కేసీఆర్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి..

  ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అనుకుంటున్నారు. ఎందుకంటే వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగడానికి కేసీఆర్ పసునూరి దయాకర్ ను ఎంపికచేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికంటే ముందే ఆయన గుడిమళ్ల రవికుమార్ పేరును సెలక్ట్ చేశారంట. కొడుకు కేటీఆర్ సిఫారసు మేరకు ఆయనను ఎంపిక చేసిన కేసీఆర్.. పార్టీలో ఎవరూ అభ్యంతరం చెప్పకుండా ఉండేదుకు కాను వారికి ముందే బ్రెయిన్ వాష్ చేశారు. ఎంపీ అంటే ఆషామాషీ కాదని.. ఇంగ్లీషు హిందీ వచ్చి ఉండాలి.. బాగా చదువుకుని ఉండాలి.. న్యాయం చట్టం తెలిసి ఉండాలి. రాజ్యాంగం మీద పూర్తి పట్టుఉండాలని అందుకే రవికుమార్ ను ఎంపిక చేయనున్నామని ముందుగానే చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయింది కేసీఆర్ చెప్పింది వేరు చేసింది వేరు.. ఆఖరి నిమిషంలో దయాకర్ పేరును ఎంపిక చేశారు. ఎందుకంటే రవికుమార్ న్యాయవాది అయినప్పటికీ ఆయనకు పార్టీ పరంగా అంతగా గుర్తింపు లేదు. దయాకర్ అయితే పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉంటూ.. మంచి కార్యకర్తగా పేరుతెచ్చుకున్నాడు.. అందుకే కేసీఆర్ దయాకర్ ను ఎంపిక చేశారు. అయితే కేసీఆర్ చెప్పినట్టు దయాకర్ కు అన్ని తెలుసా అని డౌట్ రావచ్చు కానీ ఆయన కేవలం  ఫైన్ ఆర్ట్స్ పట్టభద్రుడు మాత్రమే. ఇక రాజ్యాంగం - హిందీ మీద ఆయనకు ఉన్న పట్టు ఏపాటిదో మనకు తెలియదు.

చంద్రబాబు బాటలోనే రేవంత్ రెడ్డి.. కేసీఆర్ తో రేవంత్ భేటీ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా మాట్లాడతారో అందరికి తెలిసిన విషయమే. వాళ్లు వీళ్లు అని చూడరు ఎవరినైనా తిట్టడంలో.. తను చెప్పాలనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో తనకు తానే సాటి. అలాంటి కేసీఆర్ కు ధీటుగా మాటల తూటాలు పేల్చాలన్నా.. సరైన సమాధానం చెప్పాలన్నా అది ఒకరికే సాధ్యం అది ఎవరో కాదు.. తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. మరి వీరిద్దరూ ఒకరిని ఒకరు దూషించుకుంటే ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరంలేదు. మాములుగానే ఒకరంటే ఒకరికి పడదు.. ఇంక ఓటుకు నోటు కేసు తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్దం ఒక రేంజ్ లో జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఒకరిని ఒకరు తిట్టుకున్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ లు కలవనున్నట్టు కనిపిస్తుంది. దీనిలో భాగంగానే కేసీఆర్.. రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఏపీ శంకుస్థాపన వల్ల ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య విభేధాలు కొంత వరకూ తొలగిపోయినట్టే కనిపిస్తున్నాయి. సాక్షాత్తు చంద్రబాబే కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ కేసీఆర్ ను ఆహ్వానించారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తన అధినేతే కేసీఆర్ ను కలుపుకుంటూ పోతుంటే తనకు మాత్రం వైరం ఎందుకని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో త్వరలో జరగబోయే తన కూతురి వివాహానికి కేసీఆర్ ను ఆహ్వానించనున్నారంట. అంతేకాదు కేసీఆర్ కూడా ఈ వివాహానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వైరం నెమ్మదిగా తొలగిపోవడం ఆనందాన్నిచ్చే అంశమే.

నేడు నామినేషన్లు వేయనున్న కాంగ్రెస్, వామ పక్షాల అభ్యర్ధులు

  వరంగల్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య మరియు వామ పక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ ఇద్దరూ కూడా ఇవ్వాళ తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అధికార తెరాస వసునూరి దయాకర్ పేరును ఖరారు చేసింది. ఆయన కూడా నేడోరేపో తన నామినేషన్ దాఖలు చేస్తారు.   ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీల ఉమ్మడి అభ్యర్ధిగా బీజేపీకి చెందిన వ్యక్తిని నిలబెట్టబోతున్నాయి. అయితే ఇంతవరకు బీజేపీ తన అభ్యర్ధి పేరుని ఖరారు చేసుకోలేకపోతోంది. ఇంతకు ముందు తెరాసలో పనిచేసిన చింతా స్వామి, ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ దేవయ్య, స్థానికంగా మంచి పేరున్న వైద్యుడు డాక్టర్ రాజమౌళి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈరోజు వారిలో ఎవరో ఒకరి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. వరంగల్ నుంచి పోటీ చేయడానికి తెదేపా తరపున రావుల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపించినప్పటికీ, దానిని తమకే వదిలిపెట్టాలని బీజేపీ పట్టుబట్టి మరీ తీసుకొంది. కానీ ఎన్నికలలో విజయం సాధించడానికి తగినంత అర్ధబలం, అంగబలం ఉన్న అభ్యర్ధులు పార్టీలో లేకపోవడంతో ఇబ్బంది పడుతోంది. అటువంటప్పుడు ఆ స్థానం తమకే వదిలిపెట్టి తమకే మద్దతు ఇచ్చి ఉండి ఉంటే బాగుండేది కదా అని తెదేపా నేతలు అభిప్రాయ పడుతున్నారు.

టెన్నిస్ క్రీడాకారిణి భువన కేసులో కొత్త మలుపు

  టెన్నిస్ క్రీడాకారిణి భువన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆమె భర్త అభినవ్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ అతని అనుచరులు కలిసి దాడి చేసి భువనను కిడ్నాప్ చేయగా, అతను పోలీసులకు పిర్యాదు చేసారు. కానీ తన భర్తే తన తండ్రి మహేంద్రనాద్ పై దాడి చేసారని భువన స్వయంగా చెప్పారు. తన కుమారుడు సాయి కిరణ్ గురించి మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తన కుమారుడితో సహా మారేడ్ పల్లిలోని భువన ఇంటికి నిన్న వెళ్లి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి భువన చేతనే జరిగినదంతా మీడియాకు వివరింపజేశారు.   ఆమె మీడియాతో మాట్లాడుతూ తామిద్దరం ఇష్టపడే పెళ్లిచేసుకొన్నామని తెలిపారు. అభినవ్ కు ఇదివరకే వేరొకరితో పెళ్ళయిన సంగతి తెలిసుకొని తను మోసపోయానని చాలా బాధపడ్డానని తెలిపారు. అభినవ్ తనను మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా రూ.3కోట్లు కట్నం కావాలని నిత్యం తనను మానసికంగా చాలా హింసించేవాడని భువన తెలిపారు. ఈ సంగతి తెలుసుకొని తనను తీసుకుపోవానికి తన తండ్రి మహేంద్రనాద్ తుకారం గేటు సమీపంలో ఉన్న తమ ఇంటికి వచ్చినప్పుడు అభినవ్ తన తండ్రిపై దాడి చేసాడని భువన తెలిపారు. తన తండ్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహాయం కోరి ఆయన ఇంటికి వెళ్ళగా, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన కుమారుడు సాయి కిరణ్ తక్షణమే స్పందించి తనను కాపాడి తన తల్లి తండ్రులకు అప్పగించారని తెలిపారు. ఇకపై తను అభినవ్ తో కలిసి జీవించలేనని భువన మీడియాకు తెలిపారు.   ఆమె బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో తన భర్త అభినవ్ పై పిర్యాదు చేయగా వారు అతనిపై 498(ఏ), 495 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.   అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ “మహేంద్రనాద్ గారు మా ఇంటికి వచ్చినపుడు నేను ఇంట్లో లేకపోవడంతో నా కుమారుడు సాయి కిరణ్ మానవతా దృక్పదంతో స్పందించి భువనను రక్షించి తీసుకువచ్చి ఆమె తల్లి తండ్రులకి అప్పగించాడు తప్ప అతనేమీ ఎవరినీ కిడ్నాప్ చేయలేదు. కిడ్నాపులు చేయడానికి నా కుమారుడు ఏమీ డాన్ కాడు. మీడియాలో కొన్ని సంస్థలు పనికట్టుకొని నామీద బురద జల్లుతూ తద్వారా మా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. అటువంటి వారు హోటల్స్ లో తప్పతాగి అల్లరి చేస్తున్నపుడు వారిని కూడా నేను రక్షించిన సందర్భాలున్నాయి. ఆ సంగతి మరిచిపోయి తిరిగి నాపైనే ఈవిధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు,” అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

రష్యా విమానాన్ని మేమే కూల్చేసాము..ఇదిగో వీడియో: ఐసిస్ ఉగ్రవాదులు

  రష్యా విమానాన్ని తామే క్షిపణితో కూల్చివేశామని ఐసిస్ ఉగ్రవాదులు ప్రకటించుకొన్నారు. దానిని వీడియో తీసి ఇంటర్నెట్ లో కూడా పెట్టారు. సిరియాలో తమ స్థావరాలపై రష్యా విమానిక దాడులు చేస్తున్నందునే ప్రతీకారంగా విమానాన్ని కూల్చివేశామని ఉగ్రవాదులు పేర్కొన్నారు. నిన్న ఈజిప్టులో కూలిపోయిన రష్యా విమానంలో 224 ప్రయాణికులు, 7 మంది విమాన సిబ్బందితో కలిపి మొత్తం 231మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా విమానాన్ని తామే కూల్చివేశామని ఐసిస్ ఉగ్రవాదులు ప్రకటించినప్పటికీ ఈజిప్ట్, రష్యా దేశాలు దానిని దృవీకరించలేదు.   సాధారణంగా క్షిపణులతో 26,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానాలను కూల్చవచ్చును. కానీ రష్యా విమానం గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధం తెగిపోయే సమయానికి సుమారు 31,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. అంటే క్షిపణులకు అందనంత ఎత్తులో ప్రయాణిస్తోందన్నమాట. కనుక ఏదయినా యాంత్రిక లోపం వలన కానీ మానవ తప్పిదం వలన కానీ లేదా ఐసిస్ ఉగ్రవాదులు విమానంలో ముందుగానే బాంబులు అమర్చి పేల్చడం వలన గానీ కూలిపోయుండవచ్చని ఇరు దేశాల అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొన్న రష్యా అధికారులు విమానంలోని బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకొన్నారు. కాక్ పిట్ లో పైలట్ల సీట్ల క్రింద అమర్చి ఉంచే ఆ బ్లాక్ బాక్స్ లో పైలట్ల సంభాషణ నిరంతరంగా రికార్డు అవుతుంది. కనుక దాని ద్వారా విమానం కూలిపోవడానికి అసలయిన కారణాలు ఏమిటనే విషయం బయటపడవచ్చును.

బిహార్ 4వ దశ ఎన్నికలలో ఒంటి గంటకి 42.94 శాతం పోలింగ్

  బిహార్ నాల్గవ దశ పోలింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సజావుగా సాగుతోంది. మహ్యాహ్నం ఒంటి గంటకు 42.94 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఈరోజు జరుగుతున్న 55 సీట్లకు మొత్తం 776 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారిలో 57మంది మహిళా అభ్యర్దులున్నారు. వారిలో ఎన్డీయే కూటమి తరపున 51మంది, జనతా పరివార్ తరపున 55 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ముజఫ్ఫర్ నగర్, సివాన్, షియోహర్,సీతామార్గ్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్ మరియు గోపాల్ గంజ్ జిల్లాలలో నేడు పోలింగ్ జరుగుతోంది. ఏడు జిల్లాలలో మొత్తం 1,46,93,294 మంది ఓటర్లున్నారు. వారిలో 42.94 శాతం మంది ఓటర్లు ఇంతవరకు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఉదయం ఏడు గంటలకి మొదలయిన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకి ముగుస్తుంది. నక్సల్స్ ప్రభావితం ఉన్న 8 నియోజక వర్గాలలో మాత్రం పోలింగ్ 3 గంటలకే ముగుస్తుంది. బిహార్ అసెంబ్లీలో ఉన్న మొత్తం 247 సీట్లున్నాయి. ఈరోజుతో 186 సీట్లకు పోలింగు పూర్తవుతుంది. మిగిలిన 57 సీట్లకు నవంబర్ 5న ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 8న ఓట్ల లెక్కింపు చేసి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.

ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి కూడా బీఫ్ గురించి మాట్లాడేశాడు

ఇప్పుడు ఎక్కడ చూసినా దేశంలో గోమాంసం గురించి మాట్లాడేవాళ్లే ఎక్కువైపోయారు. సామాన్యుడు దగ్గరనుండి అత్యున్నత స్థాయి ఉన్న వ్యక్తి వరకూ దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు ఆజాబితాలో ఇన్ఫోసిన్ సంస్థ అధినేత నారాయణ మూర్తి కూడా బీఫ్ వివాదం గురించి మాట్లాడేశాడు. ఈ మధ్య ఆయన ఇచ్చిన ఇంటర్య్వూలో దేశంలో మైనార్టీలకు రక్షణ  లేదని.. వారిలో భయాందోళనలు ఉన్నాయంటూ గోమాంసం వివాదం గురించి చెప్పకనే చెప్పారు. అంతేకాదు మతాలు, ప్రాంతాల మధ్య సామరస్యం ఉండాలని.. దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈసమస్యకు వెంటనే పరిష్కారం ఆలోచించాలని వ్యాఖ్యానించారు. నారాయణ మూర్తి చేసిన సూచనలు బానే ఉన్నా.. హాయిగా సాఫ్ట్ వేర్లు.. సేవా కార్యక్రమాలు చూసుకోక ఆయనకు ఇవన్నీ ఎందుకు అని విమర్శిస్తున్నారు.

మోడీకి మూడీస్ హెచ్చరిక.. నేతలను అదుపులో పెట్టుకోండి

దేశంలో బీఫ్ వివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వివాదల వల్ల రోజుకొకరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. అయితే ఇప్పుడు ఈ వివాదలకు గాను మూడీస్ అనే కన్సల్టెన్సీ సంస్థ మోడీకి ఒక హెచ్చరిక జారీ చేసింది. బీఫ్ మాంసంపై చెలరేగుతున్న వివాదాలలో బీజేపీ నేతలను కట్టడి చేయడం శ్రేయస్కరనమని.. లేకపోతే ఇటు దేశీయంగాను.. అంతర్జాతీయంగాను విశ్వసతను కోల్పోవాల్సి వస్తుందని సూచించింది. సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీకి చేటు చేస్తున్నాయని.. ఉద్రిక్తతలు మరింత పెరిగిన పక్షంలో రాజ్యసభలో విపక్షాల నుంచి వ్యతిరేకతా పెరుగుతుందని, ఆర్థిక విధానాలపై చర్చలు పక్కదారి పట్టే అవకాశం ఉందని మూడీస్ అనలిటిక్స్ ఒక నివేదికలో వివరించింది. కాబట్టి, మోదీ తన పార్టీ నేతలను అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించింది.

అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి చంద్రబాబు.. జ్యోతుల

  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదాల శకం ముగిసిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క బీహార్ కే కాదు.. ఈ వ్యాఖ్యలు ఏపీకి కూడా వర్తిస్తాయి అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే ఏపీకి కూడా ప్రత్యేక హోదా వస్తుందో? లేదో అని సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ విషయంపై వైకాపా నేత జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఏం స్పంష్టం చేస్తారు అని డిమాండ్ చేస్తారు. అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం లేదని.. దీనికి చంద్రబాబు స్పందన ఏంటని అన్నారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?రాదా? వస్తే ఎన్ని రోజుల్లో సాధించగలరు? అంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై నీతి అయోగ్ కమిటీ సమీక్షిస్తుందని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఇప్పుడైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

టీడీపీ నుండి సుధారాణి సస్పెండ్

తెలంగాణ టీడీపీ ఎంపీ గుండు సుధారాణి టీడీపీ ని వీడి టీఆర్ఎస్ పార్టీలోకి మారనున్నట్టు చాలా రోజుల నుండి వార్తలు వింటూనే ఉన్నాం. దీనికి తోడు ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ విషయంపై మాత్రం సుధారాణి మాట్లాడుతూ తాను కేవలం తెలంగాణ అభివృద్దికి పోరాడుతున్న కేసీఆర్ కు అభినందనలు చెప్పటానికే కలిశానని.. ఒక తెలంగాణ బిడ్డగా తాను కూడా తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని చూస్తున్నానని.. అంతేకాని కేసీఆర్ ను కలవడం వెనుక ఆంతర్యం ఏం లేదని చెప్పారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇప్పుడు సుధారాణికి ఒక షాక్ తగిలింది. టీడీపీ నుండి ఎంపీ సుధారాణికి సస్పెన్షన్ వేటు విధించారు. దీనిలో భాగంగానే టీడీపీ నుండి సుధారాణిని సస్పెండ్ చేస్తూ టీడీపీ కేంద్రం క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు సుధారాణి ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఈజిప్ట్ లో విమానం కూలి 212 మంది దుర్మరణం

  ఈజిప్ట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈజిప్ట్ నుండి రష్యా వెళతున్న విమానం ప్రమాదవశాత్తు సినాయ్ లో కూలిపోయింది. విమానం కూలిపోయినట్టు ఈజిప్ట్ ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్ ధృవీకరించారు. వివరాల ప్రకారం కాగా ఈజిప్ట్ నుండి రష్యా వెళతున్న విమానం ఐఎస్ఐఎస్ ప్రాబల్యం ఎక్కువగా ఉండే సినాయ్ ప్రాంతంలో గల్లతైంది. తరువాత అక్కడి నుండి కంట్రోల్ రూంకు విమానం నుంచి సిగ్నల్స్ లేదు. దీంతో ఈజిప్ట్ సైనిక విమానాలు గల్లంతైన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టగా అది సెంట్రల్ సినాయ్ లోని పర్వత ప్రాంతాల్లో అది కూలిపోయిందని గుర్తించారు. ఈ విమానంలో మొత్తం 212 మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది ఉండగా ఎక్కువ మంది రష్యా ప్రయాణికులే ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రయాణికుల్లో ఎవరైనా బతికి ఉన్నారా అన్నది ఇప్పుడు సందేహం.. కాగా విమానంలోని వారంతా చనిపోయి ఉంటారు అని ఓ అధికారి అన్నారు.  

వరంగల్ లోక్ స్థానం బరిలో కాంగ్రెస్ అభ్యర్దిగా రాజయ్య

  వరంగల్ ఉపఎన్నిక బరిలో పోటీ చేసే అభ్యర్దిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వరంగల్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ పార్లమెంటు సభ్యుడు రాజయ్యను బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. మొదట ఈ వరంగల్ లోక్ స్థానానికి మాజీ ఎంపీ వివేక్, సర్వే నారాయణ పేర్లు పరిశీలనలో ఉండగా కాంగ్రెస్ మాత్రం ఎక్కువ శాతం వివేక్ నే ఈ బరిలోకి దింపడానికి చూసింది. కానీ వివేక్ మాత్రం దీనికి ముందునుండి సముఖత చూపించలేదు. ఇక సర్వే నారాయణ పేరును కూడా పరిశీలించిన అధిష్టానం ఆఖరికి ఈ స్థానానికి గాను రాజయ్య పేరును ఖరారు చేసింది. కాగా గత ఎన్నికల్లో కడియం శ్రీహరిపై పోటీచేసిన రాజయ్య 3 లక్షల 96 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదిలా ఉండగా ఈ వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీనుండి పసునూరి దయాకర్ బరిలో దిగనున్నారు. ఇక టీడీపీ, బీజేపీ నుండి ఎవరు పోటీ చేస్తారో తెలియాల్సి ఉంది.

తలసాని కొడుకుపై కిడ్నాప్ కేసు

  ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ అతని రాజీనామా వ్యవహారం వివాదంలో చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు దానికి తోడు అతని కుమారుడు కూడా కొత్తగా వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తుంది. అభినవ్ అనే వ్యక్తి తన భార్యను సాయి కిరణ్ కిడ్నాప్ చేశాడని మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం.. అభినవ్ రెండు నెలల క్రితమే సికింద్రాబాద్ మారేడ్ పల్లికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి తల్లిదండ్రులకు ఈ వివాహం నచ్చకపోవడంతో ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్టు అభినవ్ తెలిపాడు. తన భార్యను తీసుకురావడానికి వెళ్లిన అతనిపై అతని కుటుంబసభ్యులు, బంధువులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో తన భార్య కిడ్నాప్ కు, అతనిపై దాడి వెనుక తలసాని కుమారుడు సాయికిరణ్ హస్తం ఉందని అభినవ్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు తలసాని కొడుకుతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రష్యా విమానాన్ని కూల్చివేసిన ఐసిస్ ఉగ్రవాదులు?

  రష్యాకు చెందిన నెంబర్: 9268 విమానం ఈజిప్టులో సెంట్రల్ సినాయ్ అనే ప్రాంతంలో ఈరోజు ఉదయం కూలిపోయింది. ఆ విమానంలో మొత్తం 217 మంది ప్రయాణికులు 7 మంది విమాన సిబ్బంది కలిపి మొత్తం 224మంది ఉన్నట్లు సమాచారం. వారందరూ ఈ మరణించి ఉండవచ్చని ఈజిప్ట్, రష్యా దేశాలు భావిస్తున్నాయి. ఈజిప్టు స్థానిక కాలమాన ప్రకారం ఇవ్వాళ్ళ ఉదయం 06:51గంటలకు షర్మ్-అల్-షేక్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఫ్లయిట్ నెంబర్: 9268 విమానం, టేక్-ఆఫ్ తీసుకొన్న23 నిమిషాలకే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం ఈజిప్టు నుండి బయలుదేరి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో గల పుల్కొవ్ విమానాశ్రయానికి 12:10 గంటలకు చేరుకోవలసి ఉంది. కానీ సెంట్రల్ సినాయ్ అనే ప్రాంతంలో కూలిపోయినట్లు ఈజిప్ట్ ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్ కార్యాలయం ద్రువీకరించింది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై రష్యా దాడులు చేస్తునందున వారు అందుకు ప్రతీకారంగానే ఈ విమానాన్ని కూల్చివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ వార్తలను ఇంకా దృవీకరించలేదు. ఐసిస్ ఉగ్రవాదులు కూడా ఇంత వరకు దీని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.

హైదరాబాద్ లో ఉంది.. మరి ఏపీలో ఎక్కడ?

  ఈ మధ్య కాలంలో ఏ చిన్న విషయానికైనా ధర్నాలు చేయడం కామన్ అయిపోయింది. మరి అలాంటి ధర్నాలు ఎక్కడ పడితే అక్కడ చేస్తే అటు అధికారులకూ.. ఇటు ప్రజలకూ ఇబ్బందే. అందుకే గతంలో దీని గురించి ఆలోచించే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలని భావించి అందుకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఏర్పాటుచేశారు. అయితే అది అప్పటి సంగతి.. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది.. ఎపీలో కూడా ధర్నాలు ఎక్కువయ్యాయి. మరి ఏపీకి కూడా ధర్నా చౌక్ ఉండాలి కదా.. ఇప్పుడు దీని గురించి కసరత్తు జరుగుతుంది. మొన్నటి వరకూ అయితే విజయవాడలోని బందరు రోడ్డులో సబ్ కలెక్టరేట్ ఎదుట విక్టోరియా మ్యూజియం ఎదుట ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి ఉంది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు పాలన విజయవాడ నుండి పాలించడం మొదలు పెట్టారో.. అప్పుడు సీఎం క్యాంపు కార్యాలయాన్ని జల వనరుల శాఖ ఆవరణలో ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ విధించడంతో బందరు రోడ్డు ప్రాంతంలో ధర్నాలు, ర్యాలీలకు ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ధర్నా చౌక్ ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ కసరత్తు చేపట్టింది. అంతేకాదు సీఎం క్యాంప్ కార్యాలయానికి దూరంగా ట్రాఫిక్ సమస్య తలెత్తని చోట ధర్నా చౌక్ను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. దీనిలో భాగంగా సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ కు వెళ్లే రోడ్డుకు బిఆర్ టిఎస్ రోడ్డుకు మధ్య ఖాళీ స్థలంలో తాత్కాలికంగా ధర్నా చౌక్ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.

మళ్లీ భూసేకరణ.. వెలిసిన పవన్ ఫ్లెక్సీలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను భూసేకరణకు వ్యతిరేకమని.. రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములు లాక్కుంటే పోరాడతామని గతంలో ప్రభుత్వాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రభుత్వం కూడా కాస్త వెనక్కి తగ్గి భూసేకరణను ఆపింది. అయితే ఇప్పుడు మళ్లీ భూసేకరణపై వివాదాలు తలెత్తుతున్నాయి. ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ భూసేకరణ గురించి మాట్లాడటం.. నవంబర్ మొదటి వారంలో భూసేకరణ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చాంశనీయమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తెరమీదకి వచ్చాయి. ఇప్పటికే తాడేపల్లి, మంగళగిరి మండలాల రైతలు తమ భూములు ఇవ్వబోమంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తుళ్లూరు మండలంలో ఉన్న 300 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేస్తుందని ప్రకటించడంతో ఇప్పుడు తుళ్లూరు రైతులు కూడా వారికి జతకట్టనున్నారు. దీనిలో భాగంగానే అప్పుడే మంగళగిరి మండలం నవులూరు, ఎర్రబాలెం, కురగల్లు గ్రామాల రైతులు జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రాజధాని మండలాల్లో అలజడి రేగింది. కాగా ఇప్పటికే రాజధాని భూముల నేపథ్యంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కి, పవన్ కళ్యాణ్ కు విభేధాలు తలెత్తాయన్న దానిలో సందేహం లేదు. మరోసారి ఈ వివాదం తెరపైకి రావడంతో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో.. ఈసారి ఎలాంటి విభేధాలు తలెత్తుతాయో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోయినసారి పవన్ కళ్యాణ్ మాట మేరకు ప్రభుత్వం భూసేకరణను నిలిపింది.. మరి ఈసారి ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది.. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అసలు పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.

మోడీని కలవడానికి ఆరాటపడుతున్న కేసీఆర్.. అందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు కేంద్రానికి.. మోడీకి చాలా దూరంగా.. అంటీముట్టనట్టు వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. ఇప్పుడు కేసీఆర్ మోడీని కలవడానికి తెగ ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ ఢిల్లీ పర్యటనలోనే ఉన్న కేసీఆర్ కు మోడీని కలిసే అవకాశం దక్కలేదు. కావాలనే అపాయింట్ మెంట్ ఇవ్వలేదో.. లేకపోతే నిజంగానే టైమ్ లేక ఇవ్వలేదో తెలియదు కాని మోడీని కలిసే ఛాన్స్ కేసీఆర్ కు ఇవ్వలేదు. అయితే మళ్లీ కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 3 నుండి 5 వరకూ ఢిల్లీలోనే పర్యటించి..మోడీని కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంతలా కేసీఆర్ మోడీని కలవడానికి ఎందుకు ఆరాటపడుతున్నారా అని అప్పుడే సందేహాలు మొదలయ్యాయి. ఒకవైపు నవంబర్ 3 - 4 తేదీల్లో ఢిల్లీలో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం కాన్ఫెడరేషన్ ఆప్ ఇండియన్ ఇండస్ట్రీ సమావేశాలకు హాజరు కావడానికే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నా మరో వైపు ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. గత కొద్ది రోజుల కిందట కేసీఆర్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. యూపీఏ హయాంలో కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న కేసీఆర్ ఆశాఖలో జరిగిన కొన్ని అవకతవకలు కారణంగా సీబీఐ కేసీఆర్ ను ప్రశ్నించింది. దీనికి తోడు మళ్లీ సహారా సంస్థ నుండి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో వీటి గురించే మోడీతో మాట్లాడేందుకే కేసీఆర్ మళ్లీ ఢిల్లీ వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 5న మోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పాపం ఇన్ని రోజులు కేంద్రంతో కోపంగా ఉన్న కేసీఆర్ కి ఇప్పుడు కేంద్రంతోనే పనిబడింది. మరి మోడీ ఈసారైనా కేసీఆర్ ను కరుణిస్తారో? లేదో?

వరంగల్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు

వరంగల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్ధి పేరును తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రకటించింది. టీఆర్ఎస్ తరుపున ఈ ఉపఎన్నికు పోటీ చేసే అభ్యర్ధిగా పసునూరి దయాకర్ పేరు ఖరారు చేశారు. ఢిల్లీ నుండి వచ్చిన కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమై అన్ని విధాలా చర్చించి దయాకర్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడి వరకూ బానే ఉన్నా నిన్న మొన్నటి వరకూ టికెట్ తనకే వస్తుందని భావించిన గుడిమళ్ల రవికుమార్.. తనను కాదని కేసీఆర్ దయాకర్ కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు మొదటి నుండి టికెట్ తనకే ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకూ న్యాయం అంటూ తన సన్నిహితుల దగ్గర ఆరోపించడంతో కేసీఆర్ రవికుమార్ ను బుజ్జగించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్లనే రవికుమార్ టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని.. పార్టీలో కీలక పదవి ఇస్తానని.. నిరాశ పడాల్సిన అవసరం లేదని రవికుమార్ కు హామీ ఇచ్చారంట. కాగా పసునూరి దయాకర్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉంటూ.. పార్టీకోసం పనిచేస్తూ.. ప్రస్తుతం పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా పనిచేశారు.