చాగంటినీ వదలరా?
posted on Nov 26, 2025 @ 10:15AM
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా ఉంది వైసీపీయుల తీరు. పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పినందుకు వైసీపీ సోషల్ మీడియా వింగ్ ప్రముఖ ప్రవచన కారుడు చాగంటిపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్నది. చాగంటికి రాజకీయాలు అంటగడుతోంది.
ఇప్పటి వరకూ చాగంటి ప్రవచనాలు కులాలకే కాదు, మతాలకు అతీతంగా కూడా ఒక గొప్ప సమానత్వాన్ని తీసుకొచ్చి పెట్టాయి. కారణం ఆయన చెబుతోన్నది హైందవ కథలా లేక మరొకటా అన్నది పక్కన పెట్టి.. వినడానికి ఇంపుగా ఉండటం, మానవీయ విలువల ఔన్నత్యాన్ని చాటడం వల్లనే ఆయన ప్రవచనాలంటే ఎవరైనా సరే చెవులు కోసుకునే పరిస్థితి ఉంది.
అది ట్రావెలింగ్ బస్సు కావచ్చు, లేదేంటే యూట్యూబ్ చానెల్ కావచ్చు, ఆపై ఆయన నేరుగా ప్రవచనాలు చెప్పే వేదికలూ కావచ్చు.. మాటల ప్రవాహం అలా దొర్లిపోతూనే ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక చాగంటి ఒక పదవి ఇచ్చి.. ఆయన ద్వారా యువతకు మంచి నేర్పే చక్కటి కార్యక్రమం చేపట్టింది. ఇక్కడే వైసీపీయులు తమ వికృత మనస్తత్వాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆయనను గౌరవించి, గుర్తించి పదవి ఇచ్చి ఓ గొప్ప బాధ్యత అప్పగించడంతో వైసీపీ కక్ష కట్టింది.
ఇటీవల ఆయన చేసిన ఒక ప్రవచనం కారణంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇన్నాళ్ల పాటు మీ మీద పెంచుకున్న గౌరవం మొత్తం మంటగలసి పోయిందన్న కోణంలో వారు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ చాగంటి ఏమన్నారో చూస్తే.. ఆయన కుటుంబ విలువల గురించి చెప్పడంలో భాగంగా తోబుట్టువుల అనుబంధం గురించి చెప్పారు. అంతే ఇదంతా జగన్, షర్మిళ గురించి ఆయన చెప్పినట్టు ఊహించుకుని ఆయన్ను తెగ ఆడిపోసుకుంటోంది వైసీపీ సోషల్ మీడియా వింగ్.
ఒక వేళ చాగంటి హత్య చేయడం తప్పు.. అని చెబితే దాన్ని కూడా జగన్ తన బాబాయి వివేకాను హత్య చేయించిన దానికి అన్వయించుకుని.. గోలగోల చేస్తూ విమర్శలకు దిగుతారేమో, అలాగే అవినీతికి పాల్పడకూడదని చాగంటి చెబితే.. అది కూడా జగన్ కొల్లగొట్టిన కోట్ల ఆక్రమాస్తుల గురించే అని దాడికి దిగుతారేమో అన్నట్లుగా వైసీపీయుల కామెంట్లు ఉంటున్నాయి.