తెలంగాణా జేయేసీ తన ఉనికి కాపాడుకోగలదా?
posted on Nov 9, 2014 @ 12:46PM
ఒకానొక సమయంలో తెలంగాణా ఉద్యమాలలో చాలా చురుకుగా పాల్గొని, కీలక పాత్ర పోషించిన తెలంగాణా జేయేసీ, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా పునర్నిర్మాణంలో చురుకుగా పాల్గొంటానని ప్రకటించింది. తెరాసతో కలిసి పనిచేసినప్పటికీ తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే గట్టిగా నిలదీస్తానని కూడా చెప్పింది. కానీ ఈ ఐదు నెలల కాలంలో తెరాస ప్రభుత్వం చాలా బలపడి, ప్రతిపక్షాలను, ఆంధ్ర, కేంద్రప్రభుత్వాలని కూడా చాలా ధీటుగా ఎదుర్కొంటూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుండటంతో క్రమంగా టీ- జేయేసీ తన ఉనికిని కోల్పోసాగింది. నిజానికి టీ- జేయేసీని కేవలం తెలంగాణా సాధన కోసమే ఏర్పాటు చేసినప్పుడు, రాష్ట్రం ఏర్పడగానే పూర్తిగా రద్దు చేసి ఉండి ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేది. కానీ చేయలేదు. అటువంటప్పుడు నీళ్ళు, విద్యుత్ తదితర అంశాలపై తెలంగాణా ప్రభుత్వం పొరుగు రాష్ట్రంతో చేస్తున్న యుద్దాలు, రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్సుమెంటు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ వంటి అనేక సమస్యలపై మాట్లాడి ఉండాలి. కానీ నోరు మెదపకుండా మౌనం వహించింది. చివరికి తెలంగాణా ప్రభుత్వం కేవలం 453 మందిని మాత్రమే అమరవీరులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించినపుడు, టీ- జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, తన వద్ద అమరవీరుల జాబితా ఉందని దానిని ప్రభుత్వానికి అందజేస్తానని అన్నారు. ఆయన ఆ జాబితాను ప్రభుత్వానికి అందజేసినట్లయితే, ప్రభుత్వం కేవలం తను గుర్తించి అమరవీరుల కుటుంబాలకు మాత్రమే పరిహారం మంజూరు చేస్తున్నప్పుడయినా మిగిలిన వారి కుటుంబాలకు కూడా తప్పనిసరిగా పరిహారం ఇచ్చితీరాలని టీ- జేయేసీ ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోయింది ఎందుకో. ఇక రాష్ట్ర పునర్ణిర్మాణంలో పాల్గోవడం సరేసరి.
బహుశః ఆవిధంగా చేసినట్లయితే సమాంతర ప్రభుత్వం నడుపుతున్నామనే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే భయమో లేకపోతే కేంద్రప్రభుత్వంతోనే యుద్ధం చేయడానికి వెనకాడని కేసీఆర్ తో పెట్టుకొంటే తట్టుకోలేమనే భయమో లేకపోతే కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి చూడాలనే ఆలోచనతోనో తెలియదు కానీ టీ- జేయేసీ ఇంతవరకు మౌనం వహించి ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. అందువల్లే ప్రజలు కూడా దానిని పట్టించుకోవడం మానివేశారు.
ఈ పరిస్థితుల్లో మళ్ళీ చాలా రోజుల తరువాత ఈ రోజు టీ-జేయేసీ స్టీరింగ్ కమిటీ హైదరాబాద్ లో సమావేశమవుతోంది. ఈ సమావేశంలో పైన పేర్కొన్న అన్ని సమస్యలపై చర్చిస్తారని సమాచారం. అందువలన ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉందని భావించవచ్చును. ఒకవేళ ఇక నుండి తాము కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీయాలని టీ-జేయేసీ నిర్ణయించుకొంటే, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే టీ-జేయేసీ ప్రభుత్వానికి అండగా నిలబడి దానిని వెనకేసుకొని వస్తూ మాట్లాడే ప్రయత్నం చేసినట్లయితే, ఇప్పటికే క్రమంగా తన ఉనికిని కోల్పోపోతున్న టీ-జేయేసీ పూర్తిగా తన ఉనికిని పోగొట్టుకొంటుంది.
అందువలన ఈ సమావేశంలో టీ-జేయేసీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోందనే దానిపైనే దాని భవితవ్యం ఆధారపడి ఉంటుందని భావించవచ్చును. అయితే కేసీఆర్ తో కత్తులు దూసి ఇబ్బందులు పడటంకంటే, మౌనం వహించడమే మేలని భావించినట్లయితే, తెలంగాణా ప్రభుత్వానికి శ్రేయోభిలాషిగా ఏవో కొన్ని సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నా ఆశ్చర్యం లేదు.