ఆంధ్ర-తెలంగాణా వివాదాలకు పరిష్కారాలే లేవా?
posted on Jul 14, 2014 @ 11:52AM
ఆంధ్ర-తెలంగాణా వివాదాలకు పరిష్కారాలే లేవా? ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య జల, విద్యుత్ వివాదాలు నిత్య ప్రహసనంగా మారాయి. అందువల్ల నిత్యం కేంద్రం జోక్యం కూడా అనివార్యమవుతోంది. కానీ ఒక సమస్యను పరిష్కరించగానే మరొకటి తయారవుతుండటంతో కేంద్రం కూడా తలపట్టుకోవలిసివస్తోంది.
రెండు ప్రభుత్వాలు తమ హక్కులను కాపాడుకోవాలని ప్రయత్నించడంలో తప్పు లేదు. కానీ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించే బదులు ఘర్షణ వైఖరి అవలంభిస్తుండటంతో కేంద్రం జోక్యం చేసుకోవలసివస్తోంది. ఈ గొడవలు ఇలా ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి? వీటికి ఎప్పటికయినా శాశ్విత పరిష్కారం దొరుకుతుందా? అనే ప్రజల ప్రశ్నలకు జవాబు ఇచ్చేవారు లేరు. ఈ జల, విద్యుత్ సమస్యలకు ఒక శాశ్విత పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించనంత కాలం ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి. దానివలన రెండు రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడటమే కాకుండా ప్రజలు, ప్రభుత్వాల మధ్య మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడి చివరికి అది శాశ్విత శత్రుత్వంగా మారే ప్రమాదం ఉంది.
వీటికి కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో పరిష్కారాలు చూపడం సాధ్యం కాదా? అని ఆలోచిస్తే సాధ్యమేనని చెప్పవచ్చును. అవేమిటంటే 1. రెండు రాష్ట్రాలు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. 2. ప్రజాభిప్రాయాలను కోరి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం. 3. నదీ జలాల పంపకాలలో డ్యాముల నిర్మాణం, ఎత్తు పెంచడం వంటివాటితో సంబంధం లేకుండా దిగువ రాష్ట్రాలకు న్యాయబద్దంగా సకాలంలో నీళ్ళు విడుదలయ్యే విధంగా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించడం. 4. నీళ్ళు, విద్యుత్ మరియు ఇతర వనరుల పంపిణీ కోసం ప్రస్తుతం ఉన్న వ్యవస్థలకు సంపూర్ణ హక్కులు కల్పించి, దేశంలో అన్ని రాష్ట్రాలు వాటికి లోబడి ఉండేలా కటిన చట్టాలు ఏర్పాటు చేయడం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వన్నీ తెలియవని కాదు. కానీ, రాజకీయ ప్రభావంతో ఇటువంటి వాటిని అమలు చేయలేకపోతున్నాయి. రాష్ట్ర విభజనపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు నాన్చిన కారణంగా రాష్ట్రం అల్లకల్లోలం అయింది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో శాంతి ఏర్పడకపోగా ఈ సమస్యల వలన క్రమంగా మళ్ళీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు అధికారం చేప్పట్టిన ఎన్డీయే ప్రభుత్వం ఈ సమస్యలకు తాత్కాలిక ఉపాయాలు కాకుండా వీలయినంత త్వరగా శాశ్విత పరిష్కారాలు కనుగొనాలి. ఈ సమస్యలను ఇలాగే నానుస్తూపోతే ఏదో ఇది కూడా తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందనే సంగతి గ్రహించి అవసరమయితే ఆంధ్ర-తెలంగాణాల కోసం నిపుణులతో కూడిన ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.