ఏపీకి నిధుల విడుదల ఇంకా ఎప్పుడో?
posted on Sep 15, 2014 @ 5:33PM
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ మూడు నెలలపైనే అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పట్టువదలని విక్రమార్కుడిలా నిధుల కోసం మోడీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క నయాపైసా విదిలించలేదు. కానీ కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ తదితరులు హామీలు గట్టిగానే ఇస్తున్నారు. కేంద్రం నిధులు విదిలించనిదే అభివృద్ధి పనులు మొదలుపెట్టే అవకాశం లేకపోవడంతో రోజులు గడుస్తున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.
అయితే నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోకుండా, రాజధాని నిర్మాణం కోసం అవసరమయిన అధ్యయనం, పోలవరం ప్రాజెక్టు క్రిందకు వచ్చిన ముంపు గ్రామాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో విలీనం చేసి నిర్వాసితుల తరలింపుకి అవసరమయిన ఏర్పాట్లు, ప్రాజెక్టుకి అభ్యంతరం చెపుతున్న ఛత్తీస్ ఘర్, ఒడ్డిషా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చంద్రబాబు చర్చలు, రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్రానికి పంపడం వంటివి అనేకం చేస్తోంది.
త్వరలో ప్రభుత్వ ప్రధాన శాఖలను విజయవాడకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండటంతో విజయవాడలో చేప్పట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా అనేక ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. వాటిలో ముఖ్యంగా కనక దుర్గ గుడివద్ద రూ. 270 కోట్లతో ఫ్లై-ఓవర్ నిర్మాణం, అది నిర్మాణం అయ్యేవరకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తట్టుకోవడానికి ఇప్పుడున్న రోడ్డును రూ. 3.5 కోట్లతో ఆధునీకరణ, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, రాయలసీమను విజయవాడ వద్ద నిర్మింపబడే కొత్త రాజధానితో కలుపుతూ ఆరు రోడ్ల నిర్మాణం, విజయవాడ-మచిలీపట్నం మధ్య రూ. 1,000 కోట్లతో హైవే వెడల్పు చేయడం వంటి ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది.
ఒక్క విజయవాడకు సంబందించిన ప్రతిపాదనలే ఇన్ని ఉన్నాయి. ఇక జిల్లాల వారిగా చూసుకొన్నట్లయితే ఇటువంటివి కనీసం వందకు పైగానే ఉంటాయి. కేంద్రం వేటినీ కాదనకుండా హామీలు గుప్పిస్తూ మీనమేషాలు లెక్కపెడుతూనే ఉంది. ఏమంటే కేంద్ర ప్రభుత్వం పలు శాఖలను, వ్యవస్థలను, చట్టాలను సవరించడంలో తీరిక లేకుండా ఉందని సమాధానం వస్తోంది. ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయడం మొదలుపెడుతుందో తెదేపా నేతలు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రయత్నలోపం లేకుండా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు కనుక బహుశః త్వరలోనే కనీసం రెండు మూడు పెద్ద ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.