కేసీఆర్ కు వ్యతిరేకంగా విధ్యార్ధి సంఘాలు..
posted on Nov 2, 2015 @ 11:53AM
ఇప్పటికే అనేక సమస్యలు.. విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కు ఇప్పుడు మరో సమస్య వచ్చిపడేలా కనిపిస్తుంది. అది విధ్యార్ధుల రూపంలో.. ఓయూ విధ్యార్ధులు.. అసలు వీరు లేకపోతే తెలంగాణ ఉద్యమం అంత విజయవంతంగా సాగేదని చెప్పలేం. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ముందుంటే.. ఆ ఉద్యమాన్ని వెనుక నుండి నడిపించడంలో ముఖ్య భూమిక పోషించారు ఓయూ విధ్యార్ధులు. ఒక్క తెలంగాణ ఉద్యమంలోనే కాదు.. రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా కీలక పాత్ర పోషించారు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎవరైతే కేసీఆర్ కు మద్దతు ఇచ్చారో వారే ఇప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్దికి కాకుండా కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో దిగిన రాజయ్యకు ఓయూ జేఏసీ, తెలంగాణ జేఏసీ సంఘాలు మద్దతు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. దీనిలో భాగంగానే జేయూ జేఏసీ, తెలంగాణ జేఏసీ సంఘాలు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు రాజయ్య మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తరువాత కేసీఆర్ తమ గురించి పట్టించుకోవడంలేదని.. విద్యార్థులను పురుగుల్లాగ చూస్తూ తృణీకార భావం ప్రదర్శిస్తున్నారని.. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన విద్యార్థుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన చంద్రశేఖరరావు ప్రభుత్వం తర్వాత విద్యార్థులను నిరుద్యోగ యువతను లెక్కచేయడం లేదని విద్యార్థి నేతలు ఆరోపించారు.
అయితే విధ్యార్ధులు కేసీఆర్ కు వ్యతిరేకంగా మారడానికి ఒక రకంగా కేసీఆరే కారణమని వేరే చెప్పనవసరంలేదు. ఎందుకంటే ఓయూ భూముల విషయంలోనే కేసీఆర్ కు విధ్యార్ధులకు మధ్య విభేధాలు వచ్చాయి. అయితే కేసీఆర్ విద్యార్ధులకు మంచిగా నచ్చజెప్పితే పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో అలా కాకుండా వాళ్లను విమర్శిస్తున్నట్టు చేసిన వ్యాఖ్యలవల్ల వారు కూడా కేసీఆర్ పై మండిపడుతున్నారు. అంతేకాదు లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం.. యూనివర్శిటిల్లో వైస్ ఛాన్సలర్ల నియామకాలను నిలిపివేయడం వెరసి కేసీఆర్ పై ఓయూ జేఏసీ, తెలంగాణ జేఏసీలు పూర్తి వ్యతిరేక భావంతో ఉన్నారు. దీనిలో భాగమే కాంగ్రెస్ నేతకు మద్దతు ఇవ్వడం. ఓయూ జేఏసీ సంఘాలు, తెలంగాణ జేఏసీ సంఘాల సపోర్టుతో ఇంతవరకూ నెగ్గిన కేసీఆర్ ఇప్పుడు వాళ్ల సపోర్టే లేకపోతే వరంగల్ ఉపఎన్నికే కాదు.. వచ్చే ఎన్నికల్లో కూడా గెలవడం ప్రశ్నార్ధకమే..