ద క్లాసే పీకారంట. అంతేకాదు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారంట. రాష్ట్రం విడిపోవడం వల్ల కొంత మందికి నష్టం కలిగిందేమో కాని దాని వల్ల కొంతమంది నేతలకు మంచే జరిగింది. ఎందుకంటే నూతన రాజధాని పుణ్యమా అని అక్కడ భూములు ఉన్న వారికి రేట్లు బాగా పెరిగాయి. దీంతో నేతలకు అహంకారం బాగా పెరగిపోయిందట. ఈ నేపథ్యంలో సోమవారం తన క్యాంపు కార్యలయంలో చంద్రబాబుని కలవడానికి వచ్చిన కృష్ణా, గుంటూరు నేతలకు కొంతమంది పార్టీ నేతలకు అహంకారం పెరిగిపోతోంది.. అహంకారం పెరిగితే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని అన్నారట. భూములు రేట్లు పెరుగుతున్నాయి కదా అని అహంకారం కూడా పెరిగితే మంచిది కాదని సూచించారట. అంతేకాదు నాకంటే కేసీఆర్ జూనియర్ అయినా రాజధాని శంకుస్థాపనకు ఇంటికెళ్లి ఆహ్వానించాను.. అహంకారం తగ్గితే వ్యక్తిగతంగా మీకూ మంచిదే'' అని చంద్రబాబు హితవు పలికారు.

నడిరోడ్డుపైనే కానిస్టేబుల్ ని నరికి చంపారు

  మెదక్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా గజ్వేల్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ను నడ్డిరోడ్డుపైనే కత్తులతో నరికి కిరాతకంగా చంపండంతో కలకలం రేగింది. వివరాల ప్రకారం నర్సింహులు అనే వ్యక్తి హైదరాబాద్ లోని బేగంపేటలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే నర్సింహులు తన సొంత పనిమీద గజ్వేల్ వెళ్లగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపారు. దీంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కాగా నర్సింహులు హత్య జరగడానికి కటుంబకలహాలే కారణమని.. అతని భార్యకు అతనికి మధ్య విభేధాలు ఉన్నాయని అంటున్నారు. ఈనేపథ్యంలో ఆమె ఒకసారి నర్సింహులుపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. కాగా ఈ హత్య జరగడం వెనుక అతని భార్య హస్తం కూడా ఉందని అనుమానిస్తున్నారు.

అమరావతిలో కాపులకు చోటు ఎందుకివ్వలేదు?

  అమరావతి శంకుస్థాపన కార్యక్రమ వేదికపై కాపు నాయకులకు ఎందుకు చోటివ్వలేదని కాపునాడు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు, వేదికపైకి కాపు నాయకులను పిలవకపోవడం అవమానకరంగా ఉందని, ఇది కాపులను అవమానించడమేనని అన్నారు, డిప్యూటీ సీఎం చినరాజప్ప లేదా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గానీ శంకుస్థాపన వేదికగా గౌరవించలేదని కాపునాడు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మండిపడ్డారు, ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చడం లేదని ఆరోపించారు, కాపులను బీసీల్లో చేర్చుతామని, 1000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని చంద్రబాబును కాపునాడు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు

చంద్రబాబును అభినందించిన రైతులు

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారని ఏపీ రైతులు చంద్రబాబుకి కితాబిచ్చారు. ఈ రోజు ఉదయం ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారని అభిందించారు. అంతేకాదు రాజధాని నిర్మాణం ద్వారా రైతులకు, యువకులకు ఉపాధి కల్పించాలని రైతులు చంద్రబాబును కోరడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ ప్రజల కల రాజధాని అమరావతి అని.. రాజధానిని త్వరగా పూర్తి చేసుకుందామని రైతులకు చెప్పారు. అంతేకాదు రాజధాని అమరావతికి రైతులు భూములను స్వచ్ఛందంగానే ఇచ్చారని.. కొంతమంది కావాలనే పంటలు తగలబెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మనకు తిండి పెట్టే పంటలను తగలబెట్టే సంస్కృతి తమది కాదని అన్నారు. మొత్తానికి రైతులే స్వయంగా చంద్రబాబు అభినందించడం శుఖపరిణామమే.

రేపిస్టులపై చెన్నై హైకోర్టు సంచలన తీర్పు

  రేపిస్టులపై చెన్నై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని నపుంసకులుగా మార్చాలంటూ అత్యంత కఠినమైన తీర్పు ఇచ్చింది, చిన్నపిల్లలపై అత్యాచారాలు, అకృత్యాలకు పాల్పడేవారికి ఇదొక్కటే మందు అని, ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిని లైంగికంగా పనికిరాకుండా చేయాలని న్యాయమూర్తి కృపాకరన్ అభిప్రాయపడ్డారు, ఇది ఆటవికంగా కనిపించొచ్చు కానీ, ఆటవిక చర్యలకు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు, సంప్రదాయ చట్టాల ప్రకారం ఇలాంటి కేసుల్లో దోషులకు సరైన శిక్షలు పడటం లేదని, కానీ చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారిని నపుంసకులుగా  మార్చాల్సిన అవసరముందన్నారు న్యాయమూర్తి కృపాకరన్

పార్టీపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. జిల్లా ఇంఛార్జిల నియామకం

  టీడీపీ అధినేత చంద్రబాబు మొన్నటి వరకూ అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో చాలా బిజీబజీగా గడిపేశారు. అయితే ఇప్పుడు పార్టీపై పూర్తి దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు ఇప్పుడు జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే చాలా కాలంగా పెండింగుల్లో ఉన్న జిల్లా ఇంఛార్జిలను నియామించడం జరిగింది. * కడప - అనంతపురం జిల్లాల ఇంఛార్జిగా మాజీ మంత్రి దివంగత బీవీ మోహనరెడ్డి కుమారుడు జయనాగేశ్వరరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. * కర్నూలు చిత్తూరులకు వర్ల రామయ్యను నియమించారు. * గుంటూరు - ప్రకాశం - నెల్లూరు జిల్లాలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించారు. * విజయనగరం - శ్రీకాకుళం - పశ్చిమగోదావరిలకు రెడ్డి సుబ్రహ్మణ్యానికి బాధ్యతలు అప్పగించారు. * కృష్ణా - తూర్పుగోదావరి - విశాఖ జిల్లాల ఇంఛార్జిగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి నియమించారు.

టీడీపీకే ఓటేశాను... అయినా వేధిస్తున్నారు

  ఏపీ రాజధాని అమరావతికి భూమి ఇవ్వలేదని తన ఐదెకరాల పొలంలో చెరుకు పంటను తగలబెట్టారని గుంటూరు జిల్లా మల్కాపురానికి చెందిన రైతు గద్దె చంద్రశేఖర్ వాపోయాడు, తనను పరామర్శించడానికి వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపిన గద్దె చంద్రశేఖర్... రాజధానికి పొలం ఇవ్వనందుకు పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు, నా పొలంలో నేను షామియానాలు, కుర్చీలు వేసుకుంటే.... కానిస్టేబుళ్లు వచ్చి బలవంతంగా జీపులో ఎక్కించుకుని వేధించారని మాజీ ఎమ్మెల్యే గద్దె రత్తయ్య కుమారుడు చంద్రశేఖర్ వాపోయారు. రాజధానికి భూమి ఇచ్చేందుకు నిరాకరించినందుకే తనపై కక్షగట్టి పోలీసులను ప్రయోగిస్తున్నారని, తాను టీడీపీకే ఓటు వేశానని, అయినా ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు, జగన్ పార్టీకి తాను ఓటు వేయలేదని, అయినా నన్ను పరామర్శించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

మాఫియాడాన్ ఛోటారాజన్ అరెస్ట్

  మాఫియాడాన్ ఛోటారాజన్ అరెస్ట్ అయ్యాడు, భారత్ లో అనేక నేరాలకు పాల్పడుతూ 20 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఛోటారాజన్ ను ఇంటర్ పోల్ వర్గాలు... ఇండోనేషియాలోని బాలిలో అరెస్ట్ చేసినట్లు ఆస్ట్రేలియా పోలీసులు ప్రకటించారు, ఒకప్పుడు అండర్ వరల్డ్ ఢాన్ దావూద్ ఇబ్రహీంకి సన్నిహిత సహచరుడైన ఛోటారాజన్... ఆ తర్వాత దావూద్ నే ముప్పుతిప్పలు పెట్టి గట్టి ప్రత్యర్ధిగా మారాడు, దాంతో దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ గ్రూప్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఛోటారాజన్ కి సంబంధించిన సమాచారాన్ని దావూద్ మనుషులే పోలీసులకు చెప్పారని, వాళ్లిచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే ఛోటాను పట్టుకున్నారని అంటున్నారు, 1995 నుంచి ముంబైలో పలు నేరాలకు పాల్పడుతున్న ఛోటారాజన్ కోసం దాదాపు రెండు దశాబ్దాలుగా భారత నిఘా ఏజెన్సీలు, ముంబై పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇంటర్ పోల్ అతడ్ని అరెస్ట్ చేయడంతో భారత్ కి ఛోటారాజన్ ని డిపోర్ట్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

తోక "చుక్క" తెచ్చింది

వినడానికి కొంచం విడ్డూరంగా ఉన్నా కొన్నిసార్లు కొన్ని నిజాలు నమ్మక తప్పుదు. అలాంటిదే ఇప్పుడు జరిగింది. అదేంటంటే అంతరిక్షంలో ఆల్కహాల్ ఉత్పత్తి అవడం. అక్కడ ఎవరు ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తున్నారా అని అనుకుంటున్నారా... దీని కారణం లవ్ జాయ్ అనే ఒక తోకచుక్కట. లవ్ జాయ్ అనే తోకచుక్క సెకనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్ ను అంతరిక్షంలోకి విడిచిపెడుతోందట.. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌లోని ప్యారిస్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతిశీతల వాతావరణం కలిగిఉన్న ఈ లవ్ జాయ్ అనే తోకచుక్క ఈ ఏడాది జనవరి 30 న సూర్యుని దగ్గరకు వచ్చిందట. అయితే సూర్యుని వేడికి ఇది సెకనుకు 20 టన్నుల నీటి ఆవిరిని రోదసిలో విడుదల చేయగా దీనిలో 500 బాటిళ్లకు సమానమైన ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి మందుబాబులకు ఈ విషయం తెలిస్తే రాకెట్ వేసుకొని అక్కడికి కూడా వెళిపోతారేమో..