తెదేపా, బీజేపీల కలహాల కాపురం ఇలాగేసాగుతుందా?
posted on Mar 12, 2015 @ 3:46PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు తమ మిత్ర పక్షమయిన తెదేపాకి, తాము భాగస్వామిగా ఉన్న తెదేపా ప్రభుత్వానికి ఇంతవరకు అప్పుడప్పుడు చిన్నచిన్న చురకలు వేస్తుండేవారు. కానీ తెదేపా నేతలు మిత్రధర్మం వల్లనయితేనేమి కేంద్రంతో తమ అవసరాల కారణం వల్లనయితేమేనీ ఎన్నడూ వారిపై ప్రతి విమర్శలు చేయకుండా నిగ్రహం పాటిస్తుండేవారు. కానీ కేంద్రబడ్జెట్ వెలువడిన తరువాత సీన్ రివర్స్ అయ్యింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా తెదేపా నేతలందరూ బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే బీజేపీ నేతలు మౌనం దాల్చవలసి వచ్చింది.
ఆ తరువాత కేంద్రం నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించడంతో తెదేపా వెనక్కి తగ్గగానే, మళ్ళీ బీజేపీ నేతలు గొంతు సవరించుకోవడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు తమ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని స్వయంగా విమర్శించడమే కాకుండా, తన పార్టీ నేతలను కూడా అందుకు అనుమతించినందుకు, రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనపై కొంచెం గుర్రుగానే ఉన్నారు. పైగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో తెదేపా యంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని కోరుతూ ధర్నా కూడా చేసారు.
తెదేపా యంపీ యన్. శివప్రసాద్ మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు అనుమతిస్తే “మేము జమ్మి చెట్టుపై ఉంచిన మా అస్త్రశస్త్రాలన్నీ క్రిందకు దించి కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేసేందుకు సిద్దంగా ఉన్నామని” మీడియా సాక్షిగా ప్రకటించడం కూడా బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది సరిపోదన్నట్లు చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్ మరియు మాణిక్యాల రావు కొన్ని రోజుల క్రితం చిత్తూరులో కరువు ప్రాంతాలను పర్యటిస్తున్నప్పుడు, అక్కడ వారికి స్థానిక తెదేపా నేతల వలన కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వారి సమావేశంలో ‘ఇంతకీ బీజేపీ రాష్ట్రానికి ఏమి చేసింది?’ అనే శీర్షికతో కొందరు కార్యకర్తలు కరపత్రాలు పంచడం వారికి చాలా ఆగ్రహం కలిగించింది.
అందుకే తాము కూడా తెదేపాపై బాణాలు వేసుకొనేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చేసుకొన్నవిన్నపానికి బీజేపీ అధిష్టానం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే మొదట శాసనసభలో చంద్రబాబుని పొగిడిన బీజేపీ సభ్యులు ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి చిన్న చురకలు వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు తెదేపా సైలెంట్ అయిపోయింది. కానీ ఒకవేళ తెదేపా మళ్ళీ గళం విప్పితే తాము కూడా దానితో సమాన స్థాయిలో రాగాలాపన చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
మోడీ అధికారం చేప్పట్టగానే అసలు ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఇవ్వనివిధంగా ఒక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే 24x7గంటలు నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు, ఎయిమ్స్, ఐఐయం, ఐఐఐటి సంస్థలను మంజూరు చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వాటికంటే ముందు పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించేందుకు మోడీ ప్రభుత్వం తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో ఏడూ ముంపు మండలాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసిన సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఒకవేళ తెదేపా నేతలు తమతో సఖ్యతగా ఉంటే సరేసరి లేకుంటే తాము కూడా కత్తులు, బాణాలు బయటకు తీయకతప్పదని బీజేపీ నేతలు చెపుతున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజలు, ప్రతిపక్షాలు వారి ఈ కలహాల కాపురం ఇంకా ఇలా ఎన్నాళ్ళు సాగుతుందో ఏమోనని అనుకొంటున్నారు.