అవి కక్ష సాధింపు చర్యలేనట!
posted on Jul 9, 2014 @ 4:03PM
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపింది. వారిరువురి అధ్వర్యంలో నడిచిన నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక మూతపడిన తరువాత, దాని ఆస్తులను ఇతర సంస్థలకు అప్పుగా ఇవ్వడం వ్యాపారపరమయిన లావాదేవీగానే భావిస్తూ, ఆ లావాదేవీలపై వచ్చిన ఆదాయంపై పన్నుఎగవేసినందుకు ఆదాయపన్ను శాఖా నోటీసులు జారీ చేసింది.
దీనిపై సోనియా గాంధీ స్పందిస్తూ మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టిందని, అటువంటి వాటికి తాను భయపడేది లేదని, తమను ఎంతగా ఇబ్బందిపెడితే తాము అంత శక్తివంతంగా తయారయ్యి మళ్ళీ అధికారంలోకి వస్తామని అన్నారు. అయితే ఇంతకాలం మిత్ర పక్షాలను, ప్రతిపక్షాలను వేదించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇప్పుడు తనవంతు రాగానే దానిని కక్ష సాధింపు చర్యలని వర్ణించడం హాస్యాస్పదం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె తన రాజకీయ ప్రత్యర్ధులను లొంగదీసేందుకు సీబీఐను ఏవిధంగా వాడుకొందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎంతగా తెగించిందంటే చివరికి తనకు బయట నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేతలపై కూడా సీబీఐని ప్రయోగించి, తనకు మద్దతు కొనసాగించేలా చేసుకొంది. ఆ విషయాన్ని స్వయంగా సమాజ్ వాదీ పార్టీ నేతలే చెప్పుకొన్నారు కూడా. కాంగ్రెస్ వైఖరితో చివరికి సుప్రీం కోర్టు సైతం విసుగెత్తిపోయి, “కాంగ్రెస్ చేతిలో సీబీఐ పెంపుడు చిలకలా మారిపోయిందని, దానికి అనేకమంది యజమానులున్నారని” చురకలు వేసింది. తన కుమారుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సైంధవుడిలా అడ్డుపడుతున్ననరేంద్ర మోడీపై కూడా సీబీఐ చిలుకలను ప్రయోగించింది. కానీ సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థ-సిట్ మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి తప్పించుకోగలిగారు. ఆవిషయాలన్నీ మరిచిపోయిన సోనియాగాంధీ, ఇప్పుడు తనకు ఆదాయపన్ను శాఖ నోటీసులు అందగానే అది మోడీ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలని గగ్గోలు పెట్టడం హాస్యాస్పదం.