రాష్ట్రంలో రాజకీయ ఆత్మహత్యలు జరగబోతున్నాయా?
posted on May 14, 2014 @ 6:20PM
ఇంతకాలం రాష్ట్రంలో మామూలుగా జరిగే ఆత్మహత్యలు కాకుండా రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఉద్యమాల ఆత్మహత్యలు, ఏ నాయకుడో పోతే హర్టయినవాళ్లు చేసుకున్న ఆత్మహత్యలు మాత్రమే చూశాం. ఈనెల 16న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రాజకీయ ఆత్మహత్యలు కూడా జరగబోతున్నాయన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి ఎన్నికలలో డబ్బు ఏరులై పారింది. పార్టీలతో నిమిత్తం లేకుండా ఎన్నికలలో పాల్గొన్న నాయకులందరూ భారీగా ఖర్చు పెట్టారు. నా పోటీ అభ్యర్థి ఇంత ఖర్చు పెట్టాడు కాబట్టి.. నేను అంతకు మించి ఖర్చు పెట్టాలి. నా పోటీ అభ్యర్థి ఓటుకి ఇంత డబ్బు ఇచ్చాడు కాబట్టి నేను అంతకంటే ఎక్కువ డబ్బిచ్చి ఓట్లు కొనాలనే సిద్ధాంతంతో చాలామంది అభ్యర్థులు డబ్బు విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. డబ్బు ఖర్చు పెట్టకపోయినా గెలిచే అభ్యర్థులు కూడా రిస్క్ ఎందుకు చేయాలన్నట్టు ఖర్చు పెట్టారు. కొంతమంది భారీగా డబ్బున్న అభ్యర్థుల విషయం అలా వుంచితే, చాలామంది అభ్యర్థులు ఎన్నికలలో గెలిచి తీరాలన్న పట్టుదలతో వడ్డీలకు తెచ్చి మరి ఎన్నికలలో ఖర్చుపెట్టారు.
ఎన్నికల కమిషన్ చూసీ చూడనట్టు వ్యవహరించడంతో బరితెగించి మరీ డబ్బు పారబోశారు. కొంతమంది 10 రూపాయల వడ్డీకి కూడా డబ్బు అప్పు తెచ్చిమరీ ఖర్చుపెట్టారు. ఈసారి ఎన్నికలలో ఒక్కో నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థి 6 నుంచి 7 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. డబ్బు అప్పనంగా సంపాదించిన ఒక పార్టీ అభ్యర్థి అయితే తాను పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చుపెట్టినట్టు సమాచారం. ఇంత డబ్బు ఖర్చుపెట్టి ఎన్నికలలో గెలిస్తే, ఆ తర్వాత ఆ డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చనే ఆలోచనే ఇలా ఖర్చుపెట్టేలా చేస్తూ వుండొచ్చు. గెలిస్తే సంపాదించే సంగతి తర్వాత.. ఓడిపోతే పరిస్థితేంటి?
ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలిచినా, ఓడినా ఆ తర్వాత ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాంరా దేవుడా అని ఏడవాల్సిందే. కోర్టు కేసులో ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు. గెలిచినవాడు ఇంటికెళ్ళాక ఏడుస్తాడన్నట్టు.. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలలో పోటీచేసిన చాలామంది అభ్యర్థుల పరిస్థితి గెలిచినా, ఓడినా ఏడవాల్సిందే అన్నట్టుగా తయారైంది. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటికే చాలా ఒత్తిడిలో వున్నారు. 16 తర్వాత ఓడిపోయిన అభ్యర్థుల్లో కొంతమందిలో ఆ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం వుంది. ఆ ఒత్తిడిలో ఆత్మహత్యాప్రయత్నాలు కూడా జరిగే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాంటివేవీ జరగకూడదని కోరుకుందాం. ఒకవేళ అలాంటివేవైనా జరిగితే దీనికి పూర్తి బాధ్యత ఎన్నికలలో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించలేకపోయిన ఎన్నికల కమిషనే తీసుకోవాల్సి వుంటుంది.