ఏపీ కేబినెట్ భేటీ.. ఏఏ అంశాలపై చర్చంటే?
posted on Nov 28, 2025 @ 11:23AM
ఆంధ్రప్రదేశ్ మంతివర్గ సమావేశం శుక్రవారం (నవంబర్ 28) మధ్యాహ్నం మూడు గంటలను జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ బేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నరిలయన్స్ డేటా సెంటర్, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం పొందిన కీలక ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
అదే విధంగా ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల అమలుపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలకు కూడా మంత్రివర్గం చర్చించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టనున్న బిల్లులపై కూడా చర్చ జరిపి ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది.
సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో గతేడాది వరద ముంపు మరమ్మతులకు గానూ దాదాపు రూ.57.14 కోట్లు మంజూరుకు ఆమోదం తెలపనుంది. అదే విధంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది.