మెగా సోదరులు...మెగా డిఫరెన్స్...
posted on Apr 24, 2014 @ 11:30AM
కాంగ్రెస్ పార్టీని ఎలాగయినా గెలిపించి తీరుతానని చిరంజీవి డిల్లీలో శపథం చేసి ప్రచారానికి బయలుదేరితే, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమికొట్టేందుకే తాను రాజకీయాలలోకి రావలసి వచ్చిందని చెప్పడం విశేషం. అయితే వీరిరువురిలో చిరంజీవి స్థిరంగా కాంగ్రెస్ టైటానిక్ పడవ మీదనే నిలబడి గంట కొడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం నేటికీ ‘ఎన్డీయే అభ్యర్ధులకే నా మద్దతు!’ అంటున్నారు తప్ప, స్వయంగా చంద్రబాబే ఆయనింటికి వచ్చి మరీ తమ పార్టీకి మద్దతు ఇమ్మని కోరినా ఆయన నోటంట ‘తెలుగుదేశం పార్టీకే నా మద్దతు’ అనే ముత్యాలవంటి ఆ మూడు ముక్కలు రాలలేదు. అంటే ఆయనకి తెదేపా పట్ల నేటికీ ఇంకా ఏవో అభ్యంతరాలున్నట్లు భావించవలసి ఉంది. ఏమయినప్పటికీ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో ‘ఎన్డీయే అభ్యర్ధులకు’ ప్రచారం చేసి పెట్టబోతున్నట్లు రూడీ అయ్యింది.
ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ నేటికీ తెలంగాణాలో ప్రచారం చేయడానికి వెళ్ళగలుగుతున్నారు. ఆయనకి అక్కడ ప్రజల నుండి అభిమానుల నుండి నేటికీ మంచి ఆదరణ కనబడుతోంది. కానీ కేంద్రమంత్రి అయిన చిరంజీవి హైదరాబాదులోనే నివాసం ఉంటున్నప్పటికీ, కాంగ్రెస్ తరపున తెలంగాణాలో ప్రచారం చేయలేని దుస్థితి. ఆయన ప్రచారానికి వెళితే పడే ఓట్లు కూడా పడవని గ్రహించిన టీ-కాంగ్రెస్ నేతలు చిరంజీవి ‘నో ఎంట్రీ’ బోర్డు ఎప్పుడో పెట్టేసారు. నిజానికి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చిన కారణంగా ఎంతో కొంత అనుకూల పరిస్థితి ఉంది. కానీ, అక్కడ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు చిరంజీవి వంటి ప్రజాకర్షక నేత ఒక్కడూ లేడు. అయినప్పటికీ మా తిప్పలేవో మేమే పడతాము తప్ప ఆ జీవి మాత్రం మాకొద్దు మహాప్రభో! అంటున్నారుట.
పోనీ ఆయనకు సీమాంద్రాలో ప్రజలు ఏమయినా బ్రహ్మ రధం పడుతున్నారా.. అంటే అదీ లేదు. అక్కడా ఆయన సభలకు జనాలు మొహాలు చాటేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన నిర్వహించిన బస్సు యాత్రలోను అదే స్థితి, నేడు ఆయన చేస్తున్న ప్రచారంలోనూ అదే పరిస్థితి. చిరంజీవి రెండు ప్రాంతాల ప్రజలకు కాని వాడయిపోతే, ఆయన తమ్ముడు మాత్రం అందరివాడు, అందరికీ కావలసినవాడు అనిపించుకొంటున్నారు. చిరంజీవిని సీమాంద్రాలో ప్రజలు సైతం పట్టించుకోకపోయినా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చి తమకోసం తెలంగాణాలో కూడా ప్రచారం చేయాలని ‘ఎన్డీయే అభ్యర్ధులు’ కోరుకోవడం గమనిస్తే ప్రజలలో మెగా సోదరుల వ్యక్తిత్వాలకున్న విలువ ఏమిటో స్పష్టంగా అర్ధమవుతుంది. చివరికి ఇతర రాష్ట్రాలలో తెలుగు ప్రజలు సైతం ఇదేవిధంగా స్పందించడం మరో విశేషం.
అయితే అందుకు కేవలం వారి వ్యక్తిత్వాలు మాత్రమే ప్రధాన కారణమని చెప్పలేము. వారి ప్రసంగ శైలి, వారు ఎన్నుకొన్న పార్టీలపై ప్రజలకున్న అభిప్రాయాలు కూడా వారి ప్రజాధారణలో తీవ్ర అంతరాన్ని కలిగిస్తున్నాయి. చిరంజీవి తన సినిమాలలో ప్రజలను ఆకట్టుకొనే విధంగా చాలా గొప్పగా డైలాగ్స్ చెపుతూ నటించి ఉండవచ్చును. కానీ నేటికీ ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ లాగ అలవోకగా ప్రసంగించలేరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేఖత, ముఖ్యంగా రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన అనుసరించిన ద్వంద వైఖరి ఇత్యాది కారణాలు కూడా ఆయన పట్ల ప్రజలలో విముఖత ఏర్పడేందుకు కారణమవుతోందని చెప్పవచ్చును.
ఒకవైపు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కోసం సీమాంద్రాలో ప్రచారం చేస్తూ గెలుపు తమదేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటే, మరో వైపు ఆ పార్టీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్ధులు ఓటమి భయంతో తమ నామినేషన్లు ఉపసంహరించుకొని పోటీ నుండి తప్పుకోవడం ఆయన ప్రచారం యొక్క గొప్పదనానికి మరో నిదర్శనం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ సీమాంద్రాలో కూడా ‘ఎన్డీయే అభ్యర్ధుల’ తరపున ప్రచారానికి దిగినట్లయితే కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును.
పాపం ఆ ఒంటరి జీవి కష్టం చూసి చలించిపోయిన కాంగ్రెస్ టైటానిక్ షిప్ కెప్టెన్స్- సోనియా రాహుల్ గాంధీలు కూడా త్వరలోనే సీమాంద్రాలో పర్యటించి ‘మిగిలిన పని’ పూర్తి చేయడానికి వస్తున్నట్లు తాజా సమాచారం. శుభం.