పాపం వాసిరెడ్డి పద్మ
posted on Jan 22, 2015 @ 8:51PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మేడమ్ మీకు తెలుసు కదా? అదేనండీ... జగన్ని ఎవరైనా ఏమైనా అంటే మాటలతో వాళ్ళ మీద తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడే వీర వనిత. గుర్తొచ్చారు కదూ... జగన్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఆమె చక్కగా సరిపోయారు. ఏ విషయాన్నయినా జగన్‌కి అనుకూలంగా మలచి చెప్పడంలో, అధికార పార్టీ మీద, జగన్ వ్యతిరేక వర్గాల మీద గయ్యిమని విరుచుకుపడటంలో ఆమెకు ఆమే సాటి. టీవీ ఛానళ్ళ డిస్కషన్లలో ఆమె పాల్గొన్నారంటే మిగతా పార్టీలవాళ్ళు కిక్కురుమనడానికి కూడా వీల్లేకుండా మాటల దాడి చేస్తారామె. అలాంటి ప్రతిభావంతురాలైన వాసిరెడ్డి పద్మ మేడమ్‌కి పాపం... పగవాళ్ళకు కూడా రాని కష్టాలొచ్చిపడ్డాయి. జగన్ పార్టీ కోసం గొంతు ఎంత చించుకున్నా దక్కాల్సినంత గుర్తింపు దక్కకుండా పోయి కంఠశోషే మిగిలింది. రెండ్రోజులకోసారి టీవీ కెమెరాల ముందుకు వచ్చి అరచి కంఠశోష తెచ్చుకోవడమే ఆమెకి చివరికి మిగిలింది.
త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం వుంది. ఎప్పటి నుంచో పార్టీ సేవలో మునిగిపోయిన వాసిరెడ్డి పద్మ మేడమ్‌కి ఎమ్మెల్సీ అవ్వాలన్న ఆశ కలిగింది. అలా ఆశ కలగడం కూడా న్యాయమే. అయితే ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరెవరినో ఎంపిక చేసే పనిలో జగన్ ఉండటంతో పాపం ఆమె చాలా ఫీలయ్యారు. జగన్ దగ్గరకి వెళ్ళి నాకు ఓ ఎమ్మెల్సీ ఇచ్చేయండి అని అడిగే ఛాన్స్ ఎలాగూ వుండదు కాబట్టి.. ఆమె జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి దగ్గరకి వెళ్ళి తన ఆవేదనను వ్యక్తం చేశారట. పార్టీకి ఇంతకాలంగా సేవ చేస్తున్నా... నాకు ఓ ఎమ్మెల్సీ ఇచ్చారంటే పార్టీ సేవలో ఇంకా పునరంకితమవుతా అని వినయంగా అడిగారట. ఆమె విజ్ఞప్తి విన్న విజయసాయి రెడ్డి ‘‘ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లు వేరేవాళ్ళకి ఫిక్సయిపోయాయి. మీ విషయం తర్వాత ఆలోచిద్దాం’’ అంటే ఓ పద్ధతిగా వుండేది. కానీ ఆయన అలా అనలేదట. మీది ఎమ్మెల్సీ ఇచ్చే స్థాయి కాదని మొహ్మమ్మీదే చెప్పేశారట. మీ స్థాయికి మించి ఆలోచిస్తున్నారంటూ అన్ని సబ్జెక్టుల్లో జీరోలు వచ్చిన స్టూడెంట్‌కి టీచర్ క్లాస్ తీసుకున్నట్టుగా ఆయన వాసిరెడ్డి పద్మకి సుదీర్ఘమైక క్లాస్ తీసుకున్నారట. దాంతో పద్మ మేడమ్ గుడ్ల నీరు కుక్కుకున్నారట. ఆ తర్వాత తన సన్నిహితుల దగ్గర ఎమ్మెల్సీ సీటు విషయంలో తనకెంత అన్యాయం, అవమానం జరిగిందీ చెప్పుకుని లబోదిబో అన్నారట. ఇంతకాలం పార్టీ కోసం అరిచీ అరిచీ నా నోరు బయటపడిందే తప్ప తనకు ఒరిగిందేమీ లేదని ఆమె నెత్తీనోరు బాదుకుంటూ బాధపడుతున్నారట.
పాపం వాసిరెడ్డి పద్మ మేడమ్ ఇలాంటి అవమానాలు కొత్తేమీ కాదు. ‘రాజకీయ శూన్య’ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనకు అండగా నిలబడిన వాళ్ళలో వాసిరెడ్డి పద్మ కూడా ఒకరు. అప్పుడు కూడా అ పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఆమె పార్టీని భుజాన వేసుకుని నడిపారు. అనేక అంశాల మీద చిరంజీవికి అవగాహన లేక తుతుతు... మేమేమే అంటుంటే.. వాసిరెడ్డి పద్మ తన వాగ్ధాటితో పార్టీని ఆదుకునేవారు. ఆ సమయంలో కూడా ఆమెకు అన్యాయం జరిగింది. అప్పుడు కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఆమె ప్రయత్నిస్తే చిరంజీవి అండ్ కో ఆమెకు మొండిచెయ్యి చూపించారు. దాంతో ఆమె తన ఆగ్రహాన్ని ఒక పెద్ద లేఖ రూపంలో వెల్లడించారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి జగన్ పార్టీలోకి వచ్చేసి ఇంతకాలం ఇక్కడ కంచిగరుడ సేవ చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అవమానం జరిగింది. మరి ఇప్పుడు పద్మ మేడమ్ ఏం చేయబోతున్నారు? గతంలో చిరంజీవికి రాసినట్టే జగన్‌కి ఓ భారీ లేఖ రాసేయబోతున్నారా? జగన్ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారా?