ఇంటర్నెట్ వినియోగంపై ప్రభుత్వ పెత్తనం అక్కర్లేదు
ప్రపంచదేశాలలోకెల్లా భారతదేశంలోనే అత్యంత వేగంగా మొబైల్, ఇంటర్నెట్ వాడకం పెరుగుతోందణి గణాంకాలు చెపుతున్నాయి. అందుకే ఇప్పుడు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సేవలు అందించే అనేక పెద్దపెద్ద కంపెనీలు భారతదేశానికి క్యూ కడుతున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మొబైల్, ఐటి కంపెనీల స్థాపనకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ఆంద్ర, తెలంగాణా, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలలో డిల్లీ, చెన్నై, ముంబై, కోల్ కతా, హైదరాబాద్ వంటి అనేక ప్రధాన నగరాలలో బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వాలు ఉచిత వైఫీ సౌకర్యం కల్పిస్తున్నాయి.
దేశంలో ప్రజలందరికీ ఇంటర్నెట్ సేవలు మరింత ఎక్కువగా, వేగంగా అందుబాటులోకి తీసుకురావాలంటే దానిపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తగ్గించడం లేదా పూర్తిగా వదులుకోవడమే సరయిన మార్గమని మోడీ ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. అందుకోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన నిపుణులతో కూడిన ఒక కమిటీని కూడా ఇటీవల నియమించింది. ఆ కమిటీ ఇందుకు అవసరమయిన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలతో కూడిన ఒక నివేదికను ప్రభుత్వానికి వచ్చేనెల రెండవ వారంలోగా ఒక నివేదికను సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన చట్టం రూపొందిస్తుందణి కేంద్ర ఐ.టి. శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలియజేసారు.
ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వం అజమాయిషీ వదులుకోవాలనుకోవడం సంబంధిత సంస్థలు, ప్రజలు కూడా హర్షించవచ్చును. కానీ దానిపై ఎంతో కొంత ప్రభుత్వ నియంత్రణ లేకపోయినట్లయితే, దాని వలన చాలా అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంది. ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అనేక అత్యంత ప్రమాదకర, హానికర సమాచారం సరఫరా అవుతోంది. దానివలన దేశంలో ఎన్నడూ ఊహించలేని అనర్ధాలు ఎన్ని జరుగుతున్నాయో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ లేకపోయినట్లయితే అది ఇంకా చాలా ప్రమాదకర పరిస్థితులు సృష్టించవచ్చును. లేదా ఊహించలేని సరికొత్త సమస్యలు సృష్టించవచ్చును.
కొన్ని ప్రముఖ సెర్చ్ ఇంజన్లు, వెబ్ సైట్లు యువతను తప్పు ద్రోవలోకి వెళ్లేలా చేస్తున్నాయని చైనాతో సహా అనేక దేశాలు వాటిని నిషేధం విదించాయి. ఆ కారణంగానే అనేక దేశాలలో నేటికీ ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఇంటర్నెట్ వ్యవస్థపై ఉన్న కొద్దిపాటి నియంత్రణను ఎత్తివేసినట్లయితే దాని వలన మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది.
కనుక అటువంటి ఆలోచనచేసే కంటే ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత చౌకగా సేవలు ఉపలబ్దమయ్యేందుకు అవసరమయిన చర్యలు చేపడితే బాగుంటుంది. అదేవిధంగా ఇంటర్నెట్ వినియోగదారులు రకరకాల కంప్యూటర్ వైరస్ ల నుండి తమ డాటాను కాపాడుకొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయవలసి వస్తోంది. అదేవిధంగా దేశంలో ఇంటర్నెట్ వినియోగంతో బాటు సైబర్ నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఆన్ లైన్ వ్యవహారాలూ చేసేవారు హ్యాకర్ల భారీన పడి చాలా నష్టపోతున్నారు. వారందరూ తమ సమస్యలను ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక మౌనంగా నరకం అనుభవిస్తున్నారు. దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం మంచిదే. అందుకోసం ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయాలని ఆలోచించడం కంటే ఇటువంటి సమస్యలకు పరిష్కారం కోసం అవసరమయిన యంత్రాంగం, సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లయితే ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ శరవేగంగా దేశంలో వ్యాప్తి చెందుతుంది. అలాకాక హడావుడిగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం వలన ఏమీ ప్రయోజనం ఉండబోదు.