కాంగ్రెస్ పార్టీకి మరో జీవన్మరణ సమస్య?
posted on Sep 13, 2014 @ 11:41AM
కేంద్ర ఎన్నికల కమీషన్ మహారాష్ట్ర మరియు హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు నిన్న షెడ్యుల్ విడుదల చేసింది. వచ్చే నెల 15వ తేదీన రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిపి 19వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు మరో అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఎందుకంటే, ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమియే అత్యధిక యంపీ సీట్లు కొల్లగొట్టి అధికార కాంగ్రెస్ ప్రభుత్వాలకు, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా పెద్ద షాక్ ఇచ్చింది. కనుక ఇప్పుడు జరుగబోయే ఎన్నికలలో ఎన్డీయే కూటమిని తప్పనిసరిగా నిలువరించి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవలసి ఉంటుంది.
ముఖ్యంగా మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకోకపోయినట్లయితే ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనలు సమఉజ్జీలుగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు విశ్వప్రయత్నం చేయవలసి ఉంటుంది. అదీగాక శివసేన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయ్యిఉండటం కూడా దానికి కలిసి వచ్చే అంశం అయితే, అదే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారవచ్చును.
కేంద్రంలో అధికారం కోల్పోయి మళ్ళీ ఎప్పటికయినా తిరిగి అధికారంలోకి వస్తుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం కంటే, కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమికి చెందిన పార్టీలు అధికారంలో ఉండటమే రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆ రెండు రాష్ట్రాల ప్రజలు భావిస్తే కాంగ్రెస్ పార్టీకి మరోసారి పరాభవం తప్పదు.
ఇక ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం నిలబెట్టుకోలేకపోయినట్లయితే, ఆ ప్రభావం పార్టీపై చాలా తీవ్రంగా ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తరువాత సోనియా, రాహుల్ గాంధీలను తమ పదవులలో నుండి దిగిపోవాలని కాంగ్రెస్ పార్టీలో డిమాండ్లు వినిపించాయి. అవి ఇప్పుడు మరింత జోరందుకొంటే కాంగ్రెస్ పార్టీకి ఇంటాబయటా కష్టాలు తప్పవు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే, దేశానికి ప్రధానమంత్రి కావాలనుకొన్న రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్ష పదవి నుండి కూడా దిగిపోవలసిన పరిస్థితి ఎదురయినా ఆశ్చర్యంలేదు.
అంతే కాదు..తమది జాతీయ పార్టీ, నూరేళ్ళ చరిత్ర కల గొప్ప పార్టీ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఓడిపోయినట్లయితే ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకు పోయి మోడీ ప్రభుత్వం ముందు మరుగుజ్జులా మారిపోతుంది. ఇది వచ్చే అన్ని ఎన్నికలపై ప్రభావం చూపవచ్చును కూడా. అందువలన ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య వంటివని చెప్పక తప్పదు.