ఇచ్చట ఉచితంగా ప్రజాసేవ చేయబడును
posted on Mar 9, 2015 @ 10:37PM
అదేమిటి...ప్రజాసేవ...ఉచితంగానా..ఏమిటీ అర్ధంపర్ధం లేని మాటలు అనేసుకోవద్దు. కొందరు సామాజిక న్యాయం చేయడానికే పుట్టినవారున్నారు. మరికొందరు ప్రశ్నించాడానికే పుట్టినవారున్నారు. ఇంకొందరు జనాలని ఓదార్చడానికే పుట్టినవారున్నారు. వారిలో ఎవరికీ అధికార దాహం లేదు. ఎందుకంటే వారి కడుపులు ముందే నిండాయిట. పాపం ప్రజల కష్టాలను చూసి జాలిపడి వారిని తాము కాకపోతే మరెవరు కాపాడుతారు? అది తమ సామాజిక బాధ్యత కూడా అనుకొంటూ వారందరో వెరైటీ రాజ్యాలు స్థాపించి తమ తమ సైన్యాలతో జనాల ముందుకు వచ్చేరు. మరి అది ఉచిత ప్రజాసేవే కదా...అదెలా సాగిందో అందరికీ తెలుసు.
వారిలో సామాజిక న్యాయం చేస్తానంటూ బయలుదేరిన చిరంజీవి తనను నమ్ముకొని వచ్చిన అభిమానులను, పార్టీ కార్యకర్తలను, చివరికి హేమాహేమీలయిన సీనియర్ రాజకీయ నేతలను కూడా హ్యాండిచ్చేసి తన (ప్రజా) రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి కేంద్రమంత్రి పదవి పుచ్చుకొని సామాజిక న్యాయం సాధించి చూపారు. సామాజిక న్యాయం చేస్తానన్న పెద్దమనిషి ప్రస్తుతం 150 సినిమాని తీసుకొనేపనిలో క్షణం తీరిక లేకుండా ఉన్నారని జనాలు గొణుక్కోవచ్చు గాక కానీ ఆయన నేటికీ జనాల సంతృప్తి కోసం రాజ్యసభకి ఓ రౌండేసి వస్తూనే ఉంటారు.
తమ్ముడు పవన్ కళ్యాణ్ 'నేను వచ్చింది అధికారం కోసం కాదు ప్రశ్నించడానికి మాత్రమే' అనే సరికొత్త సబ్ టైటిల్ తో రాజకీయాలలోకి వచ్చేరు. "ఆ...అలాగంటాడు కానీ...ఎన్నికలలో పోటీ చేయకుండా ఉంటాడా?" అనుకొంటూ ఆయన చుట్టూ ఓ పెద్దమనిషి చాలా రోజులు తిరిగాడు. "వెయ్యెకరాల మాగాణీ పోతే పోయింది గానీ చట్టం గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలిగాను" అని వెనకటికొకడు తృప్తిపడినట్లు ఆయన కూడా తన మూనెల్ల రాజకీయనుభావంతో తృప్తిపడి మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోయాడు. ఆయనతో బాటే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయాడు. ప్రశ్నించడం కోసమే రాజకీయాలలోకి వచ్చేనని చెప్పిన పెద్దమనిషి కనీసం ఆ చిన్న పని కూడా చేయకుండానే సినిమాలతో కాలక్షేపం చేసుకొంటున్నారు.
సినిమాకి సినిమాకి మధ్యలో కొంత టైం దొరికినప్పుడు తను జనసేన పార్టీ పెట్టాననే సంగతి జ్ఞాపకం రాగానే ఆవేశం తెచ్చుకొని ట్వీటర్ లో ఏదో ఒకటి గెలికి పడేస్తుంటారు. ఇంకా టైం మిగిలి ఉంటే తుళ్ళూరులో అలా ఓ రౌండేసి వెళ్ళిపోయారు. ఈసారి టైం దొరికితే కొంచెం పొలిటికల్ ఎక్స్ పీరియన్స్ గెయిన్ చేయడానికి జి.హెచ్.యం.సి.ఎన్నికలను కూడా ఓసారి ట్రై చేద్దామనుకొంటున్నట్లు ప్రకటించేసారు.
ఇక మడమ తిరగని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం బాగుపడాలంటే దానికి సర్వ రోగ నివారిణి వంటి ఒకే ఒక్క పరిష్కారం ఉందని చెపుతుంటారు. అదే తను ముఖ్యమంత్రి అయిపోవడం. తను ముఖ్యమంత్రి అయిపోతే ఇక రాష్ట్ర ప్రజలు చీకు చింత లేకుండా జీవించేసుకోవచ్చని చెపుతుంటారు. అంతేకాదు..తను ముఖ్యమంత్రి అయిపోగానే తుళ్ళూరులో అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ వంటి ఎన్ని పెద్ద పెద్ద భవనాలు కట్టిపడేసినా సరే వాటి క్రింద నుండి రైతుల భూమిని భద్రంగా ఎలా తీసుకొన్నది అలాగ బయటకి తీసిచ్చేయగల అత్యాధునిక టెక్నాలజీ తన దగ్గర ఉందని చెపుతుంటారు. కనుక ఆ భూమి కావాలనుకొంటే తనను గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకొనే బాధ్యత మీదేనని పదేపదే చెపుతుంటారు.
మెగాస్టారు కాకపోతే పవర్ స్టారు ఆయన ఏమీ చేయలేకపోతే జగనన్న మనకి ఉండనే ఉన్నాడని జనాలు అనుకొన్నారు. కానీ ముగ్గురు ముగ్గురేనని నిరూపించారు. ఇక తాజాగా మరొక కొత్త పుకారొకటి పుట్టుకొచ్చింది. అదేమిటంటే బాబాయ్ పెట్టిన జనసేనని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ "లైక్" చేసాడుట! హైదరాబాద్ నడిరోడ్డు మీద చేతికి మట్టి అంటకుండా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను అలఓకగా ఉతికి ఆరేయించిన మన చినబాబు కూడా రాజకీయాలలోకి వస్తే ఆ..రేంజ్ ఒక తుఫానులా ఉంటుందని జనాలు అప్పుడే ఆశగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. నిప్పు లేనిదే పొగ రాదనే సిద్దాంతం నిజంగా కరెక్టయితే జనసేన మెగాసేనగా మారి జనాల ముందుకి వచ్చినా ఆశ్చర్యం లేదు.