నా మాట విని ఉంటే ఈ దాడులు జరిగేవి కావు.... ట్రంప్
బెల్టియంలో అలా ఉగ్రవాదుల దాడులు జరిగాయో లేదో, ఇలా ట్రంప్ తన నోటికి పని చెప్పడం మొదలుపెట్టాడు. కాకపోతే ఈసారి ట్రంప్‌కు తోడుగా మరో రిపబ్లికన్ అభ్యర్ధి టెడ్ క్రూజ్ కూడా తోడయ్యాడు. బెల్జియం దాడుల నేపథ్యంలో, అమెరికాలోని ముస్లింలు అధికంగా ఉండే చోట నిఘాని పెంచాల్సి ఉంటుందని వీళ్లిద్దరూ పేర్కొన్నారు. తరచూ ముస్లింల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్‌ను చూసి క్రూజ్ కూడా స్ఫూర్తిని పొందాడో ఏమో... ముస్లిం శరణార్థులు అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలంటూ ప్రకటించారు. ఇక ట్రంప్ అయితే ఏకంగా తన మాట విని ఉంటే బెల్జియంలో బాంబులు పేలేవి కావని అన్నారు.
ఇంతకీ ఆ మాట ఏమిటంటారా! పోలీసులకు ఎవరన్నా ఉగ్రవాదులు పట్టుబడితే, వారి నుంచి నిజాలను రాబట్టేందుకు, వారిని చిత్రహింసలకు గురిచేయాలన్నది ట్రంప్ ఉవాచ. గతంలో ప్యారిస్‌లో పట్టుబడిన ఉగ్రవాదిని కనుక చావచితక్కొట్టి ఉంటే, అతను బెల్జియం దాడులు గురించి చెప్పేసేవాడన్నది ట్రంప్ బాధ. ట్రంప్ వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవహక్కుల సంఘాలవారు ఖండిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను మొదలుపెడితే, వాటికి ఎక్కువగా బలయ్యేది అమాయకులే అని వారి వాదన. కానీ ట్రంప్ ప్రజాదరణ పెరిగిపోవడం చూస్తుంటే, ఆయన మాటలతో ఏకీభవించేవారి సంఖ్య కూడా పెరుగుతోందని అనిపిస్తోంది.