యాదగిరి గుట్ట పేరు ఎందుకు మార్చుతున్నారో?
posted on Mar 6, 2015 @ 9:49AM
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతికి ఏ మాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేసేందుకు నడుం కట్టారు. అందుకోసం భారీగా ప్రణాళికలు సిద్దం చేసి నిధులు కూడా కేటాయించారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే. అయితే అచ్చమయిన తెలంగాణా బాషకు అద్దం పడుతూ సామాన్య ప్రజలకు అర్ధమయ్యే ‘యాదగిరి గుట్ట’ పేరును వైష్ణవ పీఠాధిపతి త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి ‘యాదాద్రి’ మార్చడం విమర్శలకు తావిస్తోంది. చుట్టుపక్కల మూడు నాలుగు రాష్ట్రాలకు సుపరిచితమయిన యాదగిరి గుట్ట అనే పేరులో వారిరురువురికీ ఏమి లోపం కనబడిందో మరి తెలియదు. తిరుమల కొండను వెంకటాద్రిగా పిలుచుకొంటారు గనుక యాదగిరి గుట్టకు యదాద్రి అని పేరు పెట్టారేమో?
యాదగిరి గుట్ట ఆనుకొని ఉన్న మరో ఎనిమిది కొండలను కలుపుకొని ‘నవగిరులు’ అని పేరుతో వాటినీ పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఆ ఎనిమిది కొండలకు కూడా చిన జీయర్ స్వామి పేర్లు పెడతారుట. తిరుమలకు ఏడు కొండలున్నాయి గనుక వాటి కంటే మరో రెండు కొండలు ఎక్కువే ఉండాలనుకొంటే అది చాలా హాస్యాస్పదమయిన ఆలోచన. అటువంటి ఆలోచనకు వైష్ణవ పీఠాధిపతి అయిన చిన జీయర్ స్వామి ఏవిధంగా ఆమోదం తెలిపారో మరి? యాదగిరి గుట్టను, దాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ కొండ దిగువన ఉన్న ఊరుని వదిలిపెట్టి చుట్టుపక్కల కొండలను అభివృద్ధి చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రం గురించి, అందులో వెలసియున్న లక్ష్మీ నృసింహ స్వామి వారి మహత్యం గురించి తెలుగు ప్రజలకు మళ్ళీ కొత్తగా ఎవరూ పరిచయం చేయనవసరం లేదు. ఆ పవిత్ర క్షేత్రాన్ని ఇన్నేళ్ళుగా ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా నిత్యం వేలాదిమంది భక్తులు దేశం నలుమూలల నుండి వచ్చి దర్శించుకొని వెళుతూనే ఉన్నారు. కనుక ఇప్పుడు యాదగిరి గుట్టకి మరో కొత్తపేరు పెట్టడం, దానికి మరో ఎనిమిది కొండలు కొత్తగా అనుసంధానం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వమే ఆలోచించాలి.
యాదగిరి గుట్టతో సహా దేశంలో ఏ పవిత్ర పుణ్యక్షేత్రాలయినా సరే అక్కడ సహజంగా వెలసిన దేవతామూర్తుల కారణంగానే వాటికి ఆ ప్రశస్తి, మహత్యం కలిగిఉన్నాయి. కానీ ఆ తరువాత కోట్లాది రూపాయలు కుమ్మరించి కట్టబడిన ఏ దేవాలయాలు కూడా అంతటి ప్రశస్తి, మహత్యం పొందలేదనే సంగతి గ్రహిస్తే ఇటువంటి ప్రయత్నాల వలన కొత్తగా ఎటువంటి ప్రయోజనము ఉండబోదని అర్ధం అవుతుంది. రాజకీయ నాయకులు తమ అజెండాలను అనుసరించి ఏవేవో నిర్ణయాలు తీసుకొంటుంటారు. అవి ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినవయితే మత గురువులను సంప్రదించడం సహజమే. అప్పుడు వారు తమ దృక్కోణంలోనే ఆలోచించి మార్గదర్శనం చేయాలి తప్ప వారే రాజకీయ నాయకుల ప్రభావానికిలోనయి వారికి అనుకూలంగా మాట్లాడటం ప్రజలు కూడా జీర్ణించుకోలేరు.
కనుక యాదగిరి గుట్టపై వేంచేసి ఉన్న నృసింహస్వామి వారికి నిత్య దూపదీప నైవేద్యాలు, ఇతర పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయా లేదా? మాడవీధుల విస్తరణ, గుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యాలు వంటి వాటిపై ప్రభుత్వం,మటాధిపతులు దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది.