అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన భూసేకరణ
posted on Sep 13, 2014 @ 12:52PM
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంరాష్ట్రాభివృద్ధికి చాలా భారీ ప్రణాళికలు ప్రకటించింది. జిల్లా కొకటి చొప్పున అన్ని జిల్లాలలో కొత్తగా చిన్న విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం, వైజాగ్, తిరుపతి, గన్నవరం విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయడం వంటి భారీ ప్రణాళికలు అందులో ఉన్నాయి. విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు అవబోతోందనే విషయం పసిగట్టిన అనేకమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు భారీగా భూములు కొనుగోలు చేసి దానిపై అంతకు పదింతలు సొమ్ము ఆర్జించాలని ఏవిధంగా ఆరాటపడుతున్నారో, అదేవిధంగా రాష్ట్రంలో రైతులు కూడా ఇన్నాళకు తమ పంట పండినదని సంతోషిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో రైతులు తమ భూముల ధరలు అమాంతం పెంచేసి ఎకరానికి కోటి రూపాయలు ఇస్తేగానీ అమ్మబోమని చెట్టెక్కి కూర్చోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం ఎకరానికి రూ.25 నుండి 40లక్షల వరకు చెల్లించేందుకు సిద్దపడినా రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. రాజకీయ నాయకులే ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నపుడు తాము మాత్రం ఎందుకు త్యాగం చేయాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారి ఈ ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అలాగని ఎంతో కొంత సొమ్ము వారి చేతిలో పెట్టేసి వారి భూములు బలవంతంగా గుంజుకొంటే అది ఇంకా ప్రమాదం. ఈ పని చేసినట్లయితే ‘రైతు వ్యతిరేఖ ప్రభుత్వం’ అంటూ ప్రతిపక్షాలతో కలిసి రైతులు కూడా ఉద్యమించే ప్రమాదం ఉంది. అదీ గాక వారందరినీ కలిపేందుకు వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారం ఉండనే ఉంది.
ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి ఎన్నిప్రణాళికలు సిద్దం చేసుకొన్నా, భూసేకరణ ఇప్పుడు ప్రతిబంధకంగా నిలుస్తోంది. ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014 ప్రకారం రాష్ట్రాభివృద్ధికి కేంద్రమే అన్ని విధాల సహాయం చేస్తాననే హామీ ఉంది. కనుక విమానాశ్రయాల ఏర్పాటు, అభివృద్ధికి సంబంధించినంత వరకు కేంద్ర సహాయం కోరాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. తెదేపా యంపీ మరియు కేంద్ర విమానశాఖా మంత్రి అశోక్ గజపతి రాజు ద్వారా ఈ పని సాధించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అందుకు కేంద్రం అంగీకరించినట్లయితే, భూసేకరణకి రూ.500 కోట్లు, విమానాశ్రయాల అభివృద్ధి కోసం మరో రూ.300 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయవలసి ఉంటుంది.
కానీ లక్షల కోట్లు వ్యయం అయ్యే పోలవరం, కొత్త రాజధాని నిర్మాణం, వైజాగ్-చెన్నైల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటువంటి అనేక ప్రతిపాదనలను అమలు చేయవలసిన కేంద్రం, భూసేకరణకు కూడా అంత డబ్బు మంజూరు చేస్తుందా? విమానాశ్రయాల ఏర్పాటు, అభివృద్ధికే ఇన్ని వందల కోట్లు అవసరమయితే రేపు మిగిలిన అన్నిటినీ నిర్మించేందుకు భూసేకరణ చేయవలసి వస్తుంది కనుక అప్పుడు వాటికి కూడా కేంద్రమే భరిస్తుందా? అని ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం తలొగ్గకపోవచ్చని అర్ధమవుతోంది.
కేంద్రం ఏ ప్రాజెక్టు మంజూరు చేసినా దానికి అవసరమయిన భూములను చూపించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుంది. అందువలన ఈ భూసేకరణ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకోగలిగితేనే, అన్ని ప్రాజెక్టులు అమలుకు నోచుకొంటాయి. కనుక కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, పాతవాటి అభివృద్ధికి ల్యాండింగ్ గేర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని భావించవలసి ఉంటుంది.