రాహుల్ శలవు పొడిగింపా...అంతా కుట్ర!
posted on Mar 13, 2015 8:51AM
కీలకమయిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు వారాలు శలవు మీద వెళ్ళడం, అందుకు ఆ పార్టీ చెపుతున్న కారణాలవల్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలయ్యింది. అది సరిపోదన్నట్లుగా మళ్ళీ ఇప్పుడు ఆయన ఈ నెలాఖరు వరకు తన శలవును పొడిగిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలతో మరింత అభాసుపాలయింది. దానితో అప్రమత్తమయిన కాంగ్రెస్ పార్టీ తక్షణమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వార్తలను ఖండించింది.
పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సురేజ్ వాలా డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శలవు మీద వెళ్ళిన మాట వాస్తవమే. కానీ ఆయన తన శలవును పొడిగించారని మీడియాలో వచ్చిన వార్తలేవీ నిజం కాదు. ఎవరో కొందరు వ్యక్తులు ఆయన ప్రతిష్టను, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఉద్దేశ్యపూర్వకంగానే ఇటువంటి వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు. కనుక అటువంటి వార్తలను నమ్మవద్దని, ప్రచురించవద్దని మా మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము,” అని కోరారు.
కానీ రెండు వారాల శలవుపై వెళ్ళిన రాహుల్ గాంధీ ఇంకా ఎందుకు తిరిగిరాలేదు? ఎప్పుడు తిరిగి వస్తారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏమి చేస్తున్నారు? అనే మీడియావారి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేరుగా సమాధానం ఇవ్వలేదు. మీడియా కూడా రాహుల్ గాంధీ వ్యక్తిగత స్వేచ్చను గౌరవించాలని మాత్రం కోరారు.
నిజానికి ఆయన ఈనెల 10వ తేదీన పార్టీ కార్యక్రమాలలో తిరిగి పాల్గొంటారని అందరూ భావించేరు. కానీ నేటికీ ఆయన రాకపోవడంతో పార్టీ వర్గాలను సంప్రదిస్తే ఈనెలాఖరు వరకు ఆయన తన శలవును పొడిగించినట్లు చెప్పడంతో మీడియా అదే వార్తను ప్రచురించింది. కానీ ఇప్పుడు దాని వలన ఆయనకి, పార్టీ ప్రతిష్టకి భంగం కలుగుతోందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ వార్తలను ఖండిస్తోంది. కానీ ఆవిధంగా చేసి ప్రజలకు తనే స్వయంగా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లయింది. ఆయన శలవు పొడిగించినట్లయితే ఆయన ప్రతిష్టకు, పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని స్వయంగా కాంగ్రెస్ పార్టీయే ద్రువీకరిస్తునట్లుంది.
ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసం, తన మీదే ఆధారపడున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కోసం ఏవో సరికొత్త వ్యూహాలు, సిద్ధాంతాలు కనిపెట్టేందుకు శలవు తీసుకొన్నట్లు కాంగ్రెస్ పార్టీయే చెప్పుకొంటోంది. కానీ పార్టీని ఇంతగా నలుగురిలో నవ్వులపాలు చేస్తూ ఆయన పార్టీని తీర్చిదిద్దేందుకు శలవు తీసుకోవడందేనికో పార్టీకే తెలియాలి. తీరాచేసి శలవు ముగించుకొని ఆయన తన మంత్రదండంతో తిరిగి వచ్చిన తరువాత తనకంటే దేశముదురు కాంగ్రెస్ నేతలను ఏమీ చేయలేక చతికిలపడితే అప్పుడు ఇంకా అప్రదిష్ట కలుగుతుంది. అంతేకాదు పార్టీలో సీనియర్లను పక్కన బెట్టాలని ఆయన ప్రయత్నించినట్లయితే అప్పడు వారందరూ కలిసి ఆయనకే పార్టీ నుండి ఉద్వాసన ఇప్పించినా ఆశ్చర్యం లేదు. ఏమయినప్పటికీ రాహుల్ గాంధీ మొదలు పెట్టిన ఈ డ్రామాతో కాంగ్రెస్ పార్టీ చాలా ఇరకాటంలోపడింది. మున్ముందు ఇంకా పెద్ద ఇరకాటంలో పడబోయే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి.