తిరుపతి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పోటీకి సిద్దం
posted on Jan 27, 2015 @ 10:33AM
తిరుపతి తెదేపా యం.యల్యే వెంకట రమణ మృతి కారణంగా జరుగనున్న ఉప ఎన్నికలలో తెదేపా ఆయన భార్య సుగుణమ్మను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి, ఆమె ఏకగ్రీవ ఎన్నిక కొరకు సహకరించవలసిందిగా కాంగ్రెస్, వైకాపా మరియు ఇతర పార్టీలని కోరింది. అందుకు వైకాపా సానుకూలంగా స్పందించింది. కానీ కాంగ్రెస్ పార్టీకి గత రెండు ఉప ఎన్నికలలో తల బొప్పి కట్టినప్పటికీ, మళ్ళీ ఇప్పుడు కూడా పోటీకి సిద్దమయింది.
ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో పాల్గొనడాన్ని ఎవరూ తప్పుపట్టకపోయినప్పటికీ, ఏదయినా ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి చనిపోతే ఆ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్ధికే విడిచిపెట్టే సత్సంప్రదాయాన్ని రాష్ట్రంలో అన్ని పార్టీలు పాటిస్తున్నప్పుడు, దానిని కాదని పోటీ చేస్తున్నందునే ఆ పార్టీ విమర్శలు ఎదుర్కొంటోంది. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కె. వేణుగోపాల్ రెడ్డి తమ పార్టీ అభ్యర్ధిగా రుద్రమరాజు శ్రీదేవి పేరును ప్రకటించారు.
ఇంతకు ముందు తెదేపా కార్యకర్తగా పనిచేసిన ఆమె రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి ఉన్నప్పటికీ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసారు. అప్పటి నుండి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. గాలికిపోయే పేలాలు కృష్ణార్పణం అన్నట్లుగా, ఈ ఉప ఎన్నికలలో గెలిచే అవకాశం ఎలాగూ ఉండదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలయిన ఆమెకు ఉదారంగా టికెట్ కేటాయించింది. తిరుపతి నియోజక వర్గంలో ఉన్న డ్వాక్రా సంఘాలతో ఆమెకున్న పరిచయాల కారణంగా ఆమెకు విజయావకాశాలు ఉంటాయనే ఆలోచనతోనే ఆమెను బరిలోకి దించినట్లు కనబడుతోంది.
ఒకవేళ ఈ ఎన్నికలలో ఆమె ఓడిపోతే, దానిని ఆమె పద్దులోనే వ్రాసేయవచ్చును. దాని వలన కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టమూ కూడా ఉండబోదు. కానీ ఆమె గెలిస్తే మాత్రం దానిని ‘అధికార తెదేపా ప్రభుత్వంపై ప్రజలలో మొదలయిన వ్యతిరేకత’ అని కాంగ్రెస్ పార్టీ టాంటాం చేసుకొనే సౌలభ్యం ఉంటుంది. బహుశః అందుకే పార్టీలో సీనియర్లను కాదని ఆమెకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఏవయినప్పటికీ, ఇది ఆమెకు అందివచ్చిన అపూర్వ అవకాశమేనని చెప్పవచ్చును. ఒకవేళ ఆమె ఈ ఎన్నికలలో గెలవగలిగినట్లయితే ఆమెకు మళ్ళీ తెదేపా నుండో లేకపోతే బీజేపీ నుండో పార్టీలో చేరమని ఆహ్వానం అందినా ఆశ్చర్యం లేదు.
అయితే ఈ ఉపఎన్నికలలో తెదేపాకు గట్టి పోటీనివ్వగల వైకాపా పోటీలో లేదు. లోక్ సత్తాతో బాటు మరి కొందరు స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ వారు ఓట్లు చీల్చగలరేమో గానీ తెదేపాకు గట్టి పోటీ ఇవ్వలేరు. కనుక తెదేపా అభ్యర్ధి సుగుణమ్మకే విజయావకాశాలున్నాయని భావించవచ్చును. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీదేవి నుండి ఆమె గట్టిపోటీయే ఎదుర్కోవలసి రావచ్చును.