ప్రజాసేవ చేసేందుకు పోటీలా?
posted on Apr 15, 2014 7:21AM
ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు జీవన్మరణ పోరాటంగా భావిస్తుండటంతో పార్టీల మధ్య, పార్టీలలోనే అభ్యర్ధుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దానికి తోడూ ఎన్నికల పొత్తులు కారణంగా కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు మూడూ కూడా టికెట్ ఆశిస్తున్నతమ స్వంత పార్టీ నేతల నుండే తీవ్ర ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాయి. అదేవిధంగా తెరాసతో సహా వివిధ పార్టీలలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్ధులు రోజుల వ్యవధిలోనే చకచకా పార్టీలు మారడం, లేకుంటే స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీలో నిలబడటం కూడా చూస్తున్నాము. ఇక ఇంతకు ముందు కనీ వినీ ఎరుగని విధంగా సదరు ఆశావాహులకు టికెట్స్ ఇమ్మని కోరుతూ వారి తరపున వందలాది మందితో వీధుల్లో బైకు ర్యాలీలు నిర్వహించడం, స్వంత పార్టీ కార్యాలయాల మీద, నేతల మీద దాడులు చేసే ఒక సరికొత్త వికృత సంస్కృతికి కూడా ఈ ఎన్నికలు పురుడు పోశాయి.
ఇక ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన నాటి నుండి వరుసపెట్టి ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నందున, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాష్ట్రమంతటా సిద్దం చేసిన డబ్భు, మద్యం, బహుమతులు పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రతీ ఎన్నికలలో ఇటువంటి దృశ్యాలు సర్వసాధారణమే అయినప్పటికీ ఈసారి మాత్రం అన్నీ కూడా చాలా అతిగానే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం రాజకీయ పార్టీల, నేతల అధికార కాంక్షేనని చెప్పక తప్పదు.
ప్రతీ పార్టీకి కొన్ని ప్రత్యేకమయిన సమస్యలు, రాజకీయ అవసరాలు ఉన్నందున, ఏదో విధంగా ఈ ఎన్నికలలో గెలిచి అధికారం చేజికించుకొంటే తప్ప వాటి నుండి బయటపడలేమనే ఆందోళన, భయంతోనే ఎంత ఖర్చుకయినా వెనుకాడటం లేదు. ఎంతకయినా తెగించేందుకు సిద్దపడుతున్నాయి. ఇక టికెట్ ఆశిస్తున్న అభ్యర్ధులలో చాల మంది వ్యాపారస్తులు, కాంట్రాక్టులు చేసుకొంటున్నవారే కనిపిస్తున్నారు తప్ప కేవలం రాజకీయాలకే పరిమితమయిన వారిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును.
అటువంటి వారందరూ తమ వ్యాపారాలను కాపాడుకొనేందుకు, వాటిని మరింత వృద్ధి చేసుకోనేందుకే రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారు. అయినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు, వారి అభ్యర్ధులు కూడా ఇదంతా కేవలం ప్రజా సేవ చేసేందుకేనని చెపుతూ దైర్యంగా ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతుండటం, ఆ సంగతి తెలిసి ఉన్నపటికీ ప్రజలు కూడా స్వచ్చందంగా, సంతోషంగా పువ్వులు పెట్టించుకోవడం విశేషమే.
తమవంటి కాదని నిజాయితీపరులు, సమర్దులయిన చిన్న పార్టీల అభ్యర్ధులకు ఓట్లు వేస్తే అవి మురిగిపోతాయని పెద్ద పార్టీల నేతలే పనిగట్టుకొని ప్రచారం చేయడం వలన ప్రజలలో కూడా క్రమంగా అటువంటి అభిప్రాయమే స్థిరపడుతుండటం అవాంచనీయమయిన పరిణామంగా చెప్పవచ్చును. వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకొనే ఈ రాజకీయ నాయకులు ఏనాడు సమాజంలో పేద ప్రజలకు, బలహీన వర్గాలకు చిల్లి గవ్వ విదిలించకపోయినా, నేడు ప్రజాసేవ చేసేందుకు విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు ఎందుకుఖర్చు చేస్తున్నారు? అని అందరూ ఆలోచించి, తగిన అభ్యర్ధికే ఓటు వేయవలసి ఉంది. లేకుంటే ఈరోజు వారు ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలకు చక్రవడ్డీతో సహా వసూలు చేసుకోవడం ఖాయం.